సబ్ ఫీచర్

చేనేతకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంటికి కనిపించని వేల పోగులను ఒక్కటిచేసి రంగులతో అందాలు అద్ది, పోటీ ప్రపంచంలోనూ మేటి డిజైన్లు వేసి, చేతి నైపుణ్యంతో అందమైన చీరలను తయారుచేయడం నేతన్నకు ఎవ్వరూ చెప్పని విద్య. గ్రామీణ భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికులకు జీవనాధారమై నిలచిన అపురూప కళారంగం చేనేత. ‘్భరతావని ఆత్మకు ప్రతీకగా చేనేత రంగాన్ని అలనాడు బాపూజీ అభివర్ణించారు’. కానీ నేడు ఆ చేనేత రంగం అనేక సమస్యలు, సవాళ్లతో ఉక్కిరిబిక్కిరవుతోంది. వృత్తిని నమ్ముకుని జీవనం సాగించే నేతన్నలు.. వారు తయారుచేసిన చీరలను అమ్ముకోలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. నేసిన చీరలు అమ్ముడుపోక కార్మికులు.. కొనుగోలు లేక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అగ్గిపెట్టెలో ఆరు గజాల చీరను ప్రపంచానికి అందించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. అంతేగాక అగ్గిపెట్టెలో పట్టుచీర మలచిన అద్భుత కళానైపుణ్యం మన నేతన్న సొంతం. నేతన్నలు నేసిన చీరలకు ఎల్లలు దాటిన ప్రాశస్త్యం ఉంది. కానీ బడ్జెట్‌లో చేనేత రంగానికి తగినంత నిధులు కేటాయించకపోవడం, చేనేత కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంవల్ల, ఎందరో చేనేత కార్మికులు చేతినిండా పని దొరక్క వీధినపడి ఆకలి చావులు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక ఇతర ప్రాంతాలకు కార్మికులు వలసపోయారు. ఇక్కడే వున్న చేనేత కార్మికులకు చేతినిండా పనిదొరక్క, నేసిన బట్టకు గిట్టుబాటు ధర రాక, ఆకలి చావులు, ఆత్మహత్యలతో చేనేత పరిశ్రమ క్షీణించింది. తెలంగాణ చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అనేక చర్చలు చేపట్టింది. ఈ క్రమంలో చేతి మగ్గాల మీద శాస్ర్తియ అధ్యయనం చేయించి తెలంగాణలో 16,776 చేనేత మగ్గాలు ఉన్నట్లు గుర్తించారు.
సొసైటీల పరిధిలో మగ్గాలు 5,505 ఉన్నట్లు లెక్కలో తేలింది.
అసోం, పశ్చిమ బంగ, తమిళనాడు తరువాత అత్యధికంగా చేనేత మగ్గాలున్న తెలుగు రాష్ట్రాల్లో రాట్నమున్న ఏ ఇంటిని పరికించినా విషాదగాథలు కదిలిస్తాయి. అమెరికా, ఐరోపాల్లో మన చేనేత వస్త్రాల నాణ్యతకు ప్రశంసలు లభిస్తున్నా చైనా, టర్కీ, వియత్నాం ప్రభృత దేశాలకు ఉత్పత్తి ధరలో పోటీ ఇవ్వలేకపోవడం భారత బ్రాండును కృంగదీస్తోంది. దాదాపు మూడొంతుల కార్మికులు నూలు, రసాయనాల కాలుష్యంవల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు. వినూత్న డిజైన్లలో చేనేత వస్త్రాల లభ్యత పెరిగితే దేశీయంగా, ఆన్‌లైన్‌లో విక్రయాలు జోరెత్తే అవకాశాలు మెండుగా ఉంటాయి. చేనేత అంటే అదొక సంప్రదాయ వస్త్రం అనుకోవడంలో అమ్మకాలు తగ్గిపోతున్నాయి. అమ్మకాలమీదే చేనేత కార్మికుల వేతనాలు ఆధారపడి ఉండడం దురదృష్టకరం.
