సబ్ ఫీచర్

పార్లమెంటులో కాంగ్రెస్‌కు మోదీ పాఠం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోదీ నేతృత్వంలో కేంద్రంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పడడం, చట్టసభల్లో రాష్ట్రపతి ప్రసంగం, అనంతరం చర్చలు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో మోదీ తుది పలుకులు.. ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ‘హువాతో హువా’వంటి శ్యాంపిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి పిడుగుపాటై మరోసారి యూపీఏ చతికిల పడడం, ఇతర పార్టీల నుంచి భాజపాలోకి వలసలు వెల్లువెత్తడం.. ఏదో నాటకీయంగా జరుగుతున్న పరిణామం కాదు. 55 ఏళ్లు దేశాన్ని ఏలిన పార్టీతో 55 నెలల తన పాలనను పోలుస్తూ, సాధించిన లక్ష్యాలను గణాంకాలుగా ప్రజలు ముందుంచి, మరోసారి మంచి కమ్యూనికేటర్‌గా 140 ర్యాలీలు కలయ దిరిగిన మోదీ శ్రమ ఫలితమే ఇది. దేశ ప్రజలు విశ్వసనీయత చెదరని మోదీ నాయకత్వానే్న సమర్ధించారు. ఎన్నికల తరువాత ‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్’ విధానానికి ‘సబ్‌కా విశ్వాస్’ తోడయింది. భారత ప్రజాస్వామ్య ప్రభ 90 కోట్ల మంది ఓటర్లతో, 70 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకున్న వారితో, 40 రోజుల ఎన్నికల యజ్ఞంతో, 4000 అసెంబ్లీ స్థానాల్లో వాడిన 20,625 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లతో, వివి పాట్‌లలో ఎక్కడా తేడాలేకుండా విశ్వయవనిక మీద ఉజ్జ్వలమై ప్రకాశించింది.
17వ లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగం ఆశావహంగా, గంభీరంగా సాగింది. మరోసారి ప్రభుత్వ విశ్వసనీయతను ప్రస్తావించారు, ప్రస్తుతించారు. 2022 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కొత్త భారతం ఆవిష్కరించాల్సిన అవసరం గురించి, మహాత్మాగాంధీ సార్థశతకివ్వాల్సిన ప్రాముఖ్యం గురించి ఉటంకించారు. మహిళలు, యువకులు, సైనికులు, రైతులు, వనవాసులు యిలా సమాజంలో అన్నివర్గాల వారి సంక్షేమం, అన్నిరంగాల అభివృద్ధికి సంబంధించిన ప్రభుత్వ యోజనను ఉభయ సభల సదస్సుల ముందుంచారు. కేవలం వ్యాపారంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’తోనే కాదు, ప్రతి పౌరుడి జీవితంలోనూ ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ కావాలనేది ప్రస్తుతం ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుంది. 2022లో జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు భారతదేశం వేదిక కానుంది.
కొత్తగా జల్‌శక్తి మంత్రిత్వశాఖను కేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయం. చెన్నై నగరాన్ని నాలుగేళ్ళక్రితం వరదలు ముంచెత్తాయి. ఇవాళ అక్కడ నీటి సమస్యను డీఎంకే పార్టీ రాజకీయం చేస్తోంది. రాష్ట్రపతి ప్రసంగంలో చంద్రయాన్ యాత్ర గురించి, డిసెంబర్ 2019 వరకు రానున్న రాఫెల్ యుద్ధవిమానాలు, చినూక్ హెలికాప్టర్ల గురించి కూడా ప్రస్తావించారు. భారతదేశం సమగ్ర చిత్రాన్ని, ప్రభుత్వ యోజనలోని సఫల ప్రయత్నాన్ని రాష్ట్రపతి ప్రసంగం గౌరవ సభ్యుల ముందుంచుతూ గంగాఝరిలా సాగిపోయింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన చర్చతో అనేకమంది సభ్యులు మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో రాజ్యసభలో చేసిన ప్రసంగం కాంగ్రెస్ పార్టీ కళ్ళు, వొళ్ళు, చెవులు చేసుకొని వినాల్సిందే! ప్రజల జాగరూకతను, నిర్ణయాత్మక వైఖరిని మోదీ ప్రసంశించారు. 