సబ్ ఫీచర్

కలలో కర్ణుడు.. వ్యథ తొలగిన జాషువా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాకవి జాషువాగారు కర్ణుని గురించి ‘భారత వీరుడు’ అనే శీర్షిక క్రింద తమ మూడు ఖండ కావ్యాలలో మూడుచోట్ల 25 పద్యాలు రాశారు. ఆ పద్యాలన్నింటిలో ఉత్ప్రేరకములు, స్ఫూర్తిదాయకములు, మూల బీజములు అనదగిన పద్యాలను కర్ణునికి సంబంధించినవే అయినా మరో 8 పద్యాలను తమకు వచ్చిన స్వప్నవృత్తాంతంగా ‘‘నా కథ’’లో ‘‘వ్యథా ఘట్టములు’’లో చెప్పుకున్నారు.
కర్ణునికి సంబంధించిన, జాషువాగారికి వచ్చిన ‘కల’ను పూర్వోత్తర సందర్భాలను జోడించి ఆయన చెప్పిన 21 పద్యాల సారాంశాన్ని యథాతథంగా వచనంలో సామాన్య పాఠక జనాదరణకు అనుకూలంగా ప్రస్తావిస్తాను. ఈ కథనమంతా జాషువాగారు చెపుతున్నట్లుగానే సాగుతుంది.
ఒకసారి వినుకొండలో కొప్పరపు సుబ్బారాయకవి ఆశుకవిత్వం చెప్పారు. అది చూచి ఆయనను ప్రశంసిస్తూ ఆయనపై భయంభయంగానే నేనూ పద్యాలు చెప్పాను. అప్పటికప్పుడు ఒక కాగితంమీద రాసుకున్నా. ఆ కవిగారికి నా పద్యాలు అందించాలి. ఎలా? మార్గం తెలియక సభాప్రాంగణంలో తారాడుతూ వుంటే ఒక బ్రాహ్మణ మిత్రుడు నన్ను చూచి ‘ఓ బాలకవి మిత్రమా! ఇలా రా! అలా దూరంగా నిలబడతావెందుకు? భవిష్యత్తులో (రేపు) నీ నాలుకపై వాణి ప్రశంసాపత్రమైన వాక్కులతో ప్రకాశిస్తుందయ్యా!’- అని, ఇంకా ఇలా అన్నాడు. ‘కళారాజ్యంలో కుల మత విద్వేషాలు తలసూపని చోట్లేలేవు. చెలికాడా! కవితాకళ చిరంజీవియై వర్ధిల్లేచోటు సామాన్యమైన ప్రదేశం కాదు. అది స్వర్గంతో సమానం. ఇదిగో, ఇక్కడ గుమిగూడివున్నారే ఈ జనమంతా రసజ్ఞులు కాదు. కొందరు ఉద్యోగస్థులు. కొందరు తెలిసీ తెలియని సగం సగం జ్ఞానులు. కొందరు మోక్షజ్ఞానం లేని బైరాగులు. ప్రకాశించే సరస్వతీమూర్తుల్లా మాట పొంకంకలవారు ఇదిగో వీరు- అని నిర్ణయించే సమర్థులు, యోగ్యులు ఇక్కడ లేరయ్యా! ఎందుకు భయపడతావు? అని నా రెక్క పట్టుకొని, నా జంకును గ్రహించి సభాసదులందరూ ఆశ్చర్యపడే విధంగా వేదికపై వున్న కొప్పరపు కవిగారివద్దకు నన్ను తీసికెళ్ళి ఆయనకు నన్ను పరిచయంచేసి నా కోరికను అతనికి విన్నవించాడు.
స్వర్ణకంకణ హస్త్భూషితుడైన ఆ కవి ‘ఓహో! ఈ ఊరిలోకూడా పనికొచ్చే కుర్రాళ్ళున్నారా!’- అని సదాశయంతోనే పల్కుతూ చిరునవ్వు నవ్వుతూ ఆదరంగా నా పద్యాల కాగితం అందుకున్నాడు.
ఇంతలో సభలో కలకలం బయలుదేరింది. ‘ఎవరీ అభాగ్యుడు. ఈ తక్కువ కులంవాడు ఈ సభలోనికి ఎలా జొరబడినాడు?’- అని సభలోని వాళ్ళంతా తమలోతాము తర్కించుకుంటున్నారు. అంతటితో ఆగలేదు, పది మంది సభికులు చివాలున లేచి సహించలేక సభనుండీ నిష్క్రమించారు. నల్గురూ నాలుగు మాటలంటూ వుంటే బదులివ్వలేక నన్ను వేదికపైకి తెచ్చిన మిత్రుడు కూడా సవర్గంతో పేచీ ఎందుకనుకున్నాడోయేమో? వౌనంగా తోకముడిచాడు. పగబట్టిన పాముల్లా తక్కిన సభాసదులు నావైపు చురచురా చూస్తున్నారు. ఆ చూపులు నన్ను గెంటేస్తుంటే ఏదో చెప్పలేనంత ఘోరమైన అపరాధం చేసినవాడిలా నేను నా ఇంటికి వచ్చేశాను.
ఇంక ఆ రోజు ఇల్లుదాటి బయటకు కదలలేదు. చెలరేగుతున్న అగ్నిలా మానసగ్లాని దహిస్తూ వుంటే, అన్ని అవయవాల రోమరోమాల్లోనూ పరాభవంతో పొంగే వేడి పొగలు గ్రక్కుతూ వుంటే, నా జన్మనే ఛేదిస్తున్న దుఃఖంతో, అన్నం కూడా తినకుండా ఆరోజు కాలం గడిపాను.
కంటికి నిద్ర రావడం లేదు. అలముకున్న చింతతో పక్కపై అటూ ఇటూ దొర్లుతున్నా. ఇంకా ఇలా కాదనుకొని, హృదయంలో ఉద్భవించిన దుఃఖం తొంగిపోవడానికి కాంతివంతమైన తెలుగు కవిత్వమరంద ధారలను చిలకరించిన కవిత్రయం వారి మహాభారతం తీసుకొని అందలి రసవద్ఘట్టాలను వరుసగా చదవడం ప్రారంభించా. నాలో వున్న అనంత దుఃఖాన్ని మరచిపోతూ కురు కుమారుల శస్త్రాస్త్ర విద్యాప్రదర్శన ఘట్టం తీశా. ఆ రాజదర్బారు మొత్తం అర్జునుని పరాక్రమాన్ని కీర్తిస్తూ అతనికి జేజేలుపల్కుతోంది. అంతటి ప్రతికూల వాతావరణంలో కూడా అర్జునునితో పోటీకి సిద్ధంగా, ధైర్యంగా ముందుకువస్తున్న నిర్భాగ్యుడైన కర్ణుని దీనత్వాన్ని ప్రతిబింబించే సన్నివేశాల్ని చదువుతూ చదువుతూ అలాగే నిద్రలోకి జారుకున్నా. కలగంటున్నా. పిరికితనం అనేదేమిటో తెలియని విశాల వక్షస్థలంపై కండలు ఉన్నతంగా ఉబికి దర్శనమిస్తున్నాయి. ఉట్టిపడే నవవనాన్ని కోడె వయస్సును కమనీయమైన మీసకట్టు పట్టిస్తోంది. నున్నగా మిసమిసలాడే చందమామ పక్కెలు అనబడే చేపల లాగా ప్రకాశిస్తూ ఇంతలేసి కనులు కన్పిస్తున్నాయి. అర్ధ చంద్రునికున్న వంకలనే దిద్ది చదునుచేస్తున్నదా అన్నట్లుగా విశాలమైన ఫాలభాగం కాంతులీనుతోంది.
ఐదుమంది పాండవులయొక్క తేజాన్ని మొత్తం గుత్తకు గొన్న విధంగా అతడొక్కడే అపహరించాడట. ఆ దివ్యరూపం ప్రజల్ని సమ్మోహితుల్ని చేస్తోందట. కన్నతల్లి కుంతీదేవి స్తనాల్లో పాలు పరవళ్ళు ద్రొక్కుతోందట. అటువంటి సూర్య తనయుడైన కర్ణుడు అస్తశ్రస్త్ర విద్యాప్రదర్శనా రంగస్థలం మధ్యకు వచ్చి నిలిచాడట. అప్పుడు దట్టమైన నీలిమేఘాల పరదాలు తొలగించుకొని సుప్రసన్నుడై తన కుమారుని చూడాలనే వేడ్కతో ఆకాశంలో సూర్యుడూ, అకారణమైన ఆదరభావంతో నిర్హేతుకంగా సభాసదులూ, వస్తున్న ఆ కర్ణుని చూచారట.
