సబ్ ఫీచర్

దొరకునా.. ఇలాంటి సేవ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు.. ఎదురుదెబ్బ తగిలిన బిడ్డ అమ్మా అని మరోలా అంటాడు.. నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా అని మరొకవిధంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం ఉంది, శృతి వుంది, స్వరం ఉంది. ఏ అనుభూతికైనా నాదం, శృతి, స్వరం అనుసంధానమైతేనే ఆ గీతం లాలిత్యంతో నిండిపోతుంది. లాలిత్యం పాటకు ప్రాణం. అందరూ పాడేస్తారు.. కానీ లాలిత్యంతో పాడే కోయిల స్వరం కోసమే ప్రకృతి అంతా ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురుచూస్తూ వుంటుంది. కోయిల కూడా వసంతం కోసమే వేయికళ్లతో ఎదురుచూస్తూ వుంటుంది. కోయిల గమకాలను తన గొంతునిండా నింపుకొని పుట్టిన వరపుత్రుడు మహాభాష్యం వేంకట అనంత చిత్తరంజన్ రామ్.
1938లో మహాభాష్యం రంగాచార్య, పేరిందేవి ముద్దులపంటగా మచిలీపట్నంలో జన్మించారు. ఇద్దరు చెల్లెళ్ళు, ముగ్గురు తమ్ముళ్ళు. తల్లి పేరిందేవి గొప్ప సంగీత విద్వాంసురాలు. తండ్రి ఆధ్యాత్మిక జ్ఞానంలో ఆరితేరినవారు. సంగీతము, ఆధ్యాత్మికము పెద్దకొడుకైన చిత్తరంజన్ చిత్తంలో ఒదిగిపోయాయి. అమ్మమ్మ వేంకటలక్ష్మి నుండి వచ్చిన స్వరసంపద చిత్తరంజన్‌దాకా సాగింది. రేడియోలో వచ్చే పాటలు వింటూ దాని స్వరం రాసుకుంటూ నేపథ్య సంగీతాన్ని కూడా నెమరువేసుకుంటూ ఆయన రాసుకొన్న నోటు అందరికీ అబ్బురమనిపించింది. ఒక్కసారి వింటే ధారణపట్టే పాట తిరిగి కోయిల గీతంలా ఆ నోటినుండి బయలువెడలేది. 1947లో స్వతంత్రం వచ్చాక తండ్రి పనిచేసే ఆకాశవాణికి వెళ్లి తన మోహన గాత్రాన్ని వినిపించారు. టంగుటూరి సూర్యకుమారి పాడిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’తో ప్రారంభమైన ఆ స్వర ప్రస్థానం ఇప్పటికీ సాగుతూనే వుంది. శంకరంబాడి సుందరాచారి రచించిన ‘మా తెలుగు తల్లి’ గీతంతోపాటుగా ఘంటసాలవారు ఆలపించిన అనేక ప్రైవేటు గీతాలను ఆరోజు పాడారు. రెగ్యులర్‌గా రేడియో వింటమే నేను చేసిన పని. రాత్రి పని అంతా ముగించుకొని అమ్మ వాయించే వయొలిన్‌పై వాయులీన తరంగాలను మాగన్ను నిద్రలో వింటూ పడుకున్న నాకు స్వరజ్ఞానం అలానే అబ్బిందనుకుంటాను. మా అమ్మే నా తొలిగురువు అంటారాయన. ఇక అప్పటినుండి రేడియోలో పాటలు, బాలానందంలో గీతాలతో ఆయన బాల్యమంతా సరిగమలతో సాగింది. తండ్రి రంగాచార్యులుకు సంగీతం జ్ఞానం లేకపోయినా ఎక్కడ తప్పు పాడినా వెంటనే ఆయన సరిచేసే ప్రయత్నమూ చేసేవారు. హైస్కూల్ చదివేటప్పుడు మేడిచర్ల లక్ష్మీకాంతం అనే తెలుగు టీచర్ ఉండేవారు. ఆయన రోజుకొక పాటైనా స్కూల్లో పాడించుకొని ఆనందించేవారు. పోతనగారి పద్యాలు, ఘంటసాలవారి ప్రైవేటు గీతాలతో పాఠశాలంతా తన్మయం చెందేది. దానికితోడు దస్తూరి బాగుండడంతో పంతులవారు తాను రాయాల్సిన ఏదైనా చిత్తరంజన్‌కే అప్పజెప్పేవారు. ‘‘ఓరకంగా అవి గోల్డెన్ డేస్ అనిపిస్తాయి. మెథడిస్ట్ బాయిస్ హైస్కూల్‌లో చదువుకున్నాను. ఇప్పుడు హైదరాబాద్ అబిడ్స్‌లో వున్నది అదే. అప్పుడు నిజాం రోజూ అక్కడికి వచ్చేవారు. ఆయన రాకను పోలీసు బందోబస్తే తెలిపేది. పాఠశాల వదలగానే అందరం నిజాం తిరిగి ఇంటికి వెళ్ళే సన్నివేశాన్ని రోజూ చూసేవాళ్ళం. ఆయన సరాసరి తన తల్లి సమాధి వద్దకు వెళ్లి గంటన్నరపాటు ప్రార్థన చేసేవారు. ఆయన చాలా మంచివారు. తెలుగువారు వచ్చి ఓ పాట పాడినా, పద్యం పాడినా విని మెచ్చుకునేవారు. అవన్నీ నాకళ్ళతోనే చూశాను’’ అంటారు చిత్తరంజన్. స్వతంత్రం వచ్చాక పాకిస్తాన్ నుండి వచ్చిన రాజకీయ ఆదేశాల కుట్రల నేపథ్యంలోనే నిజాం తల ఒగ్గాల్సి వచ్చింది కానీ, ఆయన అఖండ భారతావనికి ఎప్పుడూ వ్యతిరేకి కాదు. నిజాంను నిలువరించి నాలుగు వేలమంది అరబ్బులు రజాకార్లుగా తెలంగాణలో స్వైరవిహారం చేశారు. వారికి కత్తియుద్ధం తప్ప మరేదీ రాదు. అలాంటి వారు మర ఫిరంగులకు నిలవగలరా? భారత సైన్యం సూర్యాపేట నుండి ప్రారంభించి పరేడ్‌గ్రౌండ్స్‌దాకా వచ్చారు. వెంటనే నిజాంకు తాము రాజ దర్బారులో ప్రవేశించమంటారా లేక లొంగిపోతారా అంటూ వర్తమానం పంపించారు. అందుకు సిద్ధమైన నిజాం ఆనందంగా వచ్చి అఖండభారతావనిలో కలిశారు. కానీ చరిత్రను తప్పుదోవ పట్టించి చాలామంది రాసుకున్నారు. ఇదంతా నా కళ్ళతో చూసినదే. 1935లోనే హైదరాబాద్‌లో రేడియో స్టేషన్ ప్రారంభమైంది. అంటే దేశంలోనే మొట్టమొదటిది అని నా అభిప్రాయం. ఇప్పుడున్న చిరాగ్ అలీ లేన్‌లో అన్ని హంగులతో ప్రారంభమైన ఆకాశవాణి కేంద్రం పనిచేసేది అని వివరించారు.
ఓ వైపు రేడియో పాటలు, లలిత సంగీతం, మరోవైపు విద్యాభ్యాసం చేస్తూ బిఎస్సీదాకా చదివారు. దాశరథి, సి.నారాయణరెడ్డి తొలిరోజులలో రాసిన అనేక భావగీతాలన్నీ లలిత సంగీతంలోనే పాడి అభిమానులను ఓలలాడించారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ చెన్నైనుండి హైదరాబాద్‌కు బదిలీపై ఆకాశవాణికి వచ్చారు. ఆయన ఓసారి నా చేత పాట పాడించే ప్రయత్నం చేశారు. నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళాను. నాకోసం ఎదురుచూస్తున్న ఆయన ‘‘మీకోసమే చూస్తున్నాను’’ అంటూ స్వాగతం పలకడం నా జీవితంలో మర్చిపోలేని విషయం. అప్పటికే ఆయన గొప్ప విద్వాంసులుగా పేరుపొందారు. గతంలో నేను పాడిన అనేక పాటలు విన్న ఆయన, ఆ రోజు ఓ మంచి కీర్తన నేర్పించారు. విశేషమేమిటంటే, వేరెవరైనా నీ పాటకు వయొలిన్ వాయిస్తే న్యాయం జరగదని, ఆయనే వాయించటం చూసి నా జీవితం ధన్యమైందనుకున్నాను. గాయకులలో ఏ చిన్న స్పార్క్ కనిపించినా వెరీ గుడ్ అనేవారు. అలా ఎంత గొప్పవారైనా ఎలా ఒదిగి వుండాలనేది ఆయన వద్దే నేర్చుకున్నానంటారు ఆయన. లలిత సంగీతంలోనే అద్భుతమైన ప్రతిభతో ఆకాశవాణికి ఓ మూలస్తంభంగా మారారు చిత్తరంజన్. ఆయనే పాటలు రాస్తూ వాటికి బాణీలుకడుతూ, ఆ పాటలను పాడుతూ వాగ్గేయకారుడిగా మన్ననలు పొందారు.
ఇక సినిమా పాటవైపు ప్రయాణం ఎలా సాగింది అంటే, కొత్తగా సారథి స్టూడియోవారు రూపొందిస్తున్న చిత్రానికి ఓ పాట పాడటానికి పిలిచారు. సారథి స్టూడియోలోనే సిట్టింగ్. మాస్టర్ వేణు అనేక శృతుల్లో పాడమంటూ పాడించుకున్నారు చిత్తరంజన్‌వారితో. ఆయన స్వరకల్పనలో రూపొందిస్తున్న కులదైవం చిత్రంకోసం! ఆ చిత్రంలో పి.సుశీలతో కలిసి ‘రావే రావే వయ్యారి నా చెలి నా గారాల జిలిబిలి జాబిలి’ అనే పాటను పాడారు. ఆ పాట తొలుత విన్నవారికి ఘంటసాలే పాడారేమో అన్నట్లుగా వుంటుంది. ఆ పాట రికార్డింగ్ పూర్తయ్యాక సుశీల కూడా ఎంతో మెచ్చుకున్నారు అంటూ గుర్తుచేసుకుంటారు చిత్తరంజన్. ‘మనసులో ఒకటుంచి మాటాడతారు, కన్నీటితో గుండె కరిగించుతారు అరచేత వైకుంఠం ఒలికించుతారు.. నమ్మరాదు అసలే నమ్మరాదు.. ఈ గడుసైన ఆడవారిని నమ్మరాదు’’ అంటూ గజల్ స్టైల్‌లో ఆలపించిన పాట అప్పట్లో ప్రజాదరణ పొందింది. కులదైవం చిత్రంలో ఈ సోలో పాటను జగ్గయ్యపై చిత్రీకరించారు. స్వర్ణగౌరి చిత్రంలో ఎస్.జానకితో కలిసి ‘జయగౌరీ జగదీశ్వరి’అనే పాట ఆలపించారు. కృష్ణ-విజయనిర్మల-విజయలలిత నటించిన ‘విధివిలాసం’ చిత్రంలో గాయని రామలక్ష్మితో కలిసి ‘వల్లారి బాబో సావులోరయ్య’ అనే పాట జానపద బాణీలో సాగుతుంది. ఈ పాటలో కృష్ణ-విజయలలిత నటించడం విశేషం. చంద్రమోహన్-సత్యనారాయణ కలిసి నటించిన సూర్యచంద్రులు చిత్రంలో ‘ఒకే మనసు రెండు రూపాలుగా ఒకే ఊపిరి రెండు హృదయాలుగా అల్లుకున్న అనుబంధం’ అంటూ సాగే పాటను బాలుతో సమానంగా కలిసి పాడడం విశేషం. ఈ పాట కూడా అప్పట్లో ప్రజాదరణ పొందింది. 1969లో ప్రకాశం పంతులుగారిపై ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తుండగా సంగీతాన్ని అందించి అందులో ఘంటసాల వారిచే ఓ పాట పాడించారు చిత్తరంజన్. మన మహాత్ముడు, శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి మహత్మ్యం చిత్రాలకు, అలాగే అనేక డాక్యుమెంటరీ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. భగవద్గీతలోని 701 శ్లోకాలకు, గీతామహత్మ్యంలోని 28 శ్లోకాలకు 174 రాగాలను, కర్ణాటక హిందూస్తానీ పద్ధతిలో సంగీతం అందించారు. గానరత్న, కళారత్న, లలితగంధర్వ కళానిధి, లలిత సంగీత చక్రవర్తి, మధురస్వరనిధి, లలిత సంగీత సామ్రాట్ లాంటి బిరుదులను అందుకున్నారు. ఆకాశవాణిలోనే దాదాపు 25 సంవత్సరాలపాటు సంగీత దర్శకునిగా సేవలు అందించి పదవీవిరమణ చేశారు. శ్రీ చిత్తరంజనం - వాగ్గేయ సంపుటి, లలిత సంగీత సౌరభం, 80 సంగీత సారస్వత మలయమారుతాలు లాంటి సంగీత ప్రధానమైన గ్రంథాలను అందించారు. శ్రీలంక యూనివర్సిటీ ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ కాంప్లిమెంటరీ మెడిసిన్స్ వారు సంగీతం కూడా ఓ ఔషధమేనంటూ చిత్తరంజన్‌కు డాక్టరేట్ పట్టాను అందించారు. వీరి భార్య పద్మినిదేవి, విజయలక్ష్మి దేశికన్, పద్మపద వందనాదేవి, అమృతవల్లి కుమార్తెలు. అప్పటి సంగీతం వేరు, ఇప్పటి సినీ సంగీతం వేరు. లలిత సంగీతం ఎప్పుడైనా ఒకలాగే వుంటుంది. అప్పటి రికార్డింగ్ ఇప్పటి రికార్డింగ్‌కు చాలా తేడా వుంది. అప్పుడు అంతా కలెక్టివ్ ఎఫర్ట్ ఉండేది. ఇప్పుడలా కాదు, ఎవరి లైన్ వారు పాడి వెళ్లిపోతారు. అసలు వాళ్లు ఏం పాట పాడారో వారికే తెలియదు. అంతా పీస్‌మిల్‌లా తయారైంది అంటూ ముగించారు చిత్తరంజన్.

-సరయు శేఖర్, 9676247000