సబ్ ఫీచర్

నాటకం నుంచి జీవితంలోకి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహావృక్షాలు కూడా రాత్రికి రాత్రి పుట్టవు. మట్టిని ఎగదన్నుకుంటూ విత్తనం నుంచి బయటికొచ్చిన మొలక -ఏళ్ల తరబడి ప్రయాణాన్ని కొనసాగిస్తే తప్ప మహావృక్షంగా సాక్షాత్కరించదు. ఎదిగే క్రమంలో ఏ మొలకా గమనాన్ని, గమ్యాన్ని నిర్దేశించుకోకపోవచ్చు. కాని -ఎదిగిన తరువాత ఆ రెండూ దాని నీడలో కనిపిస్తుంటాయి.
మంచి నటుడన్నవాడెవడూ -ఒక్క రోజులో ఉద్భవించడు. నటించాలన్న కోరిన మనసును తొలిచేస్తున్నపుడు -అలసట మర్చిపోయి అహరహం శ్రమించినవాడే గొప్ప నటుడవుతాడు. ఆ ప్రయాణంలో ఏ నటుడూ గమనాన్ని, గమ్యాన్ని నిర్దేశించుకోకపోవచ్చు. కానీ -ఎదిగిన తరువాత ఆ రెండూ అతని మోములో కనిపిస్తుంటాయి.
తోటివాళ్లంతా తనను దాటుకెళ్లినా, తన ప్రయాణం తనకు సంతృప్తినిస్తోందని ప్రశాంతంగా చెప్తోన్న నటుడు లక్ష్మీకాంత్. సంతృప్తిగా చెప్పుకోగలిగే సినిమాలు ఆయన కెరీర్‌లో తక్కువే కావొచ్చు. కాని -గొప్పగా చెప్పుకోగలిగే ఆర్టిస్టులతో సాగిన సినీ ప్రయాణం మాత్రం చాలా పెద్దది. ఆ ప్రయాణంలోని మధుర జ్ఞాపకాలను ఈవారం వెనె్నలతో పంచుకుంటున్న అతిథి -లక్ష్మీకాంత్.

గుంటూరు జిల్లా పెదకాకానిలో నాగండ్ల రత్తయ్య చౌదరి, సామ్రాజ్యమ్మల ఆరుగురు సంతానం. వాళ్లలో ఓ ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. అతను -లక్ష్మీకాంత్. చిన్నపుడు -శ్రీరామనవమి పందిళ్లలో ప్రదర్శించే నాటకాలు, కళారూపాలు అతని కాళ్లను కట్టిపడేసేవి. లెక్కలేనన్నిగా అలాంటి ప్రదర్శనలు చూస్తూ పెరిగాడు. గుండెల్లోకి చొచ్చుకుపోయిన ఆ ప్రదర్శనలు -వేషంకట్టాలన్న కోరికను తట్టిలేపాయి.
పదమూడేళ్ల వయసులో థర్డ్ఫామ్ చదువుతూ -ఊరి శివాలయంలో ‘చైర్మన్’, ‘మానవుడు’ నాటకాలాడాడు. తమ్ముడి ఆసక్తికి వకీలైన అన్న నాగండ్ల చలపతిరావు ప్రోత్సాహం దక్కింది. అలా హిందూ కాలేజీలో చేరాక, కళాభిరుచీ పెరిగింది. ప్రదర్శనలిచ్చే స్థాయికి చేరింది. ఆక్రమంలో ప్రదర్శించిన ‘వలయం’ నాటకం -కళా ప్రయాణానికి కొత్త మార్గం చూపించింది.
మళ్లీ కొంచెం వెనక్కి వెళ్దాం. నైన్త్ స్టాండర్డ్ చదువుతున్న టైం. మనసుకవి ఆత్రేయ రచనా దర్శకత్వంలో ‘చిన్నారి మనసులు’ మొదలైంది. ఆర్టిస్టుల కోసం దినపత్రికలో వచ్చిన ప్రకటన ఫొటోలు పంపించాడు లక్ష్మీకాంత్. మద్రాసుకు రమ్మంటూ తిరుగుఠపా అందింది. మేనమామతో చెన్నైలో అడుగుపెట్టాడు లక్ష్మీకాంత్. నాటకాల స్టేజిల నుంచి సినిమాలవైపు పడిన తొలి అడుగు అది.
***
అసలు -నాటకాల్లోకి రావడం కూడా ఓ నాటకీయం అంటారు లక్ష్మీకాంత్. పెదకాకానిలోని సత్యహరిశ్చంద్ర నాటకాన్ని రుసుముతో ప్రదర్శిస్తున్నారు. చంద్రమతి పాత్ర బుర్రా సుబ్రహ్మణ్య శాస్ర్తీది. నాటకం చూడ్డానికి వెళ్లాను. చిత్రమేంటంటే -లోహితాశుడు పాత్ర వేయాల్సిన కుర్రాడు రాలేదు. ముందు వరుసలో కూర్చున్న నన్ను తీసుకెళ్లి మేకప్ చేసేశారు. వేషం వేసేశాక అడిగారు.. నటిస్తావా? అని. నటిస్తా అన్నాను. అక్కడినుంచి మొదలైంది నాటక ప్రస్థానం’ అంటూ గుర్తు చేసుకున్నారు లక్ష్మీకాంత్. ‘నేను చెప్పాల్సిన డైలాగులన్నీ సుబ్రహ్మణ్యశాస్ర్తీ ప్రామ్టింగ్ ఇచ్చారు. క్లైమాక్స్‌లో విశ్వామిత్రుడు ‘ఇకలే లోహితాశ్యా’ అంటాడు. నేను లేవలేదు, అప్పటికే నిద్రపోతున్నా. అది గమనించిన సుబ్రహ్మణ్య శాస్ర్తీ -నాటకం రసాభాసకాకుండా సమయస్ఫూర్తితో ముగించారు’ అంటూ గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత -‘వీరపాండ్య కట్టబ్రహ్మన నాటకంలో లక్ష్మీకాంత్ హీరో అయితే, బుస్సీదొర ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయప్రకాష్‌రెడ్డి వేసేవారు. చిత్ర పరిశ్రమకు వచ్చాక బుర్రా సుబ్రహ్మణ్య శాస్ర్తీ, జయప్రకాష్‌రెడ్డిలు మిత్రులయ్యారు’.
మళ్లీ ‘చిన్నారి మనసులు’ షూటింగ్ ముచ్చట్లకు వెళ్దాం. ఆ సినిమా నలుగురైదుగురి భాగస్వామ్యంతో మొదలైంది. ఆదిలోనే హంసపాదు అన్నట్టు -షూటింగ్ మొదలెట్టకముందే నటీనటుల ఎంపిక దగ్గరే ఆగిపోయింది. ఆ చిత్రానికి బాల హీరోగా నేను ఎంపికయ్యా. నా తల్లి అంజలీదేవి, తండ్రి నాగభూషణం. ఆర్థిక కారణాలతో ఆరేడు నెలల షూటింగ్ మొదలవ్వలేదు. తరువాత షూటింగ్ మొదలెడుతున్నట్టు కబురు పంపించారు. అప్పటికి నేను అంజలీదేవి కంటే పొడుగయ్యాను. పాత్ర ఇస్తారో లేదోనని భయపడ్డాను. అదే జరిగింది. ఆ పాత్రకు మరొకరిని ఎంపిక చేసి, అదే సినిమాలో రమణారెడ్డి కొడుకు పాత్ర నాకు ఇచ్చారు. షూటింగ్ మొదలైంది. నేను చేయాల్సిన బాల హీరో పాత్రకు ఎంపికైంది ఎవరో కాదు, మంజుల. అప్పటికి ఆమెకు పదేళ్లుంటాయి. చక్కని పలువరుస, మంచి భాషతో షూటింగ్ మొదలైన బుచ్చిరెడ్డిపాలెంలో అందరినీ ఆకట్టుకునేది ఆమె. ఇంగ్లీషులో గలగలా మాట్లాడుతూ హుషారుగా ఉండేది. నాలుగైదు రోజులు షూట్ చేశాక, బేబీ మంజుల నటనతో దర్శక నిర్మాతలు సంతృప్తి చెందలేదు. మళ్లీ కథ మొదటికొచ్చింది. మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాక పిలుస్తామని చెప్పి మంజుల, ఆమె తల్లిని మద్రాసు పంపేశారు. అదే టైంలో ఎన్టీఆర్- జమున జంటగా వచ్చిన ‘రాము’ చిత్రం విజయవంతంగా నడుస్తోంది. ఆ చిత్రంలో బాలనటుడైన రాజ్‌కుమార్‌ను తీసుకొచ్చి సగం సినిమా నిర్మించారు. మళ్లీ ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. చివరికి ఆత్రేయ దర్శకత్వంలో రావాల్సిన ఓ ఆణిముత్యం ‘చిన్నారి మనసులు’ ఆగిపోయింది. ఈ మొత్తం కథకు ముక్తాయింపు విశేషమేమంటే -అదే కథను విస్తృతం చేసి హీరోను నెగెటివ్ షేడ్స్‌తో చూపిస్తూ సినిమా చేశారు. అదే ‘మాయదారి మల్లిగాడు’. కృష్ణ హీరో. చిన్నారి మనసులు చిత్రంలో కుర్రాడి వేషానికి పనికిరాని మంజుల -మాయదారి మల్లిగాడు చిత్రంలో కథానాయిక అయ్యింది. ఇది ఇంకో ట్విస్ట్’ అంటూ నవ్వేశారు లక్ష్మీకాంత్.
