సబ్ ఫీచర్

పీపీసీ జోషీ.. సహస్ర సూర్య దర్శనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సమాజ సరోవరంలో ఒక మనిషి సృష్టించిపోయిన అలలు సమసిపోయేంతవరకూ- అతగాడు మరణించినట్లు భావించకూడ’’ దన్నాడు ప్రముఖ ఇంగ్లిష్ రచయిత టెర్రీ ప్రాచెట్. కిందటి నెల (మే) 26న తన ఎనభయ్యోయేట హైదరాబాద్‌లో కన్నుమూసిన ప్రముఖ ప్రచురణకర్త, ‘ప్రాచీ’ ప్రచురణ సంస్థ వ్యవస్థాపకుడు, పేరేప పూరణ్‌చంద్ జోషీ (1939-2019) కన్నా తొమ్మిదేళ్ళ తర్వాత పుట్టి, నాలుగేళ్లు ముందుపోయిన ప్రాచెట్‌కు జోషీతో పరిచయం ఉన్నట్లు ఎక్కడా వినలేదు. కానీ, ఈ ఇంగ్లిష్ రచయిత మన తెలుగు జోషీని చూసే ఈ మాటలు చెప్పినట్లు అనిపించడం లేదూ? ప్రాచెట్ చెప్పినదాన్నిబట్టి చూస్తే, జోషీగారు పోయారని అనుకోడానికి వీల్లేదు; ఇకముందు కూడా అనేక దశాబ్దాలపాటు ఆయన మనతో కలిసి జీవిస్తారని చెప్పాలి. ‘సమాజ సరోవరంలో’ జోషీ సృష్టించిన అలలు అలాంటివి మరి!
ఎనిమిది పదుల జీవనయానంలో జోషీ అనేక మజిలీలు చూశారు. తన తండ్రి, కమ్యూనిస్టు అమరవీరుడు మృత్యుంజయుడు పోలీసుల చేతుల్లో చిత్రహింసలపాలయి కన్నుమూసే నాటికి జోషీకి పది పదకొండేళ్ల వయసు ఉంటుందేమో! అమ్మ- అన్నగార్ల పెంపకంలో జోషీ పద్ధతిగా పెరిగి పెద్దవడం ఆయన జీవితంలో తొలి మజిలీ. ప్రతిభావంతుడయిన విద్యార్థిగా విజ్ఞాన శాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ కావడం మలి మజిలీ. విద్యార్థి ఉద్యమంలో చురుకయిన కార్యకర్తగా పనిచేయడం మరో మజిలీ. న్యూ సైన్స్ కాలేజ్‌లో లెక్చరర్‌గా ఉద్యోగ జీవితం మొదలుపెట్టడం ఇంకో మజిలీ. మా వదినమ్మ లలిత గారిని పెళ్లాడి పుస్తకం పూలతోటలోనే కాపరం పెట్టడం పెద్ద మజిలీ. అటుతర్వాత ‘విశాలాంధ్ర ప్రచురణాలయం’ జనరల్ మేనేజర్‌గా, జోషీ తెలుగు ప్రచురణ రంగం రూపురేఖలు మార్చడానికి కారణభూతులయ్యారు. పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్ జనరల్ మేనేజర్ అయిన తర్వాత, భారతీయ ప్రచురణ రాశీ-వాసీ పెంచడంలో జాతీయస్థాయిలో కృషిచేశారు. ‘విశాలాంధ్ర’, ‘పీపీహెచ్’లాంటి ప్రచురణ సంస్థల చరిత్రను అక్షరబద్ధం చెయ్యడానికి ఎవరన్నా పూనుకుంటే, ‘జోషీకి ముందు-ఆయన తర్వాత’ అనే విభజన రేఖ గీసుకోవలసి వస్తుంది. ముఖ్యంగా ‘విశాలాంధ్ర’ సంస్థను ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా అతిపెద్ద పుస్తకాలయంగా తీర్చిదిద్దిన ఖ్యాతి జోషీ నాయకత్వంలోని నిర్వాహక బృందానికే దక్కాలి. ‘ప్రాచీ’ప్రచురణ సంస్థ వ్యవస్థాపన- ప్రచురణ రంగంలో ఆయన చేసిన చిట్టచివరి ప్రయోగం. ‘ప్రాచీ’ చరిత్ర, జోషీ-లలితగార్ల స్వీయ చరిత్రే! మరణం జోషీ ప్రయాణంలో ఆఖరి మజిలీ-అంతే! ఈ ప్రపంచం మనతోనే పుట్టి, మనతోనే ముగిసిపోతుందనే ప్రగా(మూ)్ఢ విశ్వాసం వున్న వాళ్లనలా వదిలెయ్యండి. మృత్యువుకూడా జీవితంలో భాగమే-కాకపోతే కడపటి భాగం మాత్రమే- అనుకోగలిగిన వాళ్లకే జోషీ స్ఫూర్తి అర్థమయిందని భావించాలి- అంతే!
‘‘డెక్కన్ స్టడీస్’’లాంటి పత్రిక సక్రమంగా వెలువడ్డానికి జోషీ అందించిన సహకారం అవిస్మరణీయం. ఆ పత్రిక సంపాదకుడు వసంత్‌కుమార్ బావా సంపాదకత్వంలో గాంధీ 130వ జయంతి సందర్భంగా, ప్రాచీ ప్రచురణగా ‘‘గాంధీ ఇన్ ద ట్వెంటీఫస్ట్ సెంచురీ’’అనే పుస్తకం వెలువరించడం జోషీకే చెల్లింది. భారతదేశ చరిత్రలో గాంధీజీ పాత్ర గురించి చర్చించడంతోపాటుగా, ఇరవయ్యొకటో శతాబ్దిలో గాంధీ ప్రాసంగికతను ఈ పుస్తకం నిరూపించింది. గాంధీకన్నా ముందే దళితులకు పాఠశాలలు నిర్వహించిన సంఘ సంస్కర్త, కందుకూరి వీరేశలింగం గారి ప్రియశిష్యుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం ‘స్వీయ చరిత్ర’ను అభ్యుదయ రచయితల సంఘం 1944లో ప్రచురించగా, దాన్ని దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత పునర్ముద్రించిందీ జోషీయే!
హైదరాబాద్ కార్మికవర్గ ఉద్యమానికి మూలపురుషులు ముగ్గురు- మఖ్‌దూం- రాజబహదూర్‌గౌర్- కె.ఎల్.మహేంద్ర. వాళ్లలో ఇద్దరి సమగ్ర రచనల సంకలనాలను జోషీ-‘ప్రాచీ ప్రచురణలు’గా- వెలువరించారు. 1947లో డాక్టర్ రాజ్ బహదూర్‌గౌర్ వెలువరించిన ‘ట్రై కలర్ షల్ ఫ్లై ఓవర్ హైదరాబాద్’అనే చరిత్రాత్మక కరపత్రాన్ని అరవయ్యేళ్ల తర్వాత పునర్ముద్రించడం జోషీ చారిత్రిక దృష్టికి నిదర్శనం. దురదృష్టం ఏమిటంటే- మన ప్రచురణకర్తల్లో ఇలాంటి చైతన్యం, పరిపక్వత నానాటికీ కొరవడుతున్నాయి! ఇక రాజ్ సాబ్ వివిధ సందర్భాల్లో వెలువరించిన వ్యాసాల సంకలనంగా ‘ర్యాండమ్ రైటింగ్స్’ పుస్తకాన్ని ప్రచురించిందీ జోషీయే! కె.ఎల్.మహేంద్ర విభిన్న సందర్భాల్లో రాసిన వ్యాసాల సంకలనంగానూ, ఆయన జ్ఞాపకాల-అభిప్రాయాల సంపుటిగానూ- ‘రికలెక్షన్స్ అండ్ రిఫ్లెక్షన్స్’ ప్రచురించింది ప్రాచీ ప్రచురణ సంస్థే.
