సబ్ ఫీచర్

వర్తమానంలో బౌద్ధం ఓ దగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీస్తు పూర్వం 483వ సంవత్సరంలో బుద్ధుడు మహాపరినిర్వాణం చెందాడు. ఆయన 80 సంవత్సరాలు జీవించాడు. తన 39వ ఏట ‘జ్ఞానోద యం’ కలిగిందని భావించి, ఆ జ్ఞానాన్ని ఇతరులకు అందజేసేందుకు నాలుగు దశాబ్దాలపాటు నిరంతరం కృషిచేశాడు. 40 ఏళ్ళలో తాను నిర్మించిన, ఏర్పాటు చేసిన ‘సంఘం’లో- బుద్ధుని మరణానంతరం విభేదాలు పొడసూపాయి, చీలికలకు ‘నాంది’ పడింది. ఈ విషయాన్ని సులువుగా అర్థం చేసుకునేందుకు వర్తమాన ఉదాహరణ చెప్పుకోవాలంటే.. 1967-69 ప్రాంతంలో నక్సలైట్ నాయకుడు చారు మజుందార్ రాసిన ‘ఎనిమిది వ్యాసాలు’ ఆయన దృష్టికోణం- విప్లవ భావజాలం, వ్యూహం- ఎత్తుగడ అద్భుతమని ఆయన అభిమానులు అందరూ కీర్తించారు. వివిధ రాష్ట్రాలలో ఆయన చూపిన బాటలో నడిచేందుకు ఆసక్తిని ప్రదర్శించారు. 1972 సంవత్సరంలో చారు మజుందార్ మరణించాక క్రమంగా చారుమ జుం‘దారి’నుంచి ఒక్కొక్కరు తప్పుకున్నారు. ఆయా రాష్ట్రాల నాయకులు తమదైన శైలిలో, పద్ధతిలో ప్రత్యేక దారిలో, మార్గంలో పయనించసాగారు. అలా అనతికాలంలో 40 గ్రూపులు ఏర్పడ్డాయి. ఇది మానవ స్వభావం. రెండున్నర వేల సంవత్సరాలకు పూర్వం కూడా దాదాపు ఇదే పరిస్థితి. అంటే మానవ స్వభావాన్ని అర్థం చేసుకోలేనితనం అటు బుద్ధునిలో, ఇటు కారల్ మార్క్స్, చారు మజుందార్ విషయంలోనూ బట్టబయలైంది. మానవుల్లోని బహుళత్వాన్ని, భిన్న మనస్తత్వాల్ని- అభిరుచుల్ని, ఆలోచనల్ని, అభిప్రాయాల్ని పసిగట్టకుండానే అందరినీ ‘‘ఒకే సూత్రం’’తో బంధిస్తామని- బంధించాలని భావించడం భావ్యం కాదని వారు గుర్తించక పోవడంతో అనంతర కాలంలో జరగాల్సిన నష్టం జరిగింది.
బుద్ధుడు మరణించాక ఆయన అనుయాయుల- బౌద్ధ సన్యాసుల సమితి (కౌన్సిల్) అదే సంవత్సరం ‘రాజగృహ’లో సమావేశమైంది. బౌద్ధ ధర్మాన్ని స్థిరపరచడానికి, మరింత విస్తృత పరచడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అక్కడ చర్చించారు. బుద్ధుని బంధువు ఆనంద- బుద్ధుని బోధనలను ఒక చోట చేర్చి ‘సుతపీటక’ రాసేందుకు నిర్ణయం జరిగింది. ఇందులో బుధ్ధుని ప్రాథమిక బోధనలను సంకలనం చేశారు. బుద్ధుడు బోధించిన పద్ధతులను భావితరాలకు అందించే ప్రయత్నం జరిగింది. అలాగే మరో బౌద్ధ సన్యాసి ఉపాలి బౌద్ధ సన్యాసుల కోసం నియమ నిబంధనలు- ప్రవర్తనావళిని ‘వినయ పీటక’గా రాసేందుకు నిర్ణయం జరిగింది. అనంతరం ఆ గ్రంథం కూడా రూపుదిద్దుకుంది.
బౌద్ధ సన్యాసుల ఈ మొదటి మహా సమ్మేళనం విజయవంతంగా జరిగిందని భావించారు. పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చిన బౌద్ధ సన్యాసులు ఆ సమ్మేళనంలో పాల్గొన్నప్పటికీ వారి వారి సమస్యల వ్యక్తీకరణకు గాక బౌద్ధ ధర్మ భవిష్యత్ కార్యాచరణ పైనే ఎక్కువ శ్రద్ధచూపి అందుకు ప్రణాళిక రచించారు.
తాజా ఉదాహరణ రూపంలో చెప్పుకోవాలంటే.. కమ్యూనిస్టు పార్టీల, మావోయిస్టు పార్టీ మహాసభల మాదిరిగా అవి జరిగాయని చెప్పుకోవచ్చు. అక్కడ సాధారణ వ్యక్తుల- బలహీనుల మాటకు మాన్యత లభించదు. ఆ అవకాశమే ఉండదు. శక్తిహీనులు అనుసరించే పద్ధతులకు, ప్రదర్శనకు శక్తివంతమైన వాళ్లు రూపకల్పన చేసే వైనం అది. ఇది మానవ బలహీనత.. స్వభావం. ఈ నేపథ్యంలో విశే్లషణాత్మకంగా పరిశీలిస్తే అసలు ‘వాస్తవం’ వెల్లడవుతుంది. బౌద్ధ సన్యాసుల మొదటి మహా సమ్మేళనం ఇందుకు మినహాయింపు కాదు.
