సబ్ ఫీచర్

కశ్మీర్ సమస్య కాంగ్రెస్ పుణ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్‌కు చెందిన మహమ్మదాలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి హిందువులు, ముస్లింలు వేర్వేరు జాతుల వారని ప్రచారం చేసి భారత్‌ను విభజించేలా చేశాడు. మతం వేరు అయినంత మాత్రాన జాతీయత మారదు. భారతీయ ముస్లింలలో అత్యధికులు ఈ గడ్డమీదే పుట్టినవారు. అరబ్బులు, తురుష్కులు, ఆఫ్గన్‌లు భారత్‌పై దాడులు చేసి ఎంతోమంది హిందువుల చేత బలవంతంగా మతం మార్పించారు. అయితే, జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని ముస్లిం మనసుల్లోకి చొప్పించి పాకిస్తాన్‌ను సాధించాడు. పాకిస్తాన్ ఏర్పడిన తొలి నాళ్ళలోనే హిందువులను, సిక్కులను తరిమికొట్టి తన మైనారిటీల సమస్యను పరిష్కరించుకొంది. అదే సమయంలో భారత్ తన అల్పసంఖ్యాక వర్గాల వారి భద్రతకు అనేక చర్యలకు పూనుకుంది. పాకిస్తాన్‌లో అల్పసంఖ్యాక వర్గాల జనాభా గణనీయంగా పడిపోగా, భారత్‌లో ముస్లింల జనాభా గణనీయంగా పెరిగింది. కశ్మీర్ నుండి హిందువులను తరిమివేసి, దాన్ని ఒక ముస్లిం మెజారిటీ ప్రాంతంగా తయారుచేసి, సమస్యను అంతర్జాతీయం చేయడమే పాక్ లక్ష్యం. ఆ లక్ష్యానికి సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న నెహ్రూ, ఆయన వారసుల విధానాలు తోడ్పడటం చారిత్రక విడ్డూరం.
నెహ్రూ తప్పిదాలు..
షేక్ అబ్దుల్లా నాయకత్వంలో ముస్లింలు, హిందువులు పాక్ చొరబాటుదారులను ఎదుర్కొన్నారు. ఆనాడు కశ్మీర్ ముస్లింలు పాక్‌కు వ్యతిరేకంగా పోరాడారు. భారత సైన్యాన్ని కశ్మీర్‌కు పంపడానికి నెహ్రూకు ఇష్టం లేదు. కానీ సర్దార్ పటేల్ చొరవ తీసుకొని సైన్యాన్ని పంపాడు. భారత సైన్యం కొద్దికాలంలోనే పాక్ చొరబాటుదారులను తిప్పికొట్టి శ్రీనగర్‌ను స్వాధీనం చేసుకొన్నది. మొత్తం జమ్మూకశ్మీర్‌ను స్వాధీనంలోకి తెచ్చుకోగల స్థితిలోఉన్న సైన్యాన్ని నెహ్రూ నిలవరించాడు. కశ్మీర్ విలీనానికి మహారాజా హరిసింగ్ ఒప్పందం మీద సంతకం చేసిన తర్వాత కూడా నెహ్రూ కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితికి విన్నవించాడు. కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని తనంతట తానుగా ఒప్పుకొన్నాడు. ఐక్యరాజ్యసమితి కాల్పుల విరమణకు ఆదేశించింది. దానితో గెలిజిట్, బాల్టిస్థాన్‌లను స్వాధీనం చేసుకోగల స్థితిలో ఉండికూడా భారత సైన్యం ముందుకు వెళ్ళలేకపోయింది. నెహ్రూ చేసిన ఈ అనాలోచిత చర్య అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. నెహ్రూ దేశానికి చేసిన పెద్ద ద్రోహం ఇది. షేక్ అబ్దుల్లాకు ప్రయోజనం చేకూర్చేందుకే నెహ్రూ సైన్యాన్ని నిలిపివేశాడని పీడీపీ ఎంపీ ముజఫర్ హుస్సేన్ బేగ్ వ్యాఖ్యానించాడు. ఎందుకంటే ప్రస్తుత పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో అత్యధికులు గుజ్జర్లు, జాట్‌లు, పహాడిలు, రాజపుత్రులు, అబ్బాసిస్‌లు మొదలైనవారు. ఆ ప్రాంతం అంతా జమ్మూ-కశ్మీర్‌లో ఉంటే కశ్మీరీ ముస్లింలు అల్పసంఖ్యాకులు అవుతారు. షేక్ అబ్దుల్లా ఎన్నాళ్ళో తన అధికారాన్ని అనుభవించలేడు. నెహ్రూ అబ్దుల్లాకు ప్రయోజనం చేకూర్చేందుకే ఆక్రమిత కశ్మీర్‌పై పాకిస్థాన్ నియంత్రణను కొనసాగించాడు. అంతేకాక దాన్ని ‘అజాద్ కశ్మీర్’గా పిలిచాడు. వాస్తవానికి అజాద్ కశ్మీర్‌కు స్వతంత్రత లేదు. గత 75 ఏళ్ల నుండి అనేక అసత్యాలను అజాద్ కశ్మీర్ గురించి పాక్ ప్రచారం చేస్తూనే ఉంది. రాజా హరిసింగ్ మొత్తం జమ్మూ-కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశాడు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ‘అజాద్ కశ్మీర్’కూడా భారత్‌లో అంతర్భాగమే. సైన్యాన్ని ముందుకు వెళ్ళకుండా ఆదేశించింది నెహ్రూయే. ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువెళ్ళిందీ నెహ్రూయే. 14 రోజులపాటు జిన్నా ప్రజాభిప్రాయ ప్రతిపాదనను వ్యితిరేకించిన నెహ్రూ 15వ రోజునే అందుకు అంగీకరించాడు. ప్రజాభిప్రాయ సేకరణ జరగటానికి కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు సహకరించవు. భారత్, పాకిస్థాన్‌లు రెండూ జమ్మూ-కశ్మీర్ మొత్తంనుండి తమతమ సైన్యాలను ఉపసంహరించుకొంటేనే ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. అయినా ఐక్యరాజ్యసమితి తీర్మానం కేవలం సలహాకు మాత్రమే పరిమితం. తప్పకుండా పాటించి తీరవలసిన నియమం ఏమీలేదు. ఐక్యరాజ్యసమితికి ఇచ్చిన హామీతోపాటు 370వ అధికరణాన్ని అంగీకరించటం నెహ్రూ చేసిన పెద్ద తప్పిదం.
జమ్మూ-కశ్మీర్ రాజ్యాంగ సభ ఆ రాష్ట్ర రాజ్యాంగాన్ని అంగీకరించే సమయానికి 42వేల చదరపు కిలోమీటర్ల భూభాగం పాక్ అధీనంలో ఉంది. ఇటీవల అందులో అత్యధిక భాగాన్ని పాకిస్థాన్ చైనాకు అమ్మివేసింది. కానీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అంతర్జాతీయంగా నిరసన కూడా తెలియజేయలేదు. భారత రాజ్యాంగంతోపాటు కశ్మీర్ రాజ్యాంగం కూడా 1947 ఆగస్టు 15నాటికి ఉన్న జమ్మూ-కశ్మీర్ భూభాగం మొత్తం భారత్ భూభాగంగా గుర్తించింది. మోదీ ప్రభుత్వం ఈ వాస్తవాన్ని గుర్తించి ఆక్రమిత కశ్మీర్ ప్రాంతం భారత్‌లో భూభాగంగా పేర్కొంది.
వ్యక్తిగత ఎజెండాను బట్టి...
కశ్మీర్‌లో మూడు జెండాలు అబ్దుల్లాల జేబుల్లో ఉంటాయని చెప్తూంటారు. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలు అవసరాన్నిబట్టి, భారత్ జెండా, స్వయం ప్రతిపత్తి కశ్మీర్ జెండా, పాక్ జెండా వారి ఎజెండానుబట్టి ఏదో ఒకదాన్ని బయటకు తీస్తుంటారు. నెహ్రూ అబ్దుల్లాతో అంటకాగేటప్పుడు ఆయన అడిగినదల్లా ఇచ్చాడు. అబ్దుల్లా హద్దులుదాటి డిమాండ్ చేస్తున్నట్లుగా అనిపించగానే గృహ నిర్భందంలో ఉంచాడు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్సు రాజకీయాల వల్లే పాక్‌కు కశ్మీర్‌లో అంతపట్టు దొరికింది. ఆరోజుల్లో అబ్దుల్లా అనుమతి లేకుండా రాష్టప్రతి కూడా కశ్మీర్‌లో పర్యటించటానికి వీలులేదు. ఇందుకు నిరసనగా 1952లో జన్‌సంఘ్ అధినేత శ్యామాప్రసాద్ ముఖర్జీ కశ్మీర్‌లో ప్రవేశించాడు. 1953 మే 11న ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. దేశమంతా నిరసన ప్రదర్శనలు జరిగినా శ్యామాప్రసాద్ మరణంపై విచారణకు నెహ్రూ ఆదేశం ఇవ్వలేదు. ఆగస్టు 1953లో అబ్దుల్లాను భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు నెహ్రూ పదవీచ్యుతుడ్ని చేసాడు. ఆయనపై కశ్మీర్ కుట్ర కేసును పెట్టించి, బక్షీగులామ్ మొహమ్మద్‌ను ప్రధానమంత్రి చేసాడు. అయితే బక్షీ కూడా అధికారంలోకి రాగానే నెహ్రూను లెక్కచేయటం మానివేసాడు. బక్షీని ఢిల్లీకి పిలిపించి, ఆయనచేత బలవంతంగా రాజీనామా చేయించారు. ఆ తర్వాత గులామ్ మొహమ్మద్ సాదిక్‌ను నియమించారు. అతని ప్రవర్తన కూడా కాంగ్రెస్ బాసులకు నచ్చలేదు. అతని స్థానంలో సయ్యద్ ఖాసింను 1971లో ముఖ్యమంత్రిని చేసారు. ఇందిరాగాంధీ మీర్‌ఖాసిం లక్ష్మణ రేఖను దాటుతున్నట్లుగా గమనించగానే అతనిని దింపేశారు.
