సబ్ ఫీచర్

గాంధీ బాటలోనే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్య, అహింసలే మార్గాలు..
ధర్మక్షేత్రమే బతుకంతా..
కర్మయోగమే తలపంతా..
స్వదేశీ సూత్రమే జీవనంగా..
శాంతిమార్గమే నడవడిగా నడిచిన అసలు సిసలు జగజ్జేత..
తరతరాల యాతన తీర్చిన వరదాదరుడు..
భరతమాత తలరాతను మార్చిన విధాత..
నవశకానికే నాంది పలికిన ఈ శతాబ్దపు సూర్ఫి ప్రదాత..
బోసినవ్వుల గాంధీ తాత..
అలాంటి గాంధీతాత 150వ జయంతోత్సవాన్ని పురస్కరించుకుని వారి బాటలో నడిచిన అనేక మంది మహిళల గురించి తెలుసుకుందాం. మహాత్మాగాంధీతో పాటు చాలామందిని ఫొటోల్లో చూస్తుంటాం. వారిలో నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వారిని తేలిగ్గానే గుర్తుపడతాం. మహాత్ముడికి సన్నిహితులు అనగానే ఇలాంటి వారి పేర్లే ఎక్కువగా గుర్తుకువస్తాయి. అయితే.. వీళ్లే కాకుండా గాంధీకి దగ్గరగా ఉన్నవాళ్లు చాలా ఉన్నారు. వారిలో మహిళలు కూడా చాలామందే ఉన్నారు. గాంధీజీ ఎప్పుడూ ఆడవాళ్లు, మగవాళ్లు అనే వివక్ష చూపించలేదు. అలాగే ఆయనకు కుల, మత, ప్రాంత విభేదాలు కూడా లేవు. అందర్నీ సమానంగా చూశారు. వారు కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉద్యమాల్లో, పోరాటాల్లో పాల్గొంటూ అత్యంత సన్నిహితులయ్యారు. వారిలో కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* మెడెలిన్ స్లెడ్
మెడెలిన్ బ్రిటీష్ అడ్మిరల్ సర్ ఎడ్మండ్ స్లెడ్ కుమార్తె. వారిది సైనిక కుటుంబం కావడంతో ఆమె బాల్యంలో చాలా క్రమశిక్షణతో పెరిగింది. మెడెలిన్‌కు జర్మన్ సంగీతకారుడు, పియానో విద్వాంసుడు బీథోపెన్ అంటే చాలా ఇష్టం. ఆ కారణంతోనే ఆమెకు ఫ్రెంచ్ రచయిత రోమైన్ రోలెండ్‌తో పరిచయం ఏర్పడింది. రోలెండ్ సంగీతకారుల గురించి రచనలు చేసేవారు. ఆయనే గాంధీజీ జీవిత చరిత్రను కూడా రాశారు. ఈ చరిత్రను మెడెలిన్ చదివారు. ఆ పుస్తకం ఆమెపై గొప్ప ప్రభావాన్ని చూపింది. గాంధీ చెప్పిన మార్గంలో జీవించాలని నిర్ణయానికి వచ్చారు. సబర్మతీ ఆశ్రమానికి రావాలనుకుంటున్నానని గాంధీకి మెడెలిన్ లేఖ రాశారు. గాంధీ ప్రభావంతో ఆమె మద్యం మానేశారు. శాకాహారిగా మారిపోయారు. వ్యవసాయం నేర్చుకున్నారు. 1925, అక్టోబర్‌లో మెడెలిన్ అహ్మదాబాద్‌కు వచ్చారు. గాంధీజీని కలిశారు. అప్పటి నుంచి గాంధీజీతోనే మెడెలిన్ పయనం. మెడెలిన్‌తో గాంధీ ‘నువ్వు నా బిడ్డవు’ అనేవారు. అలా మెడెలిన్ నెమ్మదిగా మీరాబెన్‌గా మారింది.
* నిలా క్రైమ్ కుక్
ఆశ్రమంలో అందరూ నిలాను నాగిని అని పిలిచేవారు. తనను తాను కృష్ణుడి గోపికగా భావించుకునే ఆమె.. వౌంట్‌అబూలో ఓ మత గురువు దగ్గర ఉండేవారు. ఆమె జన్మస్థలం అమెరికా.. మైసూర్‌కు చెందిన రాజకుమారుడితో ఆమె ప్రేమలో పడ్డారు. 1932లో గాంధీకి ఆమె బెంగళూరు నుంచి లేఖ రాశారు. అంటరానితనానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాల గురించి గాంధీకి వివరించారు. వాళ్లిద్దరి మధ్య అలా లేఖల ద్వారా సంభాషణలు మొదలయ్యాయి. ఆ మరుసటి ఏడాది 1933లో నిలా.. యరవాడ జైల్లో గాంధీని కలిశారు. గాంధీ నిలాను సబర్మతీ ఆశ్రమానికి పంపారు. కొంతకాలం అక్కడ గడిపాక ఆశ్రమ సభ్యులతో ఆమెకు మంచి అనుబంధం ఏర్పడింది. అయితే ఉదారవాద ఆలోచనలతో ఉండే నిలాకు ఆశ్రమ జీవితం ఇబ్బందిగా అనిపించింది. దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.
