సబ్ ఫీచర్

మరో తియన్మాన్ స్క్వేర్.. హాంకాంగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచమంతటా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. ప్రజలు దానే్న కోరుకుంటున్నారు. అయితే, చైనా కమ్యూనిస్టులు మాత్రం నియంతృత్వ పోకడలను వదులుకోవడం లేదు. తన మార్క్ కమ్యూనిజాన్ని కాపాడుకునేందుకు చైనా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇచ్చిన ‘మాట’ను తప్పుతోంది. హాంకాంగ్‌పై మరింత ‘ఉచ్చు’ బిగించేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు నిదర్శనం. 1997లో బ్రిటీషు పాలన నుంచి చైనాకు దఖలుపడిన హాంకాంగ్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని 50 ఏళ్ళపాటు కొనసాగిస్తామని చేసిన వాగ్దానాన్ని క్రమంగా తుంగలో తొక్కేందుకు, తన ఉక్కు పాదాన్ని మోపేందుకు, కమ్యూనిస్టు డ్రాగన్ బుసలు కొడుతోంది. అందులో భాగమే- ‘నేరస్తుల అప్పగింత’ బిల్లు. హాంకాంగ్‌పై కమ్యూనిజం పట్టును పెంచేందుకు, స్వేచ్ఛపై నియంతృత్వ పాదాన్ని మోపేందుకు చైనా ప్రయత్నిస్తోంది.
హాంకాంగ్‌లో నేరం చేసిన వారిని అక్కడి చట్టాల ప్రకారం విచారించి, శిక్షించాలి తప్ప- వారిని చైనాకు అప్పగిస్తే అక్కడ కమ్యూనిస్టు నియంతృత్వ చట్టాల ప్రకారం తూతూ మంత్రం విచారణ జరిపించి శిక్షలు వేయడం.. వినడానికే విడ్డూరంగా ఉంది. చైనా పాలకులకు మాత్రం అది పరమపవిత్ర కర్తవ్యంగా కనిపిస్తోంది. ప్రపంచ పోకడకు, కమ్యూనిస్టు భావజాలాన్ని విశ్వసించేవారికి గల వ్యత్యాసం ఎలా ఉంటుందో ఈ విషయం స్పష్టంగా వెల్లడిస్తోంది. ‘ఒక దేశం-రెండు వ్యవస్థల’ని గొప్పలుపోయే చైనా పాలకులలో చివరకు ‘ఒక దేశం ఒకే వ్యవస్థ’గా మార్చేందుకు ప్రయత్నిస్తున్న ‘దృశ్యం’ స్పష్టంగా కనిపిస్తోంది.
చైనాలో ప్రజాస్వామ్య, స్వేచ్ఛాయుత పరిస్థితిని కల్పించాలని హాంకాంగ్ అప్పగింతకుముందే అంటే- 1989లో బీజింగ్‌లోని తియన్మాన్ స్క్వేర్‌లో ఆ దేశ విద్యార్థులు, యువకులు, మేధావులు, ప్రజాస్వామ్య ప్రియులు శాంతియుతంగా పెద్దఎత్తున ఉద్యమిస్తే నిర్దాక్షిణ్యంగా సైనిక బలగాలతో, ట్యాంకులతో ఉద్యమకారుల్ని తొక్కించి వేల మంది యువతీ యువకుల్ని పొట్టనపెట్టుకున్న సంగతి ఎవరూ మరిచిపోలేదు. ఆ సంఘటనను ఇటీవలే అటు చైనా, ఇటు హాంకాంగ్‌లో ఘనంగా స్మరించుకున్నారు. మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఆ ఘటనను భారమైన హృదయాలతో తలచుకున్నారు. ప్రజాస్వామ్య భావాలను గౌరవించాల్సిందేనని నినదించారు. తియన్మాన్ స్క్వేర్ అమరులకు నివాళులర్పించి వారి ‘కల’ను సాకారం చేస్తామని కొందరు ‘ప్రతిజ్ఞ’చేశారు.
