సబ్ ఫీచర్

గోరాశాస్ర్తియ బాణీలో ‘వినాయకుడి వీణ’ (గోరాశాస్ర్తీయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరాశాస్ర్తీగా సుప్రసిద్ధుడైన గోవింద రామశాస్ర్తీ అటు విదేశీ ఇంగ్లీషు భాషలో, ఇటు స్వదేశీ తెలుగు భాషలోను సమ ప్రజ్ఞ ప్రదర్శించిన సవ్యసాచి. ఆయన తెలుగులో పలు ప్రక్రియలలో ఎంత పసందైన నుడికారం వ్రాశారో, అంతే అధికారం ఆంగ్ల భాషలోనూ చూపారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఒక సంపాదకీయం వ్రాయడమే సంపాదకుడికి గగనమై పోయిన దృష్ట్యా ఆ రోజుల్లో రోజుకు రెండు సుదీర్ఘ సంపాదకీయాలు - ఒకటి తెలుగులో, మరొకటి ఇంగ్లీషులో వ్రాయడం ఆయనకే చెల్లింది. పైగా వారి సంపాదకీయాలు ఎక్కువ సంఖ్యలో పాఠకాదరణ పొందాయి. గోరాశాస్ర్తీకి గొప్ప సంపాదకుడిగా గుర్తింపునిచ్చాయి.
ఒక వంక సంపాదకీయాలు వ్రాస్తూనే గోరాశాస్ర్తీ తెలుగు భాషలోని అనేక ప్రక్రియల్లో ఫలవంతమైన ప్రయోగాలు చేశాడు. తొలి రోజులలో కథలు, గల్పికలు, భాణాలు, అనేక వ్యాసాలు వ్రాశాడు. అనంతర కాలంలో దాదాపు వంద దాకా శ్రవ్య నాటికలు వ్రాసి, ఆ ప్రక్రియకే ఒరవడి దిద్దాడు.
వీటన్నిటికన్నా ముందుగా - అంటే - రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో 1943లో తన సహాధ్యాయి - భద్రాచలం హైస్కూల్‌లో తన సహాధ్యాయి - మహంకాళి శ్రీరామమూర్తి సంపాదకత్వాన వెలువడిన ‘ఆనందవాణి’లో ‘వినాయకుడి వీణ’ శీర్షిక ప్రారంభించి, తన ఉనికిని ప్రదర్శించిన గోరాశాస్ర్తీ అనంతరం 1945లో ఉప్పులూరి కాళిదాసు కాలంలోను ఆ శీర్షిక కొనసాగించాడు. ‘కాలమ్’ అంటే - ‘వినాయకుడి వీణే’ అన్నంత వ్యామోహాన్ని పాఠకలోకంలో కలిగించారు.
‘ఆనందవాణి’ తర్వాత తిరిగి ‘వినాయకుడి వీణ’ కచేరీ - 1948లో ‘తెలుగు స్వతంత్ర’లో ప్రారంభమైంది. అదీ నిలిచిపోయిన తర్వాత మళ్లీ 1957లో హైదరాబాద్ నుంచి తాను, శ్రీదేవి కలిసి ప్రారంభించిన - ‘స్వతంత్ర’లో కొనసాగించారు. ‘ఆంధ్రభూమి’ ఎడిటర్ అయ్యాక మంచి అవకాశం దొరికితే బరువైన సంపాదకీయాలకు సమాంతరంగా, అదనంగా ‘వినాయకుడి వీణ’ వాయించి పాఠకులను అలరించారు.
గోరాశాస్ర్తీ కథలు, శ్రవ్య నాటికలు, కొన్ని వ్యాసాలు ‘గోరాశాస్ర్తీ’ అనే కలం పేరుతోనే వ్రాసినప్పటికీ, తొలి రోజుల్లో కొన్ని రచనలు ‘జహంగీర్’ అనే మరో కలం పేరుతో చేశారు. వాటితో ఎలాంటి పేచీ లేదు. కాని ‘వినాయకుడి వీణ’ శీర్షికను మాత్రం ఆయన ‘ఆనందవాణి’లో గోరాశాస్ర్తీ అనే పేరుతో వ్రాసినా ‘తెలుగు స్వతంత్ర’లో, ‘స్వతంత్ర’లో గోరా అన్న పేరుతో వ్రాశారు. దానివల్ల పాఠక లోకమే కాదు, పలువురు ప్రముఖ రచయితలు, ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు - విజయవాడ కేంద్రంగా నాస్తిక ఉద్యమాన్ని నడిపిన ‘గోరా’కు ‘వినాయకుడి వీణ’కు సంబంధించిన కీర్తనలు లేదా తిల్లానాలు వినిపించేవారు. గోరాశాస్ర్తీగారికేమో - నాస్తికోద్యమ రీతులు గిట్టని ఛాందసుల నుంచి ఘాటైన విమర్శల పరామర్శలు ఎదురయ్యేవి. నేను మీరు భావిస్తున్న ‘గోరా’ను కాదని ఇరువురు సంజాయిషీ చెప్పుకోవలసి వచ్చేది.
ఏమైనా ‘వినాయకుడి వీణ’ ఆనందవాణి రోజుల్లో కేవలం సాహిత్యాంశాలు, సాంఘికమైన విషయాలతో ఒక గల్పికలాగానో, కథానికలాగానో కమనీయంగా సాగాయి. ఇందులో ఆ రోజుల్లో వారు ప్రవేశపెట్టిన ‘శ్రీమతి’ పాత్ర చలం అరుణ, శశిరేఖ, బుచ్చిబాబు అమృతంలాగా పాఠకలోకాన్ని ఆకర్షించింది.
ఈ శ్రీమతి చాలా చురుకైన యువతి. నిగూఢమైన ఆకర్షణలతో పెట్టి పుట్టిన స్ర్తిమూర్తి. ఔదార్యం, జాలిగుండె, చక్కని అభిరుచులు, సంసారం - అన్నీ ఉన్నాయి. కలలుగనే తత్త్వం. కానీ పుట్టి పెరిగిన వాతావరణం ఇంకో రకానిది. అయితే ఆమె వాస్తవిక జగత్తులో ఏ ఒక్క శ్రీమతి కాదు. తానెరిగిన ఎందరో శ్రీమతులలోని ఛాయల క్రోడీకరణ ఆమె అని గోరాశాస్ర్తీ తెలిపారు. అయినా ఆకర్షణ ఝంఝాలో పడి కొట్టుకుపోయిన సాహితీ పిపాసులు ఆ రోజుల్లో ఎందరో ఉండేవారు. ఈ ‘శ్రీమతి’ ప్రస్తావనగల ‘వినాయకుడి వీణ’ కచేరీలు ఎక్కువ దొరకలేదు. మచ్చుకు ‘ఆనందవాణి’లో రాసిందొకటి చివరన పొందుపరిచాము.
అయితే ‘తెలుగు స్వతంత్ర’ నాటి నుంచి ‘వినాయకుడి వీణ’లో కవులు, పండితుల గురించిన ప్రత్యేక ఘరానాలు వినిపించడమే కాకుండా రాజకీయ సాంఘిక అంశాలు, ఇతరాలకు సంబంధించిన రాగాలు రుచి చూపించారు. అవన్నీ గోరాశాస్ర్తీ చేవను పలికించాయి. నిజానికి ‘వినాయకుడి వీణ’ ప్రక్రియా పరంగా వారు రాసిన సంపాదకీయాలకు, గల్పికలు లేదా కథానికలకు మధన వ్యంగ్య వైభవంతో నిలిచిన పూల వంతెన లాంటిది.
వ్యంగ్య రచనను, ఇంగ్లీషులో ‘సెటైర్’ అని ఆధునికులు అంటున్నారు. ఇది లాటిన్ భాషలోని ‘సతూర’ అనే పదంలోంచి వచ్చింది. ‘సతూర’ అర్థం - నిండిన పూర్ణమైన అని. ‘సతూర లంక్స్’ అంటే తొలికాపు పండ్లతో నిండిన పళ్లెం అని అర్థం. అందులో అన్ని రకాల పండ్లు ఉంటాయి. ఆ భాషలోని తొలి వ్యంగ్య రచనలు కలగూర గంపగా ఉండడం వల్ల, అన్ని రకాల పండ్లతో నిండిన పళ్లెముకు సంబంధించిన పేరు వ్యంగ్య కావ్యానికి వచ్చిందని విజ్ఞుల భావన. ఈ సాహిత్య శాఖకు రోము దేశస్థులు ప్రారంభకులని పాశ్చాత్యుల ఊహ.
ప్రాచీన కాలంలో సంస్కృతంలో, తెలుగులోను అధిక్షేప రచనలు మనకున్నాయి. అయితే పాశ్చాత్య దేశాల్లోలాగా ఒక ప్రత్యేక సాహిత్య శాఖగా ఇది మన దేశంలో ఆదరణ పొందలేదు. అయితే - నవల, కథానిక, వ్యాసం ఇత్యాది సాహిత్య శాఖల వలెనే ఈ వ్యంగ్య రచన సైతం పాశ్చాత్య సాహ్యి సంపర్కం వల్ల విశేషంగా అభివృద్ధి చెందింది.
నిజానికి వ్యంగ్య రచనను నిర్వచించడం చాలా కష్టమైన పని. అయినా ఈ ప్రక్రియలో కాకలుదీరిన ‘డ్రైడన్’ - ఈ ప్రక్రియ ఎందుకని తనకు తాను ప్రశ్నించుకొని - సంఘంలోని కల్మషాన్ని కడిగివేయడానికి అని చెప్పాడు. ‘పోప్’ అనే మరో ప్రఖ్యాత రచయిత - ‘అవును నేను గర్వపడవలసినదే! భగవంతునికి కూడా భయపడని వాళ్లు నేనంటే భయపడతారు’ అన్నాడు. వీరిద్దరి అభిప్రాయాలు వ్యంగ్య రచన ఆదర్శాన్ని, శక్తిని స్పష్టం చేస్తున్నాయి.
మానవ మాతృలలోని, సమాజంలోని చెడు మనకు కలిగించే ఏవగింపును, నవ్వును వ్యక్తం చేస్తూ, సాహిత్య గౌరవం నిలుపుతూ గోరాశాస్ర్తీ వాయించిన ‘వినాయకుడి వీణ’ ఉక్తి వైచిత్య్రానికి - ఉత్తమ నమూనా.
ఉదాహరణకు ఒకసారి ‘ఈ రైలు ప్రజలందరిదీ. ఇది జనతా ఎక్స్‌ప్రెస్. కూర్చునేందుకు అందరికీ చోటివ్వాలి’ అని బ్రహ్మర్షి వినోబాభావే అన్నారు. నిజమే, సలహా భేషుగ్గా ఉంది కానీ రైలులో చాలా భాగం రిజర్వ్ చేస్తారు కదా! అని అందులోని సాధ్యాసాధ్యాలను చర్చిస్తూ - రైలు ప్రయాణంలో ఒక విప్లవం తీసుకువద్దామని వినోబాభావే వీలయినన్ని రైళ్లెక్కి తత్త్వాలు పాడుతున్నారని ఒకసారి కచేరీ చేశారు.
మరొకసారి కలకత్తా విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రదర్శించే నాటకంలో ఇక ముందు స్ర్తి పాత్రలు స్ర్తిలు ధరించకూడదు. అంటే విద్యార్థినులందరూ కలిసి ప్రత్యేకంగా నాటకాలు ప్రదర్శించవచ్చు. అలాగే విద్యార్థులు అంటే - యువతీ

యువకులు కలిసి నాటక ప్రదర్శనలలో పాల్గొనరాదని విశ్వవిద్యాలయ అధికారులు జారీ చేసిన నిబంధనను ప్రతాపరుద్రీయంలో పేరిగాడు నాట్య ప్రదర్శనకు ‘ఆపండోస్’ అని అడ్డుపడుతూ, ‘ఏటది నువ్వు మెళ్లో ఏదో ఎంకటయ్య కడుపులాగ ఏలాడేసుకుని ‘టమా’ అంటావు, ‘టమటమా’ అంటావు! కుర్రది బెదిరి గెంతులేస్తోంది. ఆడపిల్లనలా ఝడిపిస్తావా? ఈల్లేదు. నువెళ్లి ఆ మూలకూకో! ఏయ్ పిల్లా - నువ్వు ఈ మూల కూకో! ఈసారి ఆడు నాట్యం’ అంటాడు. అట్లాగే ఉంది ఈ విశ్వవిద్యాలయం అధికారుల ఫర్మానా అని నవ్వులు పూయించారు.
ఇట్లా మరొకసారి ఉగాది కవి సమ్మేళనంలో ప్రజల డబ్బుతో కవులు తాతలనాటి పాతపాత పదాలతో కవితలల్లుతున్నారనీ, మరొకసారి మహామంత్రుల మహత్సందేశాల మీద కూనిరాగాలు, ఇంకొకసారి కమ్యూనిజం హేయమైన భావదాస్యంతో, అమానుషత్వంతో అథమ స్థాయికి పడిపోయిందనీ, కమ్యూనిజం అందరూ ఆశించిన దానికంటే ముందుగానే పతనం చెందుతుందని నిష్కర్షగా గొంతెత్తారు. వార్తాపత్రికలను పాలనా పార్టీ నాయకుల ప్రసంగాలతో నింపేయడాన్ని ప్రశ్నించారు. వార్త అంటే ఉపన్యాసానికి పర్యాయ పదం అనే భ్రాంతిపడొద్దని చెప్పారు. సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడమంటే ఖరీదైన సూట్లు లేదా జరీ సిల్కు చీరలు ధరించి మోటారుకార్లలో అతి హడావిడిగా పర్యటనలు చేయడం కాదని, గొడ్డళ్లూ, గడ్డపారలు పట్టుకుని ఫొటోలు తీయించుకుని పత్రికల్లో ప్రకటించుకోవడం కాదని - ఇట్లా ఎనె్నన్నో అంశాలను తీసుకుని తెలుగువారి హాస్యప్రియత్వం తొణికిసలాడిస్తూ గోరాశాస్ర్తీ ‘వినాయకుడి వీణ’ శృతి చేశారు. ఈ ప్రత్యేక వ్యంగ్య రచన - అసంబద్ధ ఆలోచనపరులపై, అభివృద్ధి నిరోధకులపై, స్వార్థపర శక్తులపై, సంఘ విద్రోహాలపై వెక్కిరింత, వేళాకోళమనే దుడ్డుకర్రతో మర్మాఘాతం అనవచ్చు.
ధర్మ ప్రచారకునికి, హాస్య రచయితకు మధ్యగల స్థానం వ్యంగ్య రచయితది. అతనికి ఎంతో సామాజిక దృష్టి, లోకజ్ఞానం, మరెంతో పాండిత్యం, రచనా సామర్థ్యం, ఈజ్ ఉండాలి. అప్పుడే వ్యంగ్య రచన పండుతుంది, పేలుతుంది.
వ్యంగ్య రచయిత మంచిని వర్ణించి ప్రజల మనస్సులను మార్చాలని చూడడం కంటే చెడును మన కళ్ల ఎదుట నిలిపి దాన్ని అపహాస్యం చేయడమే లక్ష్యంగా సాగుతాడు. ఆ క్రమంలో దానికి ఆలంబనమైన వ్యక్తులను గానీ, సంస్థలను గానీ, అభిప్రాయాలను గానీ మూలచ్ఛేదం చేస్తాడు. అయితే దానిలో హాస్యం లేకపోతే అది కేవలం తిట్టులా వినిపిస్తుంది. కావ్యశిల్పం లేకపోతే కేవలం వెక్కిరింతలా అనిపిస్తుంది. అధర్మాన్ని అపహాస్యం చేసి, దాని క్షుద్రత్వాన్ని చూపించడం, అధర్మం ధరించిన గంభీర వస్త్రాలను విప్పి పారేసి దాని పేలవత్వాన్ని, దాని నిజ స్వరూపాన్ని ప్రదర్శించి నవ్వించడం ఆయా రచయితల ప్రతిభా సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి రచనలు మేథాశక్తికి సంబంధించినవి. ఇవి హృదయ సంబంధి కావు. సంఘ చైతన్యంగల మేధావిగా గోరాశాస్ర్తీ సమకాలీనులను చైతన్యవంతం చెయ్యగలిగినంత మేరకు ఇట్లా తన రచనా వ్యాసంగంతో చేశాడు. అందుకే పాఠకలోకం ఆయనకు బ్రహ్మరథం పట్టింది.
గోరాశాస్ర్తీ రచనలు శ్రద్ధగా పరిశీలించిన వారికి వాటి పరిధి వారి అనుభూతికి అతీతమైన విషయాలని దాటిపోలేదని, కేవలం ఊహాజగత్తులో విహరిస్తూ ఆయనేదీ రాయలేదని స్పష్టమవుతుంది. మధ్యతరగతి దిగువ మెట్లకు చెందిన తెలుగువాడైన తనకు, ఆ పరిధిలోని జీవితమే రచనా వ్యాసంగానికి ప్రాతిపదిక అయిందని స్వయంగా గోరాశాస్ర్తీ ఒక సందర్భంలో చెప్పారు.
ఎక్కడో ఒరిస్సాలోని కుర్ధారోడ్‌లో రైల్వేలో ఉద్యోగం చేసుకుంటున్న గోరాశాస్ర్తీ మద్రాసులో ఉండే తన మిత్రుడు, వారపత్రిక సంపాదకుడికి ఇంగ్లీషులో ఉత్తరాలు వ్రాసేవాడట. ఆయన దగ్గరగల డజన్ల కొద్దీ ఉత్తరాలను ‘స్వతంత్ర’ వారపత్రిక పెట్టబోయిన తరుణంలో సుప్రసిద్ధ సంపాదకులు ఖాసా సుబ్బారావు చదివారట. ఆ ఇంగ్లీషుకు పడిపోయి అపరిచితుడైనా గోరాశాస్ర్తీకి టెలిగ్రాం ఇచ్చి మదరాసు రమ్మన్నారట. అట్లా వారు ఇంగ్లీషు స్వతంత్రలో రైల్వే ఉద్యోగం మానేసి చేరిపోయారు. ఇంగ్లీషు ‘స్వతంత్ర’లో చేరే నాటికి గోరాశాస్ర్తీ ఇంగ్లీషులో రచనలు కూడా చేయలేదు. ఈతరాని వాణ్ణి అమాంతం నదిలో వేసినట్లైంది అనేవారు. అందులో పని చేస్తున్నప్పుడు, తన ప్రోద్బలంతోనే ‘తెలుగు స్వతంత్ర’ ఖాసా సుబ్బారావు ఆరంభించి, దాని సంపాదకత్వం బాధ్యత తనకు అప్పగించారని చెప్పేవారు. అట్లా పనె్నండేళ్ల పాటు మద్రాసులో స్వతంత్ర కార్యాలయంలో - నాలుగేండ్లు తెలుగు స్వతంత్ర చూస్తూ గడిపారు. ఈ రెండు పత్రికలు చరిత్ర సృష్టించాయి. ఆ తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ నుంచి స్వతంత్రను స్వంతంగా నడిపారు. సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఆంధ్రభూమి దినపత్రికలో చేరిపోయారు.
‘ఆంధ్రభూమి’ దినపత్రికను కేవలం సంపాదకీయం కోసమే, అప్పుడప్పుడు వ్రాసే ‘వినాయకుడి వీణ’ కోసమే చదువుతున్నామని చాలామంది చెబుతున్నారంటే అవి రాయడానికి గోరాశాస్ర్తీ ఎంత కసరత్తు చేసేవారో వారికేమి తెలుసు! గోరాశాస్ర్తీతో కలిసి 21 సంవత్సరాలు పని చేసిన మా సంస్థ అధ్యక్షులు, ప్రముఖ జర్నలిస్టు జి.ఎస్. వరదాచారి పలు సందర్భాలలో గోరాశాస్ర్తీ వాగ్వైభవం గురించి ఇప్పటికీ చెబుతారు. సరైన మాట కోసం సందర్భానికి సరితూగే మాట వ్రాయడం కోసం ఆయన పడే ఆరాటం అంతా ఇంతా కాదు. అప్పటికప్పుడు తోచినమాట వ్రాసేయకుండా, ఆలోచించి పరీక్ష రాస్తున్న విద్యార్థిలాగా దీక్షగా వ్రాసేవారు. ఏ రచననైనా ఒక సవాల్‌లాగా తీసుకుని, రచన మధ్యలో ఒకటి రెండుసార్లు లేచి వెళ్లి చేతులు, ముఖం కడుక్కుని వచ్చి వ్రాసేవారని చెబుతారు.
పత్రికల సంగతి వచ్చినప్పుడు - సుప్రసిద్ధ సంపాదకుడు, రచయిత నండూరి రామమోహనరావు పలు పర్యాయాలు గోరాశాస్ర్తీ సంభాషణా చతురతపై పలు అంశాలు చెప్పేవారు. ‘తెలుగు స్వతంత్ర’లో ‘వినాయకుడి వీణ’ వారం వారం చదవడం ఒక గొప్ప అనుభవంగా ఉండేదని గుర్తు చేసేవారు.
పీరియాడికల్ జర్నలిజంలో గోరాశాస్ర్తీ తర్వాత ప్రస్తావించదగిన జర్నలిస్టు, రచయిత పురాణం సుబ్రహ్మణ్యశర్మ గోరాశాస్ర్తీ గురించి రెండు జోకులు చెప్పేవారు. గోరాశాస్ర్తీ, శ్రీశ్రీ ఇరువురు మిత్రులు. ఒకరోజు ‘నా మాత్రం ప్రతిభ కలవారు ఆంధ్రదేశంలో ఇప్పుడెవరూ లేరనుకుంటాను’ అని వారి ఆఫీసులో కూర్చుని చాలా ఎక్స్‌పాన్సివ్ మూడ్‌లో ఓసారి అన్నారు. ఎదురుగా కూర్చున్న శ్రీశ్రీ ‘నేను అదే అనుకుంటున్నాను అన్నారట.’
అట్లాగే, మరోసారి ట్రామ్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు గోరాశాస్ర్తీ ‘నాకిప్పుడెవరైనా ఓ రెండు వందల రూపాయలు అప్పు ఇచ్చేవారుంటే బావుణ్ణు’ అన్నారట. పక్కనే కూర్చున్న శ్రీశ్రీ ‘నాకంత అక్కర్లేదు’ అన్నారట. ఈ రెండు జోక్స్‌లో ఒక దాంట్లో గోరాశాస్ర్తీ ఆత్మవిశ్వాసం, రెండవ దానిలో ఆయనకు అడపాదడపా కలిగే ఆర్థిక చిక్కులు దర్శనమిస్తున్నాయి. ఎక్కువ ఆదర్శాలతో, తక్కువ జీతాలతో అప్పట్లో పత్రికా రచయితలు పడే ఇబ్బందులన్నీ గోరాశాస్ర్తీ నిత్య జీవిత గమనంలో పడుతూ నిలిచారు.
అయినా కూడా జీవితాంతం జర్నలిజం వృత్తిలో ఉండాలన్నది గోరాశాస్ర్తీ ఆశయం. అది అక్షరాల నిజమైంది. ఆయన చివరి శ్వాస నిలిచిపోయే దాకా 1982, మే 1వ తేదీ వరకు చైతన్యంతో, సమర్థతతో, తన అంతరాత్మకు విఘాతం కలగకుండా అదే పనిలో ‘ఆంధ్రభూమి’ సంపాదకుడుగా ఉన్నారు. తన సాహితీ శక్తి సమస్తాన్ని ఓడ్చి పాఠక ప్రపంచానికి పంచారు.
ఇవ్వాళ వారి శతజయంతి సందర్భంగా వారి రచనలలో విశిష్టమైన ‘వినాయకుడి వీణ’ను పుస్తకరూపంగా ప్రచురిస్తే, ముందు తరాల వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మా వయోధిక పాత్రికేయ సంఘం భావించింది. గోరాశాస్ర్తీ ‘వినాయకుడి వీణ’ శీర్షికగల ‘తెలుగు స్వతంత్ర’ ‘స్వతంత్ర’ ‘ఆంధ్రభూమి’ ‘ఆనందవాణి’ పత్రికల పాత ప్రతులు దొరికినంత వరకు సేకరించి ఈ గ్రంథాన్ని వెలువరిస్తున్నాము. ఈ గ్రంథాన్ని ఆవిష్కరించటంతోపాటుగా - గోరాశాస్ర్తీ శతజయంతి సదస్సు ప్రారంభించడానికి ఎంతో అభిరుచితో అరుదెంచిన భారత ఉపరాష్టప్రతి గౌరవనీయులు యం. వెంకయ్య నాయుడు గారికి కృతజ్ఞతాంజలులు.

- టి.ఉడయవర్లు ఉపాధ్యక్షుడు, వయోధిక పాత్రికేయ సంఘం