సబ్ ఫీచర్

ఒత్తిడికి సాంత్వన అవసరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదొక సమయంలో దిగులు తప్పదు. కష్టాలు, కన్నీళ్ళనుంచి బయటకొచ్చేందుకు అదో మార్గం. ఆ సమయంలో ఆత్మీయుల ఓదార్పు స్వాంతననందిస్తుంది. కానీ కొందరు చిన్న విషయాలను భూతద్దంలో చూసి జీవితాన్ని కష్టాల కొలిమిగా భావిస్తారు. నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయే ఈ స్థితే డిప్రెషన్. దేశ జనాభాలో దాదాపు పదిశాతం ఇలాంటి డిప్రెషన్‌తోనే బాధపడుతున్నారని పరిశోధనలు తేల్చి చెపుతున్నాయి. 20-40 ఏళ్ళ మధ్య వయసువారిలో కనిపించే ఈ డిప్రెషన్ మహిళల్లోనే ఎక్కువట. పిల్లల్లోనూ, యువతీ యువకుల్లోనూ సమస్య ఉన్నా కనిపెట్టడం కొంచెం కష్టం.
డిప్రెషన్ కారణాల్లో కొన్ని నిజమైనవి, మరికొన్ని ఊహించలేనివి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా డిప్రెషన్ వుంటే వారసత్వంగా వారి పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. మెదడులో సెరటోనిన్ అనే రసాయనంలో హెచ్చుతగ్గులవల్ల కూడా డిప్రెషన్ వచ్చే అవకాశం వుంది.
కొన్ని సందర్భాల్లో జీవితంలో ఏదైనా నష్టపోయినప్పుడు మనిషి డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు. ఆ కోల్పోవడం అనేది నిజంగా జరగవచ్చు లేదా ఊహించుకున్నదే కావచ్చు. ఆర్థికంగా, వస్తు రూపంగా ఎలాంటి నష్టం లేకపోయినా అహం దెబ్బతినడం, అవమానం పాలవ్వడం లాంటివి మనిషిని డిప్రెషన్‌లోకి నెడతాయి. ఇది ఆ వ్యక్తి పెరిగిన విధానం, వ్యక్తిత్వం, ఒత్తిడిపై ఆధారపడి ఉంటుంది.
డిప్రెషన్ ఎవరికి వస్తుందనే విషయాన్ని పూర్తిగా కనిపెట్టడం కష్టమే అయినా ఒక్కోసారి ప్రత్యేక కారణాలు లేకుండానే వ్యక్తి డిప్రెషన్‌కు లోనుకావచ్చు. అనారోగ్య కారణాలవల్ల కావచ్చు. ఒక వ్యక్తి అన్ని సౌకర్యాలతో హాయిగా జీవిస్తున్నా ఎప్పుడో ఏదో ఒక చిన్న తప్పు చేసి ఉండవచ్చు. కొందరు తాము తప్పు చేశాం కాబట్టి అన్నీ తప్పులే చేస్తామని, లేదా తాము చేసినవన్నీ తప్పులనే భావనకు లోనవుతారు. భవిష్యత్తులో ‘నేనేం చేసినా తప్పవుతుంది. నేనెందుకూ పనికిరాను’ అనే ఆత్మన్యూనతాభావానికి లోనవుతారు. చివరకు తీవ్ర నిరాశా, నిస్పృహలతో ప్రపంచాన్ని నెగెటివ్‌గా చూసి డిప్రెషన్‌కు లోనవుతారు. డిప్రెషన్ సాధారణంగా శారీరకంగా బయటపడుతుంది. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నిద్రలేమి, ఆకలి మందగించడం, గుండెవేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
అనారోగ్యంతో బాధపడుతున్నట్టు భ్రమించి డాక్టర్ దగ్గరకు వెళ్ళినా పరీక్షలు చేసి మీకెలాంటి సమస్య లేదని చెప్తారు. లేదంటే రోగి తృప్తికోసం ఏవో బి కాంప్లెక్స్ మాత్రలు రాసి ఇస్తారు. కానీ అసలు సమస్య మాత్రం అలానే ఉంటుంది. దీర్ఘకాలం దిగులుగా ఉన్నప్పుడు, మందు వాడినా శారీరక బాధలు తగ్గనపుడు మనోవ్యాధిగ్రస్తులుగా పరిగణింపబడతారు. ఇలాంటి సమయంలో వెంటనే మనో వైద్య నిపుణులను సంప్రదించడం మేలు.
డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తి సరిగా ఆహారం తీసుకోరు. నిద్రపోరు. బరువు కూడా తగ్గుతారు. చిన్న చిన్న పనులకు కూడా బాగా అలసిపోతారు. ఏదో తప్పు చేశామనే ఫీలింగ్‌తోనే కుంగిపోతారు. డిప్రెషన్‌లో వున్నవారు కొందరు మద్యం సేవించడం కూడా చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో వీటికి అలవాటు పడకూడదు. అలవాటు ఉన్నా శృతిమించకూడదు. వీటికి దూరంగా ఉండడమే మేలు. లేనిపోని ఆలోచనలతో, డిప్రెషన్‌తో బాధపడేవారిలో 15 మంది ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందని మనోవైద్య నిపుణులు అంటున్నారు. డిప్రెషన్ నుండి బయటపడడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. డిప్రెషన్‌కు లోనైనపుడు దానికసలు కారణాలేమిటో తెలుసుకోవాలి. వాటిని విశే్లషించుకోవాలి. ఆ కారణాలకు దిగులు పడాల్సిన అవసరం ఎంతవరకుందో ఆలోచించాలి. మనసు కుదుటపడేలా ప్రశాంత వాతావరణంలో గడపాలి. రిలాక్సేషన్ కోసం ఏరోబిక్ ఎక్స్‌ర్‌సైజులు, యోగ, ధ్యానం లాంటివి ప్రాక్టీస్ చేయాలి. లేనిపోని ఆలోచనలను పక్కనపెట్టి చేస్తున్న వృత్తిలో నిమగ్నం కావాలి. పని ఒత్తిడివల్ల కూడా డిప్రెషన్‌కు లోనుకాకుండా చూసుకోవాలి. వీలైనంతవరకు మనం చేసే వృత్తిలో పని ఒత్తిడిని మామూలుగానే తగ్గించుకోవాలి. ఒంటరిగా కూర్చోవడం కన్నా ఆత్మీయులతో, బంధు మిత్రులతో కలిసి కబుర్లు చెప్పుకోవడమే మిన్న. ఓదార్పు, స్వాంతన అన్నిటికన్నా అవసరం. డిప్రెషన్‌లో వున్నవారు హాయిగా నవ్వుతూ, తుళ్ళుతూ ఉండే వాతావరణంలో ఎక్కువ సమయం గడపాలి. జీవనశైలిలో మార్పుకోసం కొత్త ప్రయత్నాలు చేయాలి. ముందు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే ఒత్తిడిని ఎదుర్కోవచ్చు.

-కంసుడు