ఈ నేపథ్యంలోనే ‘నేరస్తుల అప్పగింత బిల్లు’ను చైనా పాలకులు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించడంతో హాంకాంగ్‌లో అగ్గిరాజుకుంది. శాంతియుతంగా అభివృద్ధిపైనే మనసుపెట్టి పురోగమించేవారిగా గుర్తింపు పొందిన హాంకాంగ్ ప్రజలు తొలుత శాంతియుతంగా ప్రదర్శనలు, నిరసనలు తెలిపారు. ప్రపంచంలో ఇటీవలి కాలంలో మరెక్కడా ఇంత పెద్దఎత్తున పాల్గొనని రీతిలో ప్రజలు వీధుల్లోకొచ్చి నిరసన గళాలను వినిపించారు. ‘నేల ఈనిందా..?’ అన్నట్టు మిలియన్లకొద్దీ ప్రజలు వీధుల్లోని ప్రతి అంగుళంలో తమ ఆగ్రహాన్ని నమోదుచేసినా చైనా దిగిరాక పోవడంతో ఇప్పుడు ఆ ఉద్యమం హింసాత్మకరూపం తీసుకుంది. తియన్మాన్ స్క్వేర్‌లో సైనికులతో, ట్యాంకులతో ఉద్యమాన్ని తుడిచిపెట్టేసినట్టు హాంకాంగ్ ఉద్యమాన్ని సైతం తమ సైనిక బలంతో అణచివేసేందుకు చైనా పావులు కదుపుతోందని వార్తలు వెలువడుతున్నాయి. హాంకాంగ్ సరిహద్దుల్లో చైనా భారీగా సైన్యాన్ని మోహరించింది. ఏ క్షణంలో ఏం జరగనున్నదో తెలియని ఉత్కంఠ ఏర్పడింది. ఈ పరిణామాలకు భయపడేది లేదని హాంకాంగ్ ప్రజలు తెగేసి చెబుతున్నారు. హాంకాంగ్ విమానాశ్రయంలోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్ళి అక్కడ అన్ని కార్యకలాపాలను స్తంభింపజేశారు. ఇది చైనా ఊహించని పరిణామం. ఇంకా మరిన్ని అనూహ్య పరిణామాలూ జరిగాయి. ఇది ఆందోళనకారుల బలాన్ని, శక్తిని, ఐక్యతను చాటుతోంది. ‘స్వయం ప్రతిపత్తి కోసం ప్రాణాలైనా ఇస్తాం’ అన్న తెగువను చాటుతోంది.
కేవలం నేరస్తుల అప్పగింత బిల్లు ఉపసంహరణే గాక తమ సమ్మతి లేకుండా నియమితులైన హాంకాంగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఈఓ) క్యారీలామ్‌ను సైతం తొలగించాలన్న కీలక డిమాండ్‌ను ఆందోళనకారులు ముందుకు తీసుకొచ్చారు. దీంతో సమస్య మరింత జటిలమైంది. ఆందోళన స్థాయి పెరిగింది. స్వేచ్ఛా-స్వాతంత్య్ర భావనలు మరింత ముందుకొచ్చాయి. స్వయం ప్రతిపత్తి అంశం ప్రాణప్రదమైంది. వర్తమాన ప్రపంచ పరిస్థితులకు అనుగుణమైన ఆకాంక్ష బలంగా వెల్లడవుతోంది. ఈ ఆకాంక్షను ఉడుకు యువతీయువకులే కాదు పిల్లాజెల్లా, ముసలి ముతక అందరూ వ్యక్తం చేయడం విశేషం. గత కొన్ని దశాబ్దాల్లో ఇంతటి ప్రజాచైతన్యం, వయోభేదం లేకుండా అన్ని తరగతుల వారు వీధుల్లోకొచ్చి అవసరమైతే పెట్రోలు బాంబులు విసిరి తమ నిరసనను వ్యక్తపరచడానికి వెనకాడకపోవడం ఒక్క హాంకాంగ్‌లోనే కనిపిస్తోంది. ఎంతో సౌకర్యవంతమైన జీవితాన్ని, ఆదాయాల్ని, సౌఖ్యాలను అన్నింటినీ వదిలేసుకుని, స్వేచ్ఛ, స్వాతంత్య్రం కన్నా అవి ముఖ్యం కాదన్న తెలివిడితో వాళ్ళు పోరాటపంథా ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సత్యం, న్యాయం, ధర్మం, స్వేచ్ఛకోసం తపించే వారికిది గర్వ సూచకంగా నిలుస్తోంది.
చైనాపై అమెరికా వాణిజ్య యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చైనాకు గట్టి దెబ్బగానే భావించాలి. చైనాకు చెందిన ప్రముఖ వాణిజ్య- వ్యాపార సంస్థల మనుగడ పూర్తిగా హాంకాంగ్‌పై ఆధారపడి ఉందన్న సంగతి విస్మరించరాదు. అక్కడి స్టాక్ ఎక్స్ఛ్‌ంజిలో జరిగే లావాదేవీలు - వ్యాపారం చాలా కీలకం, అక్కడి ఓడరేవుల్లోకి వచ్చే సరుకులు అసంఖ్యాకం. వీటి కదలిక లేకపోతే ఎంత నష్టం.. ఎంత కష్టం? కీలక వ్యాపార లావాదేవీలపై ఉద్యమ ప్రభావం బలంగా పడింది. అయినా చైనా తన మొండివైఖరిని వీడటం లేదు. ఇచ్చిన మాటను గౌరవించకుండా, మరో 50 ఏళ్ళు స్వయంప్రతిపత్తి ఉంటుందన్న విషయాన్ని బేఖాతరు చేస్తూ నేరస్తుల అప్పగింతపై ఇంత మొండి పట్టుపట్టడం మూర్ఖత్వంగాక ఏమవుతుంది?
తమ నియంతృత్వం, ఏకపార్టీ పాలన ఎంత విస్తృతమైతే అంతగా సంతోషపడే మనస్తత్వంతో ఖండాలు దాటి చైనా తన పంజా విసురుతోంది. కాని ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ, స్వాతంత్య్ర భావనలు చిక్కబడుతున్నాయన్న సంగతిని విస్మరిస్తోంది. తన రాజధాని బీజింగ్‌లోనే తియన్మాన్ స్క్వేర్‌లో మావో చిత్రపటం ముందే- స్వేచ్ఛా సంగీతం వినిపించగా ఆ గీతం ప్రతిధ్వని ఇప్పుడు హాంకాంగ్‌లో మరికొన్నిచోట్ల వినబడుతోందన్న ఎరుక లేకుండా ఎదురుదాడికి సిద్ధమై, సైనిక ట్యాంకులను దింపి ఆందోళనకారులపైనుంచి నడిపిస్తే నియంతృత్వం కలకాలం వర్ధిల్లుతుందని కమ్యూనిస్టులు భావించడం విడ్డూరం. హాంకాంగ్ ప్రజల ఉద్యమాన్ని ‘పశుబలం’తో అణచివేసినా ఆ స్వేచ్ఛ్భావనను, స్వాతంత్య్ర కాంక్షను, కమ్యూనిజానికి దూరంగా జీవించాలన్న హాంకాంగ్ ప్రజల ఆకాంక్షను ఎన్నటికీ ఆర్పివేయలేరు. వారి ‘కామన’ కమ్యూనిజాని కన్నా ఎంతోగొప్పది. రాబోయే నవ వసంతానికది చిహ్నం. ఆ చిహ్నాన్ని చిదిమేయాలనుకున్నవారే చితికిపోతారు తప్ప హాంకాంగ్ ప్రజల ‘కామన’ కలకాలం వర్ధిల్లుతుంది. అందులో ఇసుమంత అనుమానం అక్కర్లేదు.

-వుప్పల నరసింహం 99857 81799