సబ్ ఫీచర్

నా పాత్రలకు మరణం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భౌతికంగా నేను లేకున్నా నా పాత్రలకు మరణం రాదు. జీవితానికి ఇంతకన్నా ఏంకావాలి? సర్వమత సమ్మేళనమన్నట్టు నా చిత్రాలు అన్ని మతాలవారికీ చేరాయన్న యాది నన్ను సదా ఆనందంగా ఉంచుతుంది

అనుకున్నామని జరగవు అన్నీ
అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికనీ
అనుకోవడమే మనిషి పని
-అన్నాడు ఆచార్య ఆత్రేయ.
**
మనిషిని మనసుని కాచి వడపోసినవాడు ఆత్రేయ. అందుకే -ఆయన చెప్పిన జీవిత సత్యాలు లైఫ్‌లో మనకు ఎదురవ్వకపోయినా.. అయినట్టే భ్రమిస్తాం. లేదూ జరిగిన సంఘటనకు అన్వయించుకుంటాం. అదీ ఆత్రేయ అక్షరాల్లోని బలం.
జరిగిందో.. జరిగినట్టుగా అన్వయించుకోవాలో తెలీదుగాని -విజయ్‌చందర్‌కీ ఆత్రేయ అక్షరాల్లోని భావుకత సెగ తగిలింది. అదెలాగంటే -విజయ్‌చందర్ ‘కౌబాయ్’గా వెలుగుతున్న రోజులవి. ఠక్కున -కరుణామయుడయ్యాడు. అప్పటికి ఆర్థికపరంగా నిలదొక్కుకున్న పరిస్థితి లేదు. లైఫ్ ఇంకా ట్రయల్స్‌లోనే ఉంది. కాని -అప్పటికి సంపాదించిన అనుభవంతో సంకల్పం బలపడింది. అంతే -నటీనటులు సహకరించారు. సాంకేతిక నిపుణులు కలిసొచ్చారు. నాలుగున్నరేళ్లు కష్టపడ్డారు. కట్‌చేస్తే -కరుణామయుడు ఆవిష్కృతమయ్యాడు. చిత్రమేంటంటే -సినిమా మొత్తం జెరూసలెంలో జరుగుతున్న భ్రమలోనే ఆడియన్స్ ఉన్నారు. అది -‘సినిమాటోగ్రాఫర్ కెఎస్ ప్రసాద్ పనితనం’ అంటూ అప్పటి జ్ఞాపకాన్ని పొదివిపట్టారు విజయ్‌చందర్. ఏసును శిలువవేసే సందర్భంలో -కాళ్లకు, చేతులకు మేకులు కొట్టే సన్నివేశం గురించి అడిగినపుడు.. ‘అదంతా మేకప్‌మెన్ సత్యం గొప్పతనం’ అంటారాయన.
‘సమకూర్చుకున్న ఆర్థిక వనరులతో ఏరోజుకారోజు యుద్ధం చేస్తున్నాం. ఆరోజు -బాగానే డబ్బు సమకూరింది. దాంతో నాలుగు సన్నివేశాలన్నా తీసేయాలన్నది నా ఆలోచన. కెమెరామెన్‌కు చెప్పాను. యూనిట్ రెడీ అయిపోయింది. నేనొకటి తలిస్తే.. నేచరింకోటి తలచింది. ఆకాశం మేఘావృతమైంది. లైట్ ఫెయిలైంది కనుక -షూటింగ్ కష్టమన్నాడు కెమెరామెన్ ప్రసాద్. అప్పుడే -పక్కలో కాదు, గుండెల్లో బల్లెం దిగినట్టు అనిపించింది. షూటింగ్ పెట్టకపోతే చాలా నష్టపోతానని ఏదోకవిధంగా చేద్దామని అభ్యర్థించాను. ససేమిరా అన్నాడు ప్రసాద్. ఒకవిధంగా గొడవాడుకుంటున్నట్టే ఉంది మామధ్య సంభాషణ. చివరికి నా పట్టుదల, దీనస్థితి చూసి -క్లైమేట్‌కు అనుగుణంగా భూమి కనిపించే షాట్స్ తీస్తానన్నాడు. అతనామాట అనగానే నా బుర్ర పాదరసంలా పనిచేసింది. ఏసుకు శిలువవేసే టైంలో కెమెరా భూమినే చూపించాలి కనుక, ఆ షాట్ తీసేద్దామని ఓ నిర్ణయానికి వచ్చాం. ఏసు శిలువ మోసుకెళ్లే సీను. ప్రక్కనున్న యోధులు నన్ను కొట్టాలి. వాళ్లేమో జంకుతున్నారు. ఓపక్క టైం వేస్టవుతోంది. చిరాకొచ్చింది. కొట్టకపోతే పేమెంట్ కట్ అన్నాను. కొండపైనుంచి తోసే సన్నివేశమూ అంతే. నిజానికి సినిమాలో ఉన్నట్టు వాళ్లు నన్ను తోయలేదు. నాకు నేనే దొర్లుకుంటూ వెళ్లిపోయా’ అంటూ గుర్తు చేసుకున్నారు విజయ్‌చందర్.
ఇంకో విషయం -‘శిలువ వేశాక ఏసు చనిపోయాడో లేదో చూడడానికి కడుపులో బల్లెం గుచ్చుతారు. ఆ బల్లెం గుచ్చిన సీన్‌లో కడుపుపై తగిలిన దెబ్బ తాలూకు మచ్చ ఇదిగో’ అని చూపిస్తూ నవ్వేశారు. మేకులు కొట్టినపుడు రక్తం చిమ్మే సీన్ గుర్తు చేసుకుంటూ -నా నడుం వెనుక నుంచి సన్నని తెల్లని ప్లాస్టిక్ పైపులు కనపడకుండా సెట్‌చేశాడు కెమెరామెన్. ఆ పైపులకు పశువులకిచ్చే ఇంజెక్షన్ జతచేసి ఎర్రరంగు ఇంజెక్ట్ చేసేవాళ్లు. అయితే మేకు కొట్టిన ప్రతిసారీ ఇంజెక్షన్ చేసినా, ఒక్కోసారి రంగు చిమ్మేది కాదు. అదే సీన్‌ని ఎన్నిసార్లు చేశామో గుర్తు లేదు. రెండు రోల్స్ ఫిల్మ్ మాత్రం అయిపోయింది. వాటన్నింటి నుంచీ బావున్నవాటిని జాగ్రత్తగా ఏరుకుని -ఎడిటింగ్‌లో సెట్‌చేశాం. లైటింగ్ లేదంటూ కెమెరామెన్ నో చెప్పటంతో, డిప్రెషన్‌లోకి వెళ్లినపుడు వచ్చిన ఓ ఆలోచన అద్భుతమైన సన్నివేశమైంది’ అంటారు విజయ్‌చందర్. అనుకున్నామని జరగవు అన్ని/ అనుకోలేదని ఆగవు కొన్ని.. అన్న ఆత్రేయ మాటల్ని ఇక్కడ అన్వయించుకోవచ్చు.
**
కరుణామయుడు ఓ అద్భుతమైంది. ఘన విజయం సాధించింది. ఆ ఉత్సాహంతోనే బాపు డైరెక్షన్‌లో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర రూపొందించాలని అనుకున్నారు విజయ్‌చందర్. ఆ విషయాన్ని సంప్రదించారు కూడా. అందుకు బాపు -‘కరుణామయుడు బాగా ఆడుతుంది. మరోసారి జీసస్ చిత్రం చేస్తేనే బావుంటుందేమో’ అని సలహా ఇచ్చారు. ఆయన సలహాకు స్నేహితులూ ఓటేశారు. అప్పటికి యన్టీఆర్ -వీరబ్రహ్మేంద్రస్వామి చిత్రం చేయలేదు. ఆ పాత్రపై మక్కువ వున్నా, బాపు సలహాతో బైబిల్‌లోని దారితప్పిన కొడుకు కథనం తీసుకొని ముళ్లపూడి మాటలు, స్క్రీన్‌ప్లే రాశారు. రాజమండ్రిలో సినిమా షూటింగ్ చేశారు. సుమలత ఆ సినిమాతోనే పరిచయమైంది. ‘యామి.. శిశువా’ అన్న మానరిజమ్‌తో నూతన్‌ప్రసాద్ పాత్ర అద్భుతంగా పండింది. ఆ సినిమా -రాజాధిరాజు. శారద వదిన పాత్రలో ఒదిగిపోయింది. రాజాధిరాజు చిత్రం నేషనల్ అవార్డుకూ ఎంపికైంది. అన్ని వర్గాలనుండి అద్భుతమైన స్పందన వచ్చింది.
