సబ్ ఫీచర్

తీరికలేనంత హాయిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని జ్ఞాపకాలు -ఊపిరాడనివ్వవు. ఇంకొన్ని
జ్ఞాపకాలు -ఊపిరాగనివ్వవు. సుదూరానికి
ప్రయాణిస్తూ, తీరిక దొరికినపుడు వెనక్కి తిరిగి చూస్తే కనిపించే ప్రతి అడుగూ -ఓ జ్ఞాపకమే. కాని అవి ఓ పద్ధతిలో క్రమబద్ధంగా కనిపిస్తే, ఆ జీవితానికెంతో హాయి. అవే అడుగులు చిందరవందరగా
అగుపిస్తే -ఆ బతుకు బండరాయి. లక్ష్మీకాంత్
అదృష్టవంతుడు. అడుగులో అడుగేస్తూ..
అడుగడుగునూ పేర్చుకుంటూ.. ఆచి తూచి
అడుగులేశాడు. తరువాతి తరానికి బాటలేశాడు. ‘తీరిక లేనంత వ్యాపకం నాకుంది’ అన్న
ఒక్క మాట చాలు -ఆయనెంత హాయిగా,
హుషారుగా ఉన్నాడో చెప్పడానికి. అతిథిగా
గతవారమే ముచ్చట్లు మొదలెట్టిన లక్ష్మీకాంత్
-మిగిలిన జ్ఞాపకాల దొంతర ఈవారం వెనె్నలలో.

లక్ష్మీకాంత్ హీరోగా ఎంపికైన తొలి సినిమా -కనె్నవయసు. మద్రాస్ రెడ్‌హిల్స్‌లో షూటింగ్ మొదలైంది. ఓ గెస్ట్‌హౌస్‌లో కేవలం మూడువారాల్లో షూటింగ్ పూర్తిచేశారు. లక్ష్మీకాంత్‌కు ఇచ్చిన రెమ్యూనరేషన్ వారానికి రూ. 200. ఆ సంపాదనలో ఇంటి అద్దె నాలుగున్నర రూపాయలు. మిగిలిందంతా మిగులే. ఆ షూటింగ్‌లో రెండో సినిమా చేస్తున్న శరత్‌బాబు, పూసల కిషోర్, ఎంపి ప్రసాద్ ఫ్రెండ్సయ్యారు. సినిమా సక్సెస్ అయ్యింది.
‘అలా మొదలైన స్క్రీన్ జర్నీలో -తరువాత ప్రమీల హీరోయిన్‌గా గుమ్మడి, సావిత్రి, ఎస్‌వి రంగారావులాంటి ఉద్దండుల సరసన ‘జీవితరంగం’ చేశాను. తమిళంలో కమల్‌హాసన్ అరంగేట్రం సినిమాకు రీమేక్. కమల్ చేసిన పాత్ర తెలుగులో నేను చేశా. అదే సినిమాతో ఫటాఫట్ జయలక్ష్మి కూడా పరిచయమైంది వెండితెరకు. జయసుధ కూడా ఆ సినిమాలో నటించింది’ అంటూ -సినిమా షూటింగ్ విశేషాలు గుర్తు చేసుకున్నారు లక్ష్మీకాంత్. ‘షూటింగ్ చాలా జాలీగా సాగింది. జోకులు, స్కిట్స్‌తో అసలు షూటింగ్ స్ట్రెయిన్ లేకుండా ఎంజాయ్ చేశాం’ అన్నారు. తరువాత ‘దేవుడే దిగివస్తే’ సినిమా -దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందింది. సత్యనారాయణ కొడుకుగా జులాయి యువకుడి పాత్రలో కనిపిస్తా. సత్యనారాయణ, రావుగోపాలరావు ప్రధాన తారాగణంగా రూపొందించిన ‘మావూళ్లో మహాశివుడు’ నా కెరీర్‌లో మరో మంచి సినిమా అంటారు లక్ష్మీకాంత్. ‘అదే టైంలో అంటే.. 1975 అనుకుంటా. హైదరాబాద్ దూరదర్శన్ ప్రారంభమైంది. ప్రొడక్షన్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడంతో దరఖాస్తు పెట్టా. అప్పటికే శ్రీప్రియను స్క్రీన్‌కు పరిచయం చేస్తూ రూపొందిన ‘చిలకమ్మ చెప్పింది’ సినిమా విడుదలై నా పేరూ బాగా వినిపిస్తోంది. ఇంటర్వ్యూకి కాల్‌లెటర్ వస్తే వెళ్లా. అక్కడ దాదాపు 30మంది అభ్యర్థులున్నారు. ఇంటర్వ్యూకి అటెండవ్వడానికి ముందే -అక్కడున్న అభ్యర్థులు మాట్లాడుకుంటుంటే ఓ మాట విన్నా. ‘‘ఎవరో గుంటూరు అబ్బాయంట్రా.. ఆల్రెడీ సెలెక్షన్ అయిపోయింది.. మనం ఊరికే వచ్చాం’’ అని. నేనూ గుంటూరు