కొంచమైనా దయలేకుండా తనకు జన్మించిన పసికందును యమునానదిలో వదిలినప్పటినుండి ఆ బిడ్డను మళ్ళీ దర్శించే ఆశలేక తహతహలాడే తల్లి కుంతి, ఇప్పుడు ఇక్కడ యుద్ధ విద్యాప్రదర్శనా స్థలంలో మంగళాకారుడైన తన పెద్దకొడుకును పనంతా ముగిసిపోయిన తరువాత మరుగున వుండి వెనుకచాటుగా చూసిందట.
ఆ నిల్చున్న వీరునిది కొంచమైనా కల్తీలేని పరాక్రమమట. అతని సుస్థిరమైన తేజోబలదర్ప సంపదలు అద్దంలో కన్పించినట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నాయట. మీసాలుమెలిపెట్టి, తొడగొట్టి, సవాలు విసురుతున్నాడట ఆ వీరుడు. అప్పుడు ఈర్ష్యావంతులైన భీష్మద్రోణులు ‘కులం’ అనే బ్రహ్మాస్త్రాలను ఉపయోగించి అతనిని అవమానించి పంపించారట.
శరీరాన్ని పదివేల రంపాలతో కోసినట్లయిందట. కోపంతో ఎర్రబడిన భయంకరమైన ముఖంతో సిగ్గుతో తలవంచుకున్నవాడై ‘న్యాయమెక్కడుంది? ఎక్కడైనా ఒక మూల దాక్కొని ఏడుస్తోంది?’ అని హృదయం ఆరాటం చెందుతూ వుంటే ఆ రాధేయుడు ఆ ప్రదేశం వదలిపెట్టి వెళ్ళిపోయాడట. సూర్యుడు కూడా వౌనంగా కనుమరుగయ్యాడట.
స్నేహితుడు ఆవిధంగా అవమానం చెందడాన్ని చూచి అలిగి సుయోధనుడు కూడా తన సోదర పరివారంతో వెళ్ళిపోయాడట. భరింపరాని విధంగా పదివేల కత్తులు ఒకేసారి కుంతి కడుపులో దిగబడినాయట.
‘‘ఓ కర్ణా! నీవు ఈడూజోడూ లేని, సాటిలేని వీరుడవు. పదునాల్గు లోకాలూ నిన్ను ప్రశంసిస్తాయి. ధర్మమెప్పటికీ చావదు. నీ ధనుశ్శక్తి ఒకరుకాదు, ఇద్దరు కాదు, పదివేల మంది పార్థులనైనాసరే అల్లాడిస్తుంది! రా! నిన్ను అంగరాజ్యానికి రాజును చేస్తాను. వెంటనే దుఃఖాన్ని విస్మరించి శత్రువులను మట్టుపెట్టే శక్తితో గర్జించు. ప్రజాలోకం సత్యాన్ని విస్మరించదెప్పుడూ. అసమానుడైన ఓ సూర్యకుమారా! నీ సహజ తేజాన్ని ఆ కుంతీ సంతానం ఆర్పగలదా? దుఃఖించకయ్యా! అంతేకాదు రేపు భవిష్యత్తులో నీ వీర చరిత్రతో నిత్యసాంగత్యం పెట్టుకొని సత్కవుల కోటి కలాలు నిన్ను ఒక్కుమ్మడిగా నుతిస్తాయి. ప్రశంసిస్తాయయ్యా!’’ అని దుర్యోధనుడు సూర్యకుమారుడైన కర్ణుని మనోవ్యథను తొలగించే మధురవాక్కులు నాతో చెపుతున్నట్లు, నేను వింటున్నట్లు కలగన్నాను. ఇది స్వప్నమని తెలిసికొని కన్నులు తెరిచాను.. అని అంటారు జాషువా.
ఇటువంటి కల వచ్చి చెదరిపోయి, మెలకువ వచ్చిన వెంటనే జాషువాగారు మహాభారత కావ్యకర్తల స్వభావాన్ని, వారి కవితాస్వభావాన్ని, తీరికగా గురుభావంతో పఠించారు. తిక్కన కల్పనా చమత్కృతిని, తెలుగు నుడికారాన్ని గమనించి ఆనంద పరవశుడయ్యారు. చెఱుకుముక్కల్లాంటి పద్దెనిమిది పర్వాలను పూర్తిగా ఆస్వాదించారు. మహాకవి అయ్యారు.

- డాక్టర్ అమళ్ళదినె్న వేంకటరమణ ప్రసాద్ 9440596127