సబ్ ఫీచర్

‘పరమ్’ నుంచి ‘ప్రత్యూష్’ వరకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల ఒసాకా (జపాన్)లో జీ-20 శిఖరాగ్ర సమావేశాలు ముగిశాయి. అందులో అనేక అంశాలతోపాటు డిజిటల్ ఎకానమీపై చర్చలు జరిపారు. భారతదేశం డిజిటల్ ఎకానమీని విశ్వసిస్తోందని మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అందులో భాగంగానే పెద్దసంఖ్యలో ప్రజలకు బ్యాంకు ఖాతాలు తెరిపించామని, డిజిటల్ లావాదేవీలను పెంచామని సమావేశ అనంతరం భారత ప్రతినిధి, మాజీ కేంద్రమంత్రి సురేశ్‌ప్రభు పేర్కొన్నారు.
ఈ డిజిటల్ టెక్నాలజీకి మూలాధారం కంప్యూటర్. ఈ సాధారణ కంప్యూటర్ (పి.సి.)లు లక్షలాదిగా కలిస్తే ఓ సూపర్ కంప్యూటరవుతుంది. వర్తమానంలో సాధారణ కంప్యూటర్లతోపాటు సూపర్ కంప్యూటర్ల అవసరం పెరిగింది. ఇంకా పెరుగుతోంది. అలాంటి సూపర్ కంప్యూటర్ పరమ్ (సుప్రీం)ను 1990 దశకంలో అంటే మూడు దశాబ్దాల క్రితమే భారతదేశం తయారుచేసింది. ఒక సెకనులో లక్షలాది గుణకారాలను, భాగాహారాలను చేసే ఈ సూపర్ కంప్యూటర్‌ను పూణెకు చెందిన ప్రొఫెసర్ విజయ్ భట్కర్ సారథ్యంలో మన ఐటీ- ఇంజినీరింగ్ నిపుణులు తయారుచేశారు. వాస్తవానికిది గొప్ప ముందడుగు.
ఈ కీలక మలుపు వెనుక ఎన్నో ఆసక్తికర అంశాలు దాగున్నాయి. అవేమిటంటే.. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ మన దేశ అవసరాల కోసం ముఖ్యంగా తుపాన్లు, ఉప్పెనలు వంటి ప్రకృతి వైపరీత్యాలను ముందుగా పసిగట్టి తగు రక్షణ చర్యలు తీసుకునేందుకుగాను ‘సూపర్ కంప్యూటర్’ను విక్రయించ వలసిందిగా అప్పటి అమెరికా అధ్యక్షుడు రెనాల్డ్ రీగన్‌ను అభ్యర్థించగా ఆయన తిరస్కరించాడు. ఆధునిక టెక్నాలజీతో రూపొందిన సూపర్ కంప్యూటర్ ఆధారంగా అణ్వాయుధాలను తయారుచేసే అవకాశం ఉంది కాబట్టి తాము ఇవ్వమని మొహం మీదనే చెప్పడంతో రాజీవ్‌గాంధీ చిన్నబుచ్చుకుని వెనక్కి తిరిగొచ్చి భారత నిపుణులతో, శాస్తవ్రేత్తలతో సమావేశమై దేశీయంగా మనం సూపర్ కంప్యూటర్‌ను తయారుచేయలేమా..? అని ప్రశ్నించగా ‘చేయగలమ’న్న సమాధానమొచ్చింది. నిజానికి అప్పటివరకు సూపర్ కంప్యూటర్ ఎలా ఉంటుందో ఎవరూ చూడలేదు. ఆ సౌకర్యం ఆరోజుల్లో లేదు. అయినప్పటికీ రాజీవ్ గాంధీతో ముఖాముఖి సమావేశంలో డాక్టర్ విజయ్ భట్కర్ ఆ సవాలును స్వీకరించారు. అలా భారతదేశ సొంత టెక్నాలజీతో సూపర్ కంప్యూటర్ తయారీకి నాందీ వాచకం పలికారు. భారత ఎలక్ట్రానిక్స్ చరిత్రలో ఇదొక మరువరాని ఘట్టం.
