సబ్ ఫీచర్

విజ్ఞానశాస్త్రమె దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి రహస్యాలను ఛేదించడమే కాదు.. మానవ ప్రగతికి మూలకారణమైన ‘విజ్ఞానశాస్త్రం’ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లోని సమస్యలకు పరిష్కారాలను చూపుతూ విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతోంది. తద్వారా దేశం పురోగామి దిశలో ప్రయాణించి అభివృద్ధి ఆచరణలో సాధ్యవౌతుందనేది జగమెరిగిన సత్యం. కానీ నేడు భారతీయ ‘విజ్ఞానశాస్త్రం’ రోజురోజుకూ కుల, మత, రాజకీయాల ప్రభావానికి లోనై ‘వ్యతిరేక సైన్స్’ విస్తరించిపోతూ సమాజాన్ని మూఢ నమ్మకాల వైపు తీసుకుపోవడం చూస్తున్నాం. ఈమధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు శాస్ర్తియ ఆలోచన విధానాన్ని దెబ్బతీసే విధంగా వుంటున్నాయి.
గత కొన్ని సంవత్సరాల నుండి ‘సైన్స్ కాంగ్రెస్’ సమావేశాల్లో కేంద్ర మంత్రులు శాస్తన్రిరూపణకు నిలబడని అంశాలను మాట్లాడుతూ విజ్ఞానశాస్త్రాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఈమధ్య కొంతమంది ప్రభుత్వాధినేతల వ్యాఖ్యలు సైతం మూఢ విశ్వాసాలను పెంచి పోషించే విధంగా ఉండడం విచారకరం. శాస్త్ర, సాంకేతిక రంగాలకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు స్థూల జాతీయ ఉత్పత్తిలో కేవలం 0.8 శాతం మాత్రంగానే ఉన్నాయి. చైనాలో ఏటా బడ్జెట్‌లో 2 శాతం కేటాయింపులు ఉండడంతో ఆ దేశంలో సైన్స్ అభివృద్ధి చెందింది. టెక్నాలజీతో ప్రపంచాన్ని చైనా శాసించడాన్ని నేడు మనం చూస్తూనే ఉన్నాం.
గడిచిన కాలంలో భారతదేశం గణనీయమైన అభివృద్ధి సాధించడానికి శాస్త్ర సాంకేతిక సంస్థలకు కొంతమేరకైనా ఆర్థిక సహాయం ప్రభుత్వాల నుండి లభించడమే కారణం అని చెప్పవచ్చు. తద్వారానే పలు పరిశోధనా సంస్థలలోని శాస్తవ్రేత్తలు నూతన ఆవిష్కరణలు చేశారు. ప్రపంచ స్థాయి వైజ్ఞానిక అభివృద్ధిని భారతదేశానికి పరిచయం చేసి మానవ ప్రగతికి బాటలు వేశారనేది సత్యం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితికి తావులేకుండాపోతోంది. నవీన ఆవిష్కరణలకు అవకాశం లేని సనాతన భావజాలాలు పెరిగిపోతున్నాయి. 2015లో ప్రకటించిన ‘డెహ్రాడూన్ డిక్లరేషన్’ ప్రకారం రానున్న రెండు సంవత్సరాలలో ప్రభుత్వ సైన్స్ పరిశోధన సంస్థలు తమకు అవసరమైన నిధులను సేకరించుకోవాలని అప్పటి కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి చెప్పడం ప్రభుత్వం సైన్స్ సంస్థలను నిరుత్సాహపరచడమే అని భావించాలి. ప్రభుత్వం ఏటా శాస్త్ర, సాంకేతిక సంస్థలకు ఇచ్చే అరకొర నిధులు సిబ్బంది జీతాలకు, ఆ సంస్థల నిర్వహణకే సరిపోతున్నాయి. ఫలితంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్‌ఐఆర్) నెట్‌వర్క్‌లోని 40 ప్రయోగశాలలు, ఐఐటీలు, ఇతర పరిశోధన సంస్థలలో అధ్యయనాలు కొరవడి నూతన ఆవిష్కరణలకు అవకాశం లేకుండాపోతోంది.
శాస్త్ర, సాంకేతిక సంస్థల అధిపతులుగా బ్యూరోక్రాట్ల (ఉన్నతాధికారుల)ను నియమిస్తూ వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. పేరొందిన విశ్వవిద్యాలయాలలో సైతం పూర్తిస్థాయి ఉపకులపతులను, అధ్యాపకులను నియమించక పోవడంతో పరిపాలన కుంటుపడి, నాణ్యమైన విద్యను అందించడంలో అవి వైఫల్యం చెందుతున్నాయి. యువతలో నైపుణ్యం అభివృద్ధికి ఉద్దేశించిన ‘స్కిల్ ఇండియా’, నూతన ఆవిష్కరణలకు ఉద్దేశించిన ‘స్టార్టప్ ఇండియా’ పథకాల పర్యవేక్షకులుగా అనుభవంలేని వారిని నియమించడంతో నైపుణ్యాభివృద్ధి లోపించి నవ కల్పనకు ఆస్కారం లేకుండాపోయి నిరుద్యోగం ఏటికేడు పెరుగుతూ ఉంది. ప్రణాళికా సంఘం (ప్లానింగ్ కమిషన్) స్థానంలో ఏర్పాటుచేసిన ‘నీతీ ఆయోగ్’లో శాస్త్ర, సాంకేతిక అంశాలకు తగిన చోటులేకుండా చేయడం దారుణం. కీలకమైన జాతీయ విద్యావిధాన రూపకల్పనకు నిపుణులు, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ప్రతినిధులు కాకుండా ఆ రంగంలో ఏమాత్రం పరిచయంలేని వ్యక్తులను నియమించి లోపభూయిష్టమైన జాతీయ విద్యావిధానాన్ని ఇటీవల కేంద్రం ప్రకటించింది. పలు సంస్థల్లో డైరెక్టర్లుగా శాస్ర్తియ భావజాలం ఉన్నవారిని కాకుండా ఛాందసవాదులను నియమించడం వల్ల వారు హేతుబద్ధమైన అభివృద్ధికి తావివ్వకుండా శాస్త్రప్రగతిని ఆధ్యాత్మికతతో జోడించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతకాలం నుంచి పాఠశాల స్థాయినుంచి విశ్వవిద్యాలయాల వరకు గల పాఠ్యాంశాలలో అశాస్ర్తియమైన, వివాదాస్పదమైన అంశాలను చేర్చుతూ, శాస్ర్తియ విషయాలను పక్కనపెట్టడం జరుగుతోంది.
భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదగాలంటే ఏం కావాలి? వ్యవసాయ రంగం ఆధునికతను సంతరించుకోవాలి. నవ కల్పనలకు నాంది పలుకుతూ నూతన పరిశ్రమలను స్థాపించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విద్యను అందించాలి. శాస్త్ర ప్రగతితో కూడిన అభివృద్ధిని ఆధ్యాత్మికతతో ముడిపెట్టకుండా హేతుబద్ధమైన ఆలోచన కనిపించేలా విధంగా ప్రభుత్వం పరిపాలన కొనసాగించాలి. మన విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా, చర్చల కేంద్రాలుగా, పరిశోధన కేంద్రాలుగా ఎదగడానికి కావాల్సిన వాతావరణాన్ని కల్పించాలి. పాఠశాల స్థాయి నుంచే శాస్ర్తియ అంశాలకు చోటు ఇవ్వాలి. భారతీయ సమాజం హేతుబద్ధమైన శాస్ర్తియ ఆలోచనలు గౌరవించుకునే సామరస్య సమాజంగా బలపడడానికి ప్రభుత్వం కృషిచేయాలి. నిపుణుల అంచనా మేరకు కేంద్ర బడ్జెట్‌లో ఏటా విద్యారంగానికి 6 శాతం, శాస్త్ర సాంకేతిక రంగాలకు 2 శాతం నిధులు కేటాయించినప్పుడే దేశంలో నాణ్యమైన విద్య విద్యార్థుల చెంతకుచేరి శాస్త్ర, సాంకేతిక రంగాలలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రభుత్వాలు ఆమేరకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరిగేలా జాగ్రత్త వహించాలి. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు సుస్థిర అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి.

-సంపతి రమేష్ మహారాజు 99595 56367