సబ్ ఫీచర్

ఆ యస్వీఆర్.. ఈ యస్వీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కమాట-
ఒక్కమాటే -మహా సామ్రాజ్యాల
విధ్వంసానికి దారితీస్తుంది.
అదే మాట -మనిషికి తెలీని
మరో ప్రపంచ ఆవిష్కరణకూ దారితీస్తుంది.
మాటది -మహాబలం. బతుకును ఆకాశానికి ఎత్తాలన్నా, పాతాళానికి తొక్కాలన్నా మాటొక్కటి చాలు.
‘ఏం మాటలు రావా?’ అని గదమాయించాడు
మహానడుడు యస్వీఆర్. ఆకాశమంత ఆహార్యాన్ని, దిక్కుల ప్రతిధ్వనించే శబ్దాన్ని విని -బిక్కచచ్చిపోయాడు ఓ కుర్రాడు. యస్వీఆర్ మనసులో మారు ఉద్దేశాల్లేవు. కాని -కుర్రాడి మనసులో మరో ఉద్దేశం నాటుకుంది. ‘మాట’పడ్డాడు. ‘మాట’ పట్టుకున్నాడు. ‘మాట’ నిలబెట్టుకున్నాడు.
చివరకు -యస్వీఆర్ అనిపించుకున్నాడు.
ఆ యశ్వీర్ -యస్‌వి రంగారావు.
ఈ యశ్వీఆర్ -యస్‌వి రామారావు.
యస్వీఆర్ మాటతో యస్వీఆర్‌గా ఎదిగిన యస్వీ రామారావు ఈ వారం వెనె్నల అతిథి. అంతులేని సినిమా బాటపై మహా ప్రయాణం సాగిస్తూ -దాటొచ్చిన దారిలో గుర్తొచ్చిన కొన్ని జ్ఞాపకాలు
మనకోసం పంచారు. చదవండి.

మహావృక్షమైన మర్రి -సూక్ష్మ విత్తునుంచే పుడుతుంది. పుట్టుకొచ్చిన తరువు -ఆకాశంవైపు శాఖోపశాఖలవుతుంది. భూమిని మర్చిపోకూడదని చెప్పడానికి ఊడల్ని దించుతుంది. అలాంటివాడు -యస్వీ రామారావు. సినిమా ప్రపంచానికి సంబంధించి ఆయన ఆవరణ అందరికీ తెలిసినా -లోతెంత? అన్నది చాలా తక్కువమందికే తెలుసు. అందుకే -ఎప్పుడు ఏ సినిమా సమాచార అవసరమొచ్చినా.. ఏ సంక్లిష్ట అనుమానం తలెత్తినా -చెట్టునీడకే పరిగెడతారు తెలిసినోళ్లు. గత 50 ఏళ్ల సినిమా ప్రపంచంలోని మార్పు, ఓర్పు, నేర్పు.. ఎప్పుడేం జరిగింది? ఎవరేం చేశారు? ఇది ఎలా? అది అలాగట కదా? లాంటి ప్రశ్నలకు సమాధానం అక్కడే దొరుకుతుంది. ఇంతింతై వటుడింతైనట్టు సాగిన సినీ విజ్ఞాన విశారద ఎస్‌వి రామారావు.
ఆయన ప్రస్థానం చిన్నదేంకాదు.
***
1940లో ఏలూరులో జన్మించాడు ఎస్వీ రామారావు. ఆయనకు ఎనిమిదేళ్ల వయసులో -బాలరాజు సినిమా విడుదలైంది. తండ్రితోపాటు ఆ సినిమా చూశాడు. స్టేజి ఆర్టిస్టు అయిన తండ్రికి, మహానటుడు ఎస్‌వి రంగారావుకు పరిచయముంది. 1953లో విడుదలైన ‘బ్రతుకుతెరువు’ చిత్రం విడుదలైనప్పుడు ఆయన ఏలూరొచ్చారు. తండ్రితోపాటు ఆ మహానటుడని చూడ్డానికి వెళ్లాడు ఎస్‌వి రామారావు. ‘ఏం చదువుతున్నావ్’ అన్నారు ఎస్వీఆర్. ఎనిమిదేళ్ల ఆ కుర్రాడికి నోట మాట రాలేదు. ‘ఏం.. మాటలు రావా’ అన్నారాయన. ఆ ఒక్కమాట ఆ కుర్రాడిపై బలంగా పని చేసింది. ద్రోణాచార్యుడు అర్జునుడిని చెట్టుపై పిట్టను కొట్టమంటే, పిట్ట నేత్రానికే గురిపెట్టిన విలుకాడిలా ఒక్కోమాటా నేర్చుకుంటూ... ఆ తరువాత మాటల గనే అయ్యాడు ఎస్వీ రామారావు. ఎలాగైనా స్టేజి ఫియర్ పోగొట్టుకొని మంచి నటుడిని కావాలన్న కృతనిశ్చయం -ఎస్వీఆర్ మాటతోనే కలిగింది మనసులో. 1953లో ఆంధ్ర రాష్ట్రావతరణ సందర్భంగా ఓరోజు రాత్రికి రాత్రే ‘తారుమారు’ అనే నాటకంరాసి, మరునాడే స్నేహితులతో కలిసి ప్రదర్శించారు. ఊరి ఆసామిమెచ్చి ఓ గోల్డ్‌మెడల్ ఇచ్చాడు. అదే ఉత్సాహంతో దాదాపు 12నాటికలు, మూడు నాటకాలు రాసి ప్రదర్శించారు. కన్యాశుల్కం, వరవిక్రయం, పెళ్లి ట్రైనింగ్, వాపస్, హామ్లెట్ వంటి నాటకాలు అలా పుట్టినవే. వాటిని దాదాపు 200 ప్రదర్శనలిచ్చారు. వాటిల్లో అమరజ్యోతి, ఇదీ వరుస నాటికలకు ప్రభుత్వ అవార్డులు లభించాయి. ఏలూరు బాలానందం సంఘంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ విజయవాడ ఆలిండియా రేడియోలో ‘స్టెంటు శాస్ర్తీ’ నాటకాన్ని ప్రదర్శించారు. ఆ నాటకం టంగుటూరి సూర్యకుమారి ప్రసంశాప్రాతమైంది. అలా జాతీయ స్థాయిలోనూ అనేక నాటకాలాడారు ఎస్వీఆర్. బహుముఖీన ప్రతిభతో ఫిల్మ్ జర్నలిస్టుగా 1961లో వచ్చిన ‘బాటసారి’ చిత్రాన్ని చూసి బెంగుళూరునుంచి వచ్చే ప్రజామత పత్రికకు సమీక్ష రాశారు. ప్రచురితమైంది. ఆ ఉత్సాహంతో వందలాది వ్యాసాలు యువరక్తం, రత్నగర్భ, స్నేహలత, ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక, సితార, ఆంధ్రప్రదేశ్ వంటి పత్రికలకు రాశారు. ఇక వ్యక్తిగతంగా బిఏ పట్టా పుచ్చుకున్న ఆయన, 1962లో రిజిస్ట్రేషన్ శాఖలో గుమాస్తాగా ప్రవేశించి సబ్ రిజిస్ట్రార్‌గా పదవీ విరమణ చేశారు. మళ్లీ నటుడు ఎస్వీఆరే మరో మలుపు తిప్పారు. 1964లో విడుదలైన ‘నర్తనశాల’ చిత్రానికిగాను జకార్తాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడుగా అవార్డు పొందారు ఎస్వీఆర్. ఆ సందర్భంగా ఏలూరులో జరిగిన పౌరసన్మానంలో మన ఎస్వీఆర్ ఐదు నిమిషాల ప్రసంగాన్ని శ్రోతలు మంత్రముగ్ధులయ్యేలా చేశారు. ఇక అక్కడినుంచి ఆయన జీవితం మరోమలుపు తీసుకుంది. ఏ సినీ కార్యక్రమం జరిగినా వ్యాఖ్యాత ఆయనే. శతదినోత్సవాలనుంచి అనేక కార్యక్రమాలన్నింటికీ ముందువరుసలో ఉండి నడిపించడం ప్రారంభించారు. ఇదే ఉత్సాహంతో మిత్రుడు జయరామిరెడ్డి ప్రోత్సాహంతో నిర్మించిన ‘కలవారి కుటుంబం’ చిత్రానకి మాటల రచయితగా పరిశ్రమలో ప్రవేశించారు. ఆ చిత్రం పూర్తయి ఇప్పటికి 50 ఏళ్లు. జయమాలిని, మాధవి, మధుమాలిని, నరసింహరాజు ప్రధాన తారాగణంగా రూపొందించిన ‘త్రిలోక సుందరి’ చిత్రానికి కథను అందించారు. అత్తమెచ్చిన అల్లుడు చిత్రానికి స్క్రీన్‌ప్లే, ఈ ప్రశ్నకు బదులేది? సినిమాకు సహాయ దర్శకత్వం అందించారు. శుక్రవారం మహాలక్ష్మి చిత్రానికి కథ, మాటలు అందించారు. అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో ‘శ్రీరంగనీతులు’ చిత్రంలో నటించారు. పిచ్చిపంతులు, కాయ్ రాజా కాయ్, అత్తమెచ్చిన అల్లుడు, గూఢచారి 117, అభిసారిక, రావుగోపాలరావు తదితర చిత్రాల్లో ఆయా దర్శకుల ప్రోత్సాహంతో నటించారు. అనేక వందల చిత్రాల కథా చర్చల్లో పాల్గొన్నారు. 1998లో పదవీ విరమణ చేశాక తెలుగు తెర అనే గ్రంథాన్ని పరిశ్రమకు అందించారు. ఈ గ్రంథానికి నంది పురస్కారం లభించింది. మలిప్రయత్నంగా నాటి 101 చిత్రాలు (2006)లో గ్రంథానికీ నంది పురస్కారం లభించడం విశేషం. ఇదే ఉత్సాహంతో తెలుగు సినీ చరిత్రను విశే్లషిస్తూ అనేక గ్రంథాలను అందించారు. విజయగీతాలు, సినీగీత వైభవం, మూవీ ముచ్చట్లు, పాడనా తెలుగు పాట, అక్కినేని కథానాయికలు, అక్కినేని చిత్రాలలో సూక్తులు, సినారె సినీ సూక్తులు, కేరెక్టర్ ఆర్టిస్టులు, గ్రేట్ డైరెక్టర్స్, భక్తిచిత్ర మందారాలు, తెలుగు సినిమా చరిత్ర తదితర అమూల్య గ్రంథాలను పరిశ్రమకు అందించారు. ప్రముఖ నటులు గుమ్మడి, జమున, డివిఎస్ రాజు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, కళాదర్శకుడు కళాధర్‌ల జీవిత చరిత్రలకు రచనా సహకారం అందించారు. తెలుగు సినీ రచయితల సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా వ్యవహరిస్తూ అక్షరాంజలి అనే గ్రంథాన్ని అందించారు. సినీ చరిత్ర రచనాపరంగా ఇన్ని గ్రంథాలందించడం ఓ రికార్డు.
రచనా వ్యాసంగానికి సమాంతరంగా దూరదర్శన్, శ్రీవేంకటేశ్వరా భక్తి చానల్, సాక్షి, భక్తి టీవీ, ఎన్టీవీ, వనితా టీవీ, ఈటీవీలకు వందలాది సినిమా కార్యక్రమాలు రూపొందించి ఉత్తమ వ్యాఖ్యాతగా మరోసారి నందిని అందుకున్నారు. అనేక సినిమా టీవీ అవార్డుల కమిటీలో సభ్యులుగా పనిచేశారు. సినీ సంగీత కార్యక్రమాలకు తన గంభీర స్వరంతో సముచిత వ్యాఖ్యానం అందించడం ఆయనకొక హాబీ. సినీ గేయ రచయిత సినారె ఎస్వీఆర్‌ను ‘సినీ విజ్ఞాన విశారద’గా సంబోధించి సత్కరించి ఆశీర్వదించారు. హాసం క్లబ్ స్టేట్ కన్వీనర్‌గావుంటూ శతాధిక సినీ కార్యక్రమాలను నిర్వహించి అనేక సినీరంగ ప్రముఖులను సత్కరించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తారాయన. తన జీవితంలో గొప్ప సన్నివేశం ఏమిటీ అంటే, ఏఎన్నార్ ఇంట్లో ఓసారి దాసరితో కలిసి కథా చర్చల్లో పాల్గొనడం అంటారు. ‘ఏఎన్నార్ షూటింగ్ ముగించుకొని ఓ రోజు రాత్రి ఎప్పటికో వచ్చారు. అప్పటికి నేను నిద్రపోతున్నాను. ఏఎన్నాఆర్ నన్ను తట్టిలేపారు. భోజనం వడ్డించి మరీ తినమన్నారు. ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేని గొప్ప సంఘటన’ అంటూ గుర్తు చేసుకున్నారు ఎస్వీఆర్.
‘ఓసారి ‘అత్త మెచ్చిన అల్లుడు’ షూటింగ్ జరుగుతోంది. సహాయ దర్శకుడు క్లాప్ కొట్టగానే సైలెన్స్ అని అరవాలి. కానీ మైక్ పనిచేయకపోవడంతో ఎవరికీ వినపడలేదు. మైక్ లేకుండానే నేను ఒక్కసారిగా సైలెన్స్ అని అరిచాను. సెట్‌లోవున్న అలనాటి నటి భానుమతి ఆశ్చర్యపోయారు. ‘ఏమయ్యో! రామనాధ శాస్ర్తీ’ అంటూ సంబోధించారు. తరువాత నేను అలా అన్నారేంటి అని అడిగాను. మా చిన్నతనంలో నాటకాల్లో నారదుడిగా నటించేవారు కపిలవాయి రామనాధశాస్ర్తీ. ఆయన గొంతెత్తి పాడితే ఆ శబ్దం మైలుదూరం వినిపించేది. ఆయన్ని గుర్తుచేశావు అంటూ మెచ్చుకోవడం మరో మనసుకు నచ్చే సన్నివేశం’ అంటారాయన.
అక్కినేని నాగేశ్వరరావు చేతులమీదుగా కినె్నర పురస్కారంగా స్వర్ణకంకణం అందుకోవడం తన జీవితంలో మరపురాని సువర్ణ ఘట్టమని చెబుతారాయన. ముగ్గురు ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి వారి చేతులమీదుగా పురస్కారాలు అందుకోవడం మరింత ఆనందదాయకమని గుర్తు చేసుకున్నారు రామారావు. తాను రాసిన అనేక నాటికలను సినీ దిగ్గజాలు కెవి రెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, సి నారాయణరెడ్డి, గుమ్మడివంటి వారికి అంకితం ఇవ్వడం ఆనందదాయకమైన విషయమంటారాయన.
జీవితంలో ఏ దిశగా పయనించాలనుకున్నారో అదే దిశలో పయనిస్తూ దొరికిన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ తన ప్రతిభను చాటుకుంటూ.. ఇది అది అనక ఏదైనా సరే చేయడానికి మేటిని అంటూ ఇప్పటికీ సాగుతున్నారు సినీ విజ్ఞాన విశారద ఎస్వీ రామారావు.

-సరయు శేఖర్, 9676247000