పూణె నగరంలో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డాక్) అనే స్వతంత్ర సొసైటీ (సంస్థ)ను ఏర్పాటు చేసి అతి తక్కువ కాలంలోనే చరిత్రను సృష్టించారు. విజయ్ భట్కర్ నేతృత్వంలో దేశంలోని వివిధ విద్యాసంస్థల నుంచి, ప్రాంతాల నుంచి వచ్చిన యువ ఇంజినీర్లు అహోరాత్రులు కష్టపడి, జీతభత్యాలు, సౌకర్యాలు, కెరీర్ లాంటి విషయాలపై దృష్టిసారించకుండా ఒక ‘మిషన్ మోడ్’లో పనిచేసి సూపర్ కంప్యూటర్‌కు రూపం ఇచ్చారు. ఇందులో అమ్మాయిలు సైతం పెద్దసంఖ్యలో పాల్గొనడం విశేషం. తొలుత ఇది పనిచేస్తుందో లేదోనన్న అనుమానం కొందరు ప్రొఫెసర్లు వ్యక్తం చేసినా, నిరుత్సాహకర మాటలు మాట్లాడినా ఆ బృందం తమ లక్ష్యం నుంచి పక్కకు చూడలేదు. ఓ కొత్త చరిత్రను నిర్మించబోతున్నామన్న విషయం వారందరిలో స్పష్టంగా కనిపించింది. ‘సింపుల్ ఫ్రేమ్’తయారయ్యాక, ‘బెంచ్‌మార్క్’కావాలంటే అంతర్జాతీయ ప్రదర్శనలకు తీసుకెళ్లి అక్కడి నిపుణుల ముందు ప్రదర్శించాలి. అలా తొలుత స్విట్జర్‌లాండ్‌లో ఏర్పాటైన సూపర్ కంప్యూటర్ల ప్రదర్శనకు విజయ్ భట్కర్ బృందం తీసుకెళ్ళింది. అక్కడికి రష్యా, జర్మనీ, అమెరికా తదితర దేశాల సూపర్ కంప్యూటర్లు వచ్చాయి.
తొలుత అమెరికా సూపర్ కంప్యూటర్ బెంచ్ మార్క్ జరిగింది. భారత సూపర్ కంప్యూటర్‌పై కొందరు అనుమానాస్పదంగా, అపనమ్మకంతో చూసినప్పటికీ పరమ్ (సుప్రీం)కు బెంచ్ మార్క్ లభించింది. మొదటి ప్రతిస్పందన అమెరికా నుంచే వచ్చింది. ‘కసితో-కోపంతో భారత్ సాధించింది’అన్న మాటలు అందరికీ వినిపించాయి. దాంతోపాటే ఎలక్ట్రానిక్స్- కంప్యూటర్ రంగంలో భారత ‘సత్తా’ను ప్రపంచం గుర్తించింది. అగ్రరాజ్యం అమెరికా టెక్నాలజీని ఇచ్చేందుకు నిరాకరించినా, కసితో, అనుభవం గల విజయ్ భట్కర్ లాంటి నిపుణులు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరిచి ‘పరమ్’ను ప్రపంచం ముందు పెట్టడం నిజంగానే గర్వించదగ్గ అంశం. ఆ పరంపర అలాగే కొనసాగడం మరో గొప్ప విషయం. ఈ రంగంలో అగ్రదేశాలతో పోటీపడటమేగాక కొన్ని దేశాలకు భారతదేశం సూపర్ కంప్యూటర్లను అందజేస్తోంది. దేశీయంగా రూపొందించిన ఈ సాంకేతిక పరిజ్ఞానం వాతావరణ మార్పుల పరిశోధనతోపాటు అనేక రంగాలలో ఉపయోగపడుతోంది. చమురు, సహజవాయు నిక్షేపాల అనే్వషణలో ఉపకరించనున్నది.
సంస్కృతం...
