సబ్ ఫీచర్

పురుగు మందుల ‘అతి’తో.. గతి తప్పిన వ్యవసాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలాకాలంగా పంటలపై చీడపీడల నివారణకు పురుగు మందుల వాడకం అధికమైంది. మోతాదుకు మించి పురుగు మందుల వాడకంతో చీడపీడలు నశించడం మాట అటుంచి కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఈ తరహా పంట ఉత్పత్తులను వినియోగిస్తున్న ప్రజలకు భయంకర రోగాలు వస్తున్నాయి. మరోవైపు రసాయనాలను తట్టుకునే శక్తి పెరిగి తెగుళ్లు విజృంభిస్తున్నాయి. తెలంగాణలో 2015-16లో 992 టన్నుల రసాయన మందుల విక్రయాలు జరగ్గా, నాలుగేళ్ల తర్వాత ఆ విక్రయాలు 4,894 టన్నులకు పెరిగింది. నాలుగేళ్లలో 3,901 టన్నుల పురుగు మందుల వాడకం పెరిగింది. 2015-16లో 992 టన్నుల రసాయన మందుల వాడకానికి ప్రధాన కారణం- ఆ ఏడాది ప్రతికూల వాతావరణంతో పంటలు బాగాదెబ్బతినడమే.
2014-15లో 2805.71 మెట్రిక్ టన్నులు, 2015-16లో 992.88 మెట్రిక్ టన్నులు, 2016-17లో 3436.39 మెట్రిక్ టన్నులు, 2017-18లో 4865 మెట్రిక్ టన్నులు, 2018-19లో 4894 మెట్రిక్ టన్నుల పురుగు మందుల విక్రయం జరిగింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పురుగు మందుల వాడకం ఎక్కువగా ఉందని వ్యవసాయ శాఖ తేల్చింది. ఎరువులు, పురుగు మందులను భూసార పరీక్షల ఆధారంగా వాడాల్సి ఉంటుంది. వీటి వాడకం ఎక్కువైతే పర్యావరణం విషపూరితం కావడమే గాక, భూసారం క్షీణించి పంటల దిగుబడి తగ్గిపోతుంది. ఆహారం కొరతకు ఇది దారి తీస్తుంది.
ఇటీవల వరి, పత్తి, మొక్కజొన్న, కంది పంటలపై ఎక్కువగా క్రిమిసంహారక రసాయనాలు ఉపయోగిస్తున్నారు. వరికి దోమపోటు, మొక్కజొన్నకు కత్తెర పురుగు, పత్తికి గులాబీ పురుగు ఆశిస్తున్నాయి. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు, శరీరాన్ని కప్పి ఉంచేలా దుస్తులు ధరించని సందర్భాల్లో మందులను పిచికారీ చేస్తున్నవారు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. పురుగు మందులపై రైతులకు తగిన అవగాహన లేకపోవడం, కిరాణా షాపుల్లో సైతం ఇవి లభ్యం కావడంతో పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. మరోవైపు ఇళ్లలో ఎలుకలు, బొద్దింకలు, ఈగలు, దోమల నివారణకు విరివిగా రసాయనాలను వాడుతున్నారు. ఈ మందులను తయారుచేసే కంపెనీలు ఇస్తున్న ప్రకటనలు అందరిలోనూ ఆసక్తిని పెంచుతున్నాయి. రైతులకు అవసరం లేకున్నా భారీగా క్రిమిసంహారకాలను విక్రయిస్తున్నారు. కలుపుమందు అయిన గ్లైఫొసెట్ విక్రయాలు జరపరాదని అధికారులు చెబుతున్నా యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రాసిచ్చిన చిట్టీలపైనే క్రిమిసంహారక మందులను విక్రయించాలని నిబంధన ఉన్నప్పటికీ దానిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు నామమాత్రంగా ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేస్తున్నారు.
పురుగు మందుల విచ్చలవిడి విక్రయాలకు అడ్డుకట్టవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం- ‘పురుగు మందుల నియంత్రణ, నియమావళి 1971’కి సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. పురుగు మందుల నియంత్రణ చట్టం 1968లోని 36వ సెక్షన్ కింద ఈ సవరణ చేసింది. దీని ప్రకారం పురుగు మందుల దుకాణాలను వ్యవసాయ అధికారులు విధిగా తనిఖీ చేయాలి. గుర్తింపు పొందిన వ్యవసాయ డిగ్రీ లేదా రసాయన శాస్త్ర డిగ్రీ ఉత్తీర్ణులైనవారు మాత్రమే పురుగుమందులను విక్రయించాలి. అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్‌లో డిప్లొమా చేసినవారూ వీటిని విక్రయించవచ్చు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రాలు, జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ, రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ నిర్వహణ సంస్థ, మలక్‌పేటలోని సమితి నిర్వహణ సంస్థలలో 12 వారాలపాటు పురుగు మందుల అమ్మకాలపై శిక్షణ పొందాల్సి ఉంటుంది. ప్రస్తుత లైసెన్స్‌దారులు 2020 డిసెంబర్ 31లోగా తగిన విద్యార్హతలు కలిగి ఉండలేకపోతే వారి లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దుచేస్తారు. దుకాణాల్లో పనిచేసేవారికి సైతం ఈ నిబంధన వర్తిస్తుంది. మొత్తానికి వ్యవసాయశాఖ నిబంధనలను పక్కాగా రూపొందింది. ఇక అమలుపై వ్యవసాయ అధికారులు నడుం బిగించాలి.
క్రిమిసంహారక మందుల వాడకం వల్ల ఉపయోగాలు, వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలపై పూర్తి అవగాహన కల్పించడం వల్లనే విచ్చలవిడి తనానికి అడ్డుకట్ట పడుతుంది. భూసార పరీక్షలు అవసరాన్ని రైతులకు తెలియజెప్పాలి. గ్రామాల్లోనే వ్యవసాయ అధికారులు సమావేశాలు నిర్వహించాలి. వ్యవసాయ శాస్తవ్రేత్తలు ఈ సమావేశాలకు హాజరైతే రైతుల సందేహాలను నివృత్తిచేయగలుగుతారు. పౌల్ట్రీ, పశు, మత్స్య, పట్టు పరిశ్రమ, ఉద్యానవన శాఖల అధికారులు సైతం ఈ సమావేశాలకు వస్తే రైతులకు మేలుకలుగుతుంది. రసాయన ఎరువులు, పురుగు మందులు పంటలకు, మానవాళికి, పర్యావరణానికి ఎలా నష్టం చేస్తున్నాయనే అంశంపై రైతులకు అవగాహన కల్పించాలి. ఇది నిరంతరం జరిగే కార్యక్రమంలా సాగినపుడు క్రిమిసంహారక రసాయనాలు వినియోగం తగ్గిపోతుంది.

-వంగ మహేందర్‌రెడ్డి 99631 55523