సబ్ ఫీచర్

శ్రుతిమించిన ‘రియాల్టీ షో’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబ సభ్యులంతా కలసి చూసే టీవీ కార్యక్రమాలపై ఇటీవల విమర్శలు హోరెత్తుతున్నాయి. చెడు పోకడలు చూపే కార్యక్రమాల వల్ల పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రభావం కచ్చితంగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా టీవీ చానళ్లలో రియాల్టీ షోలు, డ్యాన్స్ షోలు ఎక్కువైపోవడం.. అందులో కొన్ని కార్యక్రమాలు మరీ శ్రుతిమించి ఉండడంతో ప్రజల్లోనూ ఆందోళన మొదలైంది. రియాల్టీ షోలలో పిల్లలు చేసే డాన్సులను, పొట్టి డ్రెస్సులతో అసభ్యంగా చూపిస్తున్న సంఘటనలు ఎక్కువయ్యాయి. కొన్ని షోలలో పిల్లలను చూపిస్తున్న విధానంపై విమర్శలు వస్తున్నాయి. అయితే.. పెద్దలు వేసే స్టెప్పులు పిల్లలతో వేయించడం వల్ల వారి మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
ఆధునిక యుగంలో అన్నిరకాల సాధనాలతో మనిషి సకల సౌకర్యాలను అనుభవిస్తున్నాడు. ఆనందానికి,కాలక్షేపానికి,వినోదానికి కావలసిన వస్తువుల జాబితాలో టీవీ చేరిపోయింది. రోజంతా కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరూ సాయంత్రం ఇంటికి వెళ్ళడంతో టీవీలకు అతుక్కుపోతుంటారు. ప్రస్తుతం టీవీలలో వస్తున్న పలు సీరియళ్లు మన జీవితాలతో, అనుబంధాలతో ముడిపడి వున్నాయి. గతంలో కొన్ని సీరియల్స్ ప్రసారం జరిగినప్పుడు పిల్లలు నాలెడ్జ్‌ను సొంతం చేసుకునే వారు. ఆ సీరియల్స్ ద్వారా సమాజంలో మార్పు జరిగి అభివృద్ధిపథంలో ప్రయాణించడానికి దోహదం చేసేవి. ఇంటిల్లిపాదికి ఉపయోగపడేవిగా ఉండేవి.
రియాల్టీ షోలతో పిల్లల్లో దాగున్న సామర్థ్యాన్ని వెలికితీసే ప్రయత్నం చేయవచ్చు. వీటిలో చిన్నారులు చాలా ఉత్సాహంగా పాల్గొనడం సహజం. వారిలో దాగివున్న నైపుణ్యాలను సానబెట్టడానికి ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయి. పిల్లల్లో సాధించాలనే కసి పెరుగుతుందనడంలో సందేహం లేదు. కానీ ఈ రియాల్టీ షోలలో తగుజాగ్రత్తలు తీసుకొనకపోతే తీవ్రమైన నష్టాన్ని ఎదర్కోవాల్సి వస్తుంది.
బాల్యం అమూల్యం..
పిల్లలు శారీరకంగా, మానసికంగా అతి మృదువైన స్వభావం కలవారు. రియాల్టీషోల పేరుతో చిన్నపిల్లల చేత వారి శక్తిసామర్థ్యాలకు మించి పనులు చేయిస్తే- వారు మానసికంగా బలహీనపడతారు. పిల్లలు తమ చదువులు, ఆనందాన్ని వదిలి రియాల్టీ షోలపై శ్రద్ధవహించడంతో వారు ఎంతో విలువైన సమయాన్ని, అమూల్యమైన బాల్యాన్ని కోల్పోతారు. రియాల్టీ షోల ద్వారా డబ్బు, గౌరవం, పేరులాంటివి వారిని చిన్న వయస్సులోనే పెద్ద మనుషులుగా మార్చేస్తుంది. ఎప్పుడైనా వారు రియాల్టీ షోలలో గెలుపు పొందలేకపోయినప్పుడు వారి మానసిక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వారి జీవితంపై తీవ్ర దుష్ప్రభావం చూపే పరిస్థితి ఉంటుంది. పిల్లలు చేసే చిన్నచిన్న తప్పులను కూడా విమర్శించి వారిలోని లోపాలను ఎత్తిచూపడం వల్ల అది వారి మనసులో జీవితాంతం అలాగే ముద్రపడిపోతుంది.
బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రియాల్టీషోలో పాల్గొనే పిల్లల వయస్సులో మార్పులు చేయాలి. పది సంవత్సరాలలోపు వయసు కలిగిన పిల్లలు ఇలాంటి రియాల్టీషోలలో పాల్గొననీయకుండా ప్రభుత్వం చట్టాలను రూపొందించాలి. పిల్లల్లోని శారీరక లోటుపాట్లను ఎత్తి చూపడం లాంటివి చేయకూడదు. కార్యక్రమాలలో పాల్గొనే న్యాయ నిర్ణేతలు సంయమనంతో మాట్లాడాలి. న్యాయ నిర్ణేతలు మాట్లాడే మాటలు పిల్లల్లో విలువలను పెంపొందించే విధంగా ఉండాలి. పిల్లల్లో ఒకరిని ఎక్కువగా మరొకరిని తక్కువగా చూడటం సరికాదు. ప్రతి పిల్లవాడు ప్రత్యేకం. ప్రతి ఒక్కరిలో అన్నీ సామర్థ్యాలు ఉండాలని లేదు. చిన్న పిల్లలు పాల్గొనే షోలు ఫ్యాషన్ షోలుగా ఉండకూడదు. పిల్లలను ఎలిమినేషన్ రౌండ్‌లో చూపే దృశ్యాలు పదే పదే చూపడం వల్ల వారిలో మానసిక కుంగుబాటు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

-డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి