సబ్ ఫీచర్

గాన.. రమణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ ఇస్లాంపేటలో గాయని రమణ అంటే తెలీనివారు లేరు. తండ్రి బత్తుల రాములు, తల్లి నారాయణమ్మల ఇద్దరు కుమార్తెలలో పెద్దవారు రమణ. పాటలపై అభిమానం, ఆకర్షణతో చిన్ని చిన్ని పల్లవులు ముద్దుముద్దుగా ఆలపిస్తూనే వుండేవారు. రమణలోని కళను గుర్తించిన తల్లిదండ్రులు సంగీతం నేర్పించారు. ఆ అభ్యాసంతో ఆషాభోంస్లే, లతామంగేష్కర్, జానకి, సుశీల పాటలను అలవోకగా పాడేసేవారు. డ్రామాలు జరుగుతుంటే అక్కడ పాడటానికి ఫిమేల్ వాయిస్ ఎవరని వెతికే అవసరం లేకుండా ఆ స్థానాన్ని భర్తీచేశారామె. అలా ఇండస్ట్రీకి వచ్చిన ఆమె -ప్లేబ్యాక్ సింగర్‌లో ఎన్నిపాటలు పాడారో చెప్పలేం. ఆ పాటల సామ్రాజ్ఞి ఈవారం వెనె్నల అతిథి. ఆమె చెప్పిన ముచ్చట్లు పాఠకుల కోసం.
*
కొందరు కారణజన్ములు కొన్ని పనులు చేయడానికే జన్మిస్తారు. వారు ఎక్కడున్నా కానీ ఆ కారణ సాధ్యాసాధ్యాలు వారినెతుక్కుంటూనే వెళతాయి. అలా వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలను ఒక్కొక్క మెట్టుగా మలచుకుంటూ గానగంధర్వ వినువీధులలోకి ఎగిసి గానామృతాన్ని కురిపించారు బత్తుల రమణ. పుట్టినప్పటినుండే తాళజ్ఞానం అలవోకగా గుర్తుపట్టేసింది. అమ్మ పాడే జోలపాటనుండే సరిగమలు పరిశీలించింది. అలా ఊహ వచ్చినప్పటినుండి పాడడం అలవోకగా అబ్బిన విద్య. విజయవాడ ఇస్లాంపేటలో చిన్ననాటి గాయని రమణ అంటే తెలియనివారు లేరు. తండ్రి బత్తుల రాములు, తల్లి నారాయణమ్మల ఇద్దరు కుమార్తెలలో పెద్దవారు రమణ. పాటలంటే వున్న అభిమానంతో ఆకర్షణతో చిన్ని చిన్ని పాటలు ముద్దుముద్దుగా ఆలపిస్తూనే వుండేది. రమణలోని కళను గుర్తించిన తల్లిదండ్రులు అరుణోదయ నాట్యమండలి రాజుగారి రత్నాకర్‌రావు వద్ద సంగీతం నేర్చుకోవడానికి కుదిర్చారు. ఆషాభోంస్లే, లతామంగేష్కర్, జానకి, సుశీలల పాటలను అలవోకగా పాడేసేవారు. డ్రామాలు జరుగుతుంటే అక్కడ పాడటానికి ఫిమేల్ వాయిస్ ఎవరు అని వెతుక్కునే అవసరం లేకుండా ఆ స్థానాన్ని భర్తీచేశారామె. విజయవాడలోనే వున్న మరో గాయకుడు కె.బి.కె.మోహన్‌రాజ్‌తో కలిసి అనేక గీతాలు ఆలపించారు. ఓసారి మద్రాసునుండి వచ్చిన సంగీత దర్శకుడు పూర్ణచంద్రరావు (చాంద్) రమణ వాయిస్‌ను విన్నారు. పినిశెట్టి రచించిన పంజరంలో పక్షులు నాటకంలో శారద, భీష్మ సుజాత నటిస్తుంటే, వారికి ప్లేబ్యాక్ పాడాలని మద్రాస్ తీసుకెళ్ళారు. అలా 1962లో మద్రాస్‌లో అడుగుపెట్టారామె. రామకృష్ణ, భీష్మ సుజాత, శారద తదితరులు నటించిన ఆ నాటకంలో పాటలన్నీ రమణే పాడారు. ఆ తరువాత అదే నాటకాన్ని ఎస్.వి.రంగారావు టేకప్‌చేసి ఆంధ్రప్రదేశ్ ఊరూరా ప్రదర్శించారు. ‘ఈ పాల వెనె్నల వెనె్నల- కనుసన్నల- ఊగెను ఉయ్యాల, విరిసీ విరియని వెనె్నల్లో, నవ్వింది నవ్వింది’ అనే పాటలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. 62లోనే విడుదలైన ‘గులేబకావళి కధ’ చిత్రంలోని పాటలను పోటీగా పెట్టారు. ఆ పోటీలో పాల్గొన్న రమణ ‘మదనా సుందర నా దొర (సుశీల), ‘అంబా జగదంబా నా ఆర్తిని ఆలించవా (లీల)’ ఆలపించిన పాటలను స్వరంలో భావుకతను నింపేలా పాడారు. అక్కడికి వచ్చిన జడ్జీలు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వింజమూరి లక్ష్మీ ఫస్ట్‌ప్రైజ్‌ను ఇచ్చారు. అవే పాటలను నిర్మాత నందమూరి త్రివిక్రమరావు కూడా పాడి మరీ వినిపించుకున్నారు. తమ చిత్రంలో అవకాశం ఇస్తామని మాట ఇచ్చారు. మద్రాస్ ఆంధ్రా క్లబ్‌లో లైట్ మ్యూజిక్ పోటీలు జరుగుతున్నాయి. ఘంటసాల, పెండ్యాల, పి.వి.రాజు లాంటి ఘనాపాటీలు అక్కడ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ కూడా రమణ పాడారు. ఎస్.పి.బాలుకు ఫస్ట్‌ప్రైజ్ రాగా, సెకెండ్ ప్రైజ్ రమణను వరించింది. విజయవాడ ప్రాంతంలో ఎక్కడికివెళ్ళినా ఫస్ట్‌ప్రైజ్ తీసుకునే తనకు, ఇప్పుడు సెకెండ్‌ప్రైజ్ రావడం బాధగా వుందని స్టేజీపైనే ఏడ్చేశారామె. అప్పుడు పెండ్యాల నాగేశ్వరరావు వచ్చి లేడీస్‌లో మరెవరైనా మీకన్నా బాగా పాడినవారు ఉన్నారా? అని ప్రశ్నించి, ఓ రకంగా ఫస్ట్‌ప్రైజ్‌మీదే అని సముదాయించారు. ఆ తరువాత సంగీత దర్శకుడు పామర్తి అదేవేదికపై పాటలు పాడమంటే పాడి వినిపించారు. ఓ అద్భుతమైన స్వరం మరొకటి పరిశ్రమకు దొరికింది అనుకున్నారందరూ. ఆ తరువాత మళ్లీ విజయవాడ వెళ్లిపోయారు. బి.సరోజాదేవితో మలయాళంలో రూపొందించిన ‘కచదేవయాని’ చిత్రాన్ని తెలుగులో ‘సంజీవని రహస్యం’ పేరిట డబ్బింగ్ చేస్తున్నారు. ఆ చిత్రంలో ఓ పాట పాడటానికి రమణను మద్రాస్ రమ్మన్నారు. అక్కడికి వెళ్లి పాడాక మొత్తం పాటలు ఆమె చేతే పాడించారు. అలా సోలో కార్డుగా తొలిసారిగా ఆ చిత్రంలో పాడాను. అది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అంటారు రమణ. ఆ తరువాత ఓ వైపు మద్రాస్, మరోవైపు విజయవాడ ప్రాంతంలో కచ్చేలు, భరతనాట్య కార్యక్రమాలు వంటి ఏదైనా సరే పాడటానికి రమణ వుండేది. అలా కొన్నాళ్లు గడిచాక మళ్లీ 1966లో సంగీత దర్శకుడు పి.వి.రాజువద్ద తబలిస్ట్‌గా లక్ష్మణరావు వచ్చారు. ఆయన రమణ వాయిస్ విని ఘంటసాలవారికి పరిచయం చేశారు. భామా విజయం చిత్రంలో ఎన్టీఆర్, ఎల్.విజయలక్ష్మి, విజయనిర్మలపై చిత్రీకరించిన ‘కోరినవాడే చెలి’ పాటను పాడించారు. విజయ కృష్ణమూర్తి పరిచయంతో ఎం.ఎస్.ప్రకాష్ వద్దకు వెళ్లి పి.బి.శ్రీనివాస్‌తో ఓ పాట పాడారు. వేదాంతం రాఘవయ్య, పి.సుశీల, ఎస్.జానకి తదితరులు రమణకు అవకాశాలు కల్పించేందుకు అన్నివిధాలా సహకారం అందించారు. భువనసుందరి కథలో ఘంటసాలవారితో ‘దేశ దేశములు తిరిగే వారమయ’ అన్నపాటతో ఘంటసాల దృష్టిలో పడ్డారామె. ఆయన బెంగుళూరు తీసుకువెళ్లి కచ్చేరీలు తనతోపాటు చేయించారు. ఒకే స్టేజీపై ఘంటసాలవారితో పాడటం అనేది ఓ అందమైన కల. ఒకవైపు భయం, మరోవైపు ఆనందం నన్ను చుట్టుకున్నాయి అంటూ గుర్తుచేసుకున్నారామె. పాండవ వనవాసంలోని ‘దేవా దీన బాంధవా.. అసహాయురాలర కావరా’ అనే పాటను ఆయన ఎంతగానో మెచ్చుకున్నారు. లీల ఎంత ఆర్తితో పాడిందో నువ్వూ అలాగే పాడావమ్మా అనడం ఎంతో సంతోషాన్నిచ్చిందామెకు. ఆయన కచ్చేరీ పూర్తయ్యాక ప్రత్యేకంగా తన కారులో ఎక్కించుకుని మరీ తీసుకువెళ్లారు. అది కూడా ఓ మధురానుభవం అంటారామె. స్వంత కూతురిలా చూసుకునేవారు. వారింట్లో నేనూ ఒక మనిషిగా మారిపోయాను. ఘంటసాల వారు ఎటువంటి కచ్చేరీలు చేసినా రమణ ఉండాల్సిందే అన్నట్లుగా మారిపోయింది. జీవితబంధం చిత్రంలో జిక్కితో ‘తోకలు లేని కోతులు’ పాటను జె.బి.రాఘవులుతో కలిసి పాడారు. పట్టిందల్లా బంగారంలో వెస్ట్రన్ స్టైల్లో ‘నువ్వెక్కడ వుంటే అక్కడ బంగారం’ పాట విని మహా సంతోషపడిపోయారు ఘంటసాలవారు. ఆయన వెంటనే ఏవండీ నిర్మాతగారూ, ఈ అమ్మాయికి పారితోషికం ఎక్కువ ఇవ్వండి అని రికమెండ్ చేశారు. అవన్నీ గుర్తొస్తే ఎంతో ఆనందంగా వుంటుంది అని చెప్పారామె. రామాలయం చిత్రంలో రోజారమణి-చంద్రమోహన్‌లపై చిత్రీకరించిన ‘ఎందుకు బిడియం చిట్టెమ్మ’ బాలుతో కలిసి పాడారు. అదే బాలుతో కలిసి పాడిన తొలి డ్యూయెట్. అలా బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఎన్నో కచేరీలు చేశారు. అనేక వేల పాటలు పాడారు. బాలు లేకపోతే నేను లేను. అలా ఆయన దాదాపు 13 సంవత్సరాలపాటు ఆయనతో అన్ని కచేరీలకు తీసుకెళ్లి పాటలు పాడే అవకాశమిచ్చారు. ఓ రకంగా మద్రాస్‌లో నేను నిలబడటానికి ఆయనే కారణం అని కృతజ్ఞతతో గుర్తుచేసుకుంటారామె. పెద్దలు మారాలు, ముళ్లకిరీటం, చల్లని తల్లి, విచిత్ర దాంపత్యం, మాయని మమత, గుణవంతుడు, భలే అల్లుడు, కురుక్షేత్రం, విజయ, శాంతినివాసం, బొట్టు కాటకు, సంఘం చెక్కిన శిల్పాలు, మగ మహారాజు, పట్నం వచ్చిన పతివ్రతలు, దశ తిరిగింది, గువ్వలజంట, పట్నవాసం, పునాదిరాళ్ళు, అబ్బాయిగారు, పెళ్ళాం చెబితే వినాలి, మేజర్ చంద్రకాంత్ లాంటి ఎన్నో చిత్రాలలో ఆమె పాటలు పాడారు. బంగారు పంజరం చిత్రంలో ఓ బాలెట్ సాంగ్ వుంటుంది. రకరకాల పువ్వులు తమ స్వగతాన్ని చెప్పుకుంటాయి. చివరికి కథానాయికకు అనుబంధంగా వుండే గడ్డి పువ్వు పాటను రమణ పాడారు. శూలమంగళం రాజ్యలక్ష్మి, వసంతతో కలిసి పాడిన ఆ పాట ఇప్పుడు చిత్రంలో కనపడదు. చల్లనితల్లి చిత్రంలో ‘పాహిమాం శ్రీ రామా అంటే, గాంధీపుట్టిన దేశంలో సుశీల, కౌశల్యతో కలిసి ‘గాంధి పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం’పాట ఎంతో పేరు తెచ్చింది. నీదారి పూలదారి పోవోయి బాటసారి అన్న మగమహారాజు చిత్రంలో పాట, శ్రీగౌరీ శంకరుల కృపవల్లనే సిరులెల్ల మా ఇంట విలసిల్లినె అన్నపాట, తల్లీకొడుకులు చిత్రంలో ‘సుఖీభవ’ అన్న మేజర్ చంద్రకాంత్‌లో పాట, పిలిచిన పలికే దేవుడివయ్యా వెంకటేశ్వరా, ఈ దీనుల కాచి తోడుగ నిలచి దారి చూపవా అన్న పసిహృదయాల్లో పాట- తదితర ఎన్నో పాటలు రమణ ముద్రను గుర్తుపట్టేలా చేస్తాయి.
తెలుగు పరిశ్రమలో వున్న సంగీత దర్శకులందరితో, గాయనీ గాయకులందరితో కలిసి పాడిన ఏకైక గాయని రమణ. తమిళంలో కొన్ని, కన్నడంలో దాదాపు 200 చిత్రాలకు పాడారు. మలయాళంలో కొన్ని, హిందీ డబ్బింగ్స్‌లో కొన్నింటిలో రమణ గాత్రం వినవచ్చు. చిత్తూరు నాగయ్య హిందీలో భక్తరామదాసును డబ్బింగ్ చేస్తూ రమణను సంప్రదించారు. లవకుశలో హిందీలో డబ్బింగ్ చేస్తే అక్కడ కూడా రమణే పాడారు. ఇలా దాదాపుగా ఎన్నో వేల పాటలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఓసారి రంగేళిరాజా చిత్రానికి సంబంధించిన పాట ‘ఓ బుల్లయ్యో.. ఓ మల్లయ్యో.. బుల్లయ్యో.. మల్లయ్యో’ పాటను ఎల్.ఆర్.ఈశ్వరితో కలిసి పాడాలి. రిహార్సల్స్‌లో బాగా వచ్చిన వాయిస్ రికార్డింగ్ థియేటర్‌కు వెళ్ళేసరికి అక్కడ ప్రసారమవుతున్న శీతలీకరణ దెబ్బకు మూగబోయింది. వాయిస్ పట్టేసింది. ఏం అర్థం కావడంలేదు రమణకి. ఘంటసాలవారి వద్ద పామర్తి ఉన్నారు. ఆయన వేడి వేడి పాలు తెచ్చి పట్టిస్తున్నారు. కానీ బయట వర్షం కూడా పడుతుండడంతో ఏం లాభం లేకపోయింది. చిన్న మాట కూడా బయటకు రావడం లేదు. వెంటనే ఘంటసాలవారు వచ్చి ఏం పర్వాలేదని అనునయించి మీకు మళ్లీ వాయిస్ బాగా వచ్చినపుడే రికార్డింగ్ పెడదాం అని చెప్పారు. వచ్చిన మొత్తం ఆర్కెస్ట్రాను, ఎల్.ఆర్.ఈశ్వరిని ఘంటలసాలవారు తరువాత పెట్టుకుందామని అభ్యర్థించారు. అందుకు ఎల్.ఆర్.ఈశ్వరి మా రమణ బాగా వున్నప్పుడే పెట్టుకుందాం అని సంతోషంగా వెళ్లిపోయారు. అలా మూడు నాలుగు నాలుగు రోజులైనా వాయిస్ ఏ మాత్రం సహకారం అందించలేదు. చివరికి ఏఎన్నార్ కాల్షీట్స్ ఖరారు కావడంతో రేపే పాట షూటింగ్ చేయాలి. ఇక తప్పదన్నట్లు రమణకు బదులుగా వసంతను పిలిచి ఆ పాట పాడించారు. అది నా జీవితంలో మర్చిపోలేనిదంటారు రమణ. అందుకు తగ్గట్టుగా ఘంటసాలవారు కూడా ఎంతో అనునయించి ఇంతకన్నా మంచి పాటలు ఎన్నో పాడతావు అని దీవించారు. ఆ దీవెన నేడు నిజమైంది అంటూ అప్పటి ముచ్చటలను గుర్తు చేసుకున్నారామె.

-సరయు శేఖర్, 9676247000