సబ్ ఫీచర్

ఆటలు ఆడుతున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయసేదైనా సరే.. రోజూ కాసేపు ఏదైనా ఆట ఆడితే ఆరోగ్యంగా ఉండొచ్చని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు. ఇష్టమైన ఆటను దినచర్యలో భాగంగా చేసుకుంటే శారీరకంగానే కాదు మానసికంగానూ బలంగా ఉండొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఆటలతో వృత్తిగత సామర్థ్యం మెరుగుపడటమే గాక గెలుపోటములను ఒకేలా స్వీకరించే సానుకూల దృక్పథం అలవడుతుందని వారు సూచిస్తున్నారు. మొదట్లో ఉదయానే్న లేచి ఆటకోసం మైదానానికి వెళ్ళటం ఇబ్బందిగా అనిపించినా కొన్ని రోజుల్లోనే దానిపై ఆసక్తి పెరుగుతుంది కనుక జిమ్ మాదిరిగా డుమ్మా కొట్టే అవకాశమూ తక్కువేనని చెబుతున్నారు. ఒకే సమయంలో వాకింగ్, రన్నింగ్, స్ట్రెచ్చింగ్, వెయిట్ లిఫ్టింగ్.. ఇలా భిన్నరకాల వ్యాయామ ప్రక్రియల ఫలితాలను అందించే క్రీడలను దినచర్యలో భాగం చేసుకోమని సూచిస్తున్నారు.
ఆటల ఎంపిక
ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం ఆటలాడేవారు తమ ఎత్తు, బరువు, ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవసరాన్ని బట్టి వైద్యుల, వ్యాయామ శిక్షకుల సలహా తీసుకోవాలి. ఆట మరీ సున్నితమైనదిగా గాక అంతో ఇంతో శారీరక శ్రమ కల్గించేదై ఉండాలి. టెన్నిస్, బాడ్మింటన్, క్రికెట్, స్కిప్పింగ్, సాకర్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, రగ్బీ, హ్యాండ్‌బాల్, జిమ్నాస్టిక్స్ వంటివేదైనా మంచి వ్యాయామం లభించినట్లే..
సాధనకు ముందు..
* దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు ఆట ఆడే ముందు వైద్యులను, వ్యాయామ నిపుణులను సంప్రదించాలి.
* ఆటకు ముందు కాసేపు తప్పనిసరిగా వార్మప్, కూల్‌డవున్ ప్రక్రియల్ని సాధన చేయాలి.
* ఆటలో పడి టైమ్‌ని మర్చిపోవడం, సామర్థ్యానికి మించి ఆడటం మంచిది కాదు.
* కొద్దిసేపు ఆడినా విశాలమైన ప్రదేశంలోనో, మైదానాలలోనో ఆడితే మంచి ఫలితాలొస్తాయి.
* ఆట సాధన చేసినంత కాలం శరీరంలో వచ్చే మార్పులను గమనించుకోవాలి.
ప్రయోజనాలు
* పెద్దగా శిక్షణ లేకుండానే ఆడగలిగే ఆట బాడ్మింటన్. గంటసేపు బాడ్మింటన్ ఆడితే దాదాపు 300 కేలరీలు కరిగిపోతాయి.
* శరీరంలోని అన్ని భాగాలను కదిలించే ఆట బాస్కెట్ బాల్. కేవలం 20 నిముషాల సెషన్‌లో 150-250 కేలరీలు కరిగిపోతాయి.
* అవకాశం, ఆసక్తి ఉంటే ఫుట్‌బాల్ మేలైన వ్యాయామం. రన్నింగ్, వాకింగ్, ట్విస్టింగ్, కిక్కింగ్, డార్టింగ్ అన్నీ కలగలసిన ఆట ఇది. 45 నిముషాల ఫుట్‌బాల్ ఆడితే 450-550 కేలరీలు ఖర్చవుతాయి.
* ఇలాంటి మరో ఆటే రగ్బీ.. ఇందులో రెజ్లింగ్, రన్నింగ్ కలగలసి ఉండే ఈ ఆట కండరాల సామర్థ్యాన్ని పెంచుతుంది. 40 నిముషాల సేపు ఆడితే.. 400-600ల కేలరీలు కరగాల్సిందే..
* తక్కువమందికి అందుబాటులో ఉండే ఆట.. వాటర్ పోలో. ప్రతి ఏడు నిముషాల సెషన్‌కు 60 నుంచి 80 దాకా కేలరీలు ఖర్చవుతాయి.

షూ ఎంపిక ఇలా..

ఆటలు ఆడేటప్పుడు, వ్యాయామ సమయంలో తగిన సైజు, ఆకృతిగల షూస్ వాడటం తప్పనిసరనే సంగతి తెలిసిందే.. దీనివల్ల వేగవంతమైన శారీరక కదలికల ప్రభావం వల్ల మోకాళ్లు, పాదాలపై పడకుండా తగినంత రక్షణ లభిస్తుంది. చేసే వ్యాయామాన్ని బట్టి షూ ఎంపిక కూడా మారుతుంది. మరి.. ఏ వ్యాయామానికి వాడే షూ ఎంపిక ఎలా ఉండాలో తెలుసుకుందాం..
* రన్నింగ్ షూకి కుషన్, బౌన్స్ ఎక్కువగా అందాలి.
* టెన్నిస్ ఆడేవారు పాదాన్ని కోరిన రీతిగా వంచేందుకు వీలుగా ఉండే షూ ఎంపిక చేసుకోవాలి.
* వాకింగ్, జాగింగ్ చేసేవారు గట్టి బేస్ ఉన్న షూ వాడాలి.
* వారానికి కనీసం ఐదు రోజులు రన్నింగ్ చేసేవారు తొమ్మిది నెలలకు ఒకసారి, రోజూ వాకింగ్ చేసేవారు ఏడాదికొకసారి షూని మార్చాలి.
* నాసిరకం షూ కంటే కాస్త ధర ఎక్కువైనా మంచివి తీసుకుంటే ఎక్కువకాలం తగినట్లు మన్నుతాయి.
* కొత్త షూ కొనేటప్పుడు పాదం సైజులో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోవాలి.
* ఎంపిక చేసిన షూ వ్యాయామ సమయంలో పాదానికి పట్టే చెమటను ఎప్పటికప్పుడు పీల్చుకునేలా ఉండాలి.
* షూ లేస్ విప్పగానే పాదాన్ని సులభంగా బయటకి తీసేంత వెసులుబాటు ఉన్న షూ సరైనదిగా భావించాలి. అలాగని వేళ్ళ భాగంలో ఇరుకుగా ఉండే షూ తీసుకోవద్దు. ఇలాంటి షూస్‌తో ఏవైనా ఆటలు ఆడాలంటే ఇబ్బందిగా ఉంటుంది.
* లేస్ తీయగానే పాదాన్ని సులభంగా బయటకి తీసేలా ఉన్న షూస్ అయితే ఆటలకు, రన్నింగ్‌కు అనుకూలంగా ఉంటాయి.