ఆంధ్రకేసరి చిత్రం తీయడానికి కారణమేమిటి? అన్న ప్రశ్నకు -‘నిజానికి టంగుటూరి ప్రకాశం పంతులు మా తాతగారు. అలాగని ఆయనపై ప్రేమతో సినిమా రూపొందించలేదు. యన్టీఆర్ అప్పుడే రాజకీయ పార్టీ పెట్టారు. ఆ టైంలోనే ఈ సినిమా మొదలెట్టాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అప్పటి రాజకీయ నేతలు ఎంత గొప్ప వ్యక్తిత్వం కిలగి ఉండేవారు, ఇప్పటి నేతలు ఎలావున్నారన్న బేరీజుతో సినిమా చేయాలనకున్నాం’ అంటారు విజయ్‌చందర్. దేశంకోసం అనేక త్యాగాలు చేసి, సంపాదనను దేశాభివృద్ధికి ఇచ్చేసిన వాళ్లెక్కడ? స్వార్థం చూసుకుంటున్న ఇప్పటి నేతలెక్కడ? అన్నది ప్రేక్షకులకు చెప్పాలన్న ఉద్దేశంతో సినిమా రూపొందించానంటారు ఆయన. ఇప్పటి తరలాకూ ఆ సినిమా మార్గదర్శే అంటారు విజయ్‌చందర్.
స్వాతంత్య్రం రావడం నాకు తెలుసు. ఆ టైంలో స్కూల్లో జెండాలు పట్టుకుని తిరిగేవాడిని. అప్పటి రాజకీయ చైతన్యం, ఇప్పటి రాజకీయ దుస్థితి మదిలోకొచ్చినపుడు -గుండె బరువెక్కుతుందని దేశ పౌరుడిగా తన వాణి వినిపించారాయన.
సిఎస్ రావు దర్శకత్వంలో వేమన చరిత్ర తీయాలనుకున్నాను. ఆ చిత్రాన్ని కెవి రెడ్డి దర్శకత్వంలో చిత్తూరు నాగయ్య హీరోగా రూపొందించిన సంగతి తెలిసిందే. అంత గొప్ప చిత్రాన్ని ఇప్పుడు నిర్మించటం, ఆ పాత్రను పోషించటం కత్తిమీద సామని నాకు తెలుసు. అయితే మొదటి చిత్రానికి మచ్చరాకుండా సినిమా చేయాలనుకున్నాం. తొలి సగంలో నా గొంతుకు ఇబ్బంది రావడంతో డబ్బింగ్ చెప్పించాం. రెండోసగంలో నా గొంతే ఉంటుంది. మీరన్నట్టు విశ్వదా పాత్రకు ఓ గ్లామర్ హీరోయిన్‌ని పెడితే బాగానేవుండేది. కానీ అర్చన అప్పటికే జాతీయ అవార్డుతో మంచి నటిగా నిరూపించుకుంది. అందుకే ఆ పాత్రకు ఆమెను ఎంపిక చేశారనిపిస్తుంది. అదంతా దర్శక నిర్మాతల ఇష్టమే. ఇక వేమన పాత్ర చిత్రణలో ఆయన ఎలా కూచుంటాడు, ఎలా నడుస్తాడు అనేది చాలా ప్రాక్టీస్ చేశా. చివరి సీన్ చిత్రీకరించేటప్పుడు కెమెరామెన్ హరి అనుమోలు పనితనం కన్పిస్తుంది. జీవసమాధి పొందే సమయంలో ఒంటిపై బట్ట ఉండకూడదు కదా, అలా చేస్తావా అని అడిగారు దర్శక నిర్మాతలు. మీరు చిత్రీకరిస్తారంటే ఆ వున్న చిన్న బట్ట కూడా తీసేసి వెళతానన్నాను నేను. ఆవిధంగా ఓ సన్నివేశం కూడా చిత్రీకరించారు. నాకు తెలియకుండానే ఆ పాత్రలో లీనమైపోయాను. అలా ఆ సీన్ దిగంబరంగానే నటించాను. ఆ సినిమా షూటింగ్‌లో కెఆర్ విజయ వదినగా నటించి చాలా మెచ్చుకున్నారు. చివరి సన్నివేశంలో తన వాళ్లను కూడా చూడకుండా ఓ అద్భుతమైన అలౌకిక ఆనందంతో చేసిన సన్నివేశంలో నాగయ్య నటనను ఇమిటేట్ చేయకుండా నా పద్ధతిలో నేను చేసే ప్రయత్నం చేశా. అది కూడా బాగా పండింది.