కుర్రాడినే కనుక, ఆ గుంటూరు అబ్బాయి ఎవరన్నా వున్నారా? అని వెతికాను. కనిపించలేదు. ఇంటర్వ్యూ ముగిసింది’ అంటూ చిన్న సస్పెన్స్ క్రియేట్ చేశారు లక్ష్మీకాంత్. ఆ ఇంటర్వ్యూలో ఎంపికైంది ఎవరో కాదు, నేనే! అంటూ నవ్వేశారు లక్ష్మీకాంత్. ఇంతకూ -ఇంటర్వ్యూకి ముందు మాట్లాడింది ఎవరో కాదు -మంచి నటుడు రాళ్ళపల్లి. ఓసారి వార్తలు చదివే అనౌన్సర్ రాకపోవడంతో లక్ష్మీకాంత్ చదవాల్సి వచ్చిందట. అలా వార్తలు చదువుతున్న లక్ష్మీకాంత్‌ను నిర్మాత రంజిత్‌కుమార్ చూశారు. రంజిత్ మూవీస్ పతాకంపై ‘నాలాగే ఎందరో’ చిత్రాన్ని రూపొందించిన నిర్మాత ఆయన. వెంటనే లక్ష్మీకాంత్‌ను పిలిచి ఇదేంటి?.. వార్తలు చదువుతున్నారు అని అడిగారు. తాను చేస్తున్న ఉద్యోగం గురించి చెప్పడంతో ‘బుల్లితెరమీద నువ్వు కనిపిస్తే బిగ్ స్క్రీన్‌లో నినె్నవరు చూస్తారు’ అని ప్రశ్నించారాయన. దాంతో సినిమా రంగం కోసం -700 రూపాయల జీతంతో సాగుతున్న ఉద్యోగాన్ని ఎలాంటి సంకోచాలు లేకుండా వదిలేశారు. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు లక్ష్మీకాంత్.
‘నాలాగ ఎందరో’ చిత్రం రూపాదేవికి తొలి చిత్రం. ఆ సినిమా విజయవంతమైంది. తరువాత కె విశ్వనాధ్ దర్శకత్వంలో జయప్రదకు తమ్ముడిగా ‘మాంగల్యానికి మరోముడి’ చిత్రంలో నటించారు లక్ష్మీకాంత్. ఆ చిత్రంలో జయప్రదతో కలిసి ఓ పెద్ద సీరియస్ సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో పండించి దర్శక నిర్మాతల మెప్పును పొందారు. ప్రత్యగాత్మ దర్శకత్వంలో ప్రభ- నరసింహరాజు, వంకాయల సత్యనారాయణ, జి వరలక్ష్మి, సారథి ప్రధాన తారాగణంగా ‘అత్తవారిల్లు’ చిత్రంలో లక్ష్మీకాంత్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, ఘరానాదొంగ, భలేకృష్ణుడు వంటి చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. జయలలిత చివరి చిత్రం ‘నాయకుడు -వినాయకుడు’ చిత్రంలో లక్ష్మీకాంత్ పాత్రను ప్రేక్షకులు మర్చిపోలేకపోయారు. ఆలుమగలు చిత్రంనుంచే లక్ష్మీకాంత్‌ను అక్కినేని నాగేశ్వరరావు ఇష్టపడేవారు. ఏ వేడుకలు జరిగినా అక్కినేనితోపాటుగా లక్ష్మీకాంత్ ఉండాల్సిందే. ‘ఆయనతో అనుబంధం మరువలేనిది’ అని గుర్తుచేసుకుంటారు లక్ష్మీకాంత్. ప్రభ, చంద్రమోహన్ జంటగా సూర్యకాంతం ప్రధాన పాత్రలో రూపొందించిన ‘కొంటెమొగుడు పెంకి పెళ్ళాం’ చిత్రంలో కృష్ణవేణికి జంటగా నటించారు. అలాగే బీరం మస్తాన్‌రావు దర్శకత్వంలో చంద్రమోహన్, పల్లవి, సూర్యకాంతం ప్రధాన తారాగణంగా రూపొందించిన ‘గయ్యాళి గంగమ్మ’ చిత్రంలో చంద్రమోహన్‌తోపాటుగా నవ్వులు కురిపించారు. అలా మంచి మంచి పాత్రలు కొంచెంతోనైనా -కెరీర్ అద్భుతంగా సాగింది. భానుప్రియతో నటించిన తొలి హీరో ఆయన. తమిళంలో 1982లో వచ్చిన సునీత చిత్రంలో భానుప్రియ, లక్ష్మీకాంత్ తొలిసారి జంటగా నటించారు. చివరిగా జంధ్యాల దర్శకత్వంలో నరేష్- అనితారెడ్డి జంటగా రూపొందిన ‘శ్రీవారి శోభనం’ చిత్రంలో నటించారు.
నటన ఓవైపు అయితే -సినిమా నిర్మాణం, డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రయాణం ఆయన కెరీర్‌కు మరోవైపు. తొలిసారిగా నీలిమా ఫిలింస్ పతాకంపై ‘అర్థరాత్రి హత్యలు’ అనే అనువాద చిత్రాన్ని అందించారు. ఆ సినిమా హిట్టవ్వడంతో ‘లవ్ లవ్ లవ్’ చిత్రాన్ని తెలుగు నటీనటులతో డబ్బింగ్ చెప్పించి విడుదల చేశారు. సాయికుమార్‌కు తొలిసారిగా డబ్బింగ్ అవకాశం ఇచ్చింది ఆ చిత్రంతోనే. మయూరి సుధ తమిళంలో నటించిన ‘దేవిపూజ’ ఇక్కడ విడుదల చేశారు. ఆ చిత్రంతోనే నటి రమ్యకృష్ణ తమిళంలో పరిచయమయ్యారు. కెఆర్ విజయ చాముండేశ్వరిదేవిగా ‘దేవీవ్రతం’ చిత్రాన్ని అందించారు లక్ష్మీకాంత్. నటి సాధన దెయ్యం పాత్రలో నిళ్‌గళ్వ్రి హీరోగా అందించిన కాళరాత్రి సూపర్‌హిట్టయ్యింది. మలయాళ దర్శకుడు 1బేబీతో ‘కనక’ (నటి దేవిక కూతురు) హీరోయిన్‌గా కార్తీకమాసం అందించారు. తరువాత పరిశ్రమలో అనేక మార్పులు రావడం, 5 లక్షల పెట్టుబడి యాభై లక్షలదాకా పెరిగి లాభాలు రాకపోవడంతో చిత్ర నిర్మాణాన్ని వదిలేశారు. తొలిసారిగా నటుడు సుమన్‌కు ‘ఇద్దరు కిలాడీలు’ చిత్రంలో డబ్బింగ్ చెప్పింది లక్ష్మీకాంతే. మూడో చిత్రంనుండి సాయికుమార్ చెప్పడం మొదలెట్టారు. దాదాపు 100 చిత్రాలదాకా పలు నటీనటులకు గాత్రదానం చేశారు. జగపతిబాబుకూ ఓ సినిమాలో డబ్బింగ్ చెప్పారాయన. టీవీ సీరియల్స్‌లో నటించమని అనేక అవకాశాలు వచ్చినా పూర్తిగా మానేశానని వివరించారు లక్ష్మీకాంత్. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ -ఇద్దరేసి కుమార్తెలు. ‘మొత్తానికి నా సంసారం, నా కుటుంబం.. అంతా ఆడపిల్లల పెత్తనమే’ అంటూ నవ్వేస్తారాయన. ‘కుమార్తెలు ఇద్దరూ వాళ్ల జీవితాల్లో స్థిరపడ్డారు’ అంటూ గుండె నిండుగా ఆనందం వ్యక్తం చేశారు లక్ష్మీకాంత్.
‘నా వ్యాపార వ్యాపకాలు నాకున్నాయి. అందుకే ఇప్పటి సినిమాలు చూసే టైం లేదు. అంత ఆసక్తికూడా లేదు. ఫలానా సినిమా బాగుందని ఎవరైనా చెబితే సెలెక్టివ్‌గా చూస్తున్నా’ అంటున్నారు లక్ష్మీకాంత్. కళామతల్లి కుడిచేతి చిటికెన వేలుపట్టుకుని చాలా దూరం ప్రయాణించిన లక్ష్మీకాంత్‌కు -స్థానిక సంస్థలు, యూనివర్సిటీలు ఎన్నో అవార్డులూ అందించాయి. ఏదేమైనా -ఓ అందమైన మెరుపు అనేక విరుపులతో ఆకాశంలో ఆవిష్కృతమైనట్టు.. లక్ష్మీకాంత్ జీవితం పలువురికి ఆదర్శమైంది.

-సరయు శేఖర్, 9676247000 (సహకారం: గంగారామ్ నాయక్, కడెం)