భారతదేశ ప్రాచీన మేధోసంపద, జ్ఞానం, సాహిత్యం ఇట్లా అనేకం సంస్కృతంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ సంస్కృతం కంప్యూటర్ (బైనరీ) భాషకు పూర్తిగా అనుకూలమైనదని ‘నాసా’లాంటి సంస్థలు చాలాకాలం క్రితమే ప్రకటించి ఆ భాషను నేర్చుకుని కంప్యూటర్ భాషను మెరుగుపరిచేందుకు తద్వారా అనేక అప్లికేషన్స్ సులువుగా రూపొందించేందుకు కృషిచేస్తున్నారు. పాణిని రూపొందించిన సంస్కృత భాష వ్యాకరణం సహజసిద్ధంగా భారతీయుల్లో నిక్షిప్తమై ఉంది. తరతరాలుగా ఆ భాషా ప్రకంపనలు ఈ నేలపై కనిపిస్తున్నాయి. దాంతో కంప్యూటర్ (బైనరీ) భాష భారతీయులకు సులువనిపిస్తోంది. అందుకే అమెరికాలో అనేక మంది భారతీయులను ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానిస్తున్నారు. ఆ స్వాగత మర్యాదల్ని వమ్ముచేయకుండా భారతీయులు తమ ‘సత్తా’ చాటుతున్నారు. భవిష్యత్‌లో భారతదేశం ‘‘విశ్వగురు’’కాబోతోందని చెప్పడానికిగల కారణాలలో ఇదొక బలమైన అంశమని అందరూ అంగీకరిస్తున్నారు.
నిరంతరం రూపాంతరం చెందే కంప్యూటర్ పరిజ్ఞానంలో ఆధునిక అంశాలను, సంస్కృత జ్ఞానాన్ని ప్రవేశపెట్టి ప్రపంచానికి కొత్తవెలుగులు అందించే అవకాశం భారత నిపుణుల్లో ఉందని చాలామంది అభిప్రాయం. సంస్కృతంలో జ్ఞానం, విజ్ఞానమున్నది. దాన్ని వర్తమాన కంప్యూటర్ జ్ఞానంతో అనుసంధానించే అవకాశాలను, అవసరాన్ని ప్రొఫెసర్ విజయ్ భట్కర్ లాంటి నిపుణులు తరచూ చెబుతున్నారు.
దాదాపు మూడు దశాబ్దాలక్రితం రూపొందించిన ‘పరమ్-8000’ క్రమంగా అది రూపాంతరం చెందుతోంది. దాని సామర్థ్యం పెరుగుతోంది. ఆధునీకరణ చెందుతోంది. పరం-పద్మ, పరం-యువ.. ఇట్లా అనేక రూపాంతరాలు వెలుగుచూశాయి. ఇవి అభివృద్ధిచెందిన జర్మనీ, బ్రిటన్, రష్యా లాంటి దేశాలకు సైతం ఎగుమతిఅయ్యాయి. అంటే సూపర్ కంప్యూటర్ రంగంలో భారత్ మిగతా దేశాలకన్నా వెనుకబడిలేదన్న విషయం తొలి రోజుల్లోనే నిరూపించుకుంది. అయితే మరింత వేగవంతంగా పనిచేసే సూపర్ కంప్యూటర్ల తయారీలో చైనా, అమెరికా దేశాలు పోటీపడుతున్నాయి. వర్తమానంలో చైనా సూపర్ కంప్యూటర్లు దూసుకుపోతున్నాయి. దీన్ని అధిగమించేందుకుగా మన దేశంలో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (జాతీయ సూపర్ కంప్యూటింగ్ సంస్థ) ఆధ్వర్యంలో హైపర్ ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్‌పిసి)కోసం ఇటీవల మిహర్, ‘ప్రత్యూష్’ సూపర్ కంప్యూటర్లను ఆవిష్కరించారు. దీన్ని ప్రపంచంలో అతి కీలకమైన కంప్యూటర్‌గా గుర్తిస్తున్నారు. ప్రత్యూష్‌ను పూణెలో ఏర్పాటుచేశారు. సూపర్ కంప్యూటర్ వేగాన్ని (సెకండర్లు) పెటా ప్లాప్‌తో పిలిచేవారు ప్రస్తుతం ఎక్సాప్లాప్స్‌తో పిలుస్తున్నారు. అంటే ఎన్నోరెట్లు ఎక్కువ వేగమన్నమాట. అలాగని అక్కడితో ఆగిపోవడం లేదు. మరింత వేగంగా ‘‘కంప్యూటింగ్’’చేసే సూపర్ కంప్యూటర్ల తయారీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగమే ప్రత్యూష్...ప్రియమైన ప్రత్యూష్...

-వుప్పల నరసింహం 99857 81799