సబ్ ఫీచర్

ఆంగ్ల మాధ్యమం విజయం సాధిస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే ఏడాది ఒకటవ తరగతినుండి ఆరవ తరగతివరకూ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని చూస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని కొద్దిమంది సమర్థించినవారైతే అధిక శాతంమంది వ్యతిరేకించిన వారున్నారు. ప్రభుత్వాలు మారుతున్నపుడల్లా విద్యారంగానికి వారు చేసిందేమీ ఉండదు. పాఠశాలలకు కావలసిన భవన సముదాయం, ఫర్నీచర్, లైబ్రరీలు, బ్లాక్‌బోర్డులు, మేప్‌లు, చార్టులు, సుద్దముక్కలు, ఆట వస్తువులు, ఆటస్థలాలు, మంచినీటి సదుపాయం, లేబరేటరీలు, ఉపాధ్యాయుల కొరత, బాలికలకు వెయిటింగ్ రూమ్స్ మొదలగు సదుపాయాలు లేని పాఠశాలలు చాలా ఉన్నాయి. ఈ అవసరాలను తీర్చకుండానే తమ పాలనలో విద్యారంగంలో ఏవో మార్పులు చేసేస్తున్నామన్న భ్రమను ప్రభుత్వాలు ప్రజలకు కల్పిస్తున్నాయి.
తెలుగు భాషాభిమాని అయిన నందమూరి తారక రామారావు ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీషు ఎలా వ్యాప్తి చెందిందో తెలుగును కూడా అలా వ్యాపింపజేయాలనే కోరికతో ఉండేవారు. అది సాధ్యమైన పనికాదని ఆనాడే (మార్చి 11, 1983) ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ‘ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్’ అనే ఆర్టికల్‌ను నేను వ్రాశాను. అలా నేను వ్రాసిన ఆర్టికల్‌లో ఎక్కడా తెలుగు భాషను విస్మరించమని చెప్పలేదు. దేనికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దానికి సమయం సందర్భాన్నిబట్టి ఇవ్వాలి. ఒక భాష అవసరం కోసం ఇంకో భాషను పూర్తిగా నాశనం చేయకూడదు. నేటి సాంకేతిక పరిజ్ఞానం, నేటి అవసరాలను బట్టి ఆంగ్లం అవసరం అయినా ప్రాథమిక స్థాయినుండి ప్రవేశపెట్టడం తెలుగు భాషకు తీరని ద్రోహం చేసినవారే అవుతారు.
మనిషి పుట్టుక నుంచీ సంస్కృతీ సంప్రదాయాలతోపాటు భాష అభివృద్ధి చెందుతూ వస్తూనే వుంది. దానిని ఇంకా అభివృద్ధి చేయవలసిన అవసరం వుంది. అంతేగాని పరాయి భాషకోసం మాతృభాషకు తిలోదకాలివ్వడం ఎంతవరకూ సమంజసమన్నది మనం ప్రశ్నించుకోవలసి వుంది. ప్రపంచ దేశాలు ఎవరి భాషను వారు పెంపొందింపజేసుకోవాలనే ప్రయత్నంలో వున్నారు. అటువంటి పరిస్థితులలో బాల్యంలోనున్న బాలబాలికలకు తెలుగు రుచులను అందనివ్వకుండా చేయడమే దురదృష్టకరమే! ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ఇప్పటికే తెలుగు భాష మృతభాషల జాబితాలో చేరిపోయింది. కొనఊపిరితో వున్న అమ్మ భాషను ఇంకా చావగొట్టాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం?
