సబ్ ఫీచర్

నాకు తెలిసిన శ్రీకాంతశర్మ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని అనుభవాలూ, పరిశీలనలూ జ్ఞాపకాలుగా మారి కాలంలో ఇంకిపోయేముందు, ఎక్కడో ఒకచోట భద్రపరచాలి. కాస్త ఆలస్యమైనా రాయాలని రాస్తున్నాను. ఆకాశవాణి మిత్రులు, కవీ, సంపాదకులూ, రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గతంగా మారిపోయారు. వారితో, ఆంధ్రభూమి దినపత్రికతో ముడిపడిన ఒకటి, రెండు విషయాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ వ్యాసం. ఇంద్రగంటి అనగానే నాకు హనుమచ్ఛాస్ర్తి గుర్తుకు వస్తారు. దానిక్కారణం వారి అమరగీతం - సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్. అంతకు మించి వారు రాసిన గౌతమీ గాథలు, కాలమ్ రెగ్యులర్‌గా చదవడం కూడా. ఇదంతా యనభైల వ్యవహారం.
ఆకాశవాణిలో చేరినా శ్రీకాంతశర్మగారిని కలువలేదు, మాట్లాడలేదు. కారణం తొలుత నేను గోవాలో, పిమ్మట అనంతపురము కేంద్రాలలో పనిచేయడమే! 1993లో విజయవాడ కేంద్రంలో విలువయిన రికార్డింగులు తీసుకురావాలని అనంతపురం నుంచి వెళ్ళాను. పాత రికార్డింగులు కావాలని అడిగితే, శర్మగారు రావాలని చెబుతున్నారు. వారు రికార్డింగుకని బయటకు వెళ్ళారని చెప్పారు. సాయంత్రం 7 గం. ప్రాంతంలో వారు తిరిగి వచ్చారు. పని, ప్రయాణం బడలికతో ఉన్నారు. తొలి పరిచయంలో వారి చమత్కారాలు, తుళ్ళింతలు, నవ్వులూ ఏమీ లేవు. మరుసటి రోజు కావాల్సిన టేపులు వెతికి ఇచ్చారు. అప్పటికే వారి రచనలు కొన్ని చదివి ఉన్నాను. ఆంధ్రప్రభలో వారు - సాహితీగవాక్షం -లో ‘సంచలనమ్’ కాలమ్ రెగ్యులర్‌గా చదివాను కూడా! అప్పటికి వారికి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రమోషన్ రాలేదు. నేను 1996లో విజయవాడ కేంద్రంలో చేరే సమయానికి వారు ఆకాశవాణి నిజామాబాద్‌కు ప్రమోషన్ మీద వెళ్ళిపోయారు. అంతేకాదు దానికి రాజీనామా చేసి ప్రభ వారపత్రికకు సంపాదకులుగా చేరిపోయారు. 1998 ఫిబ్రవరి ప్రాంతం అనుకుంటా, వారిని విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో కలిశాను. వారు వేరే పనిమీద వచ్చినట్టున్నారు. కనబడగానే తనకు ఒక సైన్స్ కాలమ్ రాయమని, అది ఎలా ఉండాలో, ఎంత నిడివి ఉండాలో అపుడే చెప్పారు. అప్పటికి ఆంధ్రభూమి దినపత్రికలో నేను ఒక టీవీ కాలమ్, ఒక సైన్స్ కాలమ్ రాస్తున్నాను. ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం సంచికకు అపుడపుడు కవర్ స్టోరీలు కూడా రాస్తున్నాను. శ్రీకాంతశర్మ నా ఆంధ్రభూమి సైన్స్ కాలమ్ చదివినట్టున్నారు. ముందుగానే నిర్ణయించుకుని, కనబడగానే పని అప్పగించారు. అప్పుడు నాకో విషయం బోధపడింది. పత్రికల సర్క్యులేషన్‌తో సంబంధం లేకుండా సంపాదకులు పత్రికలనూ, రచయితలనూ గమనిస్తారని! రచయిత స్థాయి తప్ప మరేదీ అంత ప్రధానం కాదని కూడా బోధపడింది. అంటే ఆంధ్రభూమిలో కాలమ్ మరో పత్రిక కాలమ్‌కు దారి కల్పించింది.
