సబ్ ఫీచర్

అదే ఆమె కల..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లిని మించిన దైవం లేదంటారు అంతా. నాకు మాత్రం మా అమ్మ దేవమే కాదు, సైన్యం.. ధైర్యం కూడా.
**
సినిమా -జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక్కోసారి -జీవితం కూడా సినిమాను చూసి రూపుదిద్దుకుంటుంది. ఇది -విలోమానుపాతం. అప్పట్లో వచ్చిన ఏఎన్నార్- సావిత్రి సినిమా ‘అభిమానం’లో -తల్లిని మించిన దైవం వేరే లేదురా/ ఎన్ని లోకములు వెతికి చూసినా లేనే లేదురా అన్న పాటుంది. అది నా జీవిత సంఘటనలకు ఖచ్చితంగా సరిపోతుంది -అంటోంది లతాశ్రీ.
ముందు -పద్మలత. స్క్రీన్ పరిచయం -శ్రీలత. కెరీర్ పరుగులో సెంటిమెంట్‌గా -లతాశ్రీ. ప్రత్యేక పరిచయం అవసరంలేని మంచి నటి. పాత్రలో ఉన్నపుడు పక్కింటి పరిచయస్తురాలిగా అనిపించే లతాశ్రీ -ఈవారం వెనె్నల ముచ్చట్లకు అతిధి.

విజయవాడకు చెందిన ముల్పూరి మాధవరావు, సువర్ణలత కుమార్తె -లతాశ్రీ. ఆ కుటుంబంలో అన్నకు చెల్లిగా గారాలపట్టి. అలనాటి రంగస్థల నటుడు సూరపనేని ప్రభాకరరావు మనవరాలు కూడా. బాల్యంనుంచే నాట్యాభినివేశం శ్రీలత ప్రతిభ. ఆ ఆసక్తిని గమనించింది తల్లి సువర్ణలత. తండ్రికి ఇష్టంలేకున్నా డ్యాన్స్ నేర్పించింది. స్కూల్లో అన్ని డ్యాన్స్ క్లాసుల్లో ఆమే ఫస్ట్. అనేక ప్రదర్శనలూ ఇచ్చింది. అనేక బహుమతులూ అందుకుంది. ముఖ్యంగా మోహినీ భస్మాసుర నృత్య నాటకంలో శ్రీలత చేసిన ‘మోహినీ నృత్యం’ అందరినీ మోహితులను చేసింది. ఇదే ప్రదర్శన హైదరాబాద్‌లోనూ ఇస్తే, అనేక అవార్డులు వచ్చాయి. సినిమాలో నటించడమన్నది అంత ఇష్టంలేని విషయం. కానీ మనకు ఇష్టంలేనిదే పదే పదే మనముందుకొస్తుంది -అన్నట్లు ఇష్టంలేని సినిమా అవకాశాలు లతాశ్రీని వెతుక్కుంటూ వచ్చాయి. అలా తొలిసారిగా తమ్మారెడ్డి భరద్వాజ రూపొందించిన ‘మన్మథ సామ్రాజ్యం’ చిత్రంలో కథానాయికగా నటించారు. తరువాత టెన్త్ పాస్ అవ్వడంతో, ఇంటర్మీడియట్ విజయవాడలో చదువుతున్న టైం. నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఓసారి విజయవాడ వచ్చినపుడు.. తాను రూపొందిస్తున్న పోలీస్ భార్య చిత్రంలో నటించమని అవకాశమిచ్చారు. అది హిట్టవ్వడంతో లతాశ్రీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. ఓవైపు ఇంటర్ చదువు, మరోవైపు షూటింగ్‌లు. చివరికి అధ్యాపకులు ఇచ్చిన అమూల్యమైన సలహాతో సినిమా అవకాశాలవైపే ప్రయాణించారు లతాశ్రీ. అలా మొదలైన ప్రయాణం ఎక్కడా గ్యాప్‌లేకుండా దాదాపు 80 చిత్రాలవరకూ సాగింది. ఒకరకంగా