సబ్ ఫీచర్

జనం ఆశలన్నీ మోదీపైనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా, తమిళనాడులో డీఎంకే మినహా దేశంలోని ప్రాం తీయ పార్టీల కోటలన్నింటిపై భారతీయ జనతాపార్టీ బాద్‌షా నరేంద్ర మోదీ జయకేతనం ఎగురవేశారు. ఆయన ‘చాయ్‌వాలా’, ‘చౌకీదార్’ పలుకుబడుల ఆకర్షణలు జన సమ్మోహితంగా ఆకట్టుకొన్నాయి. కేంద్రంలో మళ్లీ సారథ్యం వహించే అవకాశం భారత ప్రజాస్వామ్యం మోదీకి కట్టబెట్టింది. ప్రస్తుత రాజకీయ స్థితిగతులు ప్రజల మనోభావాలను ప్రతిబింబింప చేస్తున్నాయి. వోటర్లను ఎన్నో ప్రలోభాలు, ఎన్నో ఆకర్షణలు సతమతం చేస్తున్నాయి. అయినా తాజా సార్వత్రిక సమరంలో ప్రజాస్వామ్యం కొత్తపంథాలో తల ఎత్తింది. ప్రధానిగా మోదీకి ‘ఎస్’ లేదా ‘నో’ అన్నది నినాదమైంది. 17 ఏళ్లు ప్రధానిగా నెహ్రూ సాధించలేని వ్యక్తిత్వ ఆరాధనా పరిణతి స్థాయి మోదీ హస్తగతమైంది. ప్రధానమంత్రి భాష, వేషం, కొత్త ఊసులు ఉత్తర భారతావనిని ఉర్రూతలూగించాయి. తమిళం తప్ప మరో భాషను పట్టించుకోని తమిళనాడు, కాంగ్రెస్, భాజపాలను మట్టికరిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మాత్రం మరో మార్గం అనుసరించాయి. దేశమంతటా ‘కమల వికాసం’ వెల్లివిరిసింది.
భాజపా సిద్ధాంత కార్యాచరణ
స్వాతంత్య్రానంతరం దేశాన్ని పాలించిన 15 మంది ప్రధాన మంత్రులలో- ఇందిరా గాంధీ నియంతృత్వ పోకడలు, అత్యవసర పరిస్థితి విధింపు వంటివి దేశంలో ప్రత్యామ్నాయ అధికార వ్యవస్థ ఎదగటానికి ఆస్కారం కల్పించటం చారిత్రక వాస్తవం. కమ్యూనిస్టు పార్టీలకు, భాజపాకు వౌలిక సిద్ధాంత వైరుధ్యాలున్నా ప్రత్యేక సిద్ధాంత ఆశయ సాధన, లక్ష్యం సాధించగల కార్యాచరణకు అనుగుణంగా పాలించవలసిన తీరుతెన్నులున్నాయి. క్రమేపీ అన్ని రాజకీయ పార్టీలకు జనజీవన సంక్షేమం దృష్ట్యా పేదరికం, అనారోగ్యం, ఆర్థిక సాంఘిక అసమానతలు, సామాజిక న్యాయం, అణచివేత, అవినీతి పోగొట్టే సమసమాజ నిర్మాణం లక్ష్యమై, సిద్ధాంత ఆచరణకు ప్రాధాన్యత తగ్గింది. భారత రాజ్యాంగం చిత్తశుద్ధితో అమలు జరపాలంటే సిద్ధాంత కార్యాచరణను పక్కకుపెట్టక తప్పదు. స్వాతంత్య్రానంతరం భారత జాతీయ కాంగ్రెస్ పాలనా తీరుతెన్నులతో విభేదించిన భారతీయ జనసంఘ్‌కు ప్రత్యేక సిద్ధాంత ఆశయ కార్యాచరణ వుండటంతో, తదనంతరం ఏర్పడిన భారతీయ జనతాపార్టీ పరిమళాన్ని ఆమోదించింది. శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీనదయాళ్ ఉపాధ్యాయ, మదనమోహన మాలవ్య వంటి జ్ఞానయోధులను గుర్తుచేసుకొంటూ అద్వానీ, వాజపేయి, మురళీమనోహర్ జోషిలు పార్టీని నడిపించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌తో తాదాత్మ్యం వున్న అగ్రనేతగా మోదీ రెండోసారి ప్రధాని పీఠం అధిరోహించారు.
నమో నమః
కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు దూరం అయిన సోనియా గాంధీ తదనంతరం ప్రత్యక్షంగా, పరోక్షంగా రాహుల్, ప్రియాంకలకు ఒరగపెట్టిందేమీ లేదు. నెహ్రూ-ఇందిర వారసత్వ ప్రధానిగా రాజీవ్ అధ్యాయానికి సోనియా తెరవేయటంతో భారత జాతీయ కాంగ్రెస్ అడపాదడపా వున్నామనిపించుకొన్నా, దేశ ప్రధాని సారధ్య బాధ్యతల ప్రతిష్ఠ దక్కలేదు. రాహుల్ వ్యక్తిత్వం ప్రధాని స్థాయికి యినుమడించకపోగా ఈ సార్వత్రికంలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెందాక అప్రతిష్ఠ తప్పలేదు. రాయ్‌బరేలీలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియా మెజారిటీ 3.5 లక్షల నుంచి 1.67 లక్షలకు తగ్గింది.
భారతదేశాన్ని అన్ని విధాలుగా సమర్ధవంతంగా ప్రధాని మోదీ నడిపించగలరని దేశ ప్రజలు విశ్వసించారు. దేశం అంతర్గతంగా ఎదుర్కొంటున్న ఉగ్రవాద బీభత్సం, నిరుద్యోగం, ఆర్థిక రంగ అవకతవకలు వంటి అంశాలపై ప్రతిపక్షాల విమర్శలు తనమీద పడకుండా తిప్పికొట్టగల మాంత్రిక నేత నరేంద్ర మోదీ. దేశ రక్షణ, శత్రు దేశాల రణోన్మాదాన్ని అరివీర భయంకరంగా ఎదుర్కొనే శక్తియుక్తులు ప్రదర్శించి జన సామాన్యాన్ని వారి కష్టాలను మరిచిపోయి నమో నమః మంత్రాన్ని మరొక ఐదేళ్లపాటు జపించే మహానేతగా వర్ధిల్లగలరు. అందుకే దేశం ‘జయహో మోదీ’ అని నినదించింది. తొలి ప్రధాని నెహ్రూ, తరువాత ఇందిర అనంతరం తొలి కాంగ్రెసేతర నేతగా రెండవసారి ప్రధాని పీఠాన్ని మోదీ చేపట్టారు. ఆయన తన విశ్వరూపాన్ని ప్రదర్శించి జాతిని సమ్మోహితం చేస్తున్నారు. కాని హిందుత్త్వ ఆధిపత్యం సృష్టించే ఒత్తిడిని మతాతీత రాజ్యాంగానికి అనుసరణీయంగా ఎంతవరకు ఆయన తల ఒగ్గగలరో వేచిచూడాలి.

-జయసూర్య