సబ్ ఫీచర్

మమతానుబంధాలకు రక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంప్రదాయం కుటుంబ సంబంధాలకు పెద్దపీట వేసింది. తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లు, సోదరులు.. ఇలా అందరి మధ్యా ఆప్యాయత, అనురాగాలు పెనవేసుకుని ఉంటాయి. మానవ సమాజాన్ని దిశానిర్దేశం చేసేది ధర్మం. వేదాలు మనిషి మనుగడకు మార్గనిర్దేశం చేశాయి. వాటిని తూచా తప్పకుండా ఆచరించడమే మనిషి కర్తవ్యం. కుటుంబ బాధ్యత ఈ ధర్మాల్లో ఒకటి. తల్లిదండ్రులతో పాటు సోదరిని చూసుకోవాల్సిన బాధ్యత అన్నపై ఉంటుంది. వాస్తవానికి రక్షణ కోరిన చెల్లెలికి రక్షాకవచంగా నిలుస్తానని అభయమివ్వడమే రాఖీ పండగ పరమార్థం. తనకు రక్షణగా నిలిచే సోదరుడు కలకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిత్య సంతోషంతో జీవించాలని కోరుకుంటూ సోదరి కట్టే తోరం(దారం) రాఖీ. తన క్షేమాయుర్థాయం కోసం నిరంతరం తపించే సోదరి రక్షణకు అనుక్షణం కట్టుబడి ఉంటానని సోదరుడు భరోసా ఇవ్వడం ఆశీర్వాదం. ఇదే రక్షాబంధన్ ముఖ్య ఉద్దేశం.
శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి పేర్లతో పిలుస్తారు. రాఖీ లేదా రక్షాబంధన్ దేశంలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశానికి పరిమితమైన ఈ సంప్రదాయం దేశమంతటా వ్యాపించింది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పటిష్ట మమతానుబంధానికి రాఖీ ప్రతీక. ఈ రోజు అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లు రాఖీ కడతారు. రాఖీ అంటే ‘రక్షణ’ అని అర్థం. ‘రక్ష’ అంటే రక్షించడం. ‘బంధన్’ అంటే సూత్రం కట్టడం అని అర్థం. ఇంటి ఆడపడుచు తన అన్న లేదా తమ్ముడు వేసే ప్రతి అడుగూ విజయం వైపే సాగాలని, తన సోదరుడు అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ సన్నటి దారాన్ని ఎర్రటి తోరణానికి చుట్టి రాఖీని తయారుచేసి సోదరుడి చేతికి కడుతుంది. హారతి ఇచ్చి, నుదుటన మంగళ తిలకం దిద్దుతుంది. దీనికి బదులుగా సోదరుడు తన సోదరికి ఏ కష్టమొచ్చినా కాపాడతానని వాగ్దానం చేస్తాడు. ఆమెకు తనకు తోచిన కానుకలను అందిస్తాడు.
నేటి ఉరుకుల పరుగుల జీవనం కారణంగా మారిన జీవనశైలిలో భాగంగా పలకరింపుల్లో తేడాలు వచ్చి ఉండొచ్చు. ఒకరినొకరు నేరుగా చూసుకోలేనంత దూరాలు పెరిగి ఉండొచ్చు. కానీ ఆప్యాయతానురాగాల్లో మాత్రం కొంచెం కూడా తేడా లేదు. అవును మరి! అది రక్తసంబంధం.. అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల అనుబంధం. ఆ అనుబంధాన్ని మరింత గాఢంగా ముడేస్తూ ఏడాదికోమారు శ్రావణమాసంలో జరుపుకునే అపురూపమైన వేడుకే రాఖీ పౌర్ణమి. ఆ రోజున చంద్రుడికో నూలుపోగులా అన్నదమ్ముల శ్రేయస్సును కోరుతూ, వాళ్లపై ప్రేమ తమకు చిరకాలం ఉండాలని ఆకాంక్షిస్తూ రక్షరేకును చుట్టిన పసుపు, ఎరుపు దారాలు వాళ్ల చేతికి అక్కాచెల్లెళ్లు కట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఆ దారాలే నేడు అనేక వెరైటీల్లో దొరుకుతూ కట్టేవారి, కట్టించుకునేవారి మనసుని