పీక్ స్టేజ్‌లో ఉన్నపుడే ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. ఆమెకు ఇద్దరు కొడుకులు. తెలుగుతోపాటు కన్నడంలో కథానాయికగా శశికుమార్, సాయికుమార్, కాశీనాథ్, కన్నడ ప్రభాకర్ వంటి వారితో నటించారు లతాశ్రీ. ‘పగలు తెలుగు సినిమా షూటింగులతో బిజీగా ఉండటంతో, కాల్షీట్లు అడ్జెస్ట్ చెయ్యలేక రాత్రి సమయాలను కన్నడ చిత్రాలకు కేటాయించిన రోజులు అనేకం’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా లతాశ్రీకి యమలీలలోని ‘హిమక్రీముల సుందరి’ పాత్ర అద్భుతమైన గుర్తింపు తెచ్చింది. ఇవివి సత్యనారాయణ, ఎస్ వికృష్ణారెడ్డిల దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాల్లో ‘జెండా ఎత్తేద్దామా’ అన్న టైపులో ఏదోక మ్యానరిజమ్‌తో శ్రీలత కోసం సరికొత్త పాత్రలను దర్శకులు ఆవిష్కరించారు. అలా ఒక్కో సినిమాలో ఒక్కో మ్యానరిజమ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు లతాశ్రీ. ఈ ప్రయాణానికి ఆదినుంచీ వెన్నుదన్నుగా నిలిచింది మాత్రం -లతాశ్రీ అమ్మ సువర్ణలత. ‘ఏదైనా సరే ఆమెమీదే ఆధారపడేదాన్ని. అమ్మ నా దైవమే కాదు, ధైర్యం, సైన్యం కూడా’ అంటూ గుర్తు చేసుకున్నారు లతాశ్రీ. యమలీలలో ‘అభినందనం..’ పాటలో చేసిన నృత్యాన్ని చూసిన ఏఎన్నార్ ‘సువర్ణసుందరి’లో అంజలీదేవి గుర్తు వచ్చిందని అన్నారట. అంతేకాదు, నేనెప్పుడు కనిపించినా అంజలీ లేదా దేవి అని సంబోధించేవారు -అంటూ గుర్తు చేసుకుంది లతాశ్రీ. ‘నేనెప్పుడు కనిపించినా మీ తరుఫువాళ్లు ఎవరైనా కళారంగంలో ఉన్నారా? అని ఏఎన్నార్ అడిగేవారు. కానీ నేను మా తాత పేరు ఏనాడూ చెప్పలేదు. అలా ఓ ఐదారుసార్లు ఆయనతో అనేక వేడుకలలో పాల్గొనే అవకాశాలు వచ్చాయి. ఎప్పుడు కనిపించినా ఆయననుంచి అదేమాట -మీ తరఫువాళ్లు ఎవరున్నారు కళారంగంలో అని. చివరికి చెప్పక తప్పిందికాదు. మా తాత గురించి చెప్పగానే ఏఎన్నార్ అంత పెద్ద లెజెండ్ అయినా చాలా సింపుల్‌గా తన గత అనుభవాలను నెమరేసుకున్నారు. నేనూ మీ తాత కలిసి నాటకాలాడాం. ఆయన హీరోగా, నేను హీరోయిన్‌గా రంగస్థలంపై ప్రేక్షకులను అలరించాం అని గుర్తు చేసుకోవడం తలచుకుంటే నాకిప్పటికీ ఒళ్ళు గగుర్పొడిచే విషయం. అందుకే నేనంటే ఆయనకు చాలా అభిమానం. ఆయనతో ఒక్క చిత్రంలోనైనా డ్యాన్స్ చేయాలనుకున్నాను. కానీ విధి మరోలా తలచింది. ఏఎన్నార్ జ్ఞాపకశక్తిని మెచ్చుకోవాలి. అందుకే వారు లెజెండ్స్ అయ్యారనిపిస్తుంది’ అంటూ తన జీవితంలోని ఓ మంచి ముచ్చటను గుర్తు చేసుకున్నారు లతాశ్రీ.