2014లో ఎన్‌డిఎకు ఓ అవకాశం యివ్వాలని గెలిపించినా, 2019లో ఎన్‌డిఎ పనితీరును పరీక్షించిమరీ మళ్ళీ అవకాశం యిచ్చారని, యిదో అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక ఆనందమని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తమ అవసరాలు తీర్చడంలో ఎందుకు ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ప్రశ్నించే స్థాయినుంచి ప్రజలు తమ అవసరాలు తమ ప్రభుత్వం తీర్చేందుకు ఎలా సఫలప్రయత్నం చేస్తున్నారని సమాధానపడే స్థాయికి ఎదిగారని, యిదే విశ్వాసం తమ గెలుపుకు కారణమయిందని మోదీ వ్యాఖ్యానించారు. సంక్షేమంతోబాటు ఆధునిక భారత్‌వైపు మనం అడుగులువేయాలని అన్నారు. వ్యక్తి జీవితంలోనూ, పరివార్ జీవితంలోనూ వయసు వస్తున్నకొద్దీ మలుపులున్నట్లు దేశం స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అయిన సందర్భం కూడా ఓ పెద్ద మలుపు. ఈ మలుపు మాధ్యమంగా కొత్త భారతం వైపు అడుగులు వేయాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కివక్కాణించారు. అప్పట్లో స్వాతంత్య్రం కోసం మరణించేందుకు సిద్ధపడిన తరం వున్నట్లే, ఇపుడు దేశ అభివృద్ధి కోసం జీవించే జన బాహుళ్యాన్ని కదలించాల్సిన అవసరం మోదీ ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు గుర్తు చేశారు. పెద్ద పెద్ద డ్యామ్‌లు కట్టామని, తాగునీరు, సాగునీరు అందించామని డబ్బాకొట్టుకునే కాంగ్రెస్ పార్టీ నేతలకు మోదీ తన హయాంలో రూపుదిద్దుకున్న సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం గురించి పాఠం చెప్పారు. 1961లో నెహ్రూ సమయంలో ప్రారంభించిన ఈ డ్యామ్ ఏ దశకానికాదశకం నిధులు మంజూరుకాక నిర్మాణానికి నోచుకోలేదు. సర్దార్ పటేల్ కల సాకారం కాలేదు. 6000 కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్టు 60000 కోట్లకు చేరుకుంది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండి నాటి యుపిఎ ప్రభుత్వంపై అభిశంసన దీక్షకు కూర్చోవాల్సిన పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ కల్పించింది. మోదీ ప్రధాని అయిన 15రోజుల్లోనే పనుల్లో వేగం పెరిగి డ్యామ్ నిర్మాణం పూర్తయింది. 4 కోట్ల మందికి, 7 మహానగరాలకు, 100 మున్సిపాలిటీలకు, 9000 గ్రామాలకు మంచినీరు అందుతోంది.
రామ్ మనోహర్ లోహియా మహిళలకు రెండు సమస్యలున్నాయని అంటుండేవారు. ఒకటి మరుగుదొడ్డి, రెండు తాగునీరు. మరుగుదొడ్ల సమస్యను తాము పరిష్కరించామని, జల్‌శక్తి మంత్రిత్వశాఖ ద్వారా నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని మోదీ అన్నారు. నిజానికిదో పెద్ద సవాలు. ఎప్పటికప్పుడు కొత్త సవాళ్ళను స్వీకరించడమే నిజమైన నాయకుడి లక్షణం. దేశం ప్రపంచంలో ఆర్థిక స్థితిలో 11వ స్థానంలో వున్నప్పుడు గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ 6వ స్థానానికి చేరిన ప్రస్తుత పరిస్థితిలో ఎందుకు మాట్లాడకుండా వుంది? అని మోదీ ప్రశ్నించారు. అవినీతిపై యుద్ధం కొనసాగుతుందని చెప్పిన మోదీ, అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నవారు జైలుకెందుకెళ్ళలేదని కొందరు ప్రశ్నిస్తున్నారని, జైలుకు పంపే పని తమది కాదని, తమది నియంతృత్వం కాదని, ప్రజాస్వామ్యమని, జైలుకు పంపే పని న్యాయవ్యవస్థదని అన్నారు.
