సబ్ ఫీచర్

‘అమరావతి నగరి’ ఇంకెంత దూరం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమరావతి’.. అదో సంచలనం.. విభజిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అందరికీ సుపరిచితమైంది. ఏ అండాదండా లేని రాజ్యానికి దిక్సూచిగా మారింది. గత అయిదేళ్ల కాలంలో- నిర్మాణాలేవీ లేకున్నా.. నవ్యాంధ్ర రాజధానిగా వార్తల్లో నిలిచింది. శాసనసభ ఎన్నికల అనంతరం అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో ‘అమరావతి’ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎందుకో తెలియని వెలితి చోటుచేసుకుంది. అమరావతికి అసలు ఏమైంది? రాజధాని మరోచోటకు మారుతోందంటూ జరుగుతున్న ప్రచారానికి కారకులెవరు? ఇంతకూ ఏం జరిగింది? ఏం జరుగుతోంది!? ఇదే ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట. ఎంతో ఆర్భాటాన్ని సంతరించుకున్న అమరావతి నగర భవిష్యత్‌పై ఎక్కడలేని అనుమానాలు, అవాంతరాలు తెరపైకి వచ్చాయి. ప్రతి అంశంపైనా అనుకూల, వ్యితిరేక ధోరణలున్నట్లే... అమరావతి పైనా చర్చోపచర్చలు సాగుతున్నాయి.
అమరావతి నగరానికి జరిగిన అంకురార్పణ ఘట్టం ఎన్నో ఆశలను కల్పించింది. ఎక్కడ చూసినా.. విన్నా ఈమాటే ప్రతిధ్వనించింది. కొత్త రాష్ట్రం.. కొత్త రాజధాని కావడంతో ఉత్సాహం ఉబికింది. సామాన్యుని సైతం ఆశల్లోకి తీసుకెళ్లగలిగింది. ఎక్కడ చూసినా, ఎటు వెళ్లినా ‘అమరావతి’ జపం సాక్షాత్కరించింది. ఈ పేరిట హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు, వ్యాపారాలు.. ఒకటేమిటి ఓ సరికొత్త విప్లవంలా మారింది. కొత్త కొత్త కంపెనీలు మొదలు అన్ని లావాదేవీల్లోనూ అమరావతే అగ్రగామిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ కన్నా అమరావతి అంటేనే ఉనికిని చాటుకునేలా సాగిపోయింది. కారణం.. రాజధాని ఆవిర్భావం అలా జోరుగా ముందుకెళుతుందన్న నమ్మకమే. గత పాలకుల ప్లానింగ్, నడవడికలతో రాజధాని లేని రాష్ట్రానికి కొత్త అనుభూతులను పంచింది. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నడూ లేని విధంగా వివాదాల సుడిలో రాజధాని చిక్కుకుంది. అమరావతిపై అనుమానాలు, సందేహాలు ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి.
ఈ నగర అభివృద్ధిపై నీలినీడలు ముసురుకున్నాయి. మొదలెట్టిన, పూర్తయిన ప్రతి అంశంపైనా స్పందనలు, ప్రతిస్పందనలు మామూలయ్యాయి. భవిష్యత్ తరాలకు ఒక తీయని జ్ఞాపకాన్ని పంచుతుందనుకున్న ‘అమరావతి’ ఇపుడు సందేహాలకు సాక్షీభూతంగా నిలవడం ఆశ్చర్యకరం.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను కొనసాగించాల్సిన తరుణంలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ఎంతో కీలకమని గత టీడీపీ ప్రభుత్వం పేర్కొనగా, అదంతా డొల్ల అంటూ... ఆ భూసేకరణపై కీలక నిర్ణయం తీసుకోవాలని ప్రస్తుత పాలక పక్షం భావించింది. గతంలో భూసేకరణలో అంతులేని అక్రమాలు జరిగాయని ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు వెళ్లటం, ఆ పిమ్మట అమరావతి నిర్మాణానికి రుణాల విషయంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా వౌలిక సదుపాయాల బ్యాంకు తమ ప్రతిపాదనలు వెనక్కి తీసుకున్నాయి. ఈ పరిణామంతో కొత్త సర్కారు సందిగ్ధంలో పడింది. అమరావతిని సింగపూర్‌ను తలపించేలా చేస్తామన్న టీడీపీ సర్కారు కనీస వౌలిక సౌకర్యాలను కల్పించలేకపోయిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ విరుచుకుపడటం తెలిసిందే. మేం సింగపూర్, మలేషియాల సంస్కృతిని నెలకొల్పుతామని చెప్పడం లేదని, ఉన్న నిధులు, అవకాశాల ఆధారంగా అన్నీ సమకూరుతాయని, భయాందోళనలు ఎందుకని ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా పేర్కొంది. అమరావతిలో జరిగిందేమిటి? జరుగుతున్నదేమిటి? అనేది ముందుగా మనం చూడాల్సి ఉందని చెబుతూ వస్తోంది. దీంతోనే అనుమాన బీజం పడింది.
