సబ్ ఫీచర్

పరస్పర విశ్వాసం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమ్మకం తక్కువ మనిషికి సుఖం తక్కువ. ఎవరిని నమ్మాలో ఎందుకు నమ్మాలో తెలియక గందరగోళంలో పడిపోయే వారి సంఖ్య సభ్య సమాజంలో ఎక్కువే! సహజంగానే ఈ తరహావారికి అనుమానం పెనుభూతంగా తోచడాన్ని ఆశ్చర్యపోయే విషయంగా కాని ఎవరినో తప్పుపట్టే తీరుగాను భావించనవసరంలేదు. మన చుట్టూ ఏ ఇద్దరో గొడవపడుతున్నారన్నా, ఏ ముగ్గురో తిట్టుకుంటూ కొట్టుకుంటారన్నా ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు కాని ఇరువురిమధ్య సదవగాహనతో కూడిన స్నేహం వుందన్నా, కుల మతాల కతీతంగా నలుగురు పరస్పర విశ్వాసంతో ఒకటే మాట, ఒకటే బాట అన్నట్లుగా వున్నారంటే అంత తేలిగ్గా ఎవరికీ నమ్మబుద్ధికాదు. కుటుంబ జీవనంలో ఎవరికివారు ఎదుటివారిపై గెలవాలని కోరుకుంటారు తప్ప ఎదుటివారిని గెలిపించి ఆనందించాలనుకునేవారు అతి తక్కువగా వుంటారు. అసలు ఎవరైనా ఎదుటివారిని హేళన చెయ్యాలని ఎందుకనుకోవాలి? తాము చేసే పనులపట్ల శ్రద్ధాసక్తులు చూపక ఎవరినో కించపరచాలని కాని లేదంటే ఎవరో తనను కించపరుస్తున్నట్లు ఎందుకు భావించాలి. ఎప్పుడైనా లోకమన్నది లేని లోపాలు వెదికేందుకేనని, ఎక్కడైనా లోకమున్నది రాళ్లు విసిరేందుకేనని అనుకోవలసిన అవసరం లేనే లేదు.
ఉట్టికెగురలేనమ్మ స్వర్గానికి ఎగరాలనుకోవడం తప్పన్నది పాతమాట. స్వర్గానికి దారులు వెతుక్కునేవారికి ఉట్టి తాలూకు ఏ విషయాలైనా అనవసరమన్నది నేటి మాట. విన్నదంతా చూడాలనుకోవడం, చూసిందల్లా కావాలనుకోవడం మానవ సహజం. బలాలు, బలహీనతలు సాధ్యాసాధ్యాలు సహజత్వం కోరుకుంటున్నాడా? కేవలం పైపై ఆరాటాలు ఆర్భాటాలేనా? మరి ఆనందం మాటేమిటి? మనిషికి తన పట్ల తనకే నమ్మకం లేక, మరో మనిషి పట్ల నమ్మకం లేక ఆనందం ఎలా కలుగుతుంది? రక్తసంబంధం కలిగినవారిపట్ల లేని విశ్వాసం మరెవరిపట్లనో వుంటుందంటే విశ్వసించడం ఎవరికైనా విడ్డూరంగానే వుంటుంది. ఎవరినీ నమ్మకపోవడమే సరికొత్త జీవిత విధానంగా వుండేవారి తీరు ఎలా వున్నప్పటికీ ఎవరి అవసరాలను బట్టి అవకాశాలను బట్టి నమ్మినట్లు నటిస్తూ నమ్మకపోవడంగాని, నమ్మదగని వారని వెనుక ప్రచారం చేస్తూ కళ్లెదుట అతుక్కుపోయి తిరిగేవారిని కాని ఎవరెలా వ్యాఖ్యానించినా ప్రయోజనం వుంటుందా? నిత్య జీవితంలో మాటలకు చేతలకు మధ్య సమన్వయలోపమే మనిషికి పలు సమస్యలను తెచ్చిపెడుతుంది. చూస్తుందేమిటి? చేస్తుందేమిటి, చెప్పుతుందేమిటి? ఆశిస్తుందేమిటి? అన్న విషయాలపట్ల ఎవరికైనా స్వీయ నియంత్రణ ఎంతైనా అవసరం. అది లోపించినపుడు చుట్టూ లోపాలు కనిపిస్తాయి తప్ప తన ధోరణి ఎవరికైనా అంత తేలిగ్గా అర్థంకాదు.
