సబ్ ఫీచర్

కష్టాలే సోపానాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కష్టాలు మనుషులకు కాకుండా మానులకు వస్తాయా! అని పెద్దలు అంటుంటారు. అనుభవించే అవకాశమున్నవారికి అనుభవాలు మిగులుతాయి. అన్ని జీవులకు అటువంటి అవకాశం ఇవ్వలేదు. ప్రకృతి మనిషిని మిగిలిన జీవులన్నింటికంటే భిన్నంగా, మెరుగ్గా తయారుచేసింది. జ్ఞానాంగాల శక్తిని పెంచింది. భిన్నమైన ఆలోచనలు చేయగలిగిన స్థాయిని ఇచ్చింది. వీటితోపాటు చేదు అనుభవాలు, కష్టాలు వగైరా లాంటి వాటిని అనుభవించాల్సిన స్థితిని కల్పించింది.
ఇల్లు వదిలి పిల్లలు వెళ్ళటం సహజమని తెలిసినా, వారు వెళ్ళిపోతుంటే చూడలేక ముఖం చాటుచేసుకునే తల్లిదండ్రులు 90 శాతం పైనే. ఒక వయసు తర్వాత ఎవరి జీవితం వారిదే అని తెలిసినా పిల్లల గురించే ఆలోచిస్తూ దిగులుపడతారు. ఇటువంటి బాధాకర సంఘటనలు, భారీగా మనసుకు కష్టం, నష్టం కలిగించే సంఘటనలు పలువురికి పలురకాలుగా ఎదురవుతూనే ఉంటాయి.
తాము ఎంతో ప్రేమించి, అభిమానించిన పెద్దలు లేదా చిన్నవాళ్ళయినా దూరమైతే, దానిని తట్టుకోవడం కష్టం. తప్పిపోతే మనసుపడే బాధ అంతా ఇంతా కాదు. సంసారం విచ్ఛిన్నమై, విడాకులు తప్పనిసరి అయినప్పుడు విడిపోవడమనే బాధ మనసులను పిండివేస్తుంది. అందునా అప్పటివరకు మహాద్భుతంగా, అద్భుతమైన రంగుల కలలా సాగిన సంసార సౌధం ఒక్కసారిగా కుప్పకూలితే ఆ బాధ మనసును తిరిగి అతికించుకోవటం అంత తేలిక కాదు.
నమ్మకద్రోహమనేది ఎదురైనప్పుడు దానిని తట్టుకోలేని పరిస్థితి మనిషిది. ఏమాత్రం ఊహించని దశలో ఒక్కసారిగా మనసుమీదపడిన ఆ దెబ్బలను తట్టుకోలేక తిరిగి గుండె సవ్వడిని సరైన పద్ధతిలో నిలబెట్టడానికి చాలా కాలమే పడుతుంది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి కష్టనష్టాలు అనేక రకాలుగా ఎదురవుతుంటాయి. భారీగా దెబ్బలుతినే పరిస్థితి వస్తుంది. ఈ అనుభవాలన్నీ జీవితంలో ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరికి కలిగినవే. ఆ నష్టాల్ని తట్టుకోలేనివిగా భావించి, మానసికంగా, శారీరకంగా కుంగిపోయే వారెందరో ఉంటారు. అయితే వారందరూ అర్ధంచేసుకోవాల్సింది జీవనగమనంలో అన్నీ సుఖాలే ఉండవు. కష్టాలుంటాయి. మన దారిలో పూలతోపాటు ముళ్ళుకూడా ఉంటాయి. ఆ ముళ్ళు ఎదురైనప్పుడు ప్రతిస్పందన ఎలా చూపించగలిగారనే దానిమీద జీవితం ఆధారపడి ఉంటుంది.