జాతీయ చేనేత దిన ఆవిర్భావం
భారత స్వాతంత్య్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం వచ్చింది. మొదటిసారిగా పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తాలోని టౌన్‌హాల్‌లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి విదేశీ వస్త్రాలను బహిష్కరించడంతోపాటు దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. అలా విదేశీ వస్తుబహిష్కరణలో కీలకపాత్ర వహించిన చేనేత రంగానికి గుర్తింపునిస్తూ ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా జరుపబడుతుంది. గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకటానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత రంగానికి ఒక రోజు ఉండాలన్న ఉద్దేశ్యంలో జాతీయ చేనేత దినోత్సవంను ఏర్పాటుచేయడం జరిగింది. 2015 సంవత్సరం ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ దినోత్సవాన్ని ప్రారంభించి, భారత చేనేత లోగోను ఆవిష్కరించడంతోపాటు ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. చేనేత రంగం అంటే భారతీయ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు దర్పణం. దేశంలో కోటి 30 లక్షల మందికి ఈ రంగం ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నది. పరోక్షంగా మరో 9 కోట్లమంది ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. దేశంలో తయారవుతున్న వస్త్రాల్లో చేనేత వాటా 23 శాతం. చేనేత రంగంలో జాతీయ స్థాయిలో వేగంగా అభివృద్ధి సాధించడానికి 1983లో భారత ప్రభుత్వం జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ నెలకొల్పింది. చేనేత రంగానికి అవసరమైన రంగులు, రసాయనాలు, ముడి పదార్థాలకు సబ్సిడీపై అందించడమే దీని ప్రధాన లక్ష్యం.
మార్కెటింగ్ సౌకర్యం
నిజానికి మిగతా వస్త్రాలతో పోలిస్తే, చేనేత వస్త్రాల ఉత్పత్తి తక్కువ చేనేత ఉత్పత్తుల్లో, వాటి తయారీలో, మార్కెటింగ్‌లో మార్పులు రావాలి. అందుకు వినూత్నమైన పద్ధతులు అవలంభించాలి. తెలంగాణలో మొత్తం 40వేలమంది చేనేత కళాకారులు ఈ వృత్తిమీద ఆధారపడినట్లు గతంలోని గణాంకాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పత్తయ్యే విభిన్న వస్త్రాలను సిద్ధిపేట గొల్లభామ చీరలు, గద్వాల చీరలు, పోచంపల్లి ఇక్కడ టెస్కో ద్వారా కొనుగోలు చేసి మార్కెట్‌లోకి పంపిస్తున్నారు.
ప్రపంచానికి వస్త్రాన్ని అందించి నాగరికతే నడకలు నేర్చిన చేనేత రంగం ప్రస్తుతం కష్టాలు, కన్నీళ్ళతో ఆకలి చావులతో కొట్టుమిట్టాడుతుంది. ఒకప్పుడు మగ్గం చప్పుళ్ళతో కళకళలాడిన గ్రామాల్లో నేడు నిశ్శబ్దం ఆవరిస్తుంది. చేనేత కార్మికుల గౌరవాన్ని ప్రతిబింబించేలా చేనేత రంగం విశిష్టతను తెలియజేస్తూ 2012 నుంచి ప్రతి సంవత్సరం చేనేత కార్మికులకు సంత్ కబీర్ అవార్డులను అందిస్తున్నారు. రెడీమేడ్ దుస్తుల ప్రభావంవల్ల మరమగ్గాల ఊసే కనరుమరుగవుతోంది. ప్రతి నేతన్నకు కావలసిన సౌకర్యాలను కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. రానున్న రోజులలో చేనేత వస్త్రాలకు నిలయం భారత్ అనే విధంగా పేరు ప్రతిష్ఠలు రావాలి. మిల్లు వస్త్రాల ఉత్పత్తులు ఎన్నటికీ చేనేత ఉత్పత్తులకు ప్రత్యామ్నాయం కావాలి. తెలంగాణలో కార్మికుల సంక్షేమం, వారి జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రధాన లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి. అవే చేనేత మిత్ర, పొదుపు వెల్ఫేర్ స్కీమ్స్! అంతరించిపోతున్న వస్త్రాలకు కొత్త రూపాన్ని ఇచ్చి తిరిగి విపణిలో గుర్తింపు పొందేలా చేయాలనేది తన ఆలోచన అని తెలంగాణ రాష్ట్ర హాండ్‌లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ డైరెక్టర్ శైలజా రామయ్యర్ ఇటీవల తెలియజేయడం సంతోష పరిణామం. తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో) తెలంగాణ రాష్ట్రంలోని చేనేత రంగ అభివృద్ధికోసం ఏర్పాటుచేయబడిన సంస్థ. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సహకార సంఘం (ఆప్కో) నుండి విడిపోయింది. తెలంగాణలో దాదాపు 380 ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిల్లో సుమారుగా 13వేలు చేనేత కార్మికులు చేనేత రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీరందరికీ పని కల్పించడమే టెస్కో లక్ష్యం. పోచంపల్లి, గద్వాల, నారాయంపేట, వవరంగల్, కరీంనగర్‌లలో ప్రధాన చేనేత క్లస్టర్లు ఉన్నాయి. ఉత్తరభారతదేశంలో 9, తెలంగాణ రాష్ట్రంలో 37శాఖలను టెస్కో నిర్వహిస్తోంది.
వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలు
చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు వారంలో ఒక రోజు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రజలందరూ చేనేత వస్త్రాలను వినియోగించాలని నాటి చేనేత మంత్రి కెటిఆర్ ప్రోత్సహించారు.
చేనేత లక్ష్మి పథకం
తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకునే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ఈ చేనేత లక్ష్మి పథకం. చేనేత లక్ష్మి పథకంలో వస్త్రాలను తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘ షోరూంలలో కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ.1000/- వంతున నాలుగు నెలలు రూ.4000/- చెల్లిస్తే తదుపరి రూ.5400/- విలువైన వస్త్రాలు అందిస్తాడు.
మన చేనేత రంగం విభిన్నమైనదే కాకుండా పర్యావరణ హితమైనది. గతంలో కెటిఆర్ మంత్రిగా ఉన్నపుడు ప్రతి సోమవారం హ్యాండ్లూమ్స్ డేగా ప్రకటించారు. చేనేత రంగ పరిరక్షణకు నిపుణులు చేసిన సిఫారసును అమలు చేస్తే చేనేత కార్మికుల జీవితాలు బాగుపడుతాయి. నిరుద్యోగ యువత చేనేత వృత్తివైపు ఆసక్తి కనబర్చడంలేదు. వారికీ ఆధునిక డిజైన్లలో వస్త్రాల స్థాపనకు రాయితీపై రుణ సదుపాయం కల్పిస్తే చేనేత రంగం మళ్లీ ఒక వెలుగు వెలగగలదు.
వారసత్వ సంపదగా సంక్రమించిన చేనేత వృత్తిని మరియు సంస్కృతిని కాపాడే నేతన్నలు పోచంపల్లి, ఇక్కత్, గద్వాల్ చీరలు, నారాయణపేట, సిద్ధిపేటలో గొల్లభామ చీరలు నేస్తారు. అమెరికాలోని వైట్‌హౌస్‌లో పోచంపల్లి వస్త్రాలను ఉపయోగిస్తున్నా కానీ, భారతదేశంలో చేనేత వస్త్రాలకు గుర్తింపు లభించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం చేనేత లక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. సహకార సంఘాలకు అవసరమైన మూలధనాన్ని పావలా వడ్డీరూపంలో అందించడమే కాక, 50 సం.లు పైబడిన చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు మంజూరు చేస్తుంది. నేత వృత్తిని ఆధారంగా చేసుకుని జీవించే పద్మశాలీలు మరియు ఇతర కులాలవారు గౌరవంగా బతికే విధంగా చర్యలు తీసుకోవాలి. నారాయణపేట, గద్వాల, పోచంపల్లి తదితర ప్రాంతాల్లో కళాత్మకమైన పట్టువస్త్రాలు నేస్తారు. వాటిని ప్రోత్సహించి చేనేతవారు గౌరవంగా బతికే రోజు వస్తేనే చేనేత దినోత్సవ సార్థకత.

-కె.రామ్మోహన్‌రావు 9441435912