రెండు దశాబ్దాల క్రితం నేను ఆకాశవాణి విజయవాడలో వంద సంవత్సరాలలో వచ్చిన వంద తెలుగు పుస్తకాలను ‘శతవసంత సాహితీ మంజీరాలు’గా వేర్వేరు రచయితలతో పరిచయం చేయించాను. ఆ ప్రసంగ వ్యాసాలే 2003లో ఏడువందల పైచిలుకు పేజీల గ్రంథంగా అదే పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఆ విశే్లషణలే నేడు ఆంధ్రభూమి దినపత్రికలో ‘వినమరుగయిన’ శీర్షికలో నిత్యం ధారావాహికగా ప్రచురితమవుతున్నాయి. ఈ వ్యాసాలలో ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ‘వైతాళికులు’ అనే ముద్దుకృష్ణ సంకలనం చేసిన కవితల సంపుటం గురించి ప్రసంగించారు. ‘వైతాళికులు’ గురించి వీరినే ఎందుకు కోరాం? అప్పటికి వారు ‘యువ నుంచి యువ దాకా’ అనే కవితల సంకలనం వెలువరించి ఉన్నారు. ముద్దుకృష్ణ 1910 నుంచి 1935 మధ్య పాతికేళ్ళలో వచ్చిన తెలుగు కవితల నుంచి ఎంపిక చేసి ‘వైతాళికులు’ సంకలనం చేశారు. ఇటీవల కాలంలో ఈ సంకలనంలో ఫలానా కవులు లేరని విమర్శలు తరచు వినబడుతూ ఉంటాయి. తమాషా ఏమిటంటే ‘వైతాళికులు’ వచ్చిన తర్వాత మూడు దశాబ్దాలపాటు పెద్దగా పట్టించుకోలేదని శ్రీకాంతశర్మ రేడియో ప్రసంగంలో పేర్కొన్నారు. ముద్దుకృష్ణ ‘వైతాళికులు’ ముగించిన సంవత్సరం నుంచి ఒక అరవయ్యేళ్ల వ్యవధిలో తెలుగులో వచ్చిన కవితల నుంచి ఎంపిక చేసి శ్రీకాంత శర్మ ‘యువ నుంచి యువ దాకా’ ప్రచురించారు. కనుక ‘వైతాళికులు’ గురించి శ్రీకాంతశర్మ ప్రసంగించడం ఎంతో సబబు. అదేస్థాయిలో వారి ప్రసంగవ్యాసం సాగింది. ఇది 1999 చివరి నెలల ముచ్చట.
1998 ఏప్రిల్ నుంచి ఒక యాభై వారాలపాటు నా ‘సైన్స్ డైరీ’ కాలమ్ కొనసాగి, శర్మ సంపాదకులుగా విరమించడంతో తరవాత మూడు వారాలలో నా కాలమ్ ముగిసింది. అది 1999 ఏప్రిల్ నెల వ్యవహారం. హైదరాబాద్‌కు ఏదో పనిమీద వచ్చినపుడు దోమల్‌గూడలో ప్రభ ఆఫీసుకు శర్మను కలవాలని వెళ్ళాను. వారు వెళ్ళిపోయిన విషయం నాకు అప్పటికి తెలియదు. అక్కడ ఉద్యోగం చేస్తున్న నా అభిమాన రచయిత శ్రీరమణగారిని మొదటిసారి కలిశాను. వారు కూడా శర్మగారు వెళ్ళిపోయిన షాక్‌లో ఉన్నారు. ‘శర్మగారు ఉన్నారని వచ్చాను.. వారు వెళ్లిపోయారు’ అని శ్రీరమణ కాసేపట్లో చాలాసార్లు అన్నారు. 1999లో ముగిసిన నా సైన్స్ కాలం వ్యాసాలు 2009లో ప్రచురించాలనే ప్రయత్నం జరిగింది. దీనికి శ్రీకాంతశర్మగారే ముందుమాట కూడా రాశారు. అయితే తెలియని కారణాలతో అది ప్రచురణ కాకుండా ఆగింది. మరి 2019లో నైనా బయటికి వస్తుందేమో చూడాలి. ఇంద్రగంటి జానకీబాలగారు ఆర్టీసీలో పనిచేసేవారు. వీరు టెలివిజన్ కార్యక్రమాల గురించి కొంతకాలం వారం వారం శీర్షికను రాశారు. అప్పటికి నేను రెగ్యులర్‌గా టీవీ కాలమ్ రాస్తున్నాను కనుక వారి వ్యాసాలన్నీ చాలా జాగ్రత్తగా చదివాను. ఇటీవల ఇంటిపేరు ఇంద్రగంటి అనే పేరుతో శర్మగారు రాసిన స్వీయచరిత్ర చదివి ఫోన్లో చాలా వివరంగా మాట్లాడాను. ఈ స్వీయచరిత్ర ప్రణాళిక విభిన్నంగా ఉంది. వారి పూర్వీకులు, తండ్రి హనుమచ్ఛాస్ర్తి, తను, భార్య జానకీబాల, సంతానం - మోహనకృష్ణ, కిరణ్మయిలు - ఇలా అందరి గురించి ఇంద్రచాపంలా చెబుతారు. ఇక్కడ శర్మగారికీ, నాకు మధ్య ఉండే మరో బలమైన లింకు గురించి చెప్పాలి. శర్మ - రామంగార్ల ద్వయం కలిసి రేడియో మీడియం పంట పండించారు. రామంగారితో చిరకాల, సన్నిహిత మైత్రి కారణంగా వద్దన్నా శ్రీకాంతశర్మ కబుర్లు రామంగారి మాటల్లో తరచు దొర్లేవి. ఆయన రచనా శైలీ, ఆలోచనా సంవిధానం గురించి మరిన్ని సూక్ష్మ విషయాలు బోధపడేవి.
ఆకాశవాణిలో దేవులపల్లి, జాషువా, దాశరథి, బుచ్చిబాబు, గోపీచంద్, శంకరమంచి సత్యం వంటి ప్రముఖ కవులు, రచయితలు ఉద్యోగులుగా సేవలు అందించి రేడియో ప్రక్రియలకు జవసత్వాలు తొడిగారు. లలితగీతానికీ, రేడియో రూపకానికీ శ్రీకాంతశర్మ చేసిన సేవల కారణంగా పై జాబితాలోకి సునాయాసంగా చేరిపోతారు.

- డా॥ నాగసూరి వేణుగోపాల్ 9440732392