సబ్ ఫీచర్

ఆశ్వయుజంలో అంబికారాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి మనిషిగా పుట్టటం ఒక వరం, అదృష్టం. ఎనె్నన్నో జన్మలెత్తి యిప్పుడే నరజన్మ లభించింది. ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. మనిషి జీవితంలో ఎన్నో మార్పులు, అగాథాలు, ఉన్నతులు, సుఖాలు, దుఃఖాలు- వీటన్నిటిని అనుభవించటానికి ఎదుర్కోవటానికి మనం, మన జీవిత పరమార్థమేమిటో తెలిసికోవాలి. ఈ లభించిన నరజన్మ ఉన్నతమయింది. సూర్యాస్తమయ సూర్యోదయాల మధ్యలో మనిషి ఆయుర్దాయం తగ్గిపోతుంది. వయస్సు పెరుగుతుంది. పెరుగుతున్న వయసుతోపాటు, మనిషి వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి. ఆధ్యాత్మిక చింతనను, సర్వమానవ సౌభ్రాతృతను సౌహార్థ్భావాన్ని పెంపొందిస్తూ నూతన తేజోత్సాహాన్ని కలుగజేస్తూ జీవన సరళిని సుసంపన్నం చేసేవి మన పండుగలు. పండుగలలోని పరమార్థాన్ని గ్రహించి దర్శించాలి. ధర్మార్థ కామ మోక్షములు అనేవి నాలుగు పురుషార్థములు. వీటిలో అర్థకామాల్ని ధర్మబద్ధంగా అనుభవించి, మోక్షాన్ని పొందాలని బోధించేవి పండుగలు. భారతీయ సంస్కృతిలోని సామరస్యము, సమైక్యతను ప్రకటిస్తూ, దైవప్రీతి, పాపభీతి సంఘనీతిని అలవరచి, మనిషిని సంస్కరించేవి పండుగలు.
పండుగలలోని పరమార్థం
మన మహర్షులు వారి దివ్య జ్ఞానదృష్టితో కాలభేదములలో, ఋతు ధర్మములతో వచ్చే మార్పును దృష్టిలో ఉంచుకొని నైతిక ధార్మిక సామాజిక వైజ్ఞానిక ఆధ్యాత్మిక విలువలను మానవునికి అలవరచడానికి, పోషించడానికి అవకాశం కలిగించేవి.. పర్వదినములు. మానవ హృదయంలో ఎప్పుడూ మంచికి చెడుకి సంఘర్షణ జరుగుతూనే వుంటుంది. అనగా ధర్మాధర్మములకు సంఘర్షణ దైవసంపత్తిని పొందితే, మనలోని స్వార్థం, అధర్మం, పశుత్వం, రాక్షసత్వం నశించి, మానవతా విలువలు గుర్తింపబడతాయి. అజ్ఞనాంధకారం తొలగి, జ్ఞానజ్యోతి వెలుగు ద్యోతకమవుతుంది. భారతదేశంలో యుగయుగాలుగా పండుగలు పర్వదినములు విశిష్టమైన అంతరార్థములతో కూడి, ఆధ్యాత్మికతను, ధార్మికతను పెంపొందించేవిగా ఉంటున్నాయన్నది పరమసత్యం.
దేవతలను ఆరాధిస్తే
పండుగలూ, పబ్బాలంటే మానవులకెంతో సరదా.. పిల్లలనుంచి పెద్దవాళ్ళదాకా పండుగలను ఎంతో సరదాగా జరుపుకుంటారు. శ్రీరామనవమి నుంచి శివరాత్రివరకూ, సంవత్సరం పొడుగునా పండుగలే. పండుగలు అనగా బంధుమిత్రాదులు నలుగురూ కలుసుకొని విందులతో, వినోదాలతో కాలక్షేపం చేయటమనదే మన భావన. పైకి ఆ విధంగానే కనిపించినా, ఆంతర్యంలో అశేష విశేషముంది. ప్రతి పండుగా ఏదో ఒక దేవతకు సంబంధించే ఉంటుంది. మానవులు- మర్త్యులు, దేవతలు అమర్యులు, జన్మ మృత్యు జరావ్యాధులతో నిత్యమూ సతమతమవుతూ ఉండేవాళ్ళు- మానవులు- దేవతలకివేమీ లేవు. మనకు కూడా అలాగే ఉండాలంటే, అనగా వాటిబారినుండి బయటపడాలంటే, అవి లేని దేవతామూర్తులను ఆరాధించాలి. దేవిని ఆరాధిస్తే, దానితో తాదాత్మ్యం సిద్ధిస్తుందని ‘యద్భావస్తద్భవతి’ అనే సూక్తి చెపుతోంది.
శ్రీదేవీ శరన్నవరాత్రుత్సవములు
మనం చేసుకునే పండుగలన్నింటిలో తలమానికమైనవి శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలు. వీటికే శ్రీదేవీ శరన్నవరాత్ర వ్రతమని కూడా పిలుస్తారు. మానవుని మనస్సు తమస్సుచే ఆవరించబడి ఉంటుంది. మనస్సులో పరమాత్మను నిలుపుకొంటే, క్రమేపీ తమస్సనే చీకటి తొలగి జ్ఞాన మెలుగు ద్యోతకమవుతుంది. దృశ్యమవుతున్న సర్వ వస్తు ప్రపంచం, వెలుగు నుంచి ప్రభవించినవే, ఆ వెలుగులో లీనమయ్యేవే. ఆ వెలుగు శక్తే శాశ్వతమైనది. అదే ‘విశ్వశక్తి’- ఇదే శ్రీదేవి. అనగా జగన్మాత స్వరూపం. ఇది శ్రీ శంకర భగవత్పాదులు ‘సౌందర్యలహరి’లో మనకు బోధించిన ముఖ్యాంశం. ఇదే శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవములకు పూర్తి స్ఫూర్తి.
పరమాత్ముడు వెలిగే ముచ్చట
‘అంతర్భహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః’ అని, పరమాత్మ వెలుగు అంతటా నిండి ఉన్నదని పరమాత్మ చైతన్య ప్రకాశ శక్తి గురించి, నిరాకార నిరంజన పరబ్రహ్మతత్త్వాన్ని వాగధీశ్వరీ రాగంలో ‘‘పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలిసికోవె, హరియట హరుడట, నరులట, సురలట.. గగనానిల తేజో జల భూమయమగు..’’ అని కీర్తించాడు నాదయోగి సద్గురు శ్రీ త్యాగరాజస్వామి. ఆ వెలుగు శక్తిని సాకార సగుణంగాను, నిర్గుణ నిరాకారంగాను ఉపాసించవచ్చు. ఏ ఆకారం లేకుండా నిరాకార తత్త్వాన్ని ఆరాధించటం, ఉపాసించటం, అంతగా అందరికీ సాధ్యపడే విషయం కాదు. అందుకే సాకార రూపానే్న భజించి, జపించి ఉపాసించటమే తరుణోపాయంగా ఎంచుకున్నారు. ఇది సాకార భక్తి.
స్ర్తిమూర్తిని ఉపాసించటంలో ఆంతర్యం
సగుణోపాసనలో భగవత్ తత్త్వాన్ని పురుషుడుగాని, స్ర్తిమూర్తిగాని ఉపాసించవచ్చును. అయితే పరాభక్తి ప్రేమరూపమైనదేగాని, భయం వలన కలిగేది కాదు. తల్లి ప్రేమైక స్వరూపిణి. బిడ్డ చేసిన తప్పుల్ని క్షమిస్తుంది. అందువలన తల్లిగా పరతత్త్వాన్ని ఆరాధించటం సులభం. ఈ విధంగా పరమాత్మ తత్త్వశక్తి వెలుగును, స్ర్తిరూపంగా ఆదిపరాశక్తిగా, జగన్మాతగా ఉపాసించి జన్మ సాఫల్యం పొందించే పర్వదినములే శ్రీదేవీ శరన్నరవరాత్రి మహోత్సవములు.
శరదృతువులో శక్తి ఆరాధన
బుద్ధికి మనస్సుకి దగ్గర సంబంధం ఉంది. చంచలమైన మనస్సును సాధ్యమైనంతవరకు అదుపులో పెట్టుకుంటే, మనిషి మనీషి అవుతాడు. అందుకే ‘మానస వనచర వర సంచారము నిలిపి’ అని కీర్తించాడు త్యాగయ్య, శ్రీరాగంలో. మనఃకారకుడైనవాడు- చంద్రుడు. చంద్రుడు వెనె్నలను బాగా ప్రసరింపచేసే ఋతువు శరదృతువు. ఆశ్వయుజ, కార్తికమాసములు శరదృతువు. మనస్సును నిర్మలంగా ఉంచుకోవటానికి మహర్షులు చెప్పిన మార్గాల్లో ‘శక్తి ఆరాధన’ ముఖ్యమైనది. ఎందుకంటే జ్యోతిషశాస్తర్రీత్యా చంద్రుడంటే తల్లి, జగన్మాత. పూర్ణమైన చైతన్య స్వరూపిణి. పరమేశ్వరి, పార్వతి, గాయత్రి, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి, లలిత, దుర్గ, మహిషాసురమర్దిని, శ్రీ రాజరాజేశ్వరి, కాత్యాయని, కామాక్షి, కళ్యాణి- ఏ పేరుతో పిలిచినా, ఆరాధించినా మూలశక్తి ఒక్కటే, అదే చిచ్ఛక్తి. విశ్వమంతా చిచ్ఛక్తి విలాసం. అన్ని నామాలలోనూ ప్రధానంగా ఉండేది శక్తి. అగ్నికి వేడి శక్తి. సూర్యునికి వెలుగు శక్తి, చంద్రునికి వెనె్నల శక్తి. యిలా ప్రతి పదార్థంలోనూ శక్తి వుంటుంది. అంతేకాదు ప్రతి పదంలోనూ ఉండే శక్తి- అర్థం శక్తితో కూడినవాడు- పరమేశ్వరుడు. పరమేశ్వరుడు పరమేశ్వరికి భేదం లేదు. ‘శృణాతి పంకం ఇతి శరత్’- బురదను పోగొట్టి నిర్మలముగా ఉంచేది శరత్. కనుక శరదృతువులో మనస్సును నిర్మలంగా ఉంచుకోవటానికి మహర్షులు చెప్పిన మార్గాల్లో ‘జగన్మాత’ ఆరాధన ముఖ్యమయింది.
ఆశ్వయుజ మాస విశిష్టత
అశ్వనీ నక్షత్రంలో పౌర్ణమి వస్తే అది ఆశ్వయుజమాసం. దీనినే ‘ఇష’మాసమని శ్రుతి వివరించింది. అశ్వనీ నక్షత్రానికి ‘అశ్వనీ’ దేవతలు అధిదేవతలు. అందుకే అశ్వినో ఆశ్వయుజే అని చెప్పబడింది. ఈ అశ్వనీ దేవతలు సూర్యపుత్రులు, సూర్య తేజస్సు కలవారు. ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ‘త్వష్ట’ అనే నామంతో ఉంటాడని, సూర్యశక్తి తన సృష్టిలోగల జీవుల కష్టనష్టములను పోగొడుతుందని చెప్పబడింది. ఆ విధంగానే, పూర్ణిమ వృత్తికా నక్షతంలో వచ్చే మాసం కార్తికమాసం. దీనే్న ఊర్జ మాసమంటారు. ‘ఇషశ్చోర్జశ్చ శారదావృతూ’ కనుక ఆశ్వయుజ కార్తికమాసములు గలది, శరదృతువు. శరత్ పదము ‘శృ-హింసాయామ్’ అనే ధాతువునుండి ఏర్పడింది. అనగా, మనిషిలో ఇంద్రియ నిగ్రహం లేక, కామ క్రోధాది అరిషడ్వర్గ శతృవుల్ని జయించలేక, హింసా ప్రవృత్తి ఎక్కువవుతుంది. మానవుడు తనలో వున్న పశురాక్షస ప్రవృత్తిని అణచికొని, దైవశక్తిని పెంపొందించుకోవాలని హెచ్చరిస్తుంది.
దసరా పద వివరణ
భగవత్ ధ్యానంలో దేవిని ఉపాసించటానికి, నవరాత్రి వ్రతం చెప్పబడింది. పదో రోజు విజయోత్సవం. విజయదశమి. దీనికే దసరా పండుగ అని పేరు. ‘దశహరా’ అనేది దసరా అయింది. పది జన్మల పాపమును పదిరోజులలో హరించేది అని అర్థం. ‘దసనం రాతీతి దసరా’ దసనమంటే నాశనము. నాశనమును నివారించేది దసరా. ‘సర్వరోగోపశమనం సర్వోపద్రవ నాశనమ్, శాన్ణిదం సర్వారిష్టానాం నవరాత్రి వ్రతం శుభమ్’ అని శరృతువులో నవరాత్రి వ్రతం గురించి స్కాందపురాణం పేర్కొన్నది. శ్రీదేవి శరన్నవరాత్రి వ్రత మహోత్సవములలో శ్రీదేవి- జగన్మాత గురించి, శరదృతువు గురించి తెలిసికున్నాం. ఇక నవ రాత్రి వ్రత మహోత్సవముల గురించి తెలిసికుందాం.
‘నవ’ శబ్ద వివరణ
నవ అంటే తొమ్మిది, క్రొత్త అనే అర్థాలున్నాయి. ఇవికాక ‘నవ’ అంటే పరమేశ్వరుడని, రాత్రి అంటే పరమేశ్వరి- పార్వతి అనే అర్థాలున్నాయి. కనుక నవరాత్రమంటే పార్వతీ పరమేశ్వరులు శివశక్తులు, ప్రకృతీ పురుషుల ఆరాధన లేక వ్రతము, పూజ అని అర్థము. పరమాత్మ నవస్వరూపుడు ‘నవోనవోభవతి జాయమానగ’ అన్నది శృతి. ‘సూయతే స్థూయతే ఇతి నవః’ నవ శబ్దానికి స్తుతింపబడుచున్నవాడు అని అర్థం. శబ్దరూపమైన వేదం ప్రకృష్టమైన నవ స్వరూపం. అదే ప్రణవస్వరూపమైన పరమేశ్వరుడు, నిత్యనూతనుడు, సర్వకాల సర్వావస్థలయందు ఉండేవాడు. శివశక్తులకు భేదం లేదు. అందుకే జగన్మాతకు ‘శివా’ అనే పేరు వున్నది. నవరాత్రులు కూడా ప్రాచీనకాలంనుంచి ఆచరించబడుతున్న నిత్య నూతనములు, పూజనీయములు.
రాత్రి శబ్ద విశేషము
జగన్మాత రాత్రి రూపిణి. పరమేశ్వరుడు- పగలు, జగముల నేలే తల్లి ఆరాధనే - రాత్రి వ్రతము. సీతామాత కాలరాత్రి. ఆమె జోలికి పోయినా అవమానించినా, బల్కారించటానికి ప్రయత్నించినా మొత్తం లంకను భస్మం చేస్తుంది. నిన్ను సర్వనాశనం చేస్తుంది. అయితే ఆమెను ఆరాధిస్తే జ్ఞానభిక్షనొసగి కాపాడుతుంది. కాలరాత్రి అయిన సీతామాతయే వేదవిద్య అని చెప్పాడు వాల్మీకి మహర్షి- రామాయణంలో హనుమంతుని ద్వారా రావణాసురునికి జ్ఞానబోధ చేయిస్తూ. జగజ్జనని ఆరాధనే రాత్రివ్రతం. రాత్రి దేవియే, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూప నామములతో పూజింపబడుతోంది. దుష్ట రాక్షస సంహారం గావిస్తుంది. శిష్యులను రక్షిస్తుంది. అందుకే జగన్మాతకు కాలరాత్రి అని పేరు. నవ అహోరాత్ర దీక్షగా రాత్రి పగలు, తొమ్మిది రోజులు చేస్తారు. ‘రాత్రి శబ్దస్య తిథి వాచకత్వాత్’ అనే అర్థాన్ని బట్టి, రాత్రి అనగా ‘తిథి’ అని అర్థం వస్తుంది. పాడ్యమి మొదలు నవమి తిథివరకు శ్రీదేవి పూజ, శరదృతువులో చేస్తారు. రాత్రి దేవియే, సత్త్వ రజ తమో గుణములతో త్రిమాతల రూపంలో ఆరాధింపబడుతోంది. ఆ తల్లే కాలరాత్రి, శివరాత్రి, మహారాత్రి, మోహరాత్రియని కీర్తింపబడుతోంది. ‘మోహరాత్రి’ అంటే కృష్ణాష్టమినాడు రాత్రి పుట్టి, కంసాదులను మోహింపజేసి, శ్రీకృష్ణుని నందుని ఇంటికి తీసికొనిపోవుటకు సాయపడిన జగన్మాత యోగమాయ.
