సబ్ ఫీచర్

రాజ్యాంగ రక్షణ లేని బీసీ కులాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ మన దేశంలో ఉంది. భారతీయ సమాజంలో నరనరాన వేళ్లూనుకుంది. మనుధర్మాన్ని పాటించిన ఈ వ్యవస్థలో ఉన్నత కులాలు లేదా అగ్రకులాలు లేదా ఆధిపత్య కులాలు (ఓసీలు) రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నత స్థానంలో ఉండటమే కాక సర్వసుఖాలు అనుభవించారు. అనుభవిస్తున్నారు. వేల సంవత్సరాల నుంచి ఎస్టీ, ఎస్సీ, బీసీలు అత్యంత దారుణమైన వివక్షకు గురై, అణచివేయబడి తీవ్రంగా నష్టపోయారు. స్వాతంత్య్రం సాధించిన తరువాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అంటూ రాజ్యాంగం ద్వారా ఎస్టీ, ఎస్సీ కులాల పరిస్థితి కొంత మెరుగుపడింది. జనాభా దామాషా ప్రకారం వారికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. రాజ్యాధికారంలో భాగస్వాములయ్యారు. రాజ్యాంగపరంగా వారికి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు కేటాయిస్తున్నారు. కుల వ్యవస్థ కొనసాగుతున్న క్రమంలో వృత్తి నైపుణ్యంలో అగ్రస్థానంలో ఉన్న బీసీ కులాల పరిస్థితిలో మార్పులేదు. ఆనాడు, ఈనాడు ప్రధాన వృత్తులు, ముఖ్యంగా చేనేత, బంగారు వస్తువుల తయారీ, వడ్రంగి వంటి అత్యంత నైపుణ్యత కలిగిన సున్నితమైన వృత్తులు వారే చేస్తున్నారు. ఎస్టీ, ఎస్సీ కులాల మాదిరిగా రాజ్యాంగ పరిరక్షణ లేకపోవడంతో బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములు కాలేకపోతున్నారు. జనాభా దామాషా ప్రకారం ఉద్యోగ అవకాశాలు పొందలేకపోతున్నారు. 52 శాతం జనాభా ఉంటే ఉద్యోగాలలో 25 నుంచి 27 శాతం మాత్రం రిజర్వేషన్ కల్పించారు. ఆ రిజర్వేషన్ కూడా సక్రమంగా అమలు జరగడం లేదు. అధికార గణంలో ఉన్న ఆధిపత్య కులాల వారు ఎక్కడికక్కడ వారిని తొక్కేస్తున్నారు. వారికి రావలసిన అవకాశాలను కూడా వారికి దక్కకుండా అడ్డుపడుతున్నారు. ఏపీపీఎస్సీలో కూడా అదే ధోరణి కొనసాగుతోందని బీసీలు గగ్గోలుపెడుతున్నారు. శాసనసభలో దామాషా ప్రకారం వారికి ప్రాతినిధ్యం లేదు. రాజ్యాంగపరమైన హక్కు లేకపోవడంవల్లే వారి పరిస్థితి ఇలా ఉంది. యాంత్రీకరణ, ఆధునిక పోకడలతో కుల వృత్తులు క్షీణించడంతో వారిలో కొందరి బతుకులు మరింత దయనీయంగా తయారయ్యాయి.
కుల వ్యవస్థ కొనసాగడంవల్ల అటు ఉన్నత కులాలు, ఇటు ఎస్సీ, ఎస్టీలు బాగానే లబ్ధి పొందుతున్నారు. ఓసీలు జనాభా దామాషా ప్రకారం మూడు, నాలుగు రెట్లు రాజ్యాధికారంలో, ఉద్యోగాలలో భాగం పొందుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కులాల వారు జనాభా దామాషా ప్రకారం పొందగలుగుతున్నారు. చిత్రమైన పరిస్థితి ఏమిటంటే బీసీలు అత్యంత దారుణంగా నష్టపోతున్నారు. అధ్వాన్నంగా ఉన్న వారి పరిస్థితిని ఇంకా దిగజార్చడానికి ఇతరులను కూడా తీసుకువచ్చి బీసీలలో కలిపారు. ఇంకా కలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న కొందరు ఉద్దేశ పూర్వకంగానే వారిని దెబ్బతీస్తున్నారు. అటు ప్రైవేటు రంగంలో, ఇటు ప్రభుత్వ రంగంలో ఉన్నత పదవులలో ఇతరులు ఉంటుంటే దిగువ స్థాయి ఉద్యోగాలు బీసీలు చేస్తున్నారు. కేంద్రంలోని ఉద్యోగాలలో బీసీలు పది శాతం మంది కూడా లేరు. అంటే బీసీలు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు హక్కులు దక్కలేదు. ఇక దక్కే అవకాశం కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే అంశం ఇది.
డాక్టర్ అంబేద్కర్ కుల నిర్మూలనను ప్రతిపాదించారు. అయితే అది తగిన రీతిలో కార్యరూపం దాల్చలేదు. దేశంలోని పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగా లేవు. ముఖ్యంగా రాజకీయ నాయకులు అందుకు సిద్ధంగా లేరు. కుల వ్యవస్థను వారు అనుకూలంగా మలుచుకుంటారు. ఏ ప్రాంతంలోనైనా, ఏ గ్రామంలోనైనా కమ్మ - రెడ్డి, కాపు - యాదవ, మాల - మాదిగ పేర్లతో వారిని విడగొట్టి లబ్ధి పొందడం వారికి తేలిక. అన్ని విధాల అత్యధిక లాభం పొందే ఆధిపత్య కులాల వారు గానీ, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ పొందుతున్న ఎస్సీ, ఎస్టీ కులాల వారు గానీ కుల నిర్మూలన ఉద్యమం పట్ల అసలు ఆసక్తి చూపరు. ఆ ఉద్యమం బలపడితే వారికి ఏమీ లాభం ఉండదు. కుల వ్యవస్థ కొనసాగితేనే వారు ఎక్కువ లబ్ధిపొందడానికి అవకాశం ఉంటుంది. చివరికి మనకి అర్థమయ్యేది ఏమిటంటే కుల వ్యవస్థ కొనసాగడంవల్ల తీవ్రంగా నష్టపోయేది బీసీ కులాలవారే. ఈ పరిస్థితులలో తెలంగాణ బీసీ కమిషన్ సూచించిన విధంగా మన రాష్ట్రంలో కూడా సమాన అవకాశాల కమిషన్‌ను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటుతోపాటు అన్నిరంగాల్లో సమాన అవకాశాలు కల్పించే విధంగా ఆ కమిషన్ పనిచేయాలి. ఏ ఒక్క సామాజిక, మత, కుల, భాష, ఇతర వర్గాల వారికి పక్షపాతం కానీ, విరోధం కానీ లేకుండా స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థగా దానిని రూపొందించాలి. ఉద్యోగాల నియామకం, గృహ నిర్మాణం, ఆరోగ్య పరిరక్షణ, అభివృద్ధి పథకాలను ఈ కమిషన్ పరిధిలో చేర్చితే అందరికీ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది.

- శిరందాసు నాగార్జున