సబ్ ఫీచర్

అగ్రరాజ్యాలా? ‘వ్యర్థ’రాజ్యాలా??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ జనాభాలో అమెరికా జనాభా 4 శాతమే. కాని ప్రపంచంలోని ప్రకృతి వనరులను 40 శాతం ఒక్క అమెరికాయే కొల్లగొడుతోంది. అంతగా భోగలాలసతకు ఆ దేశ ప్రజలు అలవాటుపడిపోయారన్నమాట. మార్కెట్ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోడానికి భారీ ఎత్తున వినియోగ వస్తువులను ఉత్పత్తిచేసేందుకు- అడ్డూఅదుపూ లేకుండా ప్రకృతి వనరులను అమెరికా కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. అదే అమెరికా వ్యర్థపదార్థాలను ప్రపంచ వ్యాప్తంగా ‘డంప్’ చెయ్యడంలోనూ అందరికన్నా ముందున్నదన్న విషయం తాజా అధ్యయనాలు వెల్లడిచేస్తున్నాయి.
న్యూయార్క్‌కు చెందిన పర్యావరణ విశే్లషకుడు నియాల్ స్మిత్ జరిపిన అధ్యయనం ఎన్నో దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడిస్తున్నాయి. ఈయన అధ్యయన వివరాలను బ్రిటన్‌కి చెందిన ‘వెరిస్క్ మాపుల్ క్రాప్ట్’ అనే పరిశోధక సంస్థ ప్రచురించింది. ‘గ్లోబల్ రిస్క్ డేటా, కంట్రీ రిస్క్ అనాలిసిస్’లకు సంబంధించి విశేష అధ్యయనం చెయ్యడం ఈ సంస్థ ప్రత్యేకత.
ప్రపంచ జనాభాలో కేవలం 4 శాతమే ఉన్న అమెరికా 12 శాతం వ్యర్థ పదార్థాలను ఉత్పత్తిచేస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యర్థపదార్థాల సగటు ఉత్పత్తికంటే మూడు రెట్లు ఎక్కువ. స్టార్ బక్, మెక్ డోనాల్డ్, కోకా-కోలా వంటి బహుళ జాతి సంస్థల ద్వారా గ్లోబలైజేషన్ పేరుతో ప్రపంచమంతటా విస్తరించి పెద్దఎత్తున వినియోగ వస్తువులను ఉత్పత్తిచేస్తున్న అమెరికా తత్ఫలితంగా ఉత్పన్నమవుతున్న వ్యర్థ పదార్థాలను 35 శాతం మాత్రమే రీ సైక్లింగ్ చేస్తోంది. ప్రతి అమెరికా పౌరుడి వల్ల ఏడాదికి సగటున 773 కేజీల వ్యర్థ పదార్థాలు ఉత్పత్తవుతున్నాయి. ఇది ఒక చైనా పౌరుడి వల్ల ఉత్పత్తి అయిన వ్యర్థాల కన్నా మూడు రెట్లు ఎక్కువ. ఇక భారతదేశంలోని పట్టణాలలో ఉత్పత్తిఅయ్యే వ్యర్థాలకన్నా అమెరికా పట్టణాలలో ఉత్పత్తిఅయ్యే వ్యర్థాలే ఎక్కువ.
వ్యర్థ పదార్థాల నిర్వహణ పట్ల అమెరికా ఒక్కటే కాదు, ఇంగ్లాండ్, కెనడా, జర్మనీ, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా వంటి పారిశ్రామిక దేశాలు కూడా పెద్దఎత్తున నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలే భూగోళంపై భారీగా వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడానికి ప్రధాన కారణం. ఇక ప్లాస్టిక్ వ్యర్థాల విషయానికి వస్తే ఆసియా దేశాలే ప్రధాన బలిపశువులు అవుతున్నాయి. ఆసియా దేశాల సముద్ర తీర ప్రాంతాలలో కుప్పలు తెప్పలుగా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు పెద్దఎత్తున తమ వ్యర్థ పదార్థాలను నౌకల్లో తరలించి ఆసియా దేశాలలో డంప్ చేస్తున్నాయి. వీటిని రీ సైక్లింగ్ కోసం తరలిస్తున్నామని అభివృద్ధి చెందిన దేశాలు చెప్తున్నా అటువంటిదేమీ జరగడమే లేదు. అంటే బడా దేశాలు తమ వ్యర్థాలను చాలా సులభంగా వదిలించుకుంటున్నాయన్నమాట!
ప్లాస్టిక్ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేయడానికి పారిశ్రామిక దేశాలలో తగినంత వ్యవస్థ లేదు. అందుకనే ఆ దేశాలు తమ ప్లాస్టిక్ వ్యర్థాలను ఆసియా దేశాలలో డంప్ చేసి వదిలించుకుంటున్నాయి. ఇలా వదిలించుకుంటున్నప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలతోపాటు మరికొన్ని ఇతర వ్యర్థాలను కూడా కలిపి డంప్ చేయడం జరుగుతోంది. డంప్ చేస్తున్న వ్యర్థాలను రీ సైక్లింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది. డంప్ చేసే వ్యర్థాల వల్ల ఏర్పడే సమస్యలను గుర్తించి ఇప్పటికే చైనా ‘్ఫరిన్ వేస్ట్ బ్యాన్’ చట్టాన్ని చేసింది. థాయిలాండ్, వియత్నాం, మలేషియా దేశాలు కూడా అగ్రరాజ్యాలు డంప్ చేస్తున్న వ్యర్థాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో తమ వ్యర్థాలను డంప్ చేయడానికి పారిశ్రామిక దేశాలు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు చూస్తున్నాయి. 2013-14 సంవత్సరాలలో కెనడా 100 కంటైనర్లలో పారిశ్రామిక వ్యర్థాలను నౌకలలో తీసుకెళ్ళి ఫిలిప్పీన్స్ వద్ద డంప్ చేసింది. ఇది ఆ రెండు దేశాల మధ్య పెద్ద వివాదానికి దారితీసింది. ఆ కంటైనర్లు వెనక్కి వెళ్ళకపోతే కెనడాపై ఆయుధాలతో దాడి చేస్తామని ఫిలిప్పీన్స్ బెదిరించింది కూడా. ‘వెరిస్క్ మాపుల్ క్రాఫ్ట్’ సంస్థలో పర్యావరణ విభాగానికి అధిపతి అయిన విల్ నికోల్స్ మాట్లాడుతూ -‘‘అగ్రరాజ్యాలు తమ పారిశ్రామిక వ్యర్థాలను డంప్ చేయడానికి అనుమతించడం పట్ల ఆసియా దేశాలు చెప్తున్న కారణాలు సమంజసంగా అనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలికంగా చూస్తే ఇది దుష్ఫరిణామాలనే ఇస్తుంది. పెద్దపెద్ద పడవలలో సముద్ర మార్గాం ద్వారా వ్యర్థపదార్థాలను తరలిస్తున్నప్పుడు సముద్ర మార్గం కలుషితమయ్యే ప్రమాదం ఉంది. పడవలు వెళ్ళే మార్గంలో సముద్రంలో పడిన వ్యర్థపదార్థాలను వెలికితీసి రీ సైక్లింగ్ చేయడం దాదాపు అసాధ్యం. మరోపక్క అగ్రరాజ్యాలు రీ సైక్లింగ్ చెయ్యడానికి వీలులేని వ్యర్థ పదార్థాలను డంప్ చేయడాన్ని ఆసియా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి’’ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘‘నెదర్లాండ్స్, అమెరికా, ఇంగ్లాండ్ దేశాలలో పారిశ్రామిక ప్లాస్టిక్ వ్యర్థాలపై నిబంధనలు ఉండడం వల్ల ఆ దేశాలు వ్యర్థపదార్థాలను ఆగ్నేయ ఆసియా దేశాలలో డంప్ చేయడం ఒక సమస్య అయితే, మరోవైపు ఆగ్నేయ ఆసియా దేశాల తలసరి ఆదాయం పెరుగుతుండటంవల్ల అక్కడ కూడా వస్తువినిమయంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలూ పెరగడం మరో సమస్య అయి కూర్చుంది. వ్యర్థ పదార్థాల నిర్వహణ రోజురోజుకీ కష్టతరమవుతూ ఉండడం, మరోవైపు కొత్తగా వ్యర్థ పదార్థాలు ఉత్పత్తిఅవుతూ ఉండటం రాబోయే రోజుల్లో పెను సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. వ్యర్థపదార్థాల నిర్వహణ, రీ సైక్లింగ్ విషయంలో సత్వర చర్యలు చేపట్టనట్లయితే అతి కొద్దికాలంలోనే భూమీద, నదీ జలాలలోనే కాదు, సముద్ర గర్భంలో కూడా ఊహకి అందనంతగా వ్యర్థపదార్థాలు పేరుకుపోతాయి. ముఖ్యంగా సాగర జలాలలో ప్లాస్టిక్ అవశేషాలవల్ల సముద్రం ఉనికికే ముప్పు వాటిల్లుతుంది’’ అని విల్ నికోల్స్ హెచ్చరిస్తున్నారు.
అగ్రరాజ్యాలు తమ పారిశ్రామిక వ్యర్థాలను పెద్దఎత్తున ఆసియా దేశాలలో డంప్ చేయడం ఒక వ్యాపారంగా మారిపోయింది. వ్యర్థ పదార్థాలను రీ సైక్లింగ్ చేయడం పెద్దఖర్చుతో కూడిన వ్యవహారంగా తయారైంది. ‘‘సింగపూర్, తైవాన్ తప్ప మిగిలిన ఆగ్నేయ ఆసియా దేశాలలో వ్యర్థపదార్థాలను రీ సైక్లింగ్ చేయడం నామమాత్రపు వ్యవహారంగానే కొనసాగుతోంది. మయన్మార్, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లలో 80 శాతం మేరకు వ్యర్థపదార్థాలు బహిరంగ ప్రదేశాలలో అలాగే పడి ఉంటున్నాయి.’’అని విల్ నికోల్స్ అంటున్నారు.
‘‘తమ దేశాలలో అగ్రరాజ్యాలు పారిశ్రామిక వ్యర్థాలను డంప్ చేయడం ఆగ్నేయ ఆసియా దేశాలకు పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే వాటిని రీ సైక్లింగ్ చేసేందుకు అవసరమైన వ్యవస్థ ఆ దేశాలలో లేదు. దీనివల్ల ఆ దేశాలలో భూగర్భంలో కలిసిపోని ప్లాస్టిక్ వ్యర్థాల మూలంగా సమస్యలు ఎక్కువౌతున్నాయి. ఒకవేళ రీ సైక్లింగ్ పనిని ప్రైవేటు సంస్థలకు అప్పగించినా అదిచాలా ఖర్చుతో కూడిన వ్యవహారమే అవుతుంది. దీనికి ఈ దేశాలు సిద్ధంగాలేవు’’అని విల్ నికోల్స్ అంటున్నారు. వ్యర్థపదార్థాల సంక్షోభం అధికమవుతూ ఉండడంవల్ల ప్రజల ఆరోగ్య సమస్యల కోసం, పర్యావరణ పరిశుభ్రత కోసమే వివిధ దేశాల ప్రభుత్వాలు పెద్దమొత్తంలో డబ్బును ఖర్చుపెట్టాల్సివస్తోంది’’ అని సు మంగళీ కృష్ణన్ అంటారు. ఈమె సింగపూర్‌లోని జి.ఎ.సర్క్యులర్ అనే కన్సల్టెన్సీ సంస్థకు రీసెర్చ్, స్ట్రాటజీ అధిపతిగా ఉంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా పెరగడం, వేగవంతవౌతున్న నగరీకరణ ఆర్థిక పురోగతికి కారణవౌతున్నప్పటికీ, వాటి కారణంగానే పర్యావరణ కాలుష్యం కూడా నానాటికీ అధికమవుతోంది. సగటు మనిషిలో పెరుగుతున్న వినియోగ ప్రవృత్తి పెద్దమొత్తంలో వ్యర్థపదార్థాల విసర్జనకు దారితీస్తోంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 210 కోట్ల టన్నుల ఘనరూప వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని పూడ్చాలంటే 8 లక్షల 22వేల ఒలంపిక్ క్రీడల స్విమ్మింగ్ పూల్స్ పట్టేంత స్థలం కావాలి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 32కోట్ల 30 లక్షల టన్నుల వ్యర్థ పదార్థాలు మాత్రమే రీ సైక్లింగ్ అవుతున్నాయి. మిగిలిన వ్యర్థ పదార్థాలలో 46 శాతం ఇతర దేశాలలో డంప్ చేయబడుతున్నాయి.
ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల పర్యావరణం కలుషితమవడం, మానవుల ఆరోగ్యం దెబ్బతినడం, జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లడం మాత్రమేకాదు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం, రీసైక్లింగ్ చేయడం పెద్ద రిస్కుతో కూడిన వ్యవహారంగా తయారయింది. ఇదంతా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెనుభారంగానే ఉంటుంది. ఇప్పటికే పలు దేశాల సాగర తీరాలలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల మత్స్య పరిశ్రమ, పర్యాటక పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయి. తమ పారిశ్రామిక వ్యర్థాల రీసైక్లింగ్ విషయంలో అగ్ర రాజ్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మరోప్రక్క తమపై డంప్ చేయబడుతున్న వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి అవసరమైన వ్యవస్థ లేకపోవడం అభివృద్ధి చెందుతున్న దేశాలకే శాపంగా పరిణమిస్తోంది. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వల్ల పర్యావరణం ఎక్కువగా కలుషితమవుతోంది. అటువంటి వస్తువులను ఉత్పత్తిచేసే పరిశ్రమలపై ఆం క్షలు విధిస్తూ ఇప్పటికే 60 దేశాలు కఠిన చట్టాలు చేశాయి. కాలుష్య సమస్యను అదుపుచేయడానికి పర్యావరణవేత్తలు చక్రీయ వ్యవస్థను (సర్కులర్ ఎకానమీ) ప్రతిపాదిస్తున్నారు. ఈ వ్యవస్థలో ప్రకృతి వనరుల వినిమయం మాత్రమే కాదు, వాటి పూరణ కూడా ఉంటుంది. పూరించడానికి అవకాశం లేని ప్రకృతి వనరుల వినియోగం విషయంలో కఠినమైన నియంత్రణ ఉంటుంది. దీనివల్ల వ్యర్థపదార్థాల ఉత్పత్తికూడా బాగా తగ్గుతుంది. ఈ విధమైన వ్యవస్థ ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుంది.

-ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690