‘‘కాలరాత్రం బ్రహ్మ సంస్తుతాం వైష్ణవీం సందమాతరమ్ సరస్వతీ మదితం దక్ష మహితరం నమామః పాపనాం శివమ్’ వేద మంత్రాన్ననుసరించి కాలరాత్రి అంటే లక్ష్మీ సరస్వతి పార్వతి అని అర్థం. ‘శబ్దాతిగః శబ్ద సహః శిశిరః శర్వరీకరః’ అన్న విష్ణు సహస్రనామ స్తోత్రంలో ‘శర్వరి’ అంటే ‘రాత్రి’ అని అర్థం. ఆ విధంగానే ‘కాలరాత్య్రది శక్త్యాది వృతా స్నిగ్దౌదన ప్రియం’ అన్న శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా ‘కాలరాత్రి’ గురించి చెప్పబడింది.
నవరాత్రి పూజలో ఎక్కువ తక్కువలెందుకు వస్తాయి?
ఒక సంవత్సరం, పదిరోజులు పూజ, దశమి ఒక రోజు- మొత్తం పదకొండు రోజులు పూజ చేశాం. ఒక సంవత్సరం ఎనిమిది రోజులు (నవరాత్రి) పూజ, దశమి ఒక రోజు, మొత్తం తొమ్మిది రోజులు చేసుకున్నాం. సాధారణంగా తొమ్మిది రోజులు (నవరాత్రి) పూజ, విజయదశమి ఒక రోజు జరుపుకుంటాం. ఎందుకు ఎక్కువ తక్కువలు? రాత్రి అంటే తిథి అనే అర్థం కనుక, తొమ్మిది తిథులు- పాడ్యమి నుండి నవమి తిథి వరకు శ్రీ దేవీ పూజ చేస్తారు. తిథులు హెచ్చుతగ్గులొస్తాయి. కనుక శ్రీదేవీ శరన్నవరాత్ర పూజలో తొమ్మిది తిథులు ఎనిమిది రోజులలోనే వచ్చినా, ఎనిమిది రాత్రులు పూజించినా తొమ్మిది రోజులు ఆచరించినా నవరాత్రయే అవుతుంది. ‘అష్టరాత్రా న దోషాయం’ అన్నది స్మృతి.
చంద్ర నక్షత్రములలోనే కలశస్థాపన, ఉద్వాసన
చంద్ర నక్షత్రములు మూడు. అవి- రోహిణి, హస్త, శ్రవణం. కన్యారాశిలోని చంద్ర నక్షత్రమైన హస్తా నక్షత్రంలో కలశస్థాపన చేసి శ్రీదేవీ శరన్నవరాత్రి వ్రత మహోత్సవమును ప్రారంభించి, మరలా మరో చంద్ర నక్షత్రమైన శ్రవణా నక్షత్రంలో శిశశక్తి ఏకేశ్వరోపాన చేసి, కలశద్వాసన చేస్తారు.
మహోత్సవం అని ఎందుకంటారు?
ఉత్ సూతే హర్షః అనేన ఇతి ఉత్సవః- మనలో వున్న ఆనందాన్ని పైకి వ్యక్తీకరించటాన్ని ఉత్సవం అని అంటారు. ఇది పెద్ద ఉత్సవం కనుక మహోత్సవం. ఇంతవరకు మనం శ్రీదేవి శరదృతువు, నవరాత్రి పూజా మహోత్సవాల గురించి చాలా విపులంగా విశదీకరించుకున్నాము.
సపర్ణామ్ ఆకీర్ణామ్ కతిపయుగతైః సాదరమిహ
శ్రయంతి అనే్వ వల్లీం మమతమతిరేవం విలసతు
అవరె్తైకా సేవ్యా జగతి సకలైః యత్ పరివృతః
పురాతోపి స్థాణుః ఫలతి కిల కైవల్య పదవీమ్
- శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య
మాతా, అపర్ణాదేవీ, ఆకులున్న తీగెను సపర్ణ అంటారు. కొందరు సపర్ణను ఆదరిస్తారు. ఎందుకంటే ఆకులున్న తీగె పాకుతుంది. ఎప్పటికప్పుడు దానికి కొత్త కొత్త చిగుళ్ళు వస్తూ వుంటాయి. పూలు, పండ్లు వస్తాయి. వాటిని అనుభవించవచ్చు. ఆ ఫలాలతో సంపదలు, వానిని ఆస్వాదిస్తూ ఆనందించవచ్చు. ఇవన్నీ ఐహిక వాంఛలు. వీటినిచ్చేవారు సపర్ణలు. ఇవి తాత్కాలిక ఆకందాలు. సపర్ణలు వారిచ్చే ఫలాలు తాత్కాలికములే. ఆకులు లేని తీగెను అపర్ణ అంటారు. అపర్ణ అనగా జగన్మాత. పరమశివుని పొందటానికి ఆకులు కూడా భక్షించని కఠోర దీక్షాపరురాలు. అమ్మ దృష్టి అన్నివేళలా పరమేశ్వరుని వైపే. ఆమె లక్ష్యం గమ్యం- పరమ శివుడు. జనని జ్ఞానానందలత. అనాదిగా పడియున్న మోడును, స్థాణువు పరమశివుని ఆశ్రయించింది మాత. ఏ సపర్ణలు ఇవ్వలేని శాశ్వతమైన కైవల్య పదవిని మీ ఇరువురి శివశక్తుల సామరస్యంతో లభిస్తోంది. అందుకే అపర్ణవైనా, నినే్న ఆశ్రయిస్తున్నాము తల్లి. అప, ఋణ అపర్ణ అని స్మరిస్తే, భక్తులకు తను ఋణపడ్డానని తలచి, ఆ ఋణం నుండి విముక్తి పొందటానికి, భక్తులపై దయచూపే చల్లని తల్లి- అపర్ణాదేవి.
ముత్తుస్వామి దీక్షితులు
త్రిలోకమాతను ధ్యానించి పూజించి తరించినవారిలో ముఖ్యుడు ముత్తుస్వామి దీక్షితులు. ‘ఈశమనోహరి’ రాగంలో సందర్భోచితంగా ఆయన మనకందించిన ముదావహ కీర్తన-
జగదీశ మనోహర జయ కరుణా రస లహరీ
జయకరి త్రిపురసుందరీ
నగరాజ ప్రియ కుమారీ నాదాంత విహారీ గౌరీ
భగవతీ హరి హర గురు గుహ పాలినీ, అఖిలాండేశ్వరీ
సంపూర్ణ శరణాగతితో ఏ పనిచేసినా, ఆ పని చేయించేది జగదీశ్వరీననే సద్భావంతో చేస్తే, అదే శక్తి ఆరాధన. జీవితమే మహాసాధనం. అందులో ‘కాలం’ శక్తిస్వరూపం. కాలాన్ని వృథా చేయకుండా, శరీరాన్ని ఉపాధిగా చేసికొని, దానిలో వున్న సుధాసింధువును అందుకోవటమే ధ్యేయం కావాలని బోధిస్తోంది నవరాత్రివ్రతం.

-పసుమర్తి కామేశ్వరశర్మ 9440737464