ప్రపంచ దేశాలు వారి దేశ భాషలకు రక్షణ కల్పిస్తూ, ఇతర దేశ భాషలను అవసరాన్ని బట్టి ప్రోత్సహిస్తున్నారు. అలాగే మన భాషకు మనం రక్షణ కల్పించుకుంటూ పాశ్చాత్య భాష అయిన ఇంగ్లీషును నేర్చుకోవాలి. కానె్వంట్‌లలో చదివినవాళ్ళంతా ఇంగ్లీషు దొరలైపోరు. విదేశాలను పాలించేయరు. ప్రతీ యుగంలోను, ప్రతి తరంలోనూ, మనిషికీ మనిషికీ మేధాశక్తికీ తేడా వుంటుంది. ఆ కారణంగా ఒక విషయాన్ని నేర్చుకోవడంలోగానీ, అర్థం చేసుకోవడంలోగానీ మనిషికీ మనిషికీ ఎంతో వ్యత్యాసం వుంటుంది. ప్రాథమిక పాఠశాల స్థాయినుండి ఆంగ్ల మాధ్యమాన్ని అందరికీ అన్ని పాఠశాలల్లోను ప్రవేశపెడితే అందరూ ఆంగ్ల భాషాపండితులు, దొరలు అవ్వడమంటూ జరగదు. మేథాశక్తి చాలనివాడు అటు ఇంగ్లీషు రాక ఇటు తెలుగు రాక త్రిశంకు స్వర్గంలో పడతాడు. కనీసం తెలుగు రాష్ట్రాలలో అటెండర్ ఉద్యోగానికిగానీ, రికార్డు అసిస్టెంట్ ఉద్యోగానికి కూడా పనికిరాడు. కనీసం తెలుగులో ఉత్తరం చదువుకొనే పరిజ్ఞానాన్నైనా కలిగి ఉండడు. ఆ కారణంగా కనీసం పదవ తరగతి వరకైనా తెలుగు నేర్చుకొనే పరిస్థితులు కల్పించాలి. అందుకు తెలుగు మీడియం తప్పనిసరిగా ఉండాలి. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజులనుండి రమారమీ అరవయ్యో దశకం పూర్తయ్యేవరకూ ప్రాథమిక పాఠశాలలు, మాథ్యమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు (పదకొండవ తరగతివరకూ) తెలుగు మీడియంలోనూ కళాశాలల్లో పియుసి అంటే ప్రీ యూనివర్సిటీ కోర్సు (నేటి ఇంటర్ రెండవ సంవత్సరం) అందులోనే డిగ్రీ కోర్సులు ఆంగ్లంలో చదవాలి. పియుసిలో చేరినప్పటినుండీ ఉన్నత చదువులు బిఏ, బి.కాం, బిఎస్సీ, ఎంఏ, ఎం.కాం, ఎంఎస్సీ సాధారణ డిగ్రీలు ఆనర్స్ డిగ్రీలు ఇంగ్లీషు మీడియంలో చదివేవారు. హైస్కూల్ చదువులు పూర్తిచేశాక కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఇతర పరిస్థితులు విద్యార్థికి అనుకూలంగా లేకపోయినట్లయితే ఏదో ఆఫీసులో ఉద్యోగంలో చేరేవాడు. తెలుగు మీడియం చదువులవల్ల తక్కువ వ్యవధిలో విషయ పరిజ్ఞానాన్ని పొంది పరీక్ష పాసై కుటుంబ జీవనానికి ఆధారం దొరికినట్టేయ్యేది.
ఆర్థిక పరిస్థితులు బాగున్నవారు, మేథాశక్తి కలిగున్నవారు ఉన్నత చదువులు చదివేటందుకు కాలేజీల్లో చేరేవారు. ఒకటవ తరగతినుండి పదకొండవ తరగతివరకూ తెలుగు మీడియంలో చదివినా కాలేజీ చదువులకు వెళ్ళేసరికి ఇంగ్లీషు మీడియం చదువవలసి వుండేది. ఆనాటి తెలుగు మీడియం విద్యార్థులే ఈనాడు సీనియర్ ఐఏఎస్, ఐపియస్‌లు, ఇతర ఉన్నతాధికారులుగా లక్షల్లో వున్నారు.
ఇక 1969 నుండి ఎస్.ఎస్.ఎల్సీ (పదకొండవ తరగతి)లో పబ్లిక్ పరీక్ష తీసేసి దాని స్థానే ఎస్‌ఎస్‌సి అనే పేరుతో పదవ తరగతిలోనే పబ్లిక్ పరీక్ష పెట్టారు. ఇదీ తెలుగు మీడియంలో చదివిన చదువే! ఇక వీరు ఉన్నత చదువులు తెలుగు మీడియంలోనే చదువుతున్నారు. ఉన్నత పదవులు పొంది ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారు. ఇక్కడ మనం గమనించవలసిందేమిటంటే ప్రాథమిక స్థాయి నుండి తెలుగు మీడియంలో చదివినవారు ఉన్నత పదవులను అత్యంత సమర్థనీయంగా నిర్వహిస్తున్నారు. అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడగలుగుతున్నారు.
కొన్ని దశాబ్దాల క్రితం ఎక్కడో అరుదుగా ఇంగ్లీషు మీడియం స్కూల్స్ ఉండేవి. కానీ ఈనాడు ప్రతీ చోటా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఆంగ్ల భాష నేర్చుకోవాలనే తపన గలవారు, ధనిక కుటుంబాలకు చెందిన పిల్లలే అటువంటి పాఠశాలల్లో చదివేటందుకు అవకాశం వుంది.
-ప్రస్తుత తెలుగు మీడియం పాఠశాలలు ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత పాఠశాల స్థాయివరకూ యథాతథంగా కొనసాగిస్తూ కాలేజీ చదువుల నుండి ఇంగ్లీషు మీడియం ఉండాలి.
- ఇంగ్లీషు మీడియం పాఠశాలలు ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలి.
- ఇంగ్లీషు మీడియం పాఠశాలలకు అవసరమైన పూర్తి అర్హతలుగల (అంటే ఎంఏ ఇంగ్లీషు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఫ్లూయెన్సీ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ఇంగ్లీష్, ప్రొనొన్సియేషన్ అండ్ టీచింగ్ ఎబిలిటీ గలవారిని) మాత్రమే ఆంగ్ల ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి నియమించాలి.
- ప్రాథమిక పాఠశాలల్లో విద్యా విధానం మెరుగుపడాలంటే సరియైన పర్యవేక్షణ ఉండాలి. పాఠశాలకు కల్పించే సదుపాయాలు విద్యార్థులు, ఉపాధ్యాయులు సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అని పర్యవేక్షకులు చూడాలి.
- ప్రాథమిక స్థాయి విద్య భవనానికి పునాది వంటిది. ప్రాథమిక విద్యకు ప్రభుత్వం కొన్ని వేలకోట్లు ఖర్చు పెడుతున్నా సక్రమమైన ఫలితాలు రావడంలేదు. స్టాండర్డ్స్ పతనమవుతున్నాయి. విద్యార్థి పుట్టుకతో తెలుగువాడైనా తెలుగు అక్షరాలు ఆరవ తరగతివరకూ రాలేదు. అలాగే మిగిలిన సబ్జెక్టుల పరిస్థితీ అంతే. ఇక ఆ తరగతి ఉపాధ్యాయుల గోడు వినేదెవ్వరు? ఇటువంటి విద్యార్థులు పైతరగతుల ఉపాధ్యాయులకు తలకుమించిన భారం అవుతున్నారు. దీనికి కారకులెవరు? ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం కాదా! పాఠశాల పాలనా విధానంలో రాజకీయ నాయకుల జోక్యం కూడదు. తెలుగు మాధ్యంగల పాఠశాలలకే ఇన్ని అవాంతరాలు ఉంటే ఆంగ్ల భాషా మాధ్యమం పాఠశాలలు ఎంతటి విజయాన్ని తెచ్చిపెడతాయో చూడాలి మరి!

- శివ్వాం ప్రభాకర్ 7013660252