సబ్ ఫీచర్

పోలికలు వద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పక్కింటి విశ్వని చూడు.. ఉదయం ఐదున్నరకే లేసి బాస్కెట్ బాల్‌కి వెళ్లిపోతాడు. నువ్వు ఉదయం తొమ్మిదైనా నిద్రలేవవు. సెలవులు నీకేనా, ఎవరికీ లేవా?’ అంటూ పనె్నండేళ్ల ఆయుష్‌కి తండ్రి మేలుకొలుపు. ‘సోనాకు 9.8 మార్కులు వచ్చాయి. నీకూ వచ్చాయి 8.3.. అవీ ఓ మార్కులేనా.. ఎప్పుడు నేర్చుకుంటావు?’ అని వైష్ణవికి తల్లి మందలింపు..
ఇవి ప్రతీ ఇంట్లో సర్వ సాధారణమే.. కానీ ఈ పోలికల వల్ల పిల్లల్లో పోటి, కసి, అసూయ, ద్వేషం.. ఇలా రకరకాల భావాలు వచ్చేస్తాయి. పోలిక వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. దీంతోవారు తల్లిదండ్రులతో పాటు పోల్చినవారితో కూడా మాట్లాడటం మానేస్తారు. ఫలితంగా పిల్లల్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మొదలవుతుంది. తోటిపిల్లలతో మన పిల్లల ఆకలి, నిద్ర, ఏడుపు, నడక, వస్తధ్రారణ, హుషారుగా ఉండటం, మార్కులు, ర్యాంకులు.. ఇలా ఎన్నోవాటిని పోలుస్తాం. పక్కింటివారు ఎంబీబీఎస్ సీటు తెచ్చుకుంటే.. ఇక మన కడుపులో బాధ మొదలవుతుంది. దాన్ని మన పిల్లలమీద రుద్దేస్తాం.. ‘నువ్వు ఎప్పుడు తెచ్చుకుంటావు?’ అంటూ పోరుపెడతాం.. ఫలితంగా ఆ పిల్లలు మానసిక కుంగుబాటుకు గురవుతారు.
* పిల్లలను తరచుగా ఇతర పిల్లలతో పోల్చడం వల్ల వారిలో ఆత్మన్యూనత పెరిగిపోతుంది.
* ఈ స్థితిలో పిల్లలు స్వతంత్రంగా ఏదైనా చేయాలని అనుకోరు. వారిలో ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. తాము ఎందుకూ పనికిరాం అనే స్థితికి చేరుకుంటారు. ఫలితంగా వారిలో ఉన్న సామర్థ్యం తగ్గిపోతుంది.
* చదవకలిగే సామర్థ్యం ఉండి చదవలేకపోతే సరే కానీ.. చిన్నప్పటి నుండీ వాళ్ల సామర్థ్యం అంతే అయినప్పుడు వారిపై ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా ఆశించిన ఫలితం రాదు. పైగా ఒత్తిడి వల్ల పిల్లలు మానసికంగా కుంగిపోతారు. అక్కడే ఆగిపోతారు.
* తమకు తాము తక్కువ అనుకుంటూ నలుగురిలోకి రావడానికి ఇష్టపడరు. తమలో ఏదో లోపం ఉందనుకుంటారు. ఇలా తమ ఆలోచనల్ని, తమ బాధను ఎవరితోనూ చెప్పుకోలేక ఒంటరితనానికి గురవుతారు. ఫలితంగా ఏదో ఒక తప్పుదారిని ఎంచుకుంటారు.
* ర్యాంకులు రాలేదని పిల్లలను పోగొట్టుకోలేము కదా.. అందుకని పిల్లల మనసుల్ని బాధపెట్టకుండా వారితో ఎంతో ప్రేమగా ఉండాలి.
* పిల్లలకు ఓటమి ఎదురైనప్పుడు వారికంటే ముందు తల్లిదండ్రులు బాధపడిపోయి పిల్లలపై అరవకుండా.. పిల్లలకు ఓదార్పునిస్తే వారు ధైర్యంగా విజయం కోసం పోరాడుతారు.
* పిల్లల మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి కానీ.. పోలిక ఉండకూడదు. బదులుగా వాళ్లలో స్ఫూర్తిని రగల్చాలి. ఇలా సాధ్యం కావాలంటే.. అవతలి వాళ్ల ప్రత్యేకతల గురించి చెబుతూనే కలిగే లాభాల్ని వివరించగలగాలి.
* ఫలానా ర్యాంకు తెచ్చుకున్నారు, ఫలానా అవార్డు గెల్చుకున్నారు అని చెప్పే బదులు.. అవి రావడానికి వారెంత కష్టపడ్డారో తేలికైన మాటలతో తెలియజెప్పాలి. ఇలా చెప్పడం వల్ల పిల్లలు అవతలి వ్యక్తులపై ద్వేషం పెంచుకోకుండా వారిని రోల్‌మోడల్‌గా తీసుకుంటారు. అమ్మానాన్నలపై కూడా కోపం తెచ్చుకోరు.
* పిల్లలపై ఊరికే అరవకుండా వారిలో స్ఫూర్తినింపేలా, నెమ్మదిగా మాట్లాడాలి. వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందేలా చేయాలి. భయం పోగొట్టాలి. కష్టపడే తత్వాన్ని పెంపొందించాలి.
* ఇతరుల ఎదుట పిల్లల్లోని సామర్థ్యాన్ని ప్రోత్సహించి మాట్లాడితే వాళ్లలో మరింత కృషి చేయాలనే హుషారు వస్తుంది. అంతేకాని పిల్లల్ని తక్కువచేసి మాట్లాడితే వాళ్లు అవమానంగా భావిస్తారు.
* పిల్లలు ఏం చెప్పినా తల్లిదండ్రులు సానుకూల దృక్పథంతో ఉండాలి.
* పిల్లలు ఉన్నతస్థానాలను చేరుకోవాలని కోరుకోవడంలో నిజాయితీ ఉండాలి తప్ప, ఇతరులను అనుసరించి అడుగులు వేయించాలని అనుకోకూడదు.
* చదువు, ఆటపాటలు ఏవైనా సరే.. వారి అభిరుచికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి తప్ప తోటివారు చేస్తున్నారని, పిల్లలను కూడా అదే ఎంచుకోమని ఒత్తిడి చేయకూడదు. వారి అభిరుచికి తగ్గ రంగాన్ని ఎంచుకున్నప్పుడు వారు సంతోషంగా ఆ రంగంలో రాణిస్తారు. *