ప్రతిదీ అక్రమమేనంటూ దోపిడీ చిట్టా చాలా ఉందంటూ ప్రస్తుత అధికార పక్షం చెబుతోంది. అంతెందుకు అలనాటి టీడీపీ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నదే నిజమైతే ఈ రాజధాని ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ఆ పార్టీని ప్రజలు ఎందుకు ఓడించారో, జనం ఎంత విసిగిపోయారో తెలుస్తూనే ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ఎత్తిపొడుస్తున్నాయి. అక్కడ జరిగినవన్నీ అక్రమాలే అనేందుకు ఎన్నికల తీర్చే చెప్పకనే చెబుతోందనీ నొక్కివక్కాణిస్తున్నారు. అన్నీ తెలుస్తాయి, అక్రమమేదో, సక్రమమేదో బయల్పడే రోజులొస్తాయని పాలకపక్షం విశదీకరిస్తోంది. మరోవైపు ఏమీలేనిచోట మహాద్భుతం ఎలా సాధ్యం? అది మావల్లే జరిగిందంటూ.. అర్థం పర్థం లేని వాదనలతో అభివృద్ధిని ఆపాలా? అమరావతిని చంపేశారంటూ మాజీ సీఎం చంద్రబాబు విమర్శలు చేస్తుండటం గమనార్హం. రాజధానిలో నిర్మాణాలన్నీ ఆగిపోయాయని, తాపీ ఎత్తేవారే లేరని, వలస కూలీలు సైతం ఊర్లబాట పట్టారని ఇదే నిదర్శనమని ఆయన పేర్కొంటున్నారు. ఈ దశలో రాజధానిలో నిర్మాణాలు నిలిపివేయాలని తాము పేర్కొన లేదని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రకటించడం ఇక్కడ ప్రస్తావనార్హం. అనుమతులు తీసుకుని ఇప్పటిదాకా ప్రారంభించని పనులను మాత్రమే నిలిపివేశామని పాలకపక్ష నేతలు స్పష్టం చేస్తున్నారు.
కొత్త రాజధాని ఆవిష్కరణతోపాటు తమ ప్రాంతం అభివృద్ధిలో అందనంత ఎత్తుకు తీసుకెళుతుందని రాజధాని ప్రాంత రైతులు భారీగా భూసమీకరణకు తలూపారు. గత ప్రభుత్వానికి సహకరించారు. ఇదిలా ఉంటే... గత నెల రోజుల నుంచీ అమరావతి ప్రాంతంలో అంతులేని చర్చలు నడవడం చెప్పుకోదగింది. నిర్మాణాలపై ఇదమిత్థంగా కొత్త ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోలేక కాలయాపన చేస్తుండడంతో ఈ ప్రాంత రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అప్పట్లో ఆ ప్రభుత్వ హామీలు నమ్మి భూసేకరణకు సహకరించామని, ఇప్పుడు అమరావతి నిర్మాణాలపై అయోమయంతో తమ భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. పైగా గత ప్రభుత్వం చెప్పిన విధంగా ఈ ఏడాది జూన్‌లో ఇవ్వాల్సిన కౌలు డబ్బులు ఇంతవరకూ ముట్టలేదని రైతులు అనడం పరిగణించాల్సిన అంశమేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. అక్రమాలు, ఆరోపణల సంగతెలా ఉన్నా, భూములిచ్చిన తమ పరిస్థితి ఏంటన్నదే రైతుల వాదనగా ఉంది.
క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే.. ముఖ్యంగా అమరావతి పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో ప్రస్తుతం నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. నిన్నటిదాకా కొనసాగిన ప్రొక్లెయిన్లు, మిషన్ల రణగొణులు, వేలాది కార్మికుల అడుగుల సవ్వడులు ఇపుడు సన్నగిల్లాయి. ఓ మహోద్యమంలా సాగిన ఈ క్రతువు కనుమరుగవడం అందరినీ ఆలోచింపజేస్తోంది. ఎన్నో ఆశలతో ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టిన, పెట్టాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ అమరావతిపై వేచిచూసే ధోరణి అవలంబించడం ప్రత్యేకంగా చూడాల్సి ఉంది. రాజధాని పనులు ఆగిపోవడంతో కంకర వంటి సామాగ్రికి డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. వీటన్నిటికితోడు ఇసుక కొరత తలెత్తడం కూడా ఆజ్యంపోసినట్లయింది. ఇంకా కొన్ని ఉదాహరణలను పరికిస్తే... రాజధాని ప్రాంతంలోని పలుచోట్ల ఉన్న భారీ క్రషర్లు మూతపడ్డాయి. ఇక వీటిపై ఆధారపడిన కూలీలు విలవిల్లాడుతున్నారు. వలస వచ్చినవారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఉపాధి కరువై ప్రత్యామ్నాయ పనులు దొరక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నిర్మాణాలను నమ్ముకుని సంబంధిత పనుల కోసం పెట్టుబడులుపెట్టి రంగంలోకి దిగిన వ్యాపారులు సైతం- తాము తీసుకున్న రుణాలు, వాయిదాలు చెల్లించలేక సతమతవౌతున్నారు. అమరావతి ప్రాంత నిర్మాణ రంగంలో స్తబ్ధత ఏర్పడటంతో అనుబంధ రంగాల ఉత్పత్తుల విక్రయాలు, వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపడాన్ని పరిశీలకులు ప్రత్యేకిస్తున్నారు.
మరోవైపు రాజధాని ప్రాంతంలో విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. భూములిచ్చిన రైతులు మళ్లీ సాగువైపు పయనిస్తుండటం గమనార్హం. కొత్త ప్రభుత్వం నిర్మాణాలను నిలిపివేయడంతో దాదాపు 5,000 ఎకరాల్లో ఈ ఖరీఫ్ సీజన్‌లో తిరిగి సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇక ఇప్పట్లో నిర్మాణాలు సాగకపోవచ్చన్న భావనతో రైతులు ఈ పనికి పూనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలోని ఇంజనీరింగ్ కంపెనీలు తమ సాధన సంపత్తిని అంతా తమ వేరే సైట్లకు తరలించడం జరుగుతోంది. అమరావతి ప్రాజెక్టులను జల్లెడ పట్టి పూర్తిగా పరిశీలన చేశాక మళ్లీ నిర్మాణాలు పుంజుకోవాలంటే కనీసం కొన్ని నెలలైనా పట్టవచ్చని ఇక్కడ వినిపిస్తోంది. రైతులు మళ్లీ సాగుకు ఉపక్రమిస్తే ఇప్పుడేం చేయాలన్నది ప్రభుత్వానికి ఓ సమస్యగా పరిణమించే అవకాశముంది. రైతులను అనుమతించే విషయమై తర్జనభర్జన కొనసాగే వీలుంది. రాజధాని మార్పిడి... అలాగే రైతులకు భూములు తిరిగి ఇచ్చే అవకాశాలపై సీఎం జగన్ హామీఇచ్చినట్లు వదంతులు బాగా వ్యాప్తిచెంది ఉండటమూ పలు సందేహాలకు తావిస్తోంది. అమరావతిపై నెలకొన్న అనుమానాలు, సందిగ్థతలకు తెరపడాలని, అక్షర క్రమంలో అందనంత ఎత్తునే అధిరోహించాలని ప్రతి ఒక్కరి ఆశ. చీకట్లు తొలగి వెలుగులు చిమ్మాలని అందరి ఆకాంక్ష!

-చెన్నుపాటి రామారావు 99590 21483