సబ్ ఫీచర్

జగన్ తొలి అడుగుల్లో .. తడబాటు.. తొందరపాటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర విభజన నేపథ్యంగా 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గొప్ప విజ్ఞత ప్రదర్శించారు. చక్కని తీర్పు నిచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు చంద్రబాబు వంటి అనుభవజ్ఞుని అవసరాన్ని గుర్తించారు. పరిపాలనా అనుభవంతో పాటుగా రాజకీయ చాణక్యం ఎరిగిన చంద్రబాబు అయితేనే విభజన కష్ట నష్టాల నుంచి రాష్ట్రాన్ని రక్షిస్తారని, రక్షించ గలరని విశ్వసించారు. అందుకే అవశేష ఆంధ్రప్రదేశ్ పరిపాలన పగ్గాలను ఆయనకు అప్పగించారు. అప్పటికే రెండు పర్యాయాలు అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మరో రెండు పర్యాయాలు ప్రతిపక్ష నాయకునిగా పనిచేసిన అనుభవంతో పాటుగా కేంద్రంలోనూ ఒకటికి రెండుసార్లు ‘చక్రం’ తిప్పిన అనుభవం ఉన్న చంద్రబాబు క్లిష్ట సమయంలో రాష్ట్రాన్ని సరైన మార్గంలో ముందుకు తీసుకుపోతారని ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
అయితే, జనం అనుకున్నది, ఆశించింది ఒకటైతే జరిగింది వేరొకటి. అవశేష ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు తొలి అడుగే తప్పుగా వేశారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసును మెడకు చుట్టుకున్నారు. ఆ కారణంగా పదేళ్ళు అక్కడే ఉండి పరిపాలన సాగించే అవకాశం ఉన్నా, అనివార్యంగా హైదరాబాద్ వదిలి విజయవాడకు చేరుకున్నారు. ఇక అక్కడి నుంచి ఒక తప్పు నుంచి ఇంకొక తప్పులోకి జారుతూ చివరాఖరుకు, చక్రబంధంలో చిక్కుకుని తాను తీసుకున్న గోతిలో తానే పడిపోయారు. అంతేకాదు, రాష్ట్ర విభజన అనంతరం, రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా అత్యంత కీలకమైన, తొలి ఐదు సంవత్సరాల కాలం (్ఫండేషన్ ఇయర్స్)లో అడుగులు తడబడ్డాయి. పునాదుల నిర్మాణంలోనే లోపాలు చోటు చేసుకున్నాయి అనే అభిప్రాయం అంటు పోసుకుంది. రాష్ట్రం ఎటూ కాకుండా, ఒక దశ దిశా నిర్దేశం లేకుండా మిగిలిపోయింది. తొలినాళ్లలో చేసిన తప్పులను దిద్దుకునేందుకు అవకాశం ఉన్నా, చంద్రబాబు అది వదిలేసి ఎన్నికల రాజకీయాలపై దృష్టిపెట్టి ఇటు కేంద్రంతో, అటు పొరుగు రాష్ట్రం తెలంగాణాతో కయ్యానికి కాలు దువవుతూ వచ్చారు. అవాంఛనీయ ఘర్షణలతో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ధర్మ పోరాటాలు అవీ ఇవీ అంటూ అనవసర రాద్ధాంతం సృష్టించారు. ఈ తతంగం వలన రాష్ట్రానికి లేదా తెలుగు దేశం పార్టీకి ఎలాంటి మేలు జరగలేదు కానీ, రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది.
ఆ విధంగా అనుభవజ్ఞుడు అన్న మకుటంతో నవ్యాంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన చివరాఖరికి తీవ్ర ప్రజాగ్రహానికి గురయ్యారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. చివరకు పార్టీ అంతలా ఎందుకు ఓడి పోయిందో, అంతటి ప్రజాగ్రహానికి కారణం ఏమిటో ఆయనకే అర్థం కానంతగా ప్రజల తిరస్కారానికి గురయ్యారు. అయితే, తొలి ఐదేళ్ళు ఏమీ జరగలేదా అంటే లేదు.. జరిగింది. కానీ జరగవలసినవి జరగ వలసిన తీరున జరగక పోవడం, చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మరిన్ని తప్పులు చేయడం వలన, మరీ ముఖ్యంగా తమను తాము ఎక్కువగా ఊహించుకుని అనవసర వైరాలు కొని తెచ్చుకోవడం వలన ‘చివరకు ఇలా మిగిలాం’ అన్నట్లుగా చంద్రబాబు మిగిలిపోయారు.
అదలా ఉంటే, తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎందుకు అంత ఘోరంగా ఓడించారో చంద్రబాబు నాయుడుకి అర్థం కాకపోవచ్చును. కానీ అదేమీ ఎవరికీ అర్థం కాని బ్రహ్మ పదార్థం కాదు. ఎటొచ్చి, కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లి తనను ఎవరూ చూడడం లేదనుకున్నట్లు ఆయన కూడా అధికారంలో ఉన్నంత కాలం తమ చుట్టూ ఏమి జరుగుతున్నదో తెలుసుకోలేని మాయలో మునిగి పోయారు. అందుకే ఎన్నికల ఫలితాలు ఆయనకు మింగుడు పడలేదు. చంద్రబాబు పాలనలో ప్రధానంగా లోపించింది ఆర్థిక క్రమశిక్షణ. ఆర్థిక వ్యవహారాల్లో చంద్రబాబు ప్రభుత్వం నేల విడిచి సాము చేసింది. ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలను పక్కన పెట్టి ఎన్నో విధాలుగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిందనే అభిప్రాయం పాతుకు పోయింది. ముఖ్యమంత్రిగా ‘తొలి సంతకం’ చేసిన రైతు రుణ మాఫీ, ఐదేళ్ళలో కూడా పూర్త కాలేదు. అంటే బాబుగారి పాలనలో ఆర్థిక క్రమశిక్షణ ఎంత అధ్వాన్నంగా ఉందో వేరే చెప్పనక్కరలేదు. రాజధాని విషయంలో అయితేనేమి, పోలవరం కాంట్రాక్టుల విషయంలో అయితేనేమి.. ఇలా అనేక విషయాల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని వచ్చిన ఆరోపణలను చంద్రబాబు పట్టించుకోకపోవడం వలన జరగరాని అనర్థం జరిగిపోయింది.
నిజానికి, చంద్రబాబు నాయుడు ఓటమికి ఒకటి, రెండు కాదు కర్ణుని చావుకు ఉన్నన్ని కారణాలున్నాయి. ఓటుకు నోటు నుంచి మొదలు పెడితే.. గాడి తప్పిన ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక అరాచకత్వం, అదుపు తప్పిన ప్రభుత్వ, పార్టీ యంత్రాంగం, మీడియా మేనేజ్‌మెంట్ వరకు చంద్రబాబు ఓటమికి ఎన్నైనా కారణాలు కనిపిస్తాయి. అన్నిటినీ మించి చంద్రబాబు నాయుడు నుంచి ప్రజలు ఏమి ఆశించారో అది జరగలేదు. ప్రభుత్వ ప్రాధాన్యతల విషయంలో వేసిన తప్పటడుగులు, రాజకీయంగా తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు అన్నీ కలిసి తెలుగు దేశం పార్టీ తలెత్తుకోలేని విధంగా కేవలం 23 సీట్లకు పరిమితం చేశాయి. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు టీడీపీకి కలిసివచ్చింది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు ఒంటరిగా పోటీ చేయడంతోనూ చంద్రన్న లెక్క తప్పింది. ఇది కూడా చంద్రబాబు స్వయంకృతమే.
సరే, అది ముగిసిన అధ్యాయం. ఇక ప్రస్తుతంలోకి వస్తే, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేకత పుణ్యాన, మరో ప్రత్యామ్నాయం లేని కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 150 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి అయ్యారు.
ఇంతవరకు అంతా బాగున్నా అసలు కథ అక్కడే మొదలైంది. చంద్రబాబు చేసిన తప్పే, జగన్మోహన్ రెడ్డి చేశారు. అంటే, ఆయనలానే ఈయన కూడా పొరుగు రాష్ట్రంలో తప్పుచేసి పట్టుపడి పారిపోయారని కాదు. అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే అనాలోచిత, తొందరపాటు నిర్ణయాలతో రాష్ట్రం ఎటు పోతోందో అర్థంకాని అయోమయాన్ని సృష్టించారు. నిజమే కావచ్చు, చంద్రబాబు పట్ల లేదా కొందరు తెలుగుదేశం నాయకుల పట్ల గతంలో వారు తమ పట్ల వ్యవహరించిన తీరు కారణంగా జగన్మోహన్ రెడ్డికి వారి పట్ల ఓ విధమైన వ్యక్తిగత ద్వేషం, కోపం, ఏహ్య భావం లేదా మరో నెగెటివ్ ఫీలింగ్ ఉంటే ఉండవచ్చును. అలాగే, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతి అక్రమాలను వెలికితీసి బాధ్యులను శిక్షించాలని కొత్త ప్రభువులు తలపోయడంలోనూ తప్పులేదు. అయితే వ్యక్తిగత కోపతాపాలను బహిరంగంగా ప్రదర్శించడం, అది కూడా శాసనసభ వేదికగా సాగడం సభానాయకుడి స్థాయికి, హోదాకు శోభను ఇవ్వదు. సరే, వ్యక్తిగత దూషణల విషయం ఎలా ఉన్నా పరిపాలన సంబంధమైన విషయాల్లోనూ అదే దూకుడు ప్రదర్శించడం వలన తప్పుడు సంకేతాలు వెళ్ళడమే కాదు, ప్రభుత్వం పనితీరుపట్ల తప్పుడు అభిప్రాయం (పర్సెప్షన్) ఏర్పడే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇప్పటికే రాజధాని ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు ఇస్తానన్న రుణం ఇవ్వలేమని ప్రకటించడం అదేబాటలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంకు (ఎఐఐబి) కూడా నిర్ణయం తీసుకోవడం తప్పుడు సంకేతాలను పంపింది. నిజమే, ప్రపంచ బ్యాంకు నిర్ణయాన్ని మార్చుకోవడం వెనక రాష్ట్ర ప్రభుత్వం చెపుతున్నట్లుగా ఇతర కారణాలు ఉంటే ఉండవచ్చును. అయితే, ప్రభుత్వ విధానాల కారణంగా పెట్టుబడులు రావని, వచ్చినవి వెనక్కి పోతాయని ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు ప్రపంచ బ్యాంకు నిర్ణయంతో ఆధారం లభించినట్లయింది.
ఇలా కారణం ఏదైనా ఒకసారి ప్రభుత్వం పనితీరుపట్ల వ్యతిరేక అభిప్రాయం ఏర్పడితే ఇక ఆ ఊబిలోంచి బయటపడడం అంత సులభంగా అయ్యే పని కాదు. అయితే, ప్రభుత్వం ఏర్పడి ఇంకా పూర్తిగా రెండు నెలలు కాకముందే ప్రజల్లో ఎంతో కొంత మేరకు అలాంటి అభిప్రాయం ఏర్పడింది. అందరిలో కాకపోయినా కొందరిలో అయినా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామన్న అభిప్రాయం బలపడుతోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం మాత్రమే కాదు, ఇతర రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వ పనితీరును, ముఖ్యమంత్రి, మంత్రుల వ్యవహారశైలిని తప్పు పడుతున్నారు.
అలాగని, ఈ 50 రోజుల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలేనా అంటే కాకపోవచ్చును కానీ, ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోందన్న సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు గ్రామ వాలంటీర్ల నియామకం విషయానే్న తీసుకుంటే గత తెలుగుదేశం ప్రభుత్వం ‘జన్మభూమి’ కమిటీలకు నకలుగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తుందన్న సందేహాలు వినిపిస్తున్నాయి. నాలుగు లక్షలకు పైగా గ్రామ వాలంటీర్లను నెలకు ఒక్కొక్కరికి రూ.5000 జీతం పై నియమించడం అంటే పార్టీ కార్యకర్తలకు ప్రజల సొమ్మును పందేరం చేయడం తప్ప మరొకటి కాదని అనుకోవచ్చును. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష కూటమి ప్రభుత్వం ఇదే పని చేసింది, క్రింది స్థాయి పరిపాలనను పూర్తిగా పార్టీ క్యాడర్ చేతుల్లో పెట్టింది. ఆ కూటమిని ఆదర్శంగా చేసుకుని చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలు ఎంత సుందర ముదనష్టంగా పనిచేశాయో, ఎంతటి అరాచకాన్ని సృష్టించిందో కళ్ళముందు కనిపిస్తోంది. అయినా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే దిశగా అడుగులు వేస్తోంది.
నిజానికి ఇప్పటికీ గ్రామాల్లో ఒక విధమైన అరాచకం రాజ్యమేలుతోందన్న విమర్శలు కొంత బలంగానే వినిపిస్తున్నాయి. ఒక వంక రాజకీయ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మరో వంక మతపరమైన వైషమ్యాలు ఘర్షణలకు దారితీస్తున్నాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండు నెలల కాలంలో ఏడుగురు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని, తమ పార్టీ కార్యకర్తలపై 285 దాడులు జరిగాయని, అలాగే 65 చోట్ల ఆస్తులు ధ్వంసం చేశారని మరో 11 కేసుల్లో అధికారపార్టీ వారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆస్తులు కబ్జా చేశారని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో పాటుగా తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులు సభ లోపల, వెలుపల ఆరోపించారు. ఇది సంపూర్ణ సత్యం కాకపోవచ్చును గానీ, సంపూర్ణ అసత్యం కూడా కాదు. ఒక్క తెలుగుదేశం మాత్రమే కాదు, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కూడా రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నానీ వేధింపులు భరించలేక ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడిందన్న వార్త ప్రతిపక్షాల ఆరోపణలు, ఆందోళనలకు బలం చేకూర్చే విధంగా ఉంది. మరో వంక తెలిసో తెలియకో లేక స్థానిక అధికారుల అతి ఉత్సాహమో గానీ ఇటీవల విశాఖ నగరంలో చర్చిలకు ప్రత్యేక రక్షణ కలిపిస్త్తూ జారీ చేసిన ఉత్తర్వులు వివాదంగా మారాయి. క్రైస్తవ మత ప్రచారాన్ని ప్రోత్సహించేందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలకు తెరతీసిందని విశ్వ హిందూ పరిషత్, సాధు పరిషత్ వంటి హిందూ ధార్మిక సంస్థలు ఆందోళనకు దిగాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి చిన్న చిన్న విషయాలుగా కనిపించినా భవిష్యత్తులో, చిలికి చిలికి గాలివానగా మారి విపరిణామాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు.
ఇవన్నీ ఒకెత్తు అయితే, గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న ప్రతి నిర్ణయాలను భూతద్దంలో చూడడం, సమీక్షల పేరుతో గత ఒప్పందాలను తిరగ తోడే ప్రయత్నం చేయడం ఒక విధంగా ప్రభుత్వం పరిధిని అతిక్రమించడమే అవుతుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) విషయంలో అదే జరిగింది. గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్షకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీకి సమీక్ష అధికారం లేదని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. నిజానికి, పీపీఏల సమీక్షలు వద్దని, దాని వలన కొత్త చిక్కులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని హెచ్చరించింది, అయినా, రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వెళ్ళి బొక్కబోర్లా పడింది. అలాగని గత ప్రభుత్వంలో జరిగిన అవక తవకలు, అక్రమాలు, అవినీతిపై విచారణ జరపరాదని కాదు. కానీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కమిటీలు, విచారణలు అంటూ హడావిడి చేస్తే అది చివరకు, పీపీఏల విషయంలోలాగా ఫలితం లేని ప్రయాసగానే మిగిలిపోతుంది.
అలాగే, గోదావరి జలాలను తెలంగాణ భూభాగం మీదుగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఒక అంగీకారానికి రావడం వివాదంగా మారింది. ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి మంచిదే. ముఖ్యంగా నిన్నమొన్నటిదాకా ఒకటిగా ఉండి అన్నదమ్ముల్లా విడిపోయిన ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర సహాయ సహకారాలు నెలకొనడం స్వాగతించదగిన పరిణామం. అయితే, నదీ జలాల వివాదాల విషయంలో మరింతగా ఆచి తూచి అడుగులు వేయడం అవసరం. కానీ ఎందుకనో జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అందుకే అనేక అనుమానాలకు, విమర్శలకు ఆస్కారం లభిస్తోంది.
నిజమే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇంకా నిండా రెండు నెలలు పూర్తికాలేదు.. ఇంతలోనే ఆయన పాలన మీద పూర్తి స్థాయి తీర్పు ఇవ్వలేము.. కానీ ప్రస్తుతానికి సంతృప్తికరంగా లేదని చెప్పేందుకు మాత్రం సందేహించవలసిన అవసరం అయితే కనిపించడం లేదు.

-రాజనాల బాలకృష్ణ 9985229722