సబ్ ఫీచర్

‘సుజల స్రవంతి’ ఫగటికలేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ సాగునీటి వనరులను మెరుగు పరచాలి. అయతే, ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న జాప్యం ఆ ప్రాంతం పట్ల పాలకుల వివక్ష కు నిదర్శనంగా మారింది. పరిపాలనా పరమైన అనుమతి లభించిన తర్వాత కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టు దేశంలోనే ఇది మొట్ట మొదటిది. ఒకే ప్రాజెక్టుకు రెండుసార్లు ఇద్దరు ముఖ్యమంత్రులు శిలాఫలకాలు వేసిన ప్రాజెక్టు కూడా ఇదే. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి శిలాఫలకం వేస్తే ముచ్చటగా మూడోసారి అవుతుంది.
ఉత్తరాంధ్రలో మొత్తం 23.24 లక్షల ఎకరాలు సాగుభూమి ఉండగా, అందులో కేవలం 8లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఉత్తరాంధ్ర ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి కష్టాలను పరిష్కరించడానికి ఏకైక మార్గం ‘బాబూ జగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ ప్రాజెక్టును పూర్తి చేయడం తప్ప మరో మార్గం లేదు. విశాఖపట్నంలో 3.21లక్షల ఎకరాలు, విజయనగరంలో 3.94 లక్షల ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలో 0.85 లక్షల ఎకరాలు మొత్తం 8లక్షల ఎకరాలకు సాగునీరు, 12వందల గ్రామాలకు తాగునీరు లభిస్తుంది. 53.40 టీఎంసీలు వ్యవసాయం కోసం, 4.46టీఎంసీలు తాగునీటి కోసం, 5.34 టీఎంసీలు పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించేలా ఈ ప్రాజెక్టును రూపొం దించారు. ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులను జీ.వో.ఎమ్.ఎస్.నెం.3, తేదీ 02-01-2009న 7214.10 కోట్ల రూపాయలతో పూర్తి చేయడానికి ఉత్తర్వులు జారీచేశారు. దివంగత నేత డా॥ వై.యస్.రాజశేఖర్‌రెడ్డి 21 ఫిబ్రవరి 2009న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. వైఎస్ మరణానంతరం ముఖ్యమంత్రులైన కె.రోశయ్య, ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడమే కాకుండా, ఒక దశలో ప్రాజెక్టును చేపట్టడాన్ని విరమించుకున్నారు.
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును’ సత్వరం పూర్తిచేస్తామని పేర్కొన్నారు. వైకాపా సైతం తన ఎన్నికల ప్రణాళికలో ఈ ప్రాజెక్టుకు కట్టుబడి వున్నామని హామీ ఇచ్చింది. అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ కానీ, ప్రధాన ప్రతిపక్షమైన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రాజెక్టు నిర్మాణం పట్ల చిత్తశుద్ధి చూపలేదు. తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వంపై వత్తిడి పెంచడానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాధన సమితి, వివిధ ప్రజా సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో పలు ఆందోళనా కార్య్రకమాలు చేపట్టడం జరిగింది. దీంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో చలనం వచ్చి ఈ ప్రాజెక్టు పనుల పైన కొంత దృష్టి సారించింది.
2017 సెప్టెంబర్ 5న జీ.వో.ఎమ్.ఎస్.నెం.53 ప్రాజెక్టు మొదటి దశ పనులకు 2022.22 కోట్లకు పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. నవంబర్ 15, 2018 నాడు చోడవరంలో మరొకసారి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శిలాఫలకం వేసి మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టారు. 2019 మే నాటికి తొలిదశ పనులు పూర్తిచేసి సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తొలిదశకు కావాల్సిన 2023 కోట్లకు గాను కేవలం 12.8 కోట్లు మాత్రమే మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా మంజూరు చేసి చేతులు దులుపుకున్నారు.
ప్రాజెక్టు తొలిదశ పనుల్లో భాగంగా పెదపూడి రిజర్వాయర్ నిర్మాణానికి 2300 ఎకరాలు, కెనాల్‌కు 300 ఎకరాలు, అటవీ భూమి 147 ఎకరాలు, పిల్లకాలువలకు 1653 ఎకరాలు మొత్తం దాదాపు 4400 ఎకరాలు అవసరం వుంది. భూ సేకరణకే దాదాపు 600 కోట్ల రూపాయలు అవసరం వుంది. ఇటీవల అధికారంలోకి వచ్చిన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మాణ వ్యయాన్ని, భూ సేకరణకు కావలసిన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా- రాష్ట్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు ముష్టి వేసినట్లు 170 కోట్లు మాత్రమే కేటాయించింది. వై.ఎస్. అడుగుజాడల్లో నడుస్తామని, ఆయన కలలు నిజం చేస్తామని చెబుతున్న సీఎం జగన్ అతి తక్కువ నిధులిచ్చి సాగునీటి పథకాలను ఎలా పూర్తి చేస్తారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
2009 నాటి ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తిచేయడానికి 7,214.10 కోట్ల వ్యయం అవుతుంది. ధరల పెరుగుదల, రూపాయి విలువ తరుగుదలను పరిగణలనోకి తీసుకుంటే ఈ ప్రాజెక్టు వ్యయం కనీసం 30 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రభుత్వం కేటాయించిన విధంగా నిధులు ఇసేత- ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తికావడానికి కనీసం 176 ఏళ్లు పడుతుంది, దీంతో ఈ ప్రాజెక్టు ఒక కలగానే మిగిలిపోతుంది.
