సబ్ ఫీచర్

మావోల అమరత్వం.. నిరర్థకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావోయిస్టుల ‘అమరవీరుల సంస్మరణ వారోత్సవం’ చివరి రోజున (ఆగస్టు 3) వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా సీతాగోట వద్ద ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోలు మరణించారు. వీరిలో ఐదుగురు మహిళా గెరిల్లాలుండటం గమనార్హం. కీలక నేత సుఖ్‌దేవ్ మృతుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ తాజా ‘అమరత్వం’తో మావోల ఆశయ సాధనలో ముందడుగు పడిందా? అని ప్రశ్నించుకుంటే, లేదనే సమాధానమొస్తుంది. అమాయక ఆదివాసీ మహిళల అమరత్వం వల్ల నష్టపోతున్నది ఆ వర్గాల వారే. అక్షరం రాని, అంకెలు తెలియని మహిళలకు ఆయుధాలు ఇచ్చి అడవిలో తిప్పితే, ఆదివాసీ సమాజం ‘అభివృద్ధి’బాటన పయనిస్తుందా? లేదు..! ఆ రకంగా వారి అమరత్వం నిరర్థకమనిపిస్తోంది.
ఏటా జూలై 28నుంచి ఆగస్టు 3వరకు జరిపే అమరవీరుల వారోత్సవం వల్ల ఎందరో అమాయకులు హతమవుతున్న ‘దృశ్యం’ స్పష్టంగా కనిపిస్తోంది. జూలై 27న వారోత్సవాల ప్రారంభానికి ముందురోజు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోలు మరణించారు. వారిలో ముగ్గురు మహిళలున్నారు. మరుసటి రోజున బాలంగి తోగ్ వద్ద ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు మరణించారు. అంతకు పది రోజుల ముందు దంతెవాడ జిల్లా గుమియాపాల్ ప్రాంతంలో ఇద్దరు మావోలు మృతి చెందారు. జూన్ నెల ఆరంభంలో ధంతరీ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోలు మరణించారు. వీరిలో ముగ్గురు ఆదివాసీ మహిళలే ఉన్నారు. సుకుమా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళ మరణించింది.
ఒక్క ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనే ఎందరో ఆదివాసీ మహిళలు మృత్యువు ఒడికి చేరారు. వీరి అమరత్వం వల్ల మావోలకు ‘రాజ్యాధికారం’ దక్కే అవకాశాలున్నాయా? అంటే- ‘శూన్యం’ అన్నదే సమాధానం. ఆమాత్రం దానికి ఇంత పెద్ద సంఖ్యలో ఆదివాసీలు, మహిళలు మరణించాలా? ఇన్‌ఫార్మర్ల పేర వారిని హతమార్చాలా?
కాగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉగ్రవాదంపై, తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ఇటీవల చెప్పారు. హోం మంత్రిగా ఉన్నపుడు రాజ్‌నాథ్ సింగ్ సైతం ఇదే వైఖరితో ముందుకు కదిలారు. లక్షమందికి పైగా జవాన్లతో భద్రతా బలగాలు దండకారణ్యంలో తిష్టవేశాయి. పొరుగు రాష్ట్రాల పోలీసులు, ప్రత్యేక పోలీసులు మావోల ‘ఏరివేత’కై రంగంలోకి దిగడంతో ఎన్‌కౌంటర్లు చోటుచేసుకుంటున్నాయి. అడవిలో గెరిల్లాలపై ఇలా దాడులు చేయడమే గాక, ‘అర్బన్ నక్సల్స్’గా పేరొందిన వారిని సైతం పాలకవర్గం కటకటాల పాల్జేసింది. అర్బన్ నక్సల్‌గా ముద్రపడిన ‘విరసం’ నేత వరవరరావు జైలులో ఉన్నారు. సహాయ ప్రొఫెసర్ సాయిబాబా బందీ అయ్యారు, కోబడ్‌గాంధీ కటకటాల పాలయ్యారు. ప్రధాని మోదీ హత్యకు ‘కుట్ర’ పన్నారన్న ఆరోపణపై మరెందరో అర్బన్ నక్సల్స్ పోలీసుల నిర్బంధంలో ఉన్నారు. వాతావరణం ఇంత ప్రమాదకరంగా కనిపిస్తున్నా ఇంకా రాజ్యాధికారం పేర- దండకారణ్యంలో దండు ఏర్పాటు చేసేందుకు ‘కసరత్తు’చేస్తే ఏమిటి ప్రయోజనం? మరింత రక్తపాతం కోసమేనా?
ఛత్తీస్‌గఢ్ నుంచి మావోలను తరిమేసేందుకు సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్టల్ల్రో బలగాలు భారీగా మోహరించిన వైనం కనిపిస్తోంది. మానవ వనరులేగాక, సాంకేతిక వనరుల ఆధారంగా వారిని అణచివేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను పెంచుతూ ద్విముఖ వ్యూహంతో ముందుకెళుతున్న ప్రభుత్వాన్ని మావోలు ఓడించి- ‘ఎర్రకోట’పై ఎర్రజెండా ఎగురవేయగలరా? అది జరిగే పనికాదని మాజీ మావోలు సైతం అంగీకరిస్తున్నారు. మరి ఆమాత్రం దానికి ఇంత రక్తపాతం జరగాలా? అభం-శుభం ఎరుగని వారి సంతానం ‘అడవిపాలు’కావాలా? ఇంతటి మానవ విధ్వంసం, రక్తపాతం, వనరుల ధ్వంసం మావోల ‘అధికార దాహం’ కోసం జరగాలా? ఈరోజు కాకున్నా మరి కొన్ని రోజులకు ‘అనుకూల వాతావరణం’ ఏర్పడగలదన్న ఆశ వీసమెత్తులేదు. దేశం, ప్రపంచం మరోవైపున పయనిస్తోంది. నియంతృత్వాలను తిరస్కరించి ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. ఆ చిత్రాన్ని అందరూ తిలకిస్తున్నారు. ఆ ప్రక్రియలో ప్రజలు ఒదిగిపోతున్నారు.
గత దశాబ్ద కాలంలో జరిగిన ఎన్నికల్లో ఈ ‘దృశ్యం’ స్పష్టంగా కనిపిస్తోంది. మరలాంటప్పుడు సాయుధ పోరాటానికి, గెరిల్లా దళాలకు, ‘లాంగ్ మార్చ్’కు, సమాంతర సైన్యానికి తావెక్కడుంది? ఇది చాలా సింపుల్ ప్రశ్న. ఈ విషయాన్ని అవగాహన చేసుకున్న అనేక మంది మావోలు ఇప్పటికే ప్రధాన జనజీవన స్రవంతిలోకి వచ్చారు. తమ తమ అభిప్రాయాలు, భావనలు బలంగా వినిపించారు, వినిపిస్తూ ఉన్నారు. వారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులూ ఉన్నారు. వారి అభిప్రాయాలను మావోలు పరిగణనలోకి తీసుకోవాలి కదా? ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాల్ని మార్చుకోవాలి కదా? అలాగాకుండా అప్పుడెప్పుడో మావో చేసిన ప్రవచనాలను, లాంగ్ మార్చ్ అనుభవాలను ఆధునిక సమయంలో ‘అచ్చుగుద్దినట్టు’ ఆచరిస్తామనడం వివేకమా?
ప్రజలపై అపార ప్రేమగల వారమని చెప్పుకునే మావోలు పాతికేళ్లుగా ఆదివాసీలను తమ రాజ్యకాంక్ష కోసం నిచ్చెన మెట్లుగా ఉపయోగించుకోకుండా- వారి ఆర్థిక, సామాజిక, విద్యావిషయాలపై శ్రద్ధపెట్టి సాధికారికులుగా మలిస్తే ఎంతో మేలుచేసిన వారయ్యేవారు. అలాగాక వారి అజ్ఞానం, దారిద్య్రాన్ని ఆసరాచేసుకుని ‘జనతన సర్కారు’ పేర వివిధ కమిటీలు ఏర్పరచడం వల్ల వారి ఉత్పాదకత పెరుగుతున్నదా? వారిలో కొనుగోలుశక్తి పెరిగిందా?
కొనుగోలు శక్తి పెరగనంత కాలం ఎన్ని దళాలు నిర్మించినా, ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కమిటీలు వేసి సమావేశాలు నిర్వహించినా వారికి దక్కేది హళ్ళికి హళ్ళి... సున్నకు సున్నా మాత్రమే! ఆదివాసీల ఆవాసాలను మావోలు ముట్టడించి, స్థావరాలు ఏర్పరచుకుని అధికారం కోసం తాపత్రయ పడుతూ ఎత్తుగడలు వేస్తే ఒరిగేది ఏమీ ఉండదని గత 50 ఏళ్ళ ‘నక్సల్‌బరీ ఉద్యమం’ చెబుతోంది. ఆత్మవిమర్శ చేసుకుని- విశే్లషించుకుని ప్రజల సాధికారత పెంచినవాడే నిజమైన విప్లవకారుడవుతాడు తప్ప- అమాయక మహిళలకు ఆయుధ శిక్షణ ఇచ్చి, ఆలీవ్ దుస్తులు ధరింపజేసి భద్రతా బలగాల ముందుకు పంపే వారెలా విప్లవకారులవుతారు? అహం, ఆయుధం సాధికారతను పెంచవు. వర్తమాన జ్ఞానమే సాధికారతకు కేంద్ర బిందువు. ఈ విషయం స్పష్టంగా అంతటా దృగ్గోచరమవుతోంది. దాన్ని పరిశీలించాలి కదా? అహాన్ని వీడాలి కదా? ఆయుధాలకు పాతరేయాలి కదా? జ్ఞానం వైపు కదలాలి కదా? దీన్ని విస్మరించినంత కాలం, ‘సమాంతర’ పేర ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నిష్ఫలమే! ప్రజల పట్ల నిజాయితీతో కూడిన ప్రేమ- వారి అభ్యున్నతికై పట్టుదల ఉంటే- వారికి నాల్గవ పారిశ్రామిక విప్లవ ఫలితాలు అందేలా చూడటం ముఖ్యం. ఛత్తీస్‌గఢ్‌లో, దండకారణ్యంలో కారుణ్యం లేకుండా కొనసాగుతున్న ఈ రక్తపాతం, అమరత్వం, ఆయుధ భాష, త్యాగాల వల్ల- ‘సాధికారత’ను ఆదివాసీలు అందిపుచ్చుకోలేరు. అది జరగనప్పుడు ఎన్ని ‘ఆదర్శ’ పన్నాలు వల్లించినా ఏమి లాభం? ప్రజల జ్ఞాన ఉద్దీపన జరగదు. వాస్తవానికి మావోల ఉద్యమం ఆదివాసీల సాధికారత కోసం జరగాలి తప్ప తమ ‘రాజ్యాధికారం’ కోసం కాదు. తమ రాజ్యాధికారం పేర ఆదివాసీలను బలిపశువులను చేస్తే ఎలా? అటవీ ప్రాంతాలను ఇలా వారి రక్తంతో ఎర్రబార్చితే ఎలా?...

-వుప్పల నరసింహం 99857 81799