దోచుకుంటున్నాయి. ఈ రక్ష రేకులు నేడు బంగారం, వెండి, వజ్రాలు, నవరత్నాలతో చేసిన అందమైన ఆభరణాల రూపంలో కనువిందు చేస్తున్నాయి. కొన్ని నగల దుకాణాలైతే ఆ రోజు కోసం ఒక్కోటి యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు విలువచేసే ఖరీదైన వజ్రాల రాఖీలను రూపొందిస్తున్నాయి. అంతేకాదు బ్రొ, భాయ్.. వంటి పదాలను చెక్కిన బంగారు రాఖీలు, తెల్ల రాళ్లను పొదిగిన వెండి బంధనాలు నవరత్నాల లాకెట్లతో చేసిన ఆభరణాల్లాంటి రాఖీలు ఈ తరాన్ని అలరిస్తున్నాయి. అంత ధర పెట్టలేని వారికోసం సహజాతి రత్నాలను పొదిగిన వెండి, బంగారు పూత పూసినవీ చేస్తున్నారు. ఇక జర్దోసి, దారం ఎంబ్రాయిడరీలు, రాళ్లూ, రుద్రాక్షలూ కలిపి రూపొందించే డిజైనర్ రాఖీలు టీనేజర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎతె్తైతే పిల్లలకోసమే ప్రత్యేకంగా బ్యాట్‌మన్, స్పైడర్‌మ్యాన్, పోకెమాన్, మిక్కీ, మిన్నీ వౌస్‌ల్లాంటి కార్టూన్ కారెక్టర్లూ, చోటాభీమ్, హనుమాన్, శ్రీకృష్ణ వంటి పౌరాణిక పాత్రల రాఖీలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు భయ్యాబాబీ సెట్స్ పేరుతో వస్తున్నాయి రాఖీలు. అంటే అన్నతో పాటు వదినెను కూడా తల్లిగా భావించి రక్ష కడుతుంది మరదలు. ఇలా రాఖీల్లో ఎన్ని డిజైన్లు వచ్చినా.. పూల డిజైన్లు మాత్రం ఎవర్‌గ్రీన్. సిల్కుదారాలతో అల్లిన కృత్రిమపూలు, బంగారు పూలు చొప్పించి చేతినిండుగా అందంగా కనిపించేలా రాఖీలు తయారుచేస్తున్నారు. ఇప్పుడు మరో ఫ్యాషన్ వచ్చింది.. ఆయా వ్యక్తుల పేర్లు, ఫొటోలతో రూపొందించిన పర్సనలైజ్డ్ రాఖీలు వస్తున్నాయి. అన్నదమ్ముల ఫొటోలతోను, తమ అన్యోన్యతను సూచించే ఫొటోలతోనూ రాఖీలు చేయిస్తున్నారు.
వివిధ రాష్ట్రాల్లో..
రాఖీపౌర్ణమిని మహారాష్టల్రో నరాళి పూర్ణిమగా జరుపుకుంటారు. మహారాష్ట్ర కోస్తా తీరంలో కొలిస్ అనే మత్స్యకారులు వరుణదేవున్ని ఆరాధ్యదైవంగా కొలుస్తారు. రాఖీ పండుగ సందర్భంగా వీరు కొబ్బరికాయల్ని సముద్రంలోకి విసిరి వరుణదేవుడ్ని పూజిస్తారు. సంపదలకు ప్రతీక అయిన సింధూరాన్ని ఒకరి నుదిటిపై మరొకరు దిద్దుతారు.
పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో ఘూలాన్ పూర్ణిమ పేరుతో రాధాకృష్ణులను పూజించిన తర్వాత మహిళలు తమ సోదరులకు రాఖీలు కడతారు. రాఖీ పండుగను భారతదేశం, నేపాల్‌లో సార్వత్రికంగా, మిగతా దేశాల్లోని హిందువులు, జైనులు, సిక్కులు జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమిని ‘బలేవా’ అని కూడా పిలుస్తారు. బలేవా అంటే బలిరాజు భక్తి అని అర్థం. ఈ రోజున లక్ష్మీదేవి బలి చక్రవర్తికి రాఖీ కట్టి విష్ణుమూర్తిని కావాలని కోరుకుంటుందట. అలాగే ద్రౌపది శ్రీకృష్ణుడికి రాఖీ కట్టినందుకు వస్త్రాపహరణ సమయంలో ఆమెను ఆదుకుంటాడు. అలాగే పదిహేను శతాబ్దంలో రాణి కర్ణావతి, హుమాయూన్‌కు రాఖీ కడుతుంది. ఇవన్నీ రాఖీ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు అని చెప్పడానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.