జోషీ ఆత్మీయ మిత్రుల్లో మా గురువు బూదరాజు రాధాకృష్ణ ఒకరు. బూదరాజు మేష్టారు ఆంగ్లంలో వెలువరించిన పరిశోధన- అధ్యయన పత్రాలను ‘అకేషనల్ పేపర్స్ ఇన్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్’పేరిట ప్రచురించిందీ జోషీయే! మేష్టారు రాసిన ‘ఆధునిక వ్యవహార కోశం’, ‘తెలుగులో సమస్యాపూరణలు’, ‘పద్య సాహిత్యం- సంఘ చరిత్ర’ తదితర రచనలను ప్రచురించిందీ ప్రాచీయే! రాజేంద్రప్రసాద్ రచన ‘ఆసిఫ్‌జాహ్స్ ఆఫ్ హైదరాబాద్’అనే చరిత్ర రచనను ప్రచురించిందీ జోషీయే!
జోషీ ‘సహస్ర చంద్ర దర్శనం’ చేసినట్లు లేరు. కానీ ఆయన జీవితంలో వేనకువేల సూర్యుళ్ల దర్శనం మాత్రం చేసుకున్నారు. బహుశా ఆయన చూసిన తొలి సూర్యుడు తన తండ్రి, అమరవీరుడు మృత్యుంజయుడు గారే. సుందరయ్య-రాజేశ్వరరావు-రాజశేఖరరెడ్డి త్రయం ఈ జాబితాలో ప్రజ్వలంగా కనిపించే సూర్యతారలు. 2013లో మృత్యుంజయుడు శత జయంతి ప్రారంభ సభలో జోషీ చెప్పిన ఓ మాట ఆయన సంస్కారం తాలూకు మూలం ఎక్కడ వుందో పట్టిస్తుంది. ‘మృత్యుంజయుడు శత జయంతి సభలు నిర్వహించవలసిన బాధ్యత ఉద్యమానిదే. వాళ్లకి ఈ సందర్భం గుర్తుచెయ్యడానికి మాత్రమే ఈ సమావేశం నిర్వహిస్తున్నా’మని ఆయన చెప్పిన మాట మరవరానిది.
నేనెక్కడో రాసినట్లుగా, జోషీగారి వ్యాకరణంలో ఒకటే విభక్తి వుండేది. అది సంబోధిస్తూ ప్రథమావిభక్తి (ఓరుూ, ఓరీ, ఓసీ!) తనకన్నా పాతికేళ్లు పెద్దవాళ్లనీ అదే పిలుపు- ఇరవయ్యేళ్లు చిన్నవాళ్లనీ అదే పిలుపు. పరిచయమున్న రెండో నిమిషంలోనే, ఆత్మీయం ‘ఏరా, ఒరే’ అంటూ మాట్లాడే పల్లెటూరి తత్వం జోషీది. నాగరికత నాలుగుగోడల మధ్య ఉక్కబోసే తరుణంలో జోషీ సహజ ప్రవర్తన చల్లగా మనసుకు తాకుతుంది! అరమరికలు లేకుండా మాట్లాడ్డమే కాదు- మంచిమాట చెప్పి సేదదీర్చే ఆత్మీయత జోషీ సొంతం. ఆయన ఆదరణను అర్థం చేసుకున్నవాళ్లు జోషీగారికి ఆజన్మ స్నేహితులుగా మారడం కద్దు. ఏ సభలోనో, సమావేశంలోనో కనబడినప్పుడల్లా ‘‘ఓసారి ఇంటికి రారా! చక్కని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం!’’ అనే శ్టాండింగ్ ఇన్విటేషన్ ఇచ్చే పెద్దవాడు లేకుండాపోయాడని నాలాంటివాళ్లం బాధపడే పరిస్థితి తెచ్చిపెట్టారు జోషీగారూ! ఇది మీకేమన్నా బాగుందా??

-మందలపర్తి కిషోర్ 81796 91822