సబ్ ఫీచర్

నవ్వుతూ..నవ్విస్తూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ.. నవ్వుతూ చావాలిరా!’ అన్నాడు ఓ సినీ కవి. నిజంగా ప్రకృతిలో నవ్వగలిగిన వరం మనిషికి మాత్రమే ఉంది. నవ్వు నాలుగు విధాల చేటు అనుకుంటూనే ప్రస్తుతం మనసారా నవ్వటమనే ప్రక్రియను మనుషులు మరచిపోతున్నారు. ఎవరికివారు తాము చివరిసారిగా బిగ్గరగా నవ్విన సమయం, సందర్భం గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తే అది చాలాకాలం క్రితం జరిగిందని అర్థమవుతుంది. అయితే తమ జీవితంలో జరిగిన సంఘటనలమీద నవ్వుకోవచ్చు. కానీ అది కూడా ప్రస్తుతం పనుల ఒత్తిడిలో మనిషి చేయలేకపోతున్నాడు.
నవ్వటాన్ని మించిన ఇతరబాధ్యతలు ఎన్నో మీదపడుతుండగా తీరికగా నవ్వే అవకాశం ఎక్కడనుండి వస్తుందనేది నేటి ప్రశ్న. జీవితంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు ఎదురవుతుంటాయి. వాటి పరిష్కారం అంత తేలిక కూడా కాదు. అయితే అంతమాత్రం చేత మనిషి తన సహజ లక్షణమైన నవ్వును వదిలేయటం ఏమంత మంచిది కాదు.
చిన్నతనంలో ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వుతారు. తమ ఆటపాటలతో కూడా నవ్వే అంతటి స్వచ్ఛమైన నవ్వే పిల్లల ఎదుగుదలకు ఒక టానిక్‌గా పనిచేస్తుంది. బాల్యంలో వున్న మంచి అలవాట్లను చాలావాటిని ఎదుగుతూ మరచిపోవటం మానవ నైజం. సరిగ్గా అటువంటిదే మనిషి నవ్వు విషయంలో కూడా చేస్తున్నాడు.
నవ్వటమనేది ఒక కళ. కళలో వివిధ స్థాయిలు ఉన్నట్లే నవ్వులోను పలు స్థాయిలుంటాయి. చిరునవ్వు మొదలు పగలబడి నవ్వడం వరకు నవ్వును ప్రదర్శిస్తారు. సందర్భాన్ని బట్టి నవ్వే పద్ధతి మారినట్టే, మనిషి మనస్తత్వాన్ని బట్టి నవ్వు మారుతుంటుంది. ప్రతి చిన్నదానికీ పగలబడి నవ్వగలిగిన అదృష్టవంతులు కొందరు. వారి నవ్వులో చక్కని ధ్వని ఉంటుంది. నోరంతా తెరచి హాయిగా నవ్వగలరు. ఈ నవ్వు ఆనంద బాష్పాలను కురిపిస్తాయి కూడా. ఇక కొందరి నవ్వు పెదవులు దాటీ దాటకుండా ఉంటుంది. నవ్వితే ఎక్కడ తాను గాంభీర్యం చెడిపోయి, బలహీన మనుషులుగా తేలిపోతామోనన్న భయంతో నవ్వును బలవంతంగా అదుపుచేసుకుంటారు. ఇది చాలా అసహజమైన మానవ లక్షణం.
నవ్వు నాలుగు విధాల చేటు- అనేది చాలా పాత సామెత. అసందర్భమైన నవ్వుల గురించి చెప్పినది అది. నవ్వు ఎటువంటిదైనా ఆరోగ్యాన్ని తెస్తుందనేది నేటి సూక్తి. నవ్వు మహాభాగ్యం.. నవ్వటం ఒక యోగం! ఇవి నేటి మాటలు. ఇపుడు ప్రత్యేకంగా లాఫింగ్ క్లబ్స్ కూడా ఏర్పాటవుతున్నాయి పెద్ద పెద్ద నగరాల్లో. నవ్వటాన్ని ప్రత్యేకంగా నేర్పాలా? అనే విమర్శలు కూడా వున్నాయి. అయితే వీటిని ప్రత్యేకంగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరుగున పడుతున్న ప్రతి కళనూ పునరుద్ధరించాల్సిందే. అందుకు తగిన శిక్షణ అవసరమే. అందుకే నవ్వటం నేర్చుకునే శిబిరాల్లో చేరటం తప్పేమీకాదు.
నవ్వుల కాంపుల్లో నాలుగు వారాలు గడిపివచ్చినవారు మాత్రం తమ జీవితాల్లో మార్పు వచ్చిందని స్పష్టం చేస్తున్నారు. ఆ క్యాంప్ నుండి వచ్చిన తరువాత సీరియస్ అంశాలను లైట్‌గా తీసుకోగలుగుతున్నామని కొందరు సాఫ్ట్‌వేర్ నిపుణులు అంటున్నారు. కామెడీ షోలను నిర్వహించేవారు కూడా తమ కార్యక్రమాలకు హాజరై హాయిగా నవ్వినవారిలో వచ్చిన మార్పు అమోఘం అంటున్నారు.
హాస్యమనేది మనుషుల మనసులను తేలికపరుస్తుంది. కాబట్టి నవ్వును ఒక చికిత్సా మార్గంగా అంగీకరిస్తున్నారు అందరూ. ఆపరేషన్ తరువాత కోలుకుంటున్నవారిని, నవ్వు చికిత్సామార్గంలో త్వరగా ఆరోగ్యవంతుల్ని చేయగలమని నిరూపించారు కొందరు వైద్యులు.
ఒంటరితనాన్ని వదిలించగలిగిన శక్తివంతమైన సాధనం నవ్వు. ఇది ప్రపంచవ్యాప్తంగా వినిపించేమాట. ఎదురుగా నవ్వించే తోడు ఉండటం ఒక అదృష్టం. జీవితం అద్భుతంగా గడిచిపోతుంది. నవ్వులో మునిగివున్నపుడు లోపాలు తెలియవు. అలాగే బాధలూ గుర్తుకురావు. హాస్యం పలికించే వీడియోలు, నవ్వించే జోక్స్ పుస్తకాలు, సినిమాలు అందుబాటులో ఉంచుకుంటే ఆరోగ్యం ఉన్నట్టే. అందుకే ఇప్పుడు హాస్యానికి విలువ పెరిగింది.
అందరిచేతా అభిమానించబడటం హాయిగా నవ్వగలిగినవారికి, నవ్వించగలిగినవారికీ సాధ్యం. అందుకే అందరూ హాయిగా నవ్వుకోవాలి. నవ్వలేనివారు నవ్వులు నేర్చుకుని జీవితాన్ని మార్చుకోవాలి. నవ్వటానికి ప్రత్యేకంగా సమయం, సందర్భం అవసరం లేదు. కళాకారుడు దేనిలోనైనా కళను పట్టగలిగినట్టే, హాస్యమనేది కంటిముందుండే ప్రతి సంఘటనద్వారా నవ్వు తెచ్చుకోవచ్చు. హాయిగా నవ్వుతూ, నవ్విస్తూ బతకగలిగిన వరం ప్రకృతి మనిషికి ఇచ్చింది. అది మరచిపోయి జీవితాలను పాడుచేసుకోవద్దు. చిరునవ్వులనుండి, భారీ నవ్వుల వరకూ ప్రతి రకపు నవ్వులతో లోకం కళకళలాడాలి. అందుకే మానసికంగా అందరూ సిద్ధమవ్వాలి నవ్వడానికి.

- పి.ఎం. సుందరరావు 9490657424