సబ్ ఫీచర్

మూఢ నమ్మకాలు ప్రగతికి అడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత కంప్యూటర్ యుగంలో మానవుడు విభిన్న రంగాల్లో అనూహ్య అభివృద్ధిని సాధిస్తూ, విశ్వ రహస్యాలను సైతం ఛేదిస్తున్నా- ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు బలంగా పాతుకొని ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాలలో బాబాలు, స్వాములు, మంత్రగాళ్లు తమ వద్ద మహిమలు, మాయలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయని చెబుతూ అమాయకులను దోచుకొంటున్నారు. ఇంటిపై, వొంటిపై ఉన్న దుష్టశక్తులను నాశనం చేసే నైపుణ్యం తమకు ఉందని సామాన్య జనాన్ని బురిడీ కొట్టించి డబ్బులు వసూలు చేస్తున్నారు. స్వస్థత కూటముల పేరుతో కళ్ళు లేని వారికి కళ్ళు, కాళ్ళు లేని వారికి కాళ్లు ప్రార్థన ద్వారా చేకూరుతాయని కొందరు గ్రామీణ ప్రజానీకాన్ని మూఢ విశ్వాసాల వైపు తీసుకెళ్తున్నారు. ఇలాంటివి శాస్ర్తియతకు పూర్తిగా విరుద్ధం. వీటివల్ల జరిగే మేలు ఎంత? అని ప్రశ్నించినప్పుడు ఇసుమంత కూడా ఉండదని కచ్చితంగా చెప్పవచ్చు.
వివిధ మతాలలో అనేక రూపాలలో మూఢ నమ్మకాలను వ్యాపింపజేస్తూ సామాన్య జనాన్ని కొందరు అజ్ఞానులుగా చేస్తున్నారు. సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ, గ్రామాల్లో చదువుకోని కొందరు తమ పిల్లలు అస్వస్థతకు గురైనా, వాంతులు-విరేచనాలు అయినా, శారీరకంగా ఎలాంటి ఇబ్బంది కలిగినా బాబాలను, స్వాములను, పూనకంతో ఊగిపోయే వారిని, మత ప్రచారకులను ఆశ్రయిస్తుంటారు. బాబాలు ఇచ్చే పసుపు, కుంకుమ, విభూతి, నిమ్మకాయలు, కొబ్బరికాయలను తీసుకొని వచ్చి అర్ధరాత్రి వేళ పూజలు చేస్తుంటారు. అమావాస్య రోజున ఇలాంటి పూనకాలు, క్షుద్రపూజలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలా చేస్తే రోగాలు నయం అవుతాయని, క్షుద్రశక్తులు పారిపోతాయని మూర్ఖంగా భావిస్తుంటారు.
వ్యాధులకు కారణం గ్రామదేవత అని, ఆమెను శాంతింపచేయాలని జంతుబలులు, నరబలులకు తెగిస్తుంటారు. వీటివల్ల ఆరోగ్య సమస్యలకు ఎలాంటి పరిష్కారం లభించదు. సకాలంలో డాక్టర్లను ఆశ్రయించక పోవడంతో కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదికి కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి మూఢ నమ్మకాలను కొందరు చదువుకొన్నవారు సైతం విశ్వసించడం గమనార్హం.
సంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాల పేరిట ఇప్పటికీ మూఢ విశ్వాసాలు కొనసాగుతున్నాయి. పాము పాలు తాగుతుందని భావించడం, నల్లపిల్లి, పాము ఎదురైనా, ఎవరైనా తుమ్మినా అపశకునంగా భావించడం గ్రామ ప్రాంతాల్లో విరివిగా కనబడతాయి. అంతరిక్ష పరిశోధనల సందర్భంగానూ ఇలాంటి నమ్మకాలు కనిపించడం విడ్డూరం. రాకెట్ల ప్రయోగానికి ముందు వాటి ప్రతిమలను దేవుడి చిత్రపటాల ముందు పెట్టడం శాస్త్ర ప్రగతిని, మేధస్సును తక్కువ చేయడమే. అక్షరాస్యులు-నిరక్షరాస్యులు, గ్రామీణ- పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా అంధ విశ్వాసాలు రోజురోజుకు వేళ్లూనుకొని విజృంభించం మానవ ప్రగతికి అవరోధంగా భావించవచ్చు.
నిపుణులైన డాక్టర్లు ఇచ్చే మందుల కన్నా, సలహాల కన్నా బాబాలమని, స్వాములమని చెప్పుకునే మాయగాళ్ళను కొందరు నమ్మడం విషాదకరమైన విషయం. మాయగాళ్లకు వంచన తప్ప, ఎలాంటి మహిమలు ఉండవు. కొందరు చేసే మహిమల వెనుక- ‘సైన్స్’పై ఆధారపడిన కొన్ని ట్రిక్కులు ఉంటాయి. అమాయకుల కళ్లు గప్పి తమకు మాయలు, మంత్రాలు తెలుసునని వీరు నమ్మిస్తుంటారు.
మరోవైపు కొన్ని చోట్ల మంత్రగాళ్లనే నెపంతో కొందరిని హతమార్చడం సైతం మనం చూస్తున్నాం. చేతబడి, బాణామతి చేశారనే అనుమానంతో పల్లెల్లో కొందరిపై జనం సామూహికంగా దాడి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మూఢ నమ్మకాలు సామాజిక సమస్యగానూ మారుతున్నాయి. తల్లిదండ్రుల ద్వారా పిల్లలు కూడా వీటిని పాటించడం ఆనవాయితీగా మారింది. ఇది ప్రమాదకరమైన, అభివృద్ధి నిరోధక ధోరణి అని ప్రభుత్వం గుర్తించాలి. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా వైజ్ఞానిక అవగాహన కలిగించేందుకు పాఠశాల స్థాయి నుంచి తగిన విద్యను అందించాలి. మూఢ విశ్వాసాల నివారణకు ఇప్పటికే శాస్ర్తియ ఉద్యమాలు వివిధ పేర్లతో కొనసాగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘జన విజ్ఞాన వేదిక’ పేరుతో ప్రజల్ని చైతన్యం చేసే ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వీటిని నివారించేందుకు తగిన చట్టాలను సైతం రూపొందించేందుకు పాలకులు దృష్టి సారించాలి.

-సంపతి రమేష్ మహారాజ్ 99585 56367