చిన్నారి మనసులు సినిమా ఆగిపోయాక గుంటూరువెళ్లి చదువు కొనసాగించారు లక్ష్మీకాంత్. నాటకాలపైనే దృష్టిపెట్టిన టైంలో దర్శకుడు బీరం మస్తాన్‌రావు, జంధ్యాల వంటివారు పరిచయమయ్యారు. ఏఎన్నార్, జయలలిత జంటగా రూపొందిన ‘ఆదర్శ కుటుంబం’లో ఎస్ వరలక్ష్మి తమ్ముడిగా తొలిసారి వెండితెరకు పరిచయమయ్యాడు లక్ష్మీకాంత్. ‘ఆ సినిమా క్లైమాక్స్‌లో జరిగే పెళ్లిలో నేనే పెళ్లికొడుకుని’ అంటూ నవ్వారు లక్ష్మీకాంత్. మరో విశేషమేమంటే -పెళ్లికూతురు పాత్రధారి ప్రముఖ నర్తకి శశికళా మస్తాన్‌రావు. అదే చిత్రంలో చిన్న పిల్లలుగా హీరోయిన్ మాధవి, ఆమె చెల్లెలు కనిపిస్తారు. అప్పటి బాలనటి మాధవి, ఆమె చెల్లెలిని వాళ్ల తండ్రి షూటింగ్‌లకు జాగ్రత్తగా తీసుకురావడం, పేకప్ అయ్యాక మళ్లీ ఇంటికి తీసుకెళ్లడం నాకిప్పటికీ గుర్తు’ అంటారు లక్ష్మీకాంత్.
క్లైమాక్స్‌లో వచ్చే మూడు సన్నివేశాల్లో తారాగణమంతా కనిపిస్తుంది. ఆదర్శ కుటుంబం విడుదలయ్యాక లక్ష్మీకాంత్‌కు గుర్తింపు మొదలైంది. అలా హైదరాబాద్, మద్రాస్ తిరుగుతూ తనకు తెలిసినవాళ్లకు ఫొటోలు, బయోడేటాలు అందించేవారు.
మలయాళంలో విజయవంతమైన చంబరత్తి చిత్రాన్ని తెలుగులో ఎస్ భావన్నారాయణ రూపొందిస్తున్నారు. హీరోయిన్ రోజారమణే కనుక, కొత్తగా తెలుగులో హీరోను వెతకటం మొదలుపెట్టారు. ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బీరం మస్తాన్‌రావు -గుంటూరులో లక్ష్మీకాంత్ అనే కుర్రాడు ఉన్నాడని చెప్పి నిర్మాతకు ఫొటోలు చూపించారు. నిర్మాతకు నచ్చడంతో పిలుపొచ్చింది. అలా ప్రయత్నాల కొనసాగింపులో చెన్నై చేరుకున్నారు లక్ష్మీకాంత్. అప్పటికే సినిమా యూనిట్ సిద్ధంగా ఉంది. కొత్త హీరో ఎలా వుంటాడు? ఎలా చేస్తాడు? అని అందరికీ ఆదుర్దా. ‘దాదాపు వందమంది వున్న అక్కడ -ఏదైనా మోనో యాక్షన్ చేయమని నన్ను అడిగారు. అయితే, అప్పటికే అంతా నేనే హీరోనని నమ్మకంగా ఉన్నారు. మోనో యాక్షన్ చేశా. అలా నన్ను ఎంపిక చేసుకున్నారు. అలా హీరోగా కనె్నవయసు చిత్రంలో పరిచయమయ్యాను’ అన్నారు లక్ష్మీకాంత్. అయితే ఆ సినిమా ఎంపికకు చెన్నై వెళ్లడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందంటూ అప్పటి విషయాలు గుర్తు చేసుకున్నారు. ‘చెన్నై రమ్మనడంతో బయలుదేరాను. కానీ జై ఆంధ్రా ఉద్యమం సాగుతుండటంతో ఎటువంటి ప్రయాణ సౌకర్యాలూ లేవు. చివరికి ఓ ట్రాన్స్‌పోర్ట్ లారీ ఎక్కి, వాళ్లకు పది రూపాయలిచ్చి మద్రాస్ చేరాను’ అంటారు లక్ష్మీకాంత్.
(మరిన్ని ముచ్చట్లు వచ్చేవారం)

-సరయు శేఖర్, 9676247000