లింగ వివక్షను రూపుమాపేందుకు తలాక్ బిల్లు మోదీ ప్రభుత్వం తెస్తే, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. నిజానికి ఉమ్మడి పౌరస్మృతి (యూ నిఫాం సివిల్ కోడ్) విషయమై కాంగ్రెస్ పార్టీకి 1955లో ఓసారి, 1990లో షాబానో కేసు విషయంలో ముస్లిం మహిళలకు న్యాయం చేసేందుకు అవకాశం లభించింది. కాని కొందరు వౌల్వీలు, ముల్లాలు 420 మంది ఎంపీల బలంవున్న రాజీవ్‌గాంధీ ప్రభుత్వాన్ని బెదిరించి మరీ ముస్లిం మహిళల రక్షణ బిల్లును తెచ్చేలా చేశారు. 70 ఏళ్ళ వృద్ధ వనిత షాబానోకు విడాకుల అనంతరం భరణం యివ్వమని సుప్రీం కోర్టు చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. నేడు మోదీ ప్రభుత్వం ముస్లిం మహిళల రక్షణకోసం బిల్లును తెస్తే కాంగ్రెస్ పార్టీ మతంతో ముడిపెడుతున్నది. భద్రతతో కూడిన జీవనం అందరికీ కావాల్సిందే, దానికి మతంతో సంబంధం లేదు. ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కూడా కాంగ్రెస్‌కు పాఠం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారాల కోసం పాకులాడడం కాకుండా కర్తవ్యం గురించి ఆలోచించడం అవసరమని నాడు పండిట్ నెహ్రూ చెప్పిన విషయాన్ని అందరూ గుర్తుకుతెచ్చుకోవాలి అని మోదీ అన్నారు. దేశ ప్రజలు ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా వున్నారని, ప్రజాచేతన కోసం, ప్రజల బాగుకోసం పనిచేయడమే నాయకుల మార్గం కావాలని హితవు పలికారు.
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు 50 మంది చర్చలో పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీల కంటె జనం ఎక్కువగా పాల్గొన్నారు. 17 రాష్ట్రాల్లో ఒక్క సీటుకూడా గెలవని కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో బిజెపి గెలవడాన్ని చూసి- ‘దేశం ఓడిపోయిందని, ప్రజాస్వామ్యం ఓడిపోయిందని, రైతులు ఓడిపోయారని’ వ్యాఖ్యలు చేయడాన్ని మోదీ నిశితంగా విమర్శించారు. ఇది కాంగ్రెస్ పార్టీ అహంకారమని అన్నారాయన. ప్రపంచానికే ఆశ్చర్యం కల్గించే బలమైన ప్రజాస్వామ్యాన్ని పరిహసించే సాహసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఆయన వాడి వేడి విమర్శలతో ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్లని, కాంగ్రెస్ గెలిస్తే ఇవిఎమ్‌లు బాగా పనిచేసినట్లని భావించడం ‘ఆడలేక మద్దెల ఓడన్నట్లు’అన్న సామెతను గుర్తుకు తెస్తుంది.
1977లోనే ఇవిఎమ్‌ల గురించి చర్చ జరిగింది. 1982లో ప్రయోగం జరిగింది. 1988లో దీనిపై చట్టం చేయబడింది. 1992లో కాంగ్రెస్ నేతృత్వంలో నియమ నిబంధనలు రూపొందాయి. ఇప్పటివరకు దేశంలో ఎన్నోసార్లు ఇవిఎమ్‌లతో ఎన్నికలు జరిగాయి. 113 అసెంబ్లీ ఎన్నికలు, 4 లోక్‌సభ ఎన్నికలు ఇవిఎమ్‌లను ఉపయోగించి జరిగాయి. అనేకసార్లు న్యాయస్థానాలు కూడా ఇవిఎమ్‌లకు సానుకూలంగా తీర్పునిచ్చాయి. కొత్త భారతంలో ప్రజల ఆవశ్యకలతోపాటు అవసరాలు గుర్తించి పనిచేయాల్సిన అవసరాన్ని గురించి మోదీ నొక్కివక్కాణించారు. ఎన్‌ఆర్‌సి నిర్ణయం రాజీవ్‌గాంధీ సమయంలో తీసుకున్నది. సర్దార్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. కాని కాంగ్రెస్ పార్టీ ఎన్‌ఆర్‌సిని వ్యితిరేకిస్తున్నది. సర్దార్ పటేల్ విగ్రహం నర్మదా తీరంలో నిర్మిస్తే వ్యతిరేకిస్తున్నది. ఇది కేవలం రాజకీయ ప్రేరితం మాత్రమే. ఏ విషయంలో గర్వపడాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతున్నది. పార్టీలో నెలకొన్న అయోమయంతో దేశాన్ని, దేశ ప్రజలను తప్పుదారి పట్టించవద్దని మోడీ పాఠం చెప్పారు. మోడీ ఉభయ సభల్లో గంటలపాటు ప్రసంగించినా ఎవ్వరూ సభలో కిమ్మనకుండా వినడం చాలారోజుల తరువాత చట్టసభల్లో కన్పడిన క్రమశిక్షణ. నవ భారతం కోసం ఎన్‌డిఎ ప్రభుత్వం కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నది. ఆ లక్ష్యసాధనలో మోదీ ప్రభుత్వం దేశానికి విజయం చేకూర్చి పెట్టాలని ఆశిద్దాం.

-తాడేపల్లి హనుమత్ ప్రసాద్