రాజు దర్శకత్వంలో చేసిన గొప్ప చిత్రం -కబీర్‌దాస్. అందులో పాటలన్నీ అద్భుతంగా వుంటాయి. అలాగే శ్రీ షిరిడీ సాయిబాబా మహత్మ్యం చిత్రంలో నటించమన్నప్పుడు మొదట ఆ పాత్రను నేను చేయలేనన్నాను. కరుణామయుడు చిత్రం చేశావు కదా, మరొక దేవుడికి సంబంధించిన చిత్రం ఎందుకులే అనుకున్నా. కానీ యూనిట్‌వాళ్లంతా మీరు చేస్తే బాగుంటుందనటంతో మేకప్ నాకు సంతృప్తికరంగా ఉంటేనే చేస్తానన్నాను. నాలుగైదుసార్లు మేకప్ చేసి విగ్గులు తగిలించారు. కానీ సంతృప్తి కలగలేదు. విగ్గు తీసేసి -నేను షిరిడీ సాయిలా కనిపించడంలేదు. చేయను అన్నాను. యూనిట్‌వాళ్లు మళ్లీ మళ్లీ ప్రయత్నించి మేకప్ చేశారు. ఫైనల్‌గా అద్భుతంగా వచ్చింది ఆ గెటప్. పాత్రలో పాత్రధారుడు కనిపించకూడదన్న దర్శకుడు పి వాసు సలహాతో చేయడానికి సిద్ధమయ్యా. షూటింగ్ టైంలో చేతులు, కాళ్లు, వేళ్లు వాటికవే వంకర్లు పోవడం మొదలుపెట్టాయి. రషెస్ చూసినవారు దేవుడు సినిమా కదా అలా చేస్తున్నావేంటి అనడిగారు. ఏమో నాకు తెలియకుండానే అలా జరుగుతుందని చెప్పా. వాసు ఇచ్చిన ప్రోత్సాహంతో మొత్తానికి పాత్ర చేసేశాను’ అంటారు విజయ్‌చందర్. ఆ తరువాత -బాబా దిగివచ్చాడా? అన్నట్టే ఉందని అనేకమంది అన్నారు. చాలా సంతోషపడ్డాను అంటారు విజయ్‌చందర్. ‘సాయి శరణం.. బాబా శరణు శరణం’ అన్న పాటలో కడుపులో పేగులుతీసి శుద్ధి చేసుకునే సన్నివేశం ఉంది. నిజానికి ఆ సీన్ దర్శకుడికి ఇష్టం లేదు. కానీ, నేను పట్టబట్టి చేశా. ఆ సన్నివేశం చిత్రీకరించే లొకేషన్‌కు రానని దర్శకుడు భయపడిపోయాడు. ఆ సన్నివేశం అద్భుతంగా పండింది’ అంటూ గుర్తు చేసుకున్నారు విజయ్‌చందర్.
‘ఇప్పుడంతా బయోపిక్స్ అంటున్నారు. నేను ఆ కాలంలోనే బయోపిక్స్ తీశా. కొత్తగా రాజకీయాలకు వచ్చినవాళ్లు, కొత్త రాజకీయ పద్ధతులను చూపించాలిగా. అలా చేయాలని నేను అనుకుంటాను. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ చూసినా అలా చేయడం లేదు. ఓ రెండు మూడు వందల చిత్రాలు చేసిన అనుభవం లేదు, రికార్డూ లేదు నాకు. మరి నేనేం చేశానని వెనక్కి తిరిగి చూసుకుంటే, చేసిన నాలుగు చిత్రాలైనా మరొక నటుడు చేయలేని విధంగా చేశానని అంటుండటం నాకు గొప్పగా అనిపిస్తుంది. రాముడు, కృష్ణుడంటే ఎన్టీఆర్ గుర్తొస్తారు. ఏసు, సాయి అంటే విజయ్‌చందరే గుర్తొస్తాడన్న మాట చాలు నా జీవితానికి. ఇప్పటికీ నేను ఏదైనా చర్చికెళ్తే.. ఏసయ్య వచ్చాడంటారు. బాబా గుడికెళ్తే సాయి వచ్చాడంటారు. నన్నో దేవుడిలా చూస్తారు. ఇదంతా నా తల్లిదండ్రుల పుణ్యఫలంగా భావిస్తా. భౌతికంగా నేను లేకపోయినా నా పాత్రలకు మరణం ఎప్పటికీ రాదు. ఈ జీవితానికి ఇంతకన్నా ఏంకావాలి. సర్వమత సమ్మేళనం అన్నట్టుగా నా చిత్రాలు అన్ని మతాలవారికీ చేరాయన్న ఆనందం ననె్నప్పుడు ఆనందంగా ఉంచుతుంది’ అంటూ ముగించారు విజయ్ చందర్.

-సరయు శేఖర్, 9676247000