సబ్ ఫీచర్

పొదుపు, మదుపులతో గెలుపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటు వ్యక్తులకైనా.. అటు సంస్థలకైనా.. మరోవైపు ప్రభుత్వాలకైనా వారి లక్ష్యసాధనలో గెలుపుల కొరకు ఆర్థిక పరిపుష్టి అవసరం. ఈ పరిపుష్టి పక్కదోవ పట్టకుండా వుండడానికి ప్రణాళికాబద్ధంగా పొదుపులను పాటిస్తూ.. ఖర్చులను మదుపుచేసుకుంటూ... ఆడంబరాలకు దూరంగా వుండాలి. ఇలా.. పయనిస్తే.. నేటి ఆర్థిక మాంద్య పరిస్థితులు ఎన్నివచ్చినా తట్టుకోడానికి అవకాశం వుంటుంది.

ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 30ని ప్రపంచ పొదుపు దినోత్సవం కింద గుర్తించింది. అప్పటినుంచీ ప్రతియేటా పొదుపు ఉత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఐక్యరాజ్యసమితికే నేడు నిధుల కొరత ఏర్పడింది. ఐక్యరాజ్యసమితిలో రకరకాల విభాగాలు పనిచేస్తున్నాయి. సరాసరిన 50వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి యేటా సమితినందలి సభ్య దేశాలు ఆయా విభాగాల నిర్వహణ ఖర్చులకు విరాళాలు పంపించడం ఆనవాయితీగా జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థికమాంద్య పరిస్థితుల్లో భాగంగా కొన్ని దేశాలు విరాళాలను ఐక్యరాజ్యసమితికి ఈ సంవత్సరం పంపించలేదు. మరికొన్ని దేశాలు గత యేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పరిమిత స్థాయిలో విరాళాలు పంపించాయి. ఐక్యరాజ్యసమితి సైతం ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా పొదుపుబాటపట్టి కొన్ని కార్యక్రమాల సమావేశాలను రద్దుచేసింది. మరికొన్ని విభాగాలనందలి కార్యకలాపాల ఖర్చులను నియంత్రించుకుంటూ పోతున్నది. అమెరికాలో ఉద్యోగం అంటే.. ఒకప్పుడు భలే ఫ్యాషన్‌గా వుండేది. అమెరికా అల్లుళ్లకోసం తెగ తాపత్రయపడేవారు. ఈ విధంగా అమెరికాకు అనేక దేశాలనుంచి ఉద్యోగాలకోసం క్యూలుకట్టుకొని వివిధ దేశాల యువతీయువకులు వెళ్లేవారు. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో కూడా నిరుద్యోగ సమస్య వికృతరూపం దాల్చడంతో బయటి దేశాలనుంచి వస్తున్నవారికి బ్రేక్ వేస్తున్నారు.
వలస జీవులు వారివారి దేశాలకు వెళ్లిపోవాలనే ఉద్దేశ్యంతో అక్కడ జీవిస్తున్నవారికి రకరకాల కఠినతరమైన నిబంధనలు విధిస్తున్నారు. నేటి ఆర్థిక మాంద్య సంవత్సరంలో అయితే.. పరిస్థితి అక్కడ మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో మొత్తం ప్రపంచం చూపు పొదుపువైపు వెళ్లింది. అనాది కాలంలోనే కొన్ని దేశాలు ఆనాటి రాజ్యాలు పొదుపు ఆవశ్యకతను నొక్కివక్కాణించి చెబుతూవచ్చాయి. భారతదేశంలో స్వాతంత్య్రానంతరం 1959లో ప్రభుత్వ పొదుపు ధృవీకరణ పత్రాలను ప్రవేశపెట్టింది. తరువాత 1968లో ప్రజాప్రావిడెంట్ ఫండ్ చట్టం ప్రజలలో పొదుపు ఆవశ్యకతను పెంచడంలో భాగంగా తీసుకొచ్చింది. మొత్తంమీద నేడు ప్రపంచవ్యాప్తంగా వున్న 190కి పైగా దేశాల్లో 700 కోట్ల జనాభాలో సరాసరిన మూడవవంతు భాగం ఆర్థిక సమస్యలతో అవస్థపడుతున్నారు. వెనుకబడిన దేశాలనుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలే కాకుండా అభివృద్ధిచెందిన దేశాలు కూడా నేడు ఆర్థిక మాంద్యపు రక్కసిని చూసి భయకంపితులవుతున్నాయి. ఈ సందర్భంలో యావత్ ప్రపంచ దేశాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి పొదుపు ఆవశ్యకతను పూర్తిగా వివరించి దీనిని మరో ఉద్యమంలాగ చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి ఓ ప్రణాళిక రూపొందిస్తున్నది.
పాలకుల ప్రణాళికలకన్నా ప్రజలలో మానసిక చైతన్యం రావలసి వుంది. వివాహ ఖర్చుల నియంత్రణ చట్టం, వరకట్న నిషేధ చట్టం వున్నప్పటికీ ప్రజలు వివాహాలను చాలా ఆడంబరంగా జరిపిస్తున్నారు. కట్నాల కొరకు మగరాయుళ్లు మృగాలుగా డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. వివాహాలనందే కాకుండా ఇతరత్రా అనేక విందులు, వినోదాల కార్యక్రమాలల్లో ఆహార పదార్థాలను, విందు పానీయాలను సుమారు 20నుంచి 30 రకాల వరకు ఏర్పాటుచేస్తున్నారు. వాటిలో విందులకు హాజరయ్యే వ్యక్తులు ఒక్కొక్క ఐటం కొంచెం కొంచెం తిని మిగతావన్నీ పళ్లెంలో అలాగే వదిలేస్తున్నారు. వివాహాలకు ఇతర ఫంక్షన్లకు భారీ ఎత్తున డెకరేషన్లు, సినిమా సెట్టింగ్‌ల్లాగ రకరకాల డిజైన్లతో కూడిన లైటింగ్‌లు ఏర్పాటుచేస్తున్నారు. ఇలాగే.. బర్త్‌డేలకు, మ్యారేజ్‌డేలకు కూడా భారీగా ఖర్చుపెడుతున్నారు. ఇటీవల ముగిసిన దీపావళి రోజున సరదాకోసం ఏదో సాంప్రదాయంకోసం అన్నట్లుగా పరిమితస్థాయిలో టపాసులు కాల్చకుండా ఆరోజు పగలు రాత్రి పోటీలుపడి విచ్చలవిడిగా కాల్పుల కార్యక్రమాన్ని కొనసాగించారు. జనవరి 1 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంలో భాగంగా అర్థంపర్థంలేని విలువైన గ్రీటింగ్‌లు పంపుతుంటారు. ప్రతి ఒక కార్యక్రమానికి వందలస్థాయిలో ఖర్చుపెట్టి బోకేలు అందజేస్తారు. ఒక మంత్రి సన్మాన కార్యక్రమానికి చాలామంది బొకేలు తీసుకొచ్చారు. అక్కడే వున్న మంత్రి అంగరక్షకుడు బొకే ఇలాతీసుకొని అలా పక్కన పడేశాడు. అలా పడేసిన బొకేలు సన్మాన కార్యక్రమం ముగిసిన తరువాత ఓ ట్రాక్టర్ నిండే విధంగా కుప్పగా పేరుకుపోయాయి. ఇదే విధంగా స్టార్ హోటల్స్‌లో భోజనానికి వెళ్లినప్పుడు కూడా మెనూలోవున్న అనేక వాటికి ఆర్డర్స్ ఇస్తారు. తినేది మాత్రం కొంచెమే తింటారు. బిల్లు భారీగా పడుతుంది. భేషజాలతో వెయిటర్లకు అడక్కపోయినా... భారీ టిప్పులు చెల్లిస్తారు. కేవలం ఒక పర్లాంగు లేదా రెండు పర్లాంగులు దూరంలోవున్న షాప్‌కు లేదా కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్లకుండా బద్ధకంతో ఆటోలు ఎక్కుతారు. కార్లు వున్నాయి కదా అని ప్రతి పది నిమిషాలకు సిటీ బస్సులు ఇతరత్రా మెట్రోరైళ్లు వున్నప్పటికీ కార్లలోనే ప్రయాణించాలని తాపత్రయపడతారు. సిటీ బస్సు లేదా మెట్రోలో ప్రయాణిస్తే.. కేవలం 50 రూపాయలనుంచి 60 రూపాయలు ఖర్చవుతుంది. కారులో పోతే డీజిల్ ఖర్చు ఇతరత్రా 200 రూపాయలవుతుంది. ఇలాగే.. ఆటలలో, సిటీ బస్సులలో ప్రయాణించేటప్పుడు చిన్న చిన్న సరుకులకోసం కిరాణా షాపులకు వెళ్లేటప్పుడు తగిన చిల్లర లేక అవస్థ పడుతుంటాము. చాలామంది చిల్లర జేబులో వున్నప్పుడు చిల్లర వుంది కదా...! అని