సబ్ ఫీచర్

అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ఎక్కడ చూసినా అవినీతే.. లంచం ఇవ్వనిదే ప్రభుత్వ కా ర్యాలయాలలో పనికాని పరిస్థితి. అక్రమార్కుల భరతం పడతామని ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ సమాజంలో అవినీతి విలయ తాండవం చేస్తోంది. అవినీతి, అధికారం అనేవి ఒకే నాణానికి రెండు ముఖాలుగా మారిపోయాయి. 2003 అక్టోబర్ 31న అవినీతికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి కనె్వన్షన్ తరువాత ప్రతి ఏటా డిసెంబర్ 9న ‘అవినీతి వ్యతిరేక దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. యూరప్‌లోని కొన్ని దేశాలలో అవినీతి తక్కువస్థాయిలో వుండగా ఆఫ్రికా దేశాలలో అవినీతి తారస్థాయిలో వుంది. అవినీతిని అంతం చేయాల్సిన చర్యలపై ఐక్యరాజ్యసమితి చారిత్రాత్మక పత్రాన్ని డిసెంబర్ 9న రూపొందించింది. దీంతో ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు.
ఎయిడ్స్ మహమ్మారి కన్నా అవినీతి మహమ్మారి పెట్రేగిపోతోంది. చైనాతో పోలిస్తే- అభివృద్ధిలో వెనుకంజ వేస్తున్నా.. అవినీతిలో మాత్రం మన దేశం ముందంజలో ఉంది. దక్షిణాసియాలోనే గాక యావత్ ప్రపంచంలోనూ అవినీతి బాగా ప్రబలిన దేశాలలో భారత్ ఒకటి. ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్’ సంస్థ అధ్యయనం ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలలో పని నిమిత్తం 75 శాతం ప్రజానీకం లంచాలు చెల్లించుకోవాల్సి వస్తుంది. 2017లో ప్రకటించిన ఈ సర్వేలో మన దేశం ర్యాంకు 94. లంచం ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరాలుగా పరిగణించబడతాయి. ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడినపుడు, ప్రజాధనాన్ని అపహరించినపుడు.. ఉద్యోగం నుండి తొలగించడం ఒక్కటే సరైన శిక్ష అని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రపంచంలోని 176 దేశాల అవినీతితో పోలిస్తే భారత్ రేటింగ్ 94 వ స్థానంలో వుంది. గత సంవత్సరం 183 దేశాలతో పోలిస్తే భారత్ 95వ స్థానం కైవసం చేసుకుంది. మన పొరుగు దేశం శ్రీలంకకు అవినీతిలో ర్యాంకు 79, చైనా ర్యాంకు 80, డెన్మార్క్ అత్యధిక స్కోర్ 90 సాధించింది. ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు భారత్ కన్నా మెరుగైన ర్యాంకులు దక్కించుకున్నాయి. భారతదేశంలో అవినీతి కార్యాలయాల్లో పనుల దగ్గర నుంచి టెండర్ల స్థాయి వరకూ ప్రతి దశలోనూ జరుగుతోంది. కొంతమంది కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చేపట్టిన పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లు పాలకులు, అధికారులకు పెద్దమొత్తంలో చేతులు తడుపుతున్నారు. ఫలితంగా రోడ్లు భవనాలు, ఆనకట్టలు త్వరగానే పాడైపోతున్నాయి. రవాణారంగం, ఆదాయ పన్ను శాఖ, రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, గనులు, పోలీసు వ్యవస్థలో, పంచాయతీరాజ్ విభాగాలలో అవినీతి తీవ్రస్థాయిలలో ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అభివృద్ధిని అవినీతి కబళిస్తుంది. ఇటీవలి కాలంలో తెలంగాణ వ్యాప్తంగా అవినీతి నిరోధక అధికారులు వరుస దాడులు చేస్తూ, అవినీతి అధికారులను పట్టుకుంటున్నా అధికారులలో మార్పు లేదు. భూమి పత్రాలను ఇవ్వడంలోను, పేర్ల మార్పిడిలోను, రైతుబంధు చెక్కుల పంపిణీలో, పట్టాదారు పాసు పుస్తకాల మార్పిడిలో పెద్దఎత్తున అవినీతి జరిగి రెవెన్యూ అధికారులు పెద్దమొత్తంలో సంపాదన పెంచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించిన వారికి ‘జ్వాల’ అనే అవినీతి వ్యతిరేక సంస్థ పెద్దఎత్తున గుర్రాలపై ఊరేగించి ఘనంగా సన్మానించి, నగదు బహుమతులను అందించడం అభినందించదగ్గ విషయం.
గతంలో ‘లోక్‌సత్తా’ తెలుగు రాష్ట్రాలలో బలంగా వున్న రోజులలో ప్రతినిత్యం ఆ సంస్థ కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలపై నిఘా వేసేవారు. అవినీతి అధికారుల చిట్టాను ప్రజలకు బహిర్గతం చేసేవారు. ప్రస్తుతం లోక్‌సత్తా, సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక, యాంటీ ఫర్ కరప్షన్, జ్వాల వంటి మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు అవినీతికి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించి విద్యార్థులు, యువత, ప్రజలలో అవగాహన పెంచుతున్నాయి. ఏసీబీ అధికారుల సెల్ నెంబర్లను, ఇతర సమాచారాన్ని గ్రామాల్లో సైతం కరపత్రాల రూపంలో ఇస్తున్నారు. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064పై విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. అవినీతికి కళ్ళెం వేసేందుకు నూతన విభాగాలు, వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో అవినీతి నిరోధక విభాగాల ఏర్పాటు, లోకాయుక్త అంబుడ్స్‌మన్ వ్యవస్థలు, సమాచార హక్కు చట్టం, సిటిజన్ చార్టర్‌లు ఏర్పాటయ్యాయి. ఫిఫ్త్ పిల్లర్ అనే సంస్థ జీరోరూపీ నోట్లను జారీ చేసింది. ఎవరైనా లంచం అడిగితే ఈ నోట్లను ఇవ్వాల్సిందిగా సూచించింది. లంచం తీసుకోవడం నేరం అనే హెచ్చరిక ఆ నోట్లపై వుంటుంది. ప్రజలలో ప్రశ్నించే తత్వం, పాలకులు, అధికారులలో జవాబుదారీతనం పెరిగినప్పుడే అవినీతి తగ్గుముఖం పడుతుంది. అవినీతి అధికారులకు కఠిన శిక్షలు వేయాలి. సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ‘లంచం ఇవ్వడం నేరం-తీసుకోవడం కూడా నేరమే’అనే భావన అందరిలోనూ కలగాలి. మన దేశం, రాష్ట్రం నుండి అవినీతిని కూకటివేళ్లతో పారద్రోలదాం. అవినీతి, అక్రమాలపై చైతన్యం కల్గిద్దాం. అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం. ‘అవినీతి అధికారుల భరతం పడదాం’. అవినీతి అంతం- మన పంతం కావాలి.

-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట