సబ్ ఫీచర్

ప్రజాస్వామ్య భారతంలో ప్రతిపక్షాల చూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత ప్రజాస్వామ్య రాజకీయాలలో సార్వత్రిక ఎన్నికలు లేదా పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఏ స్థాయిలో అయినా కౌంటింగ్ అధ్యాయం తరువాత, విజయం సాధించిన అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలతో సమన్వయ, సహన, సహకార దృక్పథంతో వ్యవహరించవలసి వుంది. ఎన్నికలలో జయాపజయాలు సహజంగా అమిత ఉత్సాహాన్ని అధికార పార్టీలకు, తీవ్ర నిరాశానిస్పృహలను ఓటమి పొందిన ప్రతిపక్షాలకు కలిగిస్తాయి. 2019 ఎన్నికల అనంతరం కొలువుతీరిన చట్టసభల్లో వివిధ రాజకీయ పార్టీల నేతలలో వింత పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన శతాబ్ది పైగా చరిత్ర కలిగిన, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాహుల్, ఓటమికి బాధ్యత వహిస్తూ తప్పుకోవటం రాష్ట్రాల్లో వున్న కాంగ్రెస్ స్థితిగతులపై ప్రభావం చూపిస్తోంది. అధికార పార్టీ రాజకీయాలకు అత్యంత ప్రాధాన్యం యిచ్చే నడవడిక నెలకొన్న ప్రస్తుత పార్లమెంటు, అసెంబ్లీ సభ్యులలో తమను గెలిపించిన పార్టీపట్ల విధేయత, ఆ పార్టీకి ఓట్లువేసి గెలిపించిన ఓటర్ల పట్ల విశ్వసనీయత స్పష్టంగా కొరవడుతోంది. అదే విధంగా, మెజారిటీ స్థానాలు కైవశం చేసుకొని అధికార పీఠం ఆక్రమించుకొన్నా, ఏవో కుంటిసాకులతో గోడలు దూకే రాజకీయ ప్రత్యర్థులను తమలో కలుపుకొనే తాపత్రయ అనైతికతకు జాతీయ, ప్రాంతీయ పార్టీల అధికార నేతలు పాల్పడుతున్నారు. ప్రజాభిమానంతో ఎన్నికల రణరంగంలో ప్రతిపక్షాన్ని పూర్తిగా తుడిచిపెట్టి విజయం సాధించటం ఆహ్వానించతగ్గ పరిణామమే. కానీ కౌంటింగ్ తరువాత, చట్టసభలలో తమ మెజారిటీ యింకా పెంచుకోవాలనే తాపత్రయంతో, చట్టాల లొసుగులను ఆసరాగా చేసుకొని గోడలుదూకే వైఖరులను ప్రలోభాలతో ఆకర్షించి తమలో కలుపుకోవటం, జనాదరణతో సాధించిన స్వచ్ఛ ప్రవాహాలను కలుషితం చేసుకోవటమే అవుతుంది. ఏ పార్టీకీ, అధికార పీఠం ఆక్రమించగల సంఖ్యాబలం లేని పక్షంలోని అసెంబ్లీల పరిస్థితి, యిటువంటి వ్యవహారాలవల్ల కొంత చక్కబడినా ప్రస్తుత కర్నాటక శాసనసభ్యులు నిస్సిగ్గుగా చట్టం లొసుగుల ఆధారంగా వ్యవహరిస్తున్న స్వేచ్ఛా విధానాలు ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా అపహాస్యం పాల్జేసాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం ఆదేశాలు ఈ సంక్షోభ సందర్భంలో ప్రజాస్వామ్యానికి జీవం అందిస్తున్నాయి.