హోటల్స్‌లో వెయిటర్లకు, గుళ్లదగ్గర భిక్షగాళ్లకు హోదా రూపంలోనో.. సరదాగానో.. ఇచ్చేసి వస్తారు. అప్పుడప్పుడు జేబులో మిగిలే చిల్లర ఇంట్లో ఒకచోట డబ్బాలో దాస్తూవస్తే... చిన్నచిన్నవాటికి ఈ చిల్లరను ఉపయోగించుకోవడానికి అవకాశం వుంటుంది. చిల్లర లేనప్పుడు సిటీ బస్సులలో లేదా వేరే బస్సులలో దిగేటప్పుడు మరిచిపోయి వచ్చేస్తుంటాము. ఆటో వ్యక్తికి 45 రూపాయలు ఇవ్వవలసి వచ్చినప్పుడు 50 రూపాయలు ఇస్తే అతను 5 రూపాయలు చిల్లర లేదంటాడు. మనం ఏమీచేయలేక వదిలేసి వస్తుంటాము. ఇలు.. చిన్న విషయాలనుంచి పెద్ద విషయాలవరకు ఖర్చుల నియంత్రణలో, పొదుపునందు ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే అవసరమైనప్పుడు ఆర్థిక సమస్యలు అనేవి వుండవు.
ప్రభుత్వంలో భాగస్వాములుగావున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రభుత్వ అధికారులు నైతిక బాధ్యతతో వ్యవహరిస్తూ ఆత్మపరిశీలనలో తమ కార్యాలయాల్లో, దైనందిన కార్యక్రమాల్లో వృధాచేస్తున్న ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోవలసి వుంది. ఒక మంత్రికి ఒకటి లేదా రెండు కార్లు అవసరం కాగా... అత్యవసర సేవల నెపంతో నాలుగైదు కార్లు వినియోగిస్తున్నారు. మంత్రుల కార్లను కేవలం మంత్రులు అధికారిక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించవలసి వుంది. కుటుంబ సభ్యులు, స్వంత అవసరాలకు ఇలాగే.. మంత్రులు కూడా వ్యక్తిగత అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ఇలాగే... ఏ.సీ.లను, ఫ్యాన్లను, కరెంట్ బల్బులను ఆఫీస్ పనివేళలు ముగిసిన వెంటనే ఆఫ్ చేయవలసి వుంటుంది. వీటి మీద నియంత్రణ లేక కొన్ని వెలుగుతుంటాయి. మరికొన్ని తిరుగుతుంటాయి. కార్యాలయాల డెకరేషన్లకు కూడా భారీగా ఖర్చుపెడుతుంటారు. ఈవిధంగా అటు ప్రభుత్వంనందు పైన చెప్పిన విధంగా ఇటు ప్రజలనందు మానసిక చైతన్యంతో కూడిన మార్పురావాలి. పొదుపుద్వారా మదుపు ఏర్పడుతుంది. మదుపుద్వారా గెలుపు సునాయాసమవుతుంది. ఇటు వ్యక్తులకైనా.. అటు సంస్థలకైనా.. మరోవైపు ప్రభుత్వాలకైనా వారి లక్ష్యసాధనలో గెలుపుల కొరకు ఆర్థిక పరిపుష్టి అవసరం. ఈ పరిపుష్టి పక్కదోవ పట్టకుండా వుండడానికి ప్రణాళికాబద్ధంగా పొదుపులను పాటిస్తూ.. ఖర్చులను మదుపుచేసుకుంటూ... ఆడంబరాలకు దూరంగా వుండాలి. ఇలా.. పయనిస్తే.. నేటి ఆర్థిక మాంద్య పరిస్థితులు ఎన్నివచ్చినా తట్టుకోడానికి అవకాశం వుంటుంది. ఇందులో భాగంగా నేడు ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 250 పట్టణాలలో ప్రపంచ పొదుపు దినోత్సవం సందర్భంగా ఈ సొసైటీ ఉద్యోగులు పొదుపు ర్యాలీలను నిర్వహిస్తున్నారు.

-తిప్పినేని రామదాసప్పనాయుడు 99898 18212