గొర్రె కసాయిని నమ్ముతుంది కాని కాపలాదారుడిని నమ్మదు. ఎంతైనా అది జంతువు- మూగప్రాణి! మరి మనిషికేమైంది? విజ్ఞానం మనిషిలో విచక్షణ పెంచలేకపోతుందా? తనరీతి తన నీతి తన ధర్మం కన్నా మూర్ఖత్వం పెత్తనం చేస్తుందా? తానున్న కుటుంబంలో తానున్న సమాజంలో పలు సమస్యలు కనిపించవచ్చు. వారందరూ తనకో పెద్ద సమస్యగానూ కనిపించవచ్చు. తానే వారికో క్లిష్ట సమస్యగానూ కనిపించవచ్చు. పరస్పర విశ్వాసం లోపించిన చోట అనమ్మకం, భయం, ద్వేషం, విసుగు, ఆందోళన వ్యాపించే ప్రమాదముంది. ఫలితంగా విశ్వాసం గురించి ఎందరు వినిపించినా, ధైర్యాన్ని ఎవరు ప్రవచించినా, ప్రేమ, శాంతి, స్థిరచిత్తం గురించి ఎక్కడ ప్రస్తావించబడినా వాటితో తమకెంత మాత్రం సంబంధం లేని విధంగా ప్రవర్తించేవారు జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం ఎవరికైనా సహజంగానే కలుగుతుంది.
పరస్పర విశ్వాసమే బంధుత్వాలు నిలుపగలుగుతుంది. ఒకరిపట్ల ఇంకొకరికుండే నమ్మకమే స్నేహాలను కలుపుతుంది. ఒకింత దయాగుణం, రవ్వంత ప్రేమ, కొంచెం మంచితనం, ముఖ్యంగా నేనున్నానన్న భరోసా పక్కవారికివ్వగలిగితే నిత్య జీవితంలో మానవ సంబంధాలు మెరుగుపడతాయి. ముసురుకునే ఒంటరితనాన్ని చింతలు చికాకుల్ని కొంతైనా తగ్గించి జీవితంపట్ల సరికొత్త ఆశలు ఆశయాలను కలిగిస్తాయి.
సహజంగా మనిషి స్వేచ్ఛాప్రియుడు. అంతమాత్రాన ఎదుటివారి నమ్మకాలకు విరుద్ధంగా నడుచుకోవడమైనా, తన నమ్మకాలను బలవంతంగా పరులపై రుద్దడమైనా స్వేచ్ఛ అనిపించుకోదు కదా! ప్రతిదీ ప్రతి ఒక్కరికీ తెలియాలని లేదు. కాకపోతే ఏదెలా చెయ్యాలో తెలియడంలో కొంత ఆలస్యం జరిగినా నష్టంలేదు కాని ఏది ఎందుకు చెయ్యకూడదో తెలియడం అత్యవసరం. ఎవరిని ఎందుకు నమ్మకూడదో తెలిస్తే ఎందుకు నమ్మాలో తెలియడం పెద్ద కష్టమేమీ కాదు.
కడివెడు పాలను పాడుచేసేందుకు ఒక్క విషపు చుక్క చాలు. కొండంత దూదిని బూడిద చేసేందుకు ఒక్క నిప్పురవ్వ చాలు. మనిషి మనసుని కకావికలం చేసేందుకు చిన్ననింద చాలు.
నీ ఇంటికొస్తే ఏమిస్తావనో, నా ఇంటికొస్తే ఏమి తెస్తావనో కాదు ఇప్పుడు ఆశించవలసింది. పరిచయాన్ని స్నేహంగా మార్చుకోవడంలోనైనా, కుదిరిన స్నేహాలను, బంధుత్వాలను అపోహలతో అపార్థాలతో కలుషితమవకుండా ఎవరికివారు జాగ్రత్త పడగలిగితే పరస్పర విశ్వాసమైనా పరస్పర గౌరవమైనా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుంది.

-డా కొల్లు రంగారావు