ప్రతిపక్షాన్ని గౌరవించని అధికార పక్షం
స్వాతంత్య్రానంతర గత దశాబ్దాలలో అధికార, ప్రతిపక్ష రాజకీయాలలో క్రమేపీ చోటుచేసుకొన్న బలహీనతలు, పార్టీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. ఆశయ, సిద్ధాంత కార్యాచరణ కేవలం జనశ్రేయస్సు సంక్షేమానికి పరిమితం కావటంతో ఆకర్షణలకు, ప్రలోభాలకు నాయకులు ఓటర్లు లొంగిపోతుండటంతో ప్రతిపక్ష బాధ్యతలు నిర్లక్ష్యం ఎదుర్కొంటున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ తొలి ప్రధానిగా హిందూ మహాసభ ప్రతినిధి నాటి రాజకీయ మేధావి డా.శ్యామ్‌ప్రసాద్‌ముఖర్జీ కేబినెట్ మంత్రిగా వున్నారు. 17వ ప్రస్తుత లోక్‌సభలో రాజ్యాధికారం మళ్లీ చేపట్టగలిగిన సమర్ధదీక్షాదక్ష నేత మోడీకి, ముఖర్జీ ఆరాధ్యనీయులు. తొలి దశాబ్దాలలో, ప్రధాని రాజకీయ అభిప్రాయాలు, ప్రభుత్వ విధివిధానాలు సక్రమంకాదని భావించి ముఖర్జీ, అంబేద్కర్ వంటి జాతినేతలు మంత్రి పదవులను తృణప్రాయంగా త్యజించేవారు. పార్లమెంటులో హృదయ్‌నాథ్‌కుంజ్రు, జె.బి. కృపలానీ, ఎ.కె.గోపాలన్, హెచ్.వి.కామత్, రామమనోహర్ లోహియా, ఎమ్.ఆర్. మసానీ, అటల్‌బిహారీ వాజ్‌పాయ్ వంటి మేధావులు ప్రభుత్వాన్ని నిలదీసేవారు. కాంగ్రెసేతర కమ్యూనిస్టులు, సోషలిస్టులు, బిజెపి, స్వతంత్ర పార్టీల ఎందరో నాయకలు భారత ప్రజాస్వామ్య పాలనకు జీవం అందించారు. సిద్ధాంత, భావవైరుధ్యలున్నా ప్రతిపక్ష నేతలను, అధికార పార్టీ మంత్రులు, ఉన్నతాధికారవర్గం కూడా గౌరవించేది. జవాబుదారీతనం సర్వత్రా వెల్లివిరిసేది. స్వాతంత్య్రానంతర తొలి దశలో, పార్లమెంటులో ప్రభావంతమైన ప్రతిపక్ష నేతృత్వం లేకపోవటం నాటి ప్రధాని నెహ్రూను ఆలోచింపచేసింది. ‘‘ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాస్వామ్య తీరుతెన్నులలో ఒక చిన్న మెలికతో జవహర్‌లాల్ నెహ్రూ నియంత కాగలడు’’అంటూ ఎవరో కాదు జవహల్‌లాల్ నెహ్రూనే ‘చాణక్య’ మారుపేరుతో స్వయంగా ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో హెచ్చరించారు.
ప్రజలే అధికార నిర్ణేతలు
భారత రాజ్యాంగ నిర్మాతలు, జాతీయ నేతలు వివిధ సందర్భాలలో భారత ప్రజాస్వామ్య మనుగడకు, ప్రతిపక్ష సజీవ ప్రాధాన్యతకు ప్రాణంపోసారు. ప్రతిపక్షం లేని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, అసంఖ్యాక జనస్వామ్యం ఆశలు, కలలను ప్రతిబింబించలేని మూగబొమ్మే. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌లో తలఎత్తిన అంతర్గత నియంతృత్వ పోకడలను నిర్మూలించడానికే లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్, జనతాపార్టీ సంపూర్ణ విప్లవానికి సారధ్యం వహించారు. 1947లో ప్రత్యక్ష రాజకీయాలకు గాంధేయ విధానంలో దూరంగావున్న జయప్రకాశ్ నారాయణ్ 1977నాటికి, ఇందిరాగాంధీ అధికార నియంతృత్వాన్ని ఎదిరించటానికి సారథ్యం వహించిన కారణంగానే నేడు భారతీయ జనతాపార్టీ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా, ఢిల్లీ సింహాసనం తిరుగులేని మెజారిటీతో అధిష్ఠించగలిగింది.
మన దేశంలో పార్లమెంటరీ ప్రతిపక్షం, చట్టసభలలో అధికార వ్యామోహం కారణంగా అణచివేయబడితే సామాజిక సంఘర్షణోద్యమాలు తలఎత్తే రాజ్యాంగ పవిత్రత వుండనే వుంది. ప్రతిపక్ష పార్టీలు, కేవలం అధికారం చేపట్టే వ్యామోహంతో వ్యవహరిస్తే ఎంత జాతీయపార్టీ అయినా ప్రజలే మట్టికరిపిస్తారు. అందువలన ప్రతిపక్ష సారధ్యం, సంఖ్యాబలం లేకున్నా, అత్యంత అప్రమత్తతగా వ్యవహరించక తప్పదు. వైఫల్యాలకు జడిసి పారిపోవటం పార్టీ మనుగడను మరింత కృంగదీస్తుంది. మన రాజకీయ పార్టీల నాయకులలో ఒంగి వ్యవహరించ వలసినదిగా పార్టీ నాయకత్వం కోరితే, పాక్కుని ప్రవర్తించే వ్యక్తిత్వాలున్నాయి. అవినీతి, ఆశ్రీత పక్షపాతం, అధికార పదవీవ్యామోహంతో రాజకీయం అతలాకుతలమవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత, జాతీయస్థాయి పార్టీలయిన కాంగ్రెస్, బిజెపిల వ్యవహారశైలిలో తాత్కాలిక వింత పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. పార్లమెంటు అయినా రాష్ట్ర చట్టసభలయినా అధికార, ప్రతిపక్షాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిణతి, పరిమితులను రక్షించుకోవాలి.

- జయసూర్య