రాజగృహలో జరిగిన ఈ మొదటి బౌద్ధ మహాసమ్మేళనానికి అక్కడి రాజు అజాతశత్రు అధ్యక్షత వహించాడు. ఒక రాజు బౌద్ధ సన్యాసుల సంఘాల సమాహారమైన సమితికి అధ్యక్షత వహించడమంటేనే సాధారణ- సామాన్య ప్రజలకు చెందిన అంశాలకు అక్కడ తావులేదని తేటతెల్లమవుతోంది. ఏ ‘రాజ్యం’లోనైనా ప్రజలందరూ సన్యాసం స్వీకరించరు. ఆ రకమైన ‘వైరాగ్య భావనలు’ అధికంగా ఉన్నవారే అటు వైపు మొగ్గుతారు. మిగతా అశేష ప్రజల సంగతి అక్కడ పట్టింపులోకి రాలేదు. వారు బౌద్ధ ధర్మ ఛత్రంలో కోర్కెలు- ఆశలు చంపుకుని- తుంచుకుని కాలం గడిపేందుకు పకడ్బందీ ప్రణాళిక రచనకు- అన్ని సౌకర్యాలను దాతల, రాజుల మద్దతుతో అనుభవించే సన్యాసులు పూనుకున్నారు.
ఇక్కడ కొంత లోతుగా పరిశీలన చేస్తే- 19వ శతాబ్దంలో కారల్ మార్క్స్ ప్రకటించిన దాంట్లో, రెండున్నర వేల సంవత్సరాల క్రితం మొదటి బౌద్ధ మహాసమ్మేళనంలో ప్రకటించిన దాంట్లో పెద్దగా తేడా కనిపించదు.
బౌద్ధంలో చెప్పే త్రిరత్నాలు.. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, విప్లవాత్మకమైనవి, మానవాళికి సరికొత్త దిశాదశ నిర్దేశించాయని బుద్ధిస్టుల భావన.. అభిప్రాయం. లోతుగా పరిశీలిస్తే, విశే్లషిస్తే, ఆలోచిస్తే ప్రజల ఆలోచనలకిది సంకెళ్లు వేయడమే తప్ప స్వాతంత్య్రం కల్పించినట్టు కాదు- ఇది ‘విముక్తి’కి మార్గం అసలే అవదు. ప్రజల ఆలోచనల విస్ఫోటనానికి, కొత్త భావాలకు, కొత్త సాహిత్యానికి, కళలకు, సరికొత్త ఆవిష్కరణలకు కళ్ళెం వేసి యథాతథ వాద వ్యాప్తికి దోహదపడే వైనం అది. ‘వర్గ సమాజం’లో కారల్ మార్క్స్ ప్రవచించిన- ‘పోరాడితే పోయేది ఏమి లేదు సంకెళ్లు తప్ప!..’ అని సామాన్యుల ఎదుగుదలకు గాక త్యాగాలకు ప్రోత్సహించిన తీరు కనిపిస్తోంది. ఈ రెండు సందర్భాలలో అదే సారాంశం స్పష్టంగా బయటపడింది.
రెండున్నర వేల సంవత్సరాల క్రితం బౌద్ధం ఆధ్యాత్మిక కోణంలో, ధ్యాన కోణంలో ప్రజల ఆలోచనలను ‘‘సుషుప్తి’’లోకి తోసేసేందుకు ప్రయత్నం చేస్తే, 19వ శతాబ్దం చివరలో కారల్ మార్క్స్ భౌతిక కోణంలో, వస్తూత్పత్తి కోణంలో ఆలోచించి ప్రజల్ని కసి-ద్వేషం, పగ- ప్రతీకారం, తిరుగుబాటు- విధ్వంసం, విప్లవం వైపు మరల్చి వారిని వర్తమాన- సమకాలీన జ్ఞానానికి దూరం చేశారు. బుద్ధుడు సామాజిక సంస్కర్త, భౌతికవాది, భావ విప్లవానికి ఊపిరిలూదిన విప్లవకారుడని కితాబునిచ్చేవారు అనేకమంది వర్తమానంలోనూ కనిపిస్తారు. ప్రజల జీవనం మెరుగుపరిచే మార్గం చూపని వారిని ఎలా విప్లవకారులుగా, భావ విప్లవకారులుగా పరిగణించాలి? అన్న ప్రశ్న వారెప్పుడూ వేసుకున్నట్టు కనిపించదు.
మార్క్స్ సైతం ‘రాజ్యాధికారం’ మీద గల ప్రేమతో కసి, క్రోధం, ద్వేషం సాధారణ కార్మికుల్లో నింపేందుకు చేసిన ప్రయత్నం తప్ప శ్రమజీవుల జీవన ప్రమాణాల మెరుగు కోసం, మంచి భవిష్యత్ కోసం ప్రణాళికలు రూపొందించలేదు. ఎంతసేపూ ధర్నాలు, సమ్మెలు, విధ్వంసం, పెట్టుబడిదారుల పీచమణచడం ఎట్లా?.. ఉత్పత్తిని ఎలా నిలిపివేసి పెట్టుబడిదారులకు ఎలా నష్టం చేకూర్చాలి?.. సంఘటితమై సమ్మెలను సుదీర్ఘకాలం ఎలా కొనసాగించాలి?.. ఈ రకమైన బోధ- ప్రణాