సబ్ ఫీచర్

హిందూ జాతీయవాదంతో ‘కమల వికాసం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కొంత అనూహ్యంగా ఉన్నమాట నిజం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందున్న అంచనాలు ఫలితాలు వెలువడే వేళకు మారిపోయాయి. అందుకే కావచ్చు.. ఎగ్జిట్ ఫలితాలు వెలువడ్డాక సైతం రాజకీయ పండితులు చాలా సందేహాలను వ్యక్తం చేశారు. ఫలితాలు మరీ ఇంత ఏకపక్షంగా ఉంటాయని ఊహించలేకపోవడం లేదా ఇష్టపడకపోవడం ఇందుకు కారణం కావచ్చు. ‘ఎక్కువ సీట్లు సాధించిన అతిపెద్ద పార్టీ’గా భాజపా అవతరించినా- ఎన్డీఏ మేజిక్ ఫిగర్ (272)కి చేరుకోవడం కష్టమే అన్న అంచనాల దగ్గరే విశే్లషకుల ఆలోచనలు ఆగిపోయాయి. రాజకీయ నాయకులు కూడా అదే అనుకున్నారు. ముఖ్యం గా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీల నాయకులు మెజారిటీకి ఎంతోకొంత దూరంలో ఎన్టీఏ ఎంపీల సంఖ్య ఆగిపోతుందని ఆశలు పెంచుకున్నారు. కొందరు ఢిల్లీలో తిప్పేందుకు ‘చక్రాల’ను సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఒక్క జగన్ మాత్రమే కాదు, ఎన్డీఏకి 250 మించి సీట్లు రావన్న ఆలోచన, రాకూడదన్న ఆకాంక్ష చాలామందిలో ఉంది. జగన్ తన అంతరంగాన్ని బయటపెట్టారు. అనుభవం ఉన్న ‘తెలుగు చంద్రులు’ మాత్రం ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అని బాధను కడుపులోనే దాచుకున్నారు.
ఎన్నికల్లో భాజపా కొందరు రాజకీయ పండితులు మోదీ-అమిత్ షాల విజయంగా చూస్తే, మరికొందరు విపక్షాల వైఫల్యంగా చూస్తున్నారు. ఇంకొందరు మోదీ ఒంటరి విజయంగా అభివర్ణిస్తున్నారు. ఎవరు ఎలా విశే్లషించినా ఎన్డీఏ గెలుపునకు, కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ఓటమికి సవాలక్ష కారణాలున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘పిల్ల’వేషాలు, చిల్లర చేష్టలు, అసత్య ఆరోపణలు మొదలు విపక్షాల అనైక్యత వరకు చాలాచాలా కారణాలు ఉన్నాయి.
బీజేపీ ఘన విజయానికి అంతకు రెట్టింపు కారణాలున్నాయి. ప్రధాని మోదీ చరిష్మా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహ చతురత, చాణక్యం, కార్యకర్తల బలం, అన్నిటినీ మించి ప్రజల్లో మోదీ పట్ల పెరిగిన ‘విశ్వాసం’ ఇలా అనేక కారణాల వల్ల బీజేపీ వరుసగా రెండవసారి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేలా తన బలాన్ని 303 స్థానాలకు పెంచుకుంది. ఎన్నికలకు ముందు బీజేపీ వ్యతిరేక రాజకీయ విశే్లషకులు ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సొంత బలం కాదుకదా ఎన్డీఏకి వచ్చే సంఖ్యాబలం కూడా చాలదన్న నిర్ధారణకు వచ్చారు. తెరాస, వైసీ పీ, బిజూ జనతాదళ్ వంటి పార్టీల మద్దతుతో మాత్రమే మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని లెక్కలు కట్టారు. ఇంకొందరైతే భాజపాకు మెజారిటీ సీట్లు వచ్చినా మోదీ తిరిగి ప్రధాని అయ్యే అవకాశం లేదన్నారు. నితిన్ గడ్కరీ, రాజనాథ్‌సింగ్ వంటి నాయకుల పేర్లను తెరపైకి తెచ్చారు. చంద్రబాబు లాంటి సీనియర్ నాయకులు అసలు ఎన్డీఏ అధికారంలోకే రాదని, ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు కోసం చాలా కసరత్తుచేశారు. కాలికి బలపం కట్టుకుని దేశమంతా తిరిగొచ్చారు. (చివరకు స్వరాష్ట్రంలోనే బాబు చిత్తయ్యారు. అది వేరే విషయం)
ఏది ఏమైనా భారతీయ ఓటర్లు భాజపాకు బ్రహ్మరథం పట్టారు. 2014లో కంటే మరిన్ని సీట్లను ‘కమల దళాని’కి కానుకగా ఇచ్చారు. గత ఎన్నికల్లో బీజేపీ 282 స్థానాలను, ఈసారి 303 సీట్లను గెలుచుకొంది. ఎన్డీఏ ఎంపీల సంఖ్య 330 నుంచి 351 చేరింది. బీజేపీ అభిమానులు కూడా ఇంతటి విజయాన్ని ఊహించలేదు. బీజేపీ 300 సీట్ల లక్ష్యాన్ని చేరుతుందని నమ్మిన రాజకీయ విశే్లషకులను వేళ్ళమీద లెక్కించవచ్చు. బీజేపీని ఇంతగా గెలిపించిన రహస్యశక్తి హిందుత్వ, జాతీయవాదం, దేశభక్తి, దేశ భద్ర త అనే అంశాలు. గత ఎన్నికల్లో ప్రారంభమైన హిందూ జాతీయవాద ప్రభంజనం గడచిన ఐదేళ్ళలో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అటు ఈశాన్యం నుంచి ఇటు దక్షిణాది వరకు విస్తరించింది. ‘హిందుత్వ జాతీయవాదం’ ఒక చోదకశక్తిగా పనిచేసింది అనేది కాదనలేని వాస్తవం. ప్రభుత్వం పట్ల పెరిగిన విశ్వసనీయత మరో కీలక అంశం. ‘సబ్‌కా సాత్... సబ్‌కా వికాస్’కు ‘సబ్‌కా విశ్వాస్’ తోడై ఈ ప్రభంజనాన్ని సృష్టించింది. స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా హిందువుల ఓటు కన్సాలిడేట్ అయింది. ఇంతకాలం లౌకికవాదంగా చెలామణి అయిన ‘హిందూ వ్యతిరేక లౌకికవాదం’ ముసుగులో సాగిన మైనారిటీల బుజ్జగింపుకారణంగా ముస్లిం ఓటు బ్యాంకును సృష్టిస్తే ఈ ఎన్నికల్లో హిందుత్వ అనేది జాతీయ వాదానికి, దేశభక్తి, దేశ భద్రతకు పర్యాయపదంగా మారింది. అందుకే తమ కులాలను పక్కనపెట్టి హిందువులుగా ప్రజలంతా కాషాయ కూటమిని గెలిపించారు. ఇది చాలామందికి రుచించక పోవచ్చు.. కానీ ఇది ని జం. హిందూ జాతీయవాదానికి భూమిక వేదిక కాషాయ కూటమే అయినా బీజేపీ సంఘ్ పరివార్ సంస్థల కంటే, సోకాల్డ్ లౌకికవాద పార్టీలు, సంస్థలు హిందూ సమాజంలో ఈ మార్పును సాధించడంలో కీలక భూమికను పోషించాయి. పుల్వామా, బాలాకోట్ వంటి సంఘటనలు హిందూ జాతీయవాదానికి బలాన్నిచ్చాయి. బాలాకోట్ (పాకిస్తాన్) వద్ద ఉగ్రవాద శిబిరాలపై మన వైమానిక దళం చేసిన మెరుపుదాడులు ప్రజల్లో దేశభక్తిని, జాతీయవాదాన్ని రగిలించాయి. ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మన వైమానిక దళాలు చేసిన మెరుపుదాడుల పట్ల అనుమానాలను వ్యక్తంచేస్తూ, పాకిస్థాన్ పాటకు వంతపాడాయి. మోదీ పైన వ్యతిరేకతతో మన సైనికులను విపక్షాలు అవమానించాయి. నిజమే.. మెరుపుదాడుల విషయంలో కొన్ని అనుమానాలున్నాయి. పాక్ ప్రభుత్వం అసలు దాడులే జరగలేదని బుకాయించింది. ఈ దా డుల్లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారనేది ఈనాటికీ స్పష్టం కాలేదు. అయినా, ప్రజలు దాడులు జరిగాయని, మోదీ ప్రభుత్వం పాక్‌పై ప్రతీకారం తీర్చుకుందని విశ్వసించారు. విపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు. దేశ భద్రతపై విపక్షాల తీరును ప్రజలు ఆక్షేపించారు. అదే బీజేపీకి వరంగా మారింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్ పోటీచేసిన భోపాల్‌లో బీజేపీ వ్యూహాత్మకంగా- ‘మాలేగావ్ పేలుళ్లలో నిందితురాలైన’ సాధ్వీప్రజ్ఞాసింగ్‌ను పోటీకి నిలిపింది. మాలేగావ్ సంఘటన సందర్భంగా దిగ్విజయ్‌సింగ్ ‘హిందూ ఉగ్రవాదం’ పదాన్ని తెరపైకి తెచ్చారు. సాధ్వీని హిందూ ఉగ్రవాదిగా పేర్కొన్నారు. దిగ్విజయ్‌తోపాటు చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే లాంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని ప్రచారంలోకి తెచ్చారు. ఇప్పుడు అదే నినాదం కాంగ్రెస్‌కు మింగుడుపడని చేదు గుళికగా మారింది. ఒక్క భోపాల్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా హిందూ ఓటు పోలరైజేషన్ చేయడంలో దిగ్విజయ్ సృష్టించిన ‘హిందూ ఉగ్రవాదం’ నినాదం నిస్సందేహంగా కీలక భూమికను పోషించింది. ఇలా హిందూ జాతీయవాదం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కమల వికాసానికి కారణమైంది. అయితే మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మినహా ఇతర ప్రతిపక్ష నాయకులు ఈ వాస్తవాన్ని గుర్తించడం లేదు. గుర్తించినా గుర్తించనట్లు నటిస్తున్నారు. ఒవైసీ మాత్రం- ఆయన ఉద్దేశం, ఆవేదన, ఆగ్రహం ఏదైనా వాస్తవాన్ని అంగీకరించారు. ఈవీఎంలను రిగ్గింగ్ చేశారని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొట్టివేస్తూ- ‘రిగ్గింగ్ జరిగింది ఈవీఎంలలో కాదు- హిందువుల మనసుల్లో, ఆలోచనల్లో’ అని అన్నారు. హిందువుల ఆలోచనలలో వచ్చిన మార్పు ఆయనకు రుచించక పోవచ్చు. ఒవైసీకి మాత్రమే కాదు, ముస్లిం ఓటుబ్యాంకు ఆధారంగా రాజకీయాలు చేస్తున్న హిందూ వ్యతిరేక లౌకికవాదులు ఎవరికీ కూడా హిందూ సమాజంలో వచ్చిన ఈ మార్పు, హిందూ ఓటుబ్యాంకుగా బలపడి కుహనా లౌకికవాదాన్ని కబళించి వేయడం రుచించక పోవచ్చు.
ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసింది హిందుత్వ మాత్రమే కాదు, హిందుత్వతో ముడిపడిన జాతీయవా దం. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మొదలు, కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన నటుడు కమల్‌హాసన్, ప్రకాష్‌రాజ్ వరకు అనేకమంది చేసిన హిందూ- జాతి వ్యతిరేక వ్యాఖ్యలు, కాంగ్రెస్ నేత నవజ్యోత్‌సింగ్ సిద్ధూ, మాజీ మంత్రి శశిథరూర్ చేసిన జాతి వ్యతిరేక వ్యాఖ్యలు హిందూ సమాజం జాతీయవాదాన్ని భుజానికి ఎత్తుకునేలా చేశాయి. భాజపా పట్ల, మోదీ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేయడంలో విపక్షాలు తప్పు చేయడమే కాదు, తమ గోతిని తామే తవ్వుకున్నాయి.
ఇదే విషయాన్ని కొంత ఆలస్యంగానే అయినా కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ గుర్తించారు. ఓటర్లు తమ వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలకంటే దేశ భద్రతకే ప్రాధాన్యత ఇచ్చారని అంగీకరించారు. అంటే, వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలను ఎరగావేసి ప్రజలను మభ్యపెట్టి విజయం సాధించవచ్చనే సంప్రదాయ రాజకీయ భ్రమలను ఎన్నికల ఫలితాలు తుడిచివేశాయి. హిందూ జాతీయవాదానికి తొలిసారిగా సముచిత గౌరవం దక్కింది. అందుకే ఈ ఎన్నికలు కొత్త చరిత్రకు శ్రీకారంచుట్టాయనే విశ్వాసం ఏర్పడింది. అదే ఈ ఎన్నికల ఫలితాల అంతరార్థం.
స్వామి వివేకానంద ఏనాడో చెప్పారు.. ‘హిందువులు మేల్కొన్న రోజున అమెరికా సైతం మన సంస్కృతిని సొంతం చేసుకుంటుంది’. ఇప్పుడు దేశంలో అదే జరిగింది.

-రాజనాల బాలకృష్ణ 99852 29722