గోదావరి వరద నీరు వృథాగా సముద్రంలోకి పోకుండా, కేవలం 120 రోజుల పాటు కాలువల్లోకి ఎత్తిపోసి, 196 కిలోమీటర్లు పొడవునా కాలువలు నిర్మించి నాలుగు రిజర్వయర్లలో నిలువ చేయడం ద్వారా ఉత్తరాంధ్ర సాగు, తాగునీరు అవసరాలు తీర్చేందుకు ఈ ప్రాజెక్టును నిర్దేశించారు. పోలవరం ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు నీటిని మళ్లించేందుకు మూడు చోట్ల ఎత్తిపోతల పదకాలను నిర్మించాల్సి ఉంది. తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద మొదటి దశలో 28 మీటర్లు, పాపాయిపాలెం వద్ద రెండదశలో 45 మీటర్లు, చివరదశలో 4 రిజర్వాయర్ల వద్ద ఎత్తిపోతల పథాన్ని నిర్మించాల్సి ఉంటుంది. విశాఖ జిల్లా రావికమతం వద్దనున్న పెద్దపూడి రిజర్వాయర్, భూదేవి రిజర్వాయర్, విజయనగరం జిల్లాలోని ఎస్.కోట వద్దనున్న వీరనారాయణం రిజర్వాయర్, తాటిపూడి వద్ద ఎక్స్‌టెన్షన్ రిజ ర్వాయర్లను నిర్మించాల్సి ఉంది. మొత్తం 4 రిజర్వాయర్లలో 19.70 టీఎంసీల నీటిని నిలువ చేసేందుకు 339 మెగావాట్లు విద్యుత్ అవసరం అవుతుంది.
విశాఖ నగరంలో తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం రైవాడ, తాండవ తదితర ప్రాజెక్టుల నుండి నీటిని మళ్లిస్తున్నారు. దీంతో రైతులకు, విశాఖనగర ప్రజలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ముందు ముందు పల్లెలకు, పట్టణాలకు మధ్య ఘర్షణ వాతావరణం నివారణకు శాశ్వత పరిష్కారం ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని చేపట్టడమే. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం కారణంగానే ఈ సంవత్సరం విశాఖపట్నం నగరానికి మంచినీటి కొరతను అధిగమించింది. ఇది పూర్తికాకుంటే స్టీల్ ప్లాంట్, ఇతర పెద్ద పారిశ్రామిక సంస్థలు మూతపడే పరిస్థితి ఏర్పడేది. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు గోదావరి జిల్లాలకు దీటుగా అభివృద్ధి చెందాలంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణమే చేపట్టడమే శరణ్యం తప్ప మరో మార్గం లేదు. ఈ ప్రాంత అభివృద్ధికి జీవనధారమైన ఈ ప్రాజెక్టు పనులు చేపట్టాలని ప్రతీ ఒక్కరూ గొంతెత్తాల్సిన సమయం ఆసన్నమైంది.
సుజల స్రవంతి ప్రాజెక్టు విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి- శిలాఫలకాల వద్ద శుద్ధి కార్య్రకమం, పోస్ట్‌కార్డు ఉద్యమం, భారీగా సంతకాల సేకరణ, శాంతియుత ఆందోళనా కార్యక్రమాలు ప్రజాస్వామ్య పద్ధతిలో చేపట్టడానికి కార్యాచరణ రూపొందిస్తున్నాము. ఇంతే కాకుండా ఈ ప్రాజెక్టు కోసం న్యాయ పోరాటం కూడా చేస్తాం. ఈ ప్రాంత ప్రజలు ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తిగా అటకెక్కిచ్చి, చరమగీతం పాడినా ఆశ్చర్యం లేదు. గోదావరి జలాలలో ఉత్తరాంధ్రకు తగి న వాటా కేటాయించాలని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి సంవత్సరానికి 5వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి వెంటనే పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, పౌరసమాజం, అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వంపై వత్తిడి తీసుకొస్తే తప్ప ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ ప్రాజెక్టు పనులు ప్రారంభం కావు. ఇప్పటికైనా కదలిక లేకుంటే ఈ ప్రాజెక్టు ఓ కలగానే మిగిలిపోతుంది.

-కొణతాల రామకృష్ణ కన్వీనర్, ఉత్తరాంధ్ర చర్చావేదిక