సబ్ ఫీచర్

మనాలీ అందాలను మింగేస్తున్న కాలుష్య భూతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ ఒక అందమైన పర్వత ప్రాంతం. ఈ ప్రాంతాన్ని సందర్శించడం అంటే దేశ విదేశాల్లోని పర్యాటకులకు ఎంతో ఆహ్లాదం కలిగించే విషయం. అయితే, ఇటీవలి కాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన పర్యాటకులందరిలోనూ ఒకే ప్రశ్న మెదులుతోంది. అదేమిటంటే- ‘చిట్టచివరిసారిగా మనాలీ ప్రాంతాన్ని పరిశుభ్రంగా తాము ఎప్పుడు చూశాము?’అని. ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే. ఎందుకంటే మనాలీ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులకు ఇప్పుడు అక్కడ దర్శనమిచ్చేది ప్లాస్టిక్ సీసాలు, స్ట్రాలు, ప్లాస్టిక్ కవర్లు మొదలైన వ్యర్థ పదార్థాలతో కూడిన భారీ చెత్తకుప్పలే. ఇది పర్యాటకులలో పర్యావరణం పట్ల ఏమాత్రం శ్రద్ధలేకపోవడాన్ని తెలియజేస్తుంది.
మన దేశంలో పర్యాటకులు సందర్శించే పర్వత ప్రాంతాలన్నీ వారు పారేసే వ్యర్థపదార్థాలతో నిండిపోయి అసహ్యకరంగా తయారయ్యాయి. ఒకవైపు పర్యాటకుల తాకిడి కారణంగా పర్వత ప్రాంతాలలో వ్యర్థపదార్థాలు ఎక్కువౌతుంటే, మరోవైపువ్యర్థాలను తొలగించే వ్యవహారం స్థానిక ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది. వేసవి ఎండలకు తట్టుకోలేక చల్లటి పర్వత ప్రాంతాలలో నివసించాలనుకునే ఉత్తర భారతీయుల సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువౌతోంది. మనాలీ ఎత్తయిన పర్వత ప్రాంతం. చల్లగా హాయిగా ఉండే ఈ ప్రాంతం వేసవి కాలంలో ఎంతోమంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. మనాలీని సందర్శించడానికి వచ్చి, కొద్దిరోజులు అక్కడ గడిపే పర్యాటకుల సంఖ్య పెరగడంవల్ల ఇబ్బందేమీ లేదు. కానీ పర్యాటకులు వదిలేస్తున్న వ్యర్థపదార్థాల కారణంగా మనాలీ పరిసరాలు తీవ్రంగా కలుషితవౌతున్నాయి. పర్యాటకుల సంఖ్య అత్యధికంగా ఉండే వేసవి కాలంలో రోజుకు 30 నుండి 40 టన్నుల వ్యర్థపదార్థాలు మనాలీ పరిసరాలలో పేరుకుంటున్నాయి. ‘ఒక్క 2019 మే, జూన్ నెలల్లోనే రెండువేల టన్నుల వ్యర్థపదార్థాలు మనాలీ పర్వత పరిసరాల్లో పేరుకున్నాయి’ అని మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.
మనాలీ నుండి ధర్మశాల, ‘లే’ ప్రాంతాలకు వెళ్ళే మార్గాల్లో నిత్యం పర్యాటకుల సందడి ఉంటుంది. వాళ్ళు వాడి పారేసే ప్లాస్టిక్ బాటిల్స్ మొదలైన పదార్థాలతో అక్కడి పరిసరాలు కలుషితమవుతున్నాయి. కొండల్లా పేరుకుపోయిన వ్యర్థాలలో అధికశాతం పెద్దసంఖ్యలో ఇక్కడకు వచ్చే పర్యాటకులు పారవేసే ప్లాస్టిక్ పదార్థాలే. మనాలీ మున్సిపల్ కౌన్సిల్ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చేయడానికి బర్మానా వద్ద ఉన్న సిమెంట్ ప్లాంట్‌కి పంపిస్తుంది. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. మనాలీలోనే కాదు, ఈ జిల్లా మొత్తంలో వ్యర్థపదార్థాలు పెద్దఎత్తున పేరుకుపోయినందున, చెత్తనుంచి విద్యుత్తును ఉత్పత్తిచేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
‘పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు మనాలీలో రోజుకు 35 టన్నుల వరకు వ్యర్థ పదార్థాలు పేరుకుంటాయి. ఇతర సమయాల్లో రోజుకు పది టన్నుల వరకు వ్యర్థాలు పేరుకుంటాయి. వ్యర్థ పదార్థాల నుండి విద్యుత్తును ఉత్పత్తిచేసే కర్మాగారం మొదలైతే మేము ఎదుర్కొంటున్న పర్యావరణ పరమైన సమస్యలు చాలావరకూ పరిష్కారం అవుతాయి’అని నారాయణసింగ్‌వర్మ అంటున్నారు. ఈయన మనాలీ మున్సిపల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మనాలీ, కులూ ప్రాంతాల్లో పేరుకుపోతున్న వ్యర్థాల కారణంగా రాబోయే రోజుల్లో బియాస్ నదీ జలాల సంరక్షణకు అవసరమైన చర్యలన్నీ చేపట్టాలని వివిధ మున్సిపాలిటీలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఆదేశాలు జారీచేసింది.
ఒక్క మనాలీయే కాకుండా కోసల్, తోష్, బంజార్, సోలంగ్, వశిష్ట్, హిడింబ ఆలయం, మణికరణ్, తీర్థన్ వేలీ, జిభీ మొదలైన ప్రదేశాలను కూడా పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఒక్కోసారి స్థానిక ప్రజల కన్నా పర్యాటకుల సంఖ్య ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది. వ్యర్థపదార్థాల నిర్వహణను సులభతరం చేసుకోవడానికి మనాలీ పరిసర ప్రాంతాల్లో హోటళ్ల యాజమాన్యాలు వ్యర్థాలను వస్తుపరంగా వేరుచేసి తమకు అప్పగించాలని స్థానిక మున్సిపల్ కౌన్సిల్ కోరింది. దీనికి హోటళ్ల ప్రతినిధులు అంతగా స్పందించలేదు. అందువల్ల మనాలీ మున్సిపల్ కౌన్సిల్ హోటళ్ల నుంచి వ్యర్థ పదార్థాలను స్వీకరించడం మానేసింది. ఫలితంగా అక్కడి బహిరంగ ప్రదేశాలలో భారీఎత్తున వ్యర్థ పదార్థాల డంపింగ్ జరుగుతోంది. కులూ, భుంటర్‌నగర్ పరిసర ప్రాంతాల్లోని వ్యర్థ పదార్థాలను సేకరించి తెచ్చి పవర్ ప్లాంట్లలో దగ్ధం చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. అయితే సరైన డంపింగ్ యార్డ్ లేకపోవడంతో కులూ మున్సిపల్ కౌన్సిల్, భుంటర్‌నగర్ పంచాయతీలు వ్యర్థ పదార్థాల నిర్వహణ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాయి.

-ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690