సబ్ ఫీచర్

పరీక్ష తప్పితే ప్రాణం పోవాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వెలువడిన అనంతరం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో 19 రోజులు దుర్భర శారీరక వేదనతో మృత్యు పరిష్యంగంలో చిక్కుకొన్న భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం విద్యార్థిని మానస- ‘ఆత్మహత్యలు చేసుకున్న వారి జాబితా’లో చేరింది. 17 ఏళ్ల విద్యార్థినిగా యువ జీవన ప్రాంగణంలో అడుగుపెట్టిన ఆమెకు పరీక్షా ఫలితాలు వెలువడిన రోజు (ఏప్రిల్ 18) మరణశాసనం లిఖించింది. ఫలితాలు వెలువడిన తరువాత పాతికమందికి పైగా విద్యార్థులు బలి అవటం కేవలం మానసిక బలహీనత, ఒత్తిడికి తట్టుకోలేని సహజ దౌర్బల్యంగా అనిపిస్తోంది. అవసరమైతే మరో పది కొవ్వొత్తులు వెలిగించి, బలవన్మరణాలకు పాల్పడిన నిర్భాగ్యులకు ఆత్మశాంతి కలగాలని ప్రార్థించటం తప్ప ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొని వుంది. మానసిక శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం యువత ఆత్మహత్యలకు యత్నించడం అంటే- తమను రక్షించి బతికించవలసినదిగా అర్థించే దీనుల పిలుపు. ప్రభుత్వం, సమాజం, తల్లిదండ్రులు, పురుగు మందులు, సీలింగ్ ఫ్యాన్‌లు, కిరోసిన్ మంటలు.. వీటన్నింటి బారినుంచి యువతను రక్షించుకోలేక పోవటంతో ఆత్మహత్యల సంఖ్య కడుపుకోత మిగులుస్తోంది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2014లో తెలంగాణ ప్రాంతంలో ఆత్మహత్యల సగటు 26.2 (ఒక లక్ష మందికి) వుండగా జాతీయ స్థాయిలో 10.6 శాతంగా ఉండేది. 2013లో హైదరాబాద్ నగరంలో 629 ఆత్మహత్యలు నమోదు కాగా, 2014లో 17.8 శాతం పెరిగి, ఆ సంఖ్య 741గా నమోదైంది. 15 నుండి 29 సంవత్సరాల వయస్సులో బలవన్మరణాలకు కారణం పరీక్షల్లో ఉత్తీర్ణతా వైఫల్యం అని నివేదిక తెలియచేస్తోంది. ఏటా పెరుగుతున్న ఆత్మహత్యలను నివారించటానికి ప్రభుత్వపరంగా, సమాజం- తల్లిదండ్రుల పరంగా ఎటువంటి బాధ్యత తీసుకోవటం లేదు. పరీక్షా విధానంలో సంస్కరణలు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, విద్యాసంస్థలలో పోటీ ఎదుర్కోలేకపోవటం వంటివి ఇందుకు కారణాలవుతున్నాయి. చదువుపై శ్రద్ధాసక్తులు చూపించలేని నిస్సహాయులపై మానసిక ఒత్తిడిని గుర్తించి, వారిని రక్షించుకోలేక పోతున్నాం.
బాధ్యులు ఎవరు?
యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నివేదిక ప్రకారం భారతదేశంలో 1.8 బిలియన్ యువశక్తి వుండటం గర్వకారణమైనా, నాణ్యమైన జీవన విధానం, ఉన్నత విద్యావకాశాలు, నైపుణ్యత కొరత, నిరుద్యోగ సమస్య అత్యధిక శాతం భారతీయ యువతను కుంగదీస్తోంది. కేంద్ర ప్రభుత్వ సర్వే ప్రకారం 13 మిలియన్లకు పైగా యువతరం ఏటా శ్రామికులుగా జీవించవలసి వస్తోంది. 113 మిలియన్ల మంది బతుకు తెరువు లేక సతమతవౌతున్నారు. యువతలో అధిక శాతం మంది తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 15-39 సంవత్సరాల వయస్సులో 2016లో టిబి, ఎయిడ్స్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలతో కంటే- ఆత్మహత్యలు, రోడ్డుప్రమాదాలలో అత్యధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. కుల వ్యవస్థ, అణచివేత, లింగ వివక్ష, విద్యాసంస్థల్లోని దురన్యాయాలు, ఆర్థిక సమస్యలు యువతరం ఆత్మహత్యలకు కారణాలవుతున్నాయి. పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అయితే ఆత్మహత్యలకు పాల్పడే దుర్దశను నివారించటానికి రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షల నిర్వహణను మరింత చిత్తశుద్ధి, పారదర్శకతతో చేపట్టాలి. విద్యావిధానం సంస్కరణాయుతంగా, నాణ్యతా ప్రమాణాల అభివృద్ధికి చిహ్నంగా ఉండాలి.
కార్పొరేట్ విద్యాసంస్థలు ‘రాంక్‌లు, మార్క్‌ల’పై చేస్తున్న ప్రచారం మీడియాలో శ్రుతిమించుతోంది. పేద,గ్రామీణ కుటుంబాలలోని పిల్లలు నాణ్యతలేని విద్య కారణంగా చదువులో వెనుకబడి పోవటంతో, వారికి నిరాశానిస్పృహలు తప్పటం లేదు. తల్లిదండ్రుల ఆశలు ఫలించకపోవటంతో పిల్లల్లో న్యూనతాభావాలు చోటుచేసుకొంటున్నాయి. లేత హృదయాల్లో ఎటువంటి ఆలోచనలు, భావాలు చోటుచేసుకొంటున్నాయో గ్రహించే శక్తియుక్తులు లేని తల్లిదండ్రులు అసంఖ్యాకంగా వున్నారు. సకాలంలో స్పందించగలిగితే ఆత్మహత్యలను నిరోధించవచ్చు. సామాజికంగా ఒంటరితనం, మానవ సంబంధాల ఆత్మీయత కొరవడటం, విద్యానేపథ్యం లేకపోవటం, స్నేహితులు సన్నిహితులతో తమ మానసిక క్షోభను చెప్పుకోలేక పోవడం వంటి అంశాలు ఆత్మహత్యల వైపు నడిపిస్తున్నాయి. ప్రభుత్వం, విద్యాసంస్థలు, సమాజం, తల్లిదండ్రులు ఈ నేరానికి బాధ్యత వహించక తప్పదు.

-జయసూర్య