* సరోజినీనాయుడు
కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలు సరోజినీనాయుడు. గాంధీ అరెస్టు తర్వాత ఉప్పు సత్యాగ్రహం నడిపించాల్సిన బాధ్యత ఆమె పైనే పడింది. సరోజినీ, గాంధీ తొలిసారి లండన్‌లో కలుసుకున్నారు. ఆ సమయంలో ‘గాంధీజీ నేలపై కూర్చుని ఆలివ్ నూనెలో వేయించిన టమోటాలను తింటున్నారట. అది చూసి ప్రపంచ ప్రఖ్యాత నాయకుడు ఇలా నేలపై కూర్చుని టమోటాలను తినడమా..’ అని ఆమెకు నవ్వు వచ్చిందట. ఆమెను చూసిన గాంధీగారు కూడా ‘మీరు కచ్చితంగా నాయుడిగారి శ్రీమతి అయ్యుంటారు. నాతో పాటు తినండి’ అన్నారట. అలా వారిద్దరి మధ్య బంధం మొదలైంది.
* అమృత్ కౌర్
అమృత్ కౌర్ రాజకుమారి. కపూర్థలా రాజు హర్‌నామ్ సింగ్ కుమార్తె అమృత్. ఈమె ఇంగ్లండ్‌లో చదువుకున్నారు. గాంధీకి అత్యంత సన్నిహితులైన సత్యాగ్రహ ఉద్యమకారుల్లో ఒకరిగా ఈమె పేరును విశే్లషకులు చెబుతుంటారు. 1934లో తొలిసారి అమృత్ గాంధీని కలిశారు. తరువాత ఈమె గాంధీగారితో కలిసి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సందర్భాల్లో అమృత్ కౌర్ జైలుకు కూడా వెళ్లారు. స్వతంత్ర భారత్‌కు అమృత్ తొలి ఆరోగ్య శాఖా మంత్రిగా పనిచేశారు. అమృత్ కౌర్‌కు గాంధీ ‘మేరీ ప్యారీ పాగల్ ఔర్ బాగీ’ అంటూ లేఖలు రాసేవారు.
* సుశీలా నయ్యర్
గాంధీజీ వ్యక్తిగత కార్యదర్శి ప్యారేలాల్ నయ్యర్‌కు సుశీలా చెల్లెలు. తమ తల్లి వద్దన్నా వినకుండా ఈ అన్నాచెల్లెళ్లు గాంధీతో పాటు ఉండేందుకు వెళ్లారు. అయితే తర్వాతి రోజుల్లో వారి తల్లి కూడా గాంధీ సమర్థకురాలిగా మారిపోయారు. వైద్యం చదివిన తర్వాత గాంధీకి సుశీలా వ్యక్తిగత డాక్టర్‌గా ఉన్నారు. వృద్ధాప్యంలో గాంధీ, మనూ, అభాల తర్వాత సుశీలాపైనే ఎక్కువగా ఆధారపడేవారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కస్తూర్బా గాంధీతో పాటు సుశీల అరెస్టయ్యారు. పూనాలో కస్తూర్బా గాంధీ ఆఖరిరోజుల్లో ఉన్నప్పుడు ఆమె వెంట సుశీల ఉన్నారు.
* మను గాంధీ
చాలా చిన్న వయసులోనే మను మహాత్మాగాంధీ వద్ద చేరారు. ఆయనకు ఆమె దూరపు బంధువు. మనూను తన మనవరాలిగా గాంధీ భావించేవారు. గాంధీ నోవాఖాలీలో ఉన్న రోజుల్లో అభాతో పాటు మను ఆయనకు సాయంగా ఉండేవారు. వాళ్లిద్దరి ఆసరాతోనే గాంధీ నడుస్తుండేవారు. కస్తూర్బాకు చివరిరోజుల్లో సపర్యలు చేసినవారిలో మనూ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
ఇలా మహాత్మా గాంధీ జాతి, కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ఆడవారిని కూడా మగవారితో సమానంగా ఉద్యమాల్లో, పోరాటాల్లో పాల్గొనడానికి స్ఫూర్తిగా నిలిచారు.

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి