సబ్ ఫీచర్

నవదుర్గా వైభవము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మలకమ్మవై యిల చరాచర సృష్టికి మూలకందమై
ఇమ్ముగ పెన్నిధున్నొపని, ఏడుగదై దయబ్రోచు లక్ష్మివై
క్రమ్మిన చీకటుల్‌దొలగ కాంతి పథమ్మును జూపు దివ్వవై
మమ్ము తరింపజేయుటకు మాత! నవాంశలు దాల్చి వచ్చితే!
1. శైలపుత్రి
శూలము నొక్కహస్తమున చొప్పడ, రెండవ హస్తమందునన్
గ్రోలగ దాల్చి పద్మమును రమ్యతరమ్ముగ, కానిపించు శం
పాలత భంగి భక్తుల కపారముదంబునన్ శైలపుత్రి గా
హుల నుతించినన్ గలుగు నీప్సితముల్, విజయంబు లెస్సగన్
2. బ్రహ్మచారిణి
ఒక్కకరాంబుజంబున సమున్నతి దాలిచి అక్షమాల, వే
రొక్క కరంబున న్నునిచి యుక్తముగా జలపాత్రానున్, కరం
బక్కునజేర్చి తానొసగు అర్థిజనాళికి త్యాగబుద్ధియున్
పెక్కుజయంబులున్ సతము ప్రీతిగ అంబయె ‘బ్రహ్మచారిణై’
3. చంద్రఘంట
శాంతరస ప్రధానమయి సర్వశుభంకరమై వెలుంగుచున్
పొంతనుజేరు భక్తులకు ప్రొదిగనిచ్చు పరాక్రమంబు నే,
చెంతకు చేరనీదు చెడుజేసెడి దుర్భర దుష్టశక్తులనే
సంతత సింహవాహయగు శాంభవి, పార్వతి ‘చంద్రఘంటయై’
4. కూష్మాండ
అండగనుండి కొండవలె ఆయువునిచ్చు, తొలంగజేయు తా
మెండగు రోగబాధలను, మేలొనరించు సుభక్త పాళికిన్
నిండుమనంబునన్ గొలువనిచ్చట, భాస్కరు బోలువెల్గు ‘కూ
ష్మాండ’ భవాబ్ధి దాటుటకు స్థైర్యము, ధైర్యము నిచ్చి బ్రోచెడిన్
5. స్కందమాత
తెల్లని దేహకాంతుల ప్రదీప్తముఖాంబుజమొప్ప, నక్కునన్
పిల్లని ‘స్కందుని’న్ గదిసిప్రేముడిజేర్చిన ‘స్కందమాత’నున్
పెల్లుగపూజచేయ ప్రభవించెడి మాయ తొలంగునిట్లె, ఆ
తల్లి కృపాకటాక్షమున, దర్శనమయ్యెడు జ్ఞానచంద్రికల్
6. కాత్యాయని
శ్రీయుత కృష్ణునిన్ పతిగ జేకొనరే! వ్రజకాంతలెల్ల, కా
త్యాయని గొబ్బినానటులె ఆయత భక్తి నెడంద నిల్పుచున్
దోయిలిమోడ్చి మ్రొక్కునెడ దుఃఖ భయంబులు దూరమై చనున్
శ్రేయము కల్గు నిక్కముగ చేసిన పాపము చెల్లిపోయెడిన్
7. కాళరాత్రి
చీకటిలో దేహమును చిందరవందరలైనకేశముల్
చేకొని ఖడ్గమున్, గుదియ చేతుల రెండింట, మూడు కన్నులన్
భీకరమైన రూపమున వెల్గెడు దేవిని ‘కాళరాత్రి’నిన్
వీక భజింప త్రెళ్లుగ్రహపీడలు, భూత, పిశాచ బాధలున్
8. మహాగౌరి
భూరి సితాంబరంబులు ప్రపూత మనోహర భర్మహారముల్
తీరుగ దాల్చియొప్పు నవతేజముతో ధవళాంగియై ‘మహా
గౌరి’, చతుర్భుజంబులు, సుఖంబులు కొల్లలుగా నొసంగు నె
వ్వారు భజంత్రు, వారికిల- పాప నికాయము ద్రుంచిభళ్లునన్
9. సిద్ధదాత్రి
సింగము వాహనంబయిన, చెల్వగు పద్మముపై వసించు స
ద్భంగి ధరించి హస్తముల తా గద, శంఖము, చక్ర, మబ్జముక,
చెంగట నిల్చికొల్వ నిజసేవక బృందము, ‘సిద్ధదాత్రి’ ఉ
ప్పొంగి వరంబులిచ్చు, మరి పొల్పుగ నీయదె అష్టసిద్ధులన్

- కలవకొలను సూర్యనారాయణ 98492 68659