కెరీర్ ప్రారంభమైన తొలి రోజుల్లో సినిమా ప్రారంభోత్సవం అంటే చాలా భయంగా ఉండేది. ముహూర్తపు షాట్‌కి అనేకమంది పెద్దవాళ్లు వస్తారు. వాళ్ళందరిముందూ ఉండటం అంటే భయమనిపించేది. ఏ సినిమాకు ఆ సినిమా.. అలా భయం అనిపించినా మా అమ్మ ఇచ్చిన ధైర్యంతో బింకంగా కూర్చునేదాన్ని. ఓసారి నెంబర్‌వన్ సినిమా షూటింగ్ ఒక్కరోజు చేసి ఆపేశారు. తరువాత రోజునుండి షూటింగ్ ఉందని చెప్పలేదు. అలా మూడు నాలుగురోజులు గడిచింది. చివరికి నన్ను ఆ సినిమాలోంచి తీసేశారు అనుకున్నా. ఐదు రోజుల తరువాత ఇక నాకు పాత్ర లేదు అని కన్‌ఫర్మ్ చేసుకొని చాలా బాధపడ్డాను. సడెన్‌గా ఓ రోజు ఫోన్ వచ్చింది. హీరో కాల్షీట్స్ అడ్జెస్ట్‌కాక షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందని, రేపు మళ్లీ షూటింగ్ వుందని కాల్షీట్లు అడిగారు. దాంతో చాలా ధైర్యమొచ్చింది. మేజర్ చంద్రకాంత్, పెదరాయుడు, టాప్‌హీరోలాంటి చిత్రాల్లో కూడా అవకాశాలు వచ్చినా కాల్షీట్లు లేక వదులుకోవాల్సి వచ్చింది. ఇపుడు అప్పుడప్పుడు అనుకుంటాను.. కనీసం ఏదైనా సర్దుబాటు చేసి మేజర్ చంద్రకాంత్‌లో నటిస్తే బాగుండేదని. కానీ సమయం దాటిపోయింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది లతాశ్రీ. అలాగే కృష్ణతో కలిసి, ఆయన దర్శకత్వంలో అనేక చిత్రాల్లో చేశానని చెప్పారు లతాశ్రీ. ‘అపుడు పరిశ్రమలో నన్ను కృష్ణ మేనకోడలు అనుకునేవారు. చాలామంది అడిగారు కూడా ఆ విషయాన్ని. నా చిన్నప్పుడు ఆయనంటే నా ఫేవరేట్ హీరో. మా అన్న అని చెప్పుకునేదాన్ని. ఆయన చెల్లెలుగా నెంబర్‌వన్ చిత్రంలో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అదే అదృష్టమంటే. పాఠశాలనుండి కాలేజీకి వెళ్లాను. ఆ వెంటనే సినిమా సెట్టింగుల్లో షూటింగ్‌లకు వెళ్లాను. షూటింగ్ అంటే నాకు స్కూలుకు వెళ్లొచ్చినట్టే ఉండేది. ఎప్పటికప్పుడు ఈ చిత్రం చేసి ఇక మానేద్దాం అనుకునేదాన్ని. అలా అనుకుంటూనే అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో ఇన్ని చిత్రాల్లో నటించాను’ అంటూ గుర్తు చేసుకున్నారు. ‘బాగా చిత్రాలతో బిజీగా వున్నపుడు ఎవరూ పెళ్లివైపు వెళ్లరు. కానీ నేను పెళ్లి చేసుకున్నాను. జిమ్‌కు వెళ్లినపుడు ఆయన పరిచయం. ఆవిధంగా మా పరిచయమే పరిణయమైంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలలో జిమ్ స్టూడియోలు నిర్వహిస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు. బాధాకరమైన విషయాన్ని గుర్తు చేసుకుంటూ -‘అమ్మ దూరమవ్వడమే బాధాకరం. ఓ అన్న ఉన్నా లేనట్టే అయ్యింది నాకు. అమ్మకు ఆరోగ్యం సరిలేనపుడు ఎంతో ప్రయత్నం చేశాను. అన్నలు మనవారైనా వదినలు మనవారు కారుగా. ఓరకంగా ఠాగూర్ చిత్రంలో చికిత్స చేసినట్టుగా అమ్మకు చేశారు. అది చాలా బాధాకరమైన విషయం నా జీవితంలో. అమ్మ దూరమయ్యాక ఏకాగ్రత కోల్పోయా. ఏంచేస్తున్నానో తెలీక మళ్లీ డ్యాన్స్ క్లాసులకు వెళ్లా. ఆ విషయంపైనా ఓదార్చకుండా నాపై రాళ్లు వేసే ప్రయత్నం చేశాడు అన్నయ్య. మా అమ్మ మాత్రం నా కూతురుకు నేనుండాలి అన్న విల్‌పవర్‌తో మృత్యువుతో ఎంతో పోరాడింది. ఆవిధంగా జీవితంలో చాలా పెద్ద పోరాటమే చేశాను నేను. అమ్మతోవున్న అటాచ్‌మెంట్ అలాంటది. ఏనాడూ గొప్పలకు పోలేదు. ఎప్పుడూ ఒకేలా ఉన్నాను. ఓరకంగా నేను ఇలా ఉండటానికి మా అమ్మే స్ఫూర్తి. మళ్లీ చిత్రాల్లో నటించాలన్నది కూడా ఆమె ఆశయం. అందుకే ఇపుడు మంచి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధమవుతున్నా. ఇటీవల అల్లరి నరేష్‌తో అత్తిలి సత్తిబాబు చిత్రంలో నటించా. రాజకీయాల్లోకి వెళ్లి ప్రజాసేవ చేయాల్సిన అవసరం లేదు. మన మనసుంటే ఎంతో చేయొచ్చు అన్న ఏఎన్నార్ సలహా నాకు ఇప్పటికీ శిరోధార్యం అంటూ ముగించారు లతాశ్రీ.

-సరయు శేఖర్, 9676247000