కొన్ని కష్టమైన పనులు ఎదురవగానే భయపడిపోయి, వణికిపోయి ప్రతిక్షణం అటువంటి అనుభవమే మళ్ళీమళ్ళీ కలుగుతుందేమోననే ఆదుర్దాలో భయంభయంగా జీవితం సాగిస్తారు. మరికొంతమంది తమకెదురైన చేదు అనుభవాలకు, కలిగిన నష్టంలో కుమిలిపోయి వాటినుండి బయటకు రాలేక మరికొన్ని కాని పనులు అలవాటు చేసుకుని వాస్తవంనుండి పారిపోయే ప్రయత్నం చేస్తారు. కాని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ప్రతి చేదు అనుభవం, తగిలిన ప్రతి ఎదురుదెబ్బ కష్టం జీవితానికి ఒక కొత్త పాఠం చెబుతుంది. వినగలిగిన శక్తి, గ్రహించగలిగిన జ్ఞానం ఉండాలేకాని జీవితంలోని చేదు అనుభవం నేర్పని పాఠం ఉండదు. ఇవ్వని ప్రోత్సాహం ఉండదు. నష్టం, ఇబ్బంది, బాధలు అన్నీ తాత్కాలికమేనని, చివరగా ఆ పాఠం మరో కొత్త దశ, దిశ అవుతుందని తెలుసుకున్నవారే తమ గతిని మార్చుకోగలుగుతారు.
ఎవరికైనా ఒక కష్టం ఎదురవగానే, ఒక నష్టం జరగగానే ఇది నాకే ఎందుకు జరిగింది? అనే ప్రశ్న వేసుకుంటారు. జీవితంలో అందరూ సుఖంగా, ఆనందంగా తిరుగుతుండగా, నాకే ఎందుకీ చేదు అనుభవాలు.. అని భగవంతుడిని నమ్మి అమాయకంగా ప్రశ్నించేవారూ ఉంటారు. కొన్ని కష్టాలు, నష్టాలు జరగ్గానే తమ జీవితం అంతటితో అంతమైందని ఆగిపోతారు.
చాలామంది జీవితంలో అనుభవించే బాధలు, కష్టాలు, కార్చే కన్నీరు వాస్తవంలో అర్థంలేనివి. జీవితంలో ఏమికావాలో, ఆ కావాల్సిన వాటిని ఎలా అందుకోవాలో పూర్తిస్థాయిలో తెలుసుకోరు. ఒకవేళ తెలుసుకున్నా తమకు నచ్చిన రీతిలో, తమకు ఇష్టమైన పద్ధతిలో బతికేందుకు సాహసించరు. ఎదుటివారు ఏమనుకుంటారోనని కొద్ది సర్దబాట్లు చేసుకుంటారు అవతలివారిని సంతృప్తిపరచటంకోసం సొంత అభిరుచుల్ని వదులుకుంటారు. చాలామంది జీవితం ఇలాగే కొనసాగుతుంది. ఈ కష్టాలు నా ఒక్కడివే అనుకున్నంతకాలం మనసు కుంగిపోతూనే ఉంటుంది. కోట్లాది బాధితుల్లో నేను ఒకడినే అనుకున్నప్పుడే జీవితం విలువ అర్ధమైనట్టు. అనుభవాలరీత్యా చక్కదిద్దే ప్రయత్నం మొదలైనప్పుడే మనసు వికసిస్తుంది.
జీవితం ఒక ఉత్తమ పాఠశాల. జీవి అనుభవాలే పాఠాలు. పాఠాలు నేర్చుకునే విద్యార్థి. ఆ పాఠాలు వివరించే ఉత్తమ టీచర్ కూడా జీవితమే. జీవితం పాఠాలు నేర్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అయితే వాటిని నేర్చుకునేందుకు మనం సిద్ధంగా ఉన్నామా! లేదా? అని ఆలోచించుకోవాలి. మనం కష్టం అనుకుంటే కష్టం. బాధ అనుకుంటే బాధ. బాధలను కొత్తకోణంనుండి చూస్తే అవతల అనుభవమనే నావ దాటించేందుకు సిద్ధంగా ఉంటుంది.
ఆ నావ దగ్గర ఉండదు. కొంచెం దూరం అడుగులు వేసేందుకు డ్రస్సు తడుస్తుందేమోనని. లేదా మునుగుతామేమోనని భయపడినా ఏదో ఒక సమయంలో నావ ఎక్కించేవారు రాకపోతారా! అని ఎదురుచూసినా అక్కడే ఉండిపోతాం. నావ వెళ్ళిపోతుంది. జీవితంలో అవకాశాలు చేజారిపోయినట్టే. ఆ తర్వాత ఎంత బాధపడినా ఏం ప్రయోజనం ఉండదు.

- పి.ఎం. సుందరరావు 9490657416