షేక్ అబ్దుల్లాను గృహనిర్భందం నుండి విడుదల చేసి, ఎన్నికలు జరపకుండా ఆయనను ముఖ్యమంత్రిని చేసారు. ఆయనపై పెట్టిన కుట్ర కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. ఆ సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఒక సభ్యుడు కూడా అసెంబ్లీలో లేరు. రెండు సంవత్సరాలు తర్వాత కాంగ్రెస్ సభ్యులు ఆయనకు మద్దతును ఉపసంహరించారు. అత్యియిక పరిస్థితి కాలం అది. మిగిలిన ప్రతిపక్షాలతో కలసి ఐక్యసంఘటనలో అబ్దుల్లా చేరాడు. ఎన్నికల ద్వారా కశ్మీర్‌లో అధికారంలోకి తిరిగి అబ్దుల్లా వచ్చాడు. 1982లో షేక్ అబ్దుల్లా మరణం తర్వాత ఫరూక్ అధికారంలోకి వచ్చాడు. రెండు సంవత్సరాల తర్వాత గులామ్ మొహమ్మద్ షా ఆయనను పదవీచ్యుతుడ్ని చేశాడు. కాంగ్రెస్ మద్దతు యిచ్చింది. షాను కూడా 1986లో తొలగించి, రాష్టప్రతి పాలన విధించారు.
కాంగ్రెస్ ఆడిన ఈ నాటకాల వల్లే రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. తమకు తోచిన వారిని ముఖ్యమంత్రులను చేయటం, ఆ తర్వాత వారిని ఇష్టానుసారం తొలగించటం మూలంగానే వేర్పాటు ధోరణులు పెరిగాయి. వాటిని పాక్ తెలివిగా వాడుకొంది. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు నేషనల్ కాన్ఫరెన్సు అరాచకాలను చూసీ చూడనట్లుగా వదిలివేయకుంటే కశ్మీర్‌లో ఉగ్రవాదం పెచ్చుపెరిగేది కాదు. 1987లో ముస్లిం యునైటెడ్ ఫ్రంటు అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీకి నిలబడింది. యాసఫ్‌షా దానికి నాయకుడు. యాసఫ్‌షాను అధికారంలోకి రాకుండా చేయటమేకాక ఆయనను జైలులో పెట్టారు. జైలునుంచి విడుదల అయ్యాక పాకిస్తాన్‌కు వెళ్ళి, సయ్యద్ సలాముద్దీన్‌గా పేరుమార్చుకొని, హిజబుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థను నెలకొల్పాడు. అనేకమంది యువకులకు ఆయుధాలు వాడటంలో పాకిస్థాన్‌లో శిక్షణ ఇచ్చాడు. 1970వ దశకం దాకా వేర్పాటు వాదం కశ్మీర్ యువతను ఆకర్షించలేదు. ప్రస్తుత వేర్పాటువాద నాయకుల తండ్రులు, తాతలు జాతీయవాదులు. అనేకమంది కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకులు. వారిని హత్యచేసేందుకు పాక్ ప్రత్యేక బృందాలను పంపింది. నేషనల్ కాన్ఫరెన్సు వారిని ‘ఇండియా కుక్కలు’ అని హేళన చేసేది. ఇస్లామ్‌కు, కాశ్మీర్‌కు ద్రోహులుగా పేర్కొనేది. ముఫ్తీ మహమ్మద్ కాంగ్రెసును వీడి జనతా పార్టీలో చేరి, ఆ తర్వాత స్వంత కుంపటి పీడీపీని పెట్టాడు. జాతీయ భావాలు ఉన్నవారిని చేరదీయడానికి బదులు- వారిని జాతి వ్యతిరేకులుగా కాంగ్రెస్ తయారు చేసింది.
నెహ్రూ ఆనాడే ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళి ఉంటే అత్యధికులు భారత్‌లో విలీనానికి ఒప్పుకొనేవారు. నెహ్రూ అనాలోచితంగా సమస్యను అంతర్జాతీయం చేశాడు. తమ చారిత్రక తప్పులకు క్షమాపణ చెప్పుకోవడం మానేసి, 370వ అధికరణ రద్దును కాంగ్రెస్ వ్యతిరేకించటం, దాని మిత్రపక్షాలు వత్తాసు పలకటం దిగజారుడు తనానికి నిదర్శనం. ఐక్యరాజ్యసమితికి కశ్మీర్ సమస్యపై నెహ్రూ చేసిన అభ్యర్థనను మోదీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవటం కూడా ఎంతో అవసరం.

-డా. బి.సారంగపాణి