సబ్ ఫీచర్

కృష్ణం వందే జగద్గురుం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో పది ప్రధానమైనవి కాగా, వాటిలో శ్రీకృష్ణుని అవతారం పరిపూర్ణావతారమని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ బహుళ అష్టమి రోజున, రోహిణీ నక్షత్రాన శ్రీకృష్ణుడు జన్మించినట్లు పేర్కొంటున్నాయి. ఈ రోజును కృష్ణాష్టమిగా, గోకులాష్టమిగా, జన్మాష్టమిగా వ్యవహరిస్తారు. శ్రీకృష్ణావతారం దశావతారాల్లో ఎనిమిదవదికాగా, ఆయన పుట్టిన తిథికూడా ఎనిమిది కావటం, దేవకీ వసుదేవల అష్టమ గర్భంలో ఆయన జన్మించడం, ఆయనకు ఎనిమిదిమంది భార్యలు ఉండడం, ఇలా శ్రీకృష్ణుని గాథలో ఎనిమిదవ సంఖ్యకు ప్రాధాన్యం ఎంతో వుంది.
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగదుర్గుమ్
ఆదిశంకరాచార్యులు శ్రీకృష్ణుని జగదుర్గువుగా కీర్తిస్తూ కృష్ణాష్టకాన్ని విరచించారు. అద్వైతాన్ని స్థాపించిన ఆదిశంకరాచార్యులు, విశిష్టాద్వైతాన్ని బోధించిన రామానుజాచార్యులు, ద్వైతాన్ని ప్రతిపాదించిన మధ్వాచార్యులు సహా ఎందరో ఆధ్యాత్మిక గురువులు గీతాచార్యుడైన శ్రీకృష్ణుడిని జగద్గురువుగా తలచి కొలచి తరించారు. శ్రీకృష్ణుని పుట్టుక నుంచి నిర్యాణం వరకు ఆసాంతం ఆయన జీవితమంతా ఒక మహాప్రబోధం. మేనమామ కంసుని నుంచి మొదలుకొని దుర్యోధనాదులను వధింపజేయడం వరకూ ఆయన సాగించినదంతా దుష్టశిక్షణ. అది శిష్టులైన పాండవుల కోసమే. కలియుగంలో ధర్మం పూర్తిగా వినాశనం కాకుండా ఎన్ని ప్రబోధాలు అవసరమో అన్నింటినీ ఈ దేవదేవుడు మనకు అందించాడు. మరణం లేని మహాశక్తి స్వరూపం ఆ దేవ దేవునిది. భావగతంలోని దశమ స్కంధం శ్రీకృష్ణలీలల సమాహారం అని చెప్పవచ్చు. ధర్మసంస్థాపనకు ఉద్భవించానని చెప్పిన కృష్ణ భగవానుడు మానవ జీవితానికి దిశా నిర్దేశం చేస్తూ భగవద్గీతని ప్రబోధించాడు. గీతాచార్యునిగా పూజలందుకుంటున్నాడు. నారద ముని నుంచి ప్రేరణ పొందిన వేదవ్యాసుడు భక్తిరస ప్రధానమైన శ్రీకృష్ణచరిత్రను ‘్భగవత పురాణం’గా రచించారు. అది భక్తి జ్ఞాన, వైరాగ్యాల సమ్మేళనం. పురాణాలన్నింటిలోకీ శ్రేష్ఠమైనదీ పరమ పవిత్రమైన భాగవతం. హైందవ పురాణ పురుషుల్లా శ్రీకృష్ణుడంతటి గొప్ప వ్యక్తి మరొకరు వుండరు. ఆయనకు ఆయనే సాటి. ఇప్పటికీ ప్రజాపాలకులనబడే వారందరికీ ఆయన ప్రబోధించిన ధర్మమార్గమే శిరోధార్యం. అదే దుష్టశిక్షణ- శిష్టరక్షణ. శ్రీకృష్ణుడు తానే పరమాత్మనని కురుక్షేత్ర సంగ్రామ వేళ అస్త్ర సన్యాసం చేసిన అర్జునునికి ‘్భగవద్గీత’ను ఉపదేశిస్తూ పేర్కొన్నాడు. అంతటితో ఆగక, ప్రత్యక్ష సాక్ష్యాధారంగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. శ్రీమహావిష్ణువే శ్రీకృష్ణుడని, కాబట్టి కృష్ణతత్వమంటే పరమాత్మ తత్వమని వేరే చెప్పక్కర్లేదు. దశావతారాల పరమార్థం కూడా ఇదే. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామ వేళ ఉద్భవించిన శ్రీకృష్ణుని ‘్భగవద్గీత’ మహాప్రవచనం మరో సందేశం. కర్తవ్యం నుంచి దూరంగా జరిగే మనిషి ఏ సమయంలో బోధ చేస్తే వింటాడో పరమాత్మకు తెలుసు. కర్తవ్యం విడిచి వెడితే జాతి క్షమించదన్నాడు. కర్మాచరణమే నిజమైన సన్యాసమని తెలిపాడు.
శ్రీకృష్ణుని లీలలు
ఏ అవతారంలోనూ కనిపించని ఎన్నో ప్రత్యేకతలు కృష్ణావతారంలో కన్పిస్తాయి. ధర్మాధర్మాలకు అతీతమైన భూమికలో జీవితాన్ని గడుపుతూ ధర్మసంస్థాపన చేయడం. సర్వం తెలిసినవాడైనా ఏమీ తెలియనివాడిలా లీలా మానుష విగ్రహుడిగా తన లీలలతో జగన్నాటకాన్ని నడపడం. బాలకృష్ణుడిగా చిలిపి చేష్టలతో అందరి హృదయాలలో చిరస్థాయిగా ఆత్మీయుడిగా నిలిచిపోవడం, ‘మన్ను తిన్నావా?’ అని అడిగిన యశోదమ్మకు నోటిలోనే పదునాలుగు భువనాలను చూపిస్తూ తల్లికి ఆత్మబోధ చేశాడు. ‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ’ అనే భగవద్గీతా శ్లోకానికి పరమాత్మ అప్పుడే ఆచరణాత్మకంగా అర్థాన్ని ప్రకటించాడు. గోవర్థన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తి పట్టుకోవడం, పరమాత్మ పిలుపునందుకున్న వారంతా గోవర్థన పర్వత ఛాయలో చేరుకోవడం నిజంగా ఆశ్చర్యమే. కంసుడిని మేనమామ అని చూడకుండా వధించి లోక సంరక్షణ విషయంలో బంధుత్వాలు పనికిరావని బోధించాడు. శకటాసుర, తృణావర్త తదితర రాక్షససంహారం, కాళీయ మర్థనం, శిశుపాల దంతవక్త్రుల సంహారం- ఇలా ప్రతి ఘట్టంలోనూ దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేశాడు పరమాత్మ. నిండుగా నీళ్లతో పారుతూ అలనాటి కృష్ణుని రాసక్రీడలకు సాక్షిగా దర్శనమిస్తుంది యమునానది. మధుర భక్తికి మూలం రాధాదేవి. ఒకప్రక్క వెన్నదొంగగా గోపెమ్మలను ఆరడి పెడతాడు, ఇంకొక పక్క చీరలు దొంగిలించి గోపికలకు తత్వోపదేశం కావిస్తాడు. ఇలా ఎన్నో వింతలు! ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తూనే వుంటుంది. అదే ఆ చిన్నికృష్ణునిలోని మహిమ. కృష్ణా! ముకుందా! మురారి! జయగోవిందా! బృందావిహారి! అంటూ ప్రేమతో ధ్యానిస్తే, కీర్తిస్తే ఆ జగద్గురువు అనుగ్రహం వెంటనే లభ్యవౌతుంది. అందుకు మధుర భక్తిమార్గాన్ని ఎంచుకుని ఆరాధించటానికి కృష్ణాష్టమే మంచి రోజు.
బృందావనం వేదికగా
శ్రీకృష్ణ్భగవానుని బాల్యక్రీడలకు, లీలా విన్యాసాలకు వేదిక బృందావనం. రాధాకృష్ణుల మధుర ప్రేమకు, రసరమ్య రాసక్రీడకు సాక్ష్యమిస్తుంది. స్థానికులు వృందావనం అంటారు. తులసికి వృంద అనే పేరుంది. గోకులం ఎంచుకుని నివసించిన ప్రాంతం కాబట్టి వ్రజభూమి అన్నారు. బృందావనం యమునా నది తీరంలో వుంది. ఇక్కడే యమునా తీరంలో 32 స్నాన ఘట్టాలున్నాయి. ఇక్కడే ప్రతీ స్నానఘట్టం శ్రీకృష్ణ నగవానుని బాల్య క్రీడలలో ముడివడి అత్యంత పవిత్రమైనదని భావించి ఇక్కడ భక్తులు స్నానం చేస్తారు. శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది రాణులున్నారు. రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజిత, భద్రమనువు, లక్షణ- వారంతా శ్రీకృష్ణుని కోసం తపించి ఆయన్ను భర్తగా పొందారు. స్వపర భేదాలు లేని ధర్మమూర్తి, యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు. కర్మను ఈశ్వరార్పణంగా ఆచరించడమే సిద్ధికి హేతువనేది భగవద్గీత సారం. శ్రీకృష్ణపరమాత్మ చూపించింది లీలలు మాత్రమే కాదు అందించిన కర్తవ్య బోధ అవశ్యం అనుసరణీయం.
కరార విందేన పదార విందం
ముఖారవిందేన విని వేశ యంతు
వటస్య పుత్రస్య పుటేశయానం
బాలం ముకుందం మనసా స్మరామి
చేతితో పాదాన్ని నోట్లో పెట్టుకుని, రావి ఆకు దొప్పలో పడుకుని వున్న బాలకృష్ణుని మనసారా స్మరిస్తున్నాను. లీలాశుకుడు రచించిన శ్రీకృష్ణకర్ణామృతంలో బాల ముకుందాష్టకం తొలి శ్లోకమిది.
ధర్మ సంస్థాపన కొరకు
లోకంలో అధర్మం ప్రబలినపుడు దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి ప్రతియుగంలోనూ అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ద్వాపర యుగంలో అధర్మం పెచ్చుమీరినకాలంలో బ్రహ్మదేవుడు, భూదేవి ప్రార్థించగా, శ్రీమహావిష్ణువు దేవకీ వసుదేవుకు జన్మించ సంకల్పించాడు. అపుడు మధురానగరాన్ని శూరసేన మహారాజు పరిపాలించేవాడు. వసుదేవుడు ఆయన కొడుకు. వసుదేవుడికి యుక్తవయస్సురావడంతో ఉగ్రసేన మహారాజు కూతురు దేవకీదేవితో వివాహం జరిపిస్తారు. చెల్లెలు దేవకీదేవిని అత్తవారింట దిగబెట్టేందుకు కంసుడు స్వయంగా రథం నడుపుతాడు. రథం తోవలో ఉండగానే ‘దేవకీదేవి అష్టమ గర్భాన పుట్టిన కొడుకు చేతిలో కంసుడి చావు తప్పదు’ అని అశరీరవాణి హెచ్చరిక వినిపిస్తుంది. ఆ హెచ్చరికతో ఆగ్రహించిన కంసుడు దేవకీదేవిని, వసుదేవుడిని, అడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేనుడిని కూడా చెరసాలలో పెడతాడు. చెరసాలలో దేవకీదేవికి జన్మించిన ఆరుగురు శిశువులను కంసుడు దారుణంగా చంపేస్తాడు. దేవకీదేవి ఏడవసారి గర్భం ధరించినపుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. ఈ గర్భంవల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భస్రావం జరిగిందని అనుకుంటారు. కొన్నాళ్లకు దేవకీదేవి ఎనిమిదోసారి గర్భం ధరిస్తుంది. శ్రావణ బహుళ అష్టమినాడు అర్థరాత్రివేళ రోహిణి నక్షత్రమున్న సమయంలో శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన జన్మిస్తాడు. వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్ళలో పెట్టుకుని చెరసాల బయట నిద్రిస్తున్న కావలి భటులను తప్పించుకుని యమున నది వైపు బయలుదేరుతాడు. యమునా నది రెండుగా చీలి వసుదేవుడికి దారినిస్తుంది. వ్రేపల్లెలోని తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళతాడు. నందుడి భార్య యశోద ప్రక్కన శిశువుని విడిచి ఆమె ప్రక్క నిద్రిస్తున్న శిశువుని ఎత్తుకుని తిరిగి చెరసాలకు చేరుకుంటాడు. చెరసాలకు రాగానే ఆ శిశువు ఏడుస్తుంది. కంసుడు హుటాహుటిన చెరసాలకు చేరుకుంటాడు. శిశువుని చంపడానికి పైకి విసిరి కొడతాడు. అయితే ఆ శిశువు ఆకాశమార్గాన కెగసి, తాను యోగమాయనని, కంసుడిని చంపేవాడు వేరేచోట పెరుగుతున్నాడని చెప్పి అదృశ్యమవుతుంది. దేవకి గర్భాన పుట్టినవాడు ఎక్కడ వున్నా వెతికి వాడిని చంపాలంటూ తన వద్దనున్న రాక్షసులను పురమాయిస్తాడు. గోకులానికి వచ్చిన పూతనను, శకటాసురుడిని మొదలగువారిని బాల్యంలోనే చంపేశాడు. చెడ్డవారిని దండించి మంచివారిని కాపాడి ధర్మాన్ని నిలబెట్టడమే నా పని- రాజ్యాలు పాలించటం కాదు అని కృష్ణుడు ప్రకటించాడు. ఆ తర్వాత మహాభారత యుద్దం జరిగింది. శ్రీకృష్ణపరమాత్మ ధర్మపరులైన పాండవులకు సహాయంగా ఉండి చెడ్డవారందరినీ శిక్షించాడు.
‘‘పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే’’

- కె.రామ్మోహన్‌రావు 9441435912