సబ్ ఫీచర్

సమానత్వంతో బంధం పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ సంబంధాలలో కీలకమైనది, ఎక్కువ కాలం కొనసాగేది భార్యాభర్తల సంబంధం. కాబట్టి ఈ సంబంధంలో ఘర్షణ అనేది తప్పదు. భార్యాభర్తల మధ్య విభేదాలు సహజమేనని అంగీకరించినా అవి పెరగకూడదు. ఆ సంబంధాలు బెడిసేలోపే వాటిని పరిష్కరించుకోవాలి. లేకుంటే తిరిగి తిరిగి ఒకే అంశం చుట్టూ గొడవలు పెరుగుతుంటాయి.
ప్రతి ఒక్కరి మనసులో తామంతటివారు లేరనే భావం వుంటుంది. ఆ భావం బలంగా వున్నప్పుడే ధైర్యంగా పనులు చేసుకుంటూ పోగలుగుతాం. అనుకున్నది సాధిస్తాం. ఆ భావం ఎవరిలో అధికంగా వుంటుందో వారిలో ఆధిపత్య ధోరణి కనిపిస్తుంది. తమలోని శక్తి అంటే ఇతరులను నియంత్రించటం అనుకుంటారు తాము చెప్పింది విని అవతలివారు అమలుచేయాలి.
భార్యాభర్తల్లో ఒకరిది ఆధిపత్యం అనుకుని రెండోవారు బానిసలా వుండాలని అనుకోవటంతోనే చిక్కులు మొదలవుతాయి. వివాహ బంధంలో ఇద్దరూ పెత్తనం సమంగా వుంచుకోవాలే గాని ఒకరు తనకు అసలు ఎటువంటి పెత్తనం లేదన్న భావన, నిస్సహాయులమన్న స్థితి రాకూడదు. భార్యాభర్తలిద్దరిమధ్య సాగే ప్రతి మాటలో, పెత్తనంలో భాగస్వామ్యం కోరుకుంటున్న విషయం స్పష్టమవుతుంటుంది ప్రతి మాట. ప్రతి చర్య, శరీర కదలికలు, చేసే సంజ్ఞలు వగైరాలన్నీ తమ పైచేయిని లేదా సమస్థాయిని తెలియచెపుతూనే వుంటాయి.
ఆ విషయం అర్ధం చేసుకుని ఏఏ అంశాలలో ఎవరిది నిర్ణయాధికారం అనేది తేల్చుకోలేక పోయినప్పుడు ఇద్దరిమధ్య ఘర్షణ వాతావరణం తలెత్తుతుంది.
సమభావన అవసరం
సమాజం ఎంతగా మారినా మారకుండావున్నా పురుషుడిదే పైచేయి అనే భావన ఇంకా పోలేదు. చివరగా తన మాటే చెల్లాలనుకోవటం, ప్రతి అంశంలో రాజీ సమయంలో కూడా తొలి అడుగు ఆమె వైపునుండే పడాలన్న మగవాడి పట్టుదల ఇబ్బందులు తెస్తున్నాయి. పొరపాట్లు అనేవి ఇద్దరిలో ఎవరైనా చేస్తారు. తప్పుచేసినవారు క్షమాపణ చెప్పాలిగాని, ఎవరిది తప్పయినా ఆమెదే తప్పుగా భావించి రాజీతో దగ్గరకు చేరాలనుకోవటం తప్పు. సంసారంలో సర్దుబాట్లు ఇరువైపుల నుండీ అవసరం. ఎవరో ఒకరు మాత్రమే సర్దుకుంటూపోతే సంసార రథం సరిగా సాగదు.
ఇద్దరం సమమేనన్న భావన ఎంతగావుంటే సంసారంలో అంత ఆనందం, ప్రశాంతత ఉంటుంది. తాము తక్కువస్థాయి కాదు అనే భావన అవతలి వారిలో కలగనివ్వకుండా చూడాలి. తెలివిగలవారు, అధిక విద్యార్హత గలవారు, డబ్బుకలిగినవారు వాటిని పదే పదే ప్రస్తావిస్తూపోతుంటే రెండవవారు తమను తక్కువ చేస్తున్నారనుకునే పరిస్థితి వుంది. ఇంటి ఖర్చులకు భార్య చేతికి డబ్బు ఇవ్వటం తామేదో త్యాగం చేస్తున్నట్టు మాట్లాడటం తప్పు. తెలివిగా ఇంటిని నడిపిస్తున్న నేర్పు కలిగినది కాబట్టి ఆమె చేతికి డబ్బు ఇస్తున్నట్టుగా మాట్లాడండి. అదే విధంగా తమ భాగస్వామి బంధువుల గురించి తక్కువచేసి మాట్లాడటం చేస్తే అది ఆధిపత్య ప్రదర్శనే అవుతుంది.
ఒకరి పెత్తనం అనేది బయట ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ ఇంటి విషయంలో, భార్యాభర్తల మధ్య చెల్లదు. భార్యాభర్తల్లో ఎవరికి నేర్పువున్న అంశంలో వారు చొరవ చూపుతూ, నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయానికి ముందు అవతలివారికి తెలియచెప్పటం మంచిది. నిర్ణయాలలో పాత్ర కరువైనప్పుడు భరించినంతకాలం భరించి వీలుచూసుకుని ఎదురు తిరుగుతారు.
మెప్పులు కూడా అవసరం
తాను చేసే ఎంత చిన్న పనినైనా భర్త మెచ్చుకోవాలని భార్య ఆశిస్తుంది. ఇల్లు చిక్కదిద్దటం, రుచికరమైన వంట చేయటం తన బాధ్యతగా భావించి సంసారంలోకి దిగిన భార్యకు తన పనుల్ని మెచ్చుకోని భర్త దొరికితే జీవితం నిరాశగా మారుతుంది. బహుమతులు తెచ్చివ్వని, ఆశ్చర్యంలో ముంచెత్తే పనులు చేయని భర్తతో జీవితం భారంగా ఉంటుంది. ఆమె బాధ్యత ఆమె నిర్వహిస్తున్నది. అటువంటప్పుడు ప్రతి విషయాన్నీ నేను ప్రత్యేకంగా ఎందుకు మెచ్చుకోవాలి? అని భర్త భావిస్తే, ఆమెకిబ్బందే. అలాగని ఈ చిన్న విషయం మీద సంసారాన్ని వదులుకోలేరు.
కాబట్టి కేవలం మెప్పుకోసం పనిచేయొద్దు. మీకిష్టమైనవి మాత్రమే చేయండి. అతని కోసం అదనంగా చేస్తున్న భావన రానీయొద్దు. మీరు అందిస్తున్న సహకారం, తనకోసం చేస్తున్న పనుల్లో ఏదో లోపం ఏర్పడిందని తెలుసుకుని కారణం అర్థంచేసుకునే ప్రయత్నం భర్త చేస్తాడు. మీ విలువ అతనికి అర్థమయ్యేలా చేస్తే చాలు. ఆ తర్వాత ఆయనగారు మీవెంటే వుంటాడు. మీరు చేసే ప్రతి పనిని మెచ్చుకుని తీరతారు.
భార్యాభర్తలనేవారు సంసార రథాన్ని పరుగెత్తించే రెండు గుర్రాలులాంటి వారు. రెండూ ఒకే విధంగా అడుగులు వేయకపోతే రథం పడిపోతుంది. ఒకరు ముందుకు లాగి, రెండవవారు వెనక్కి తగ్గితే బ్యాలెన్స్ తప్పుతుంది. సర్దుబాటు చేసుకుంటూ, అర్థం చేసుకుని సంసార రథంని పరుగెత్తించాలంటే అహం అనేది పక్కన పెట్టాలి. సంసారమనే త్రాసులో అటూ ఇటూ మొగ్గు ఉండకూడదు. తాత్కాలికంగా ఒకవైపు మొగ్గుచూపినా వీలైనంత త్వరలో తిరిగి ఆ తక్కెడ సరిగా నిలవాలి. అది ఎలా నిలుపుతారన్న దానిమీదే ఎవరి గొప్ప ఎంతో తెలుస్తుంది.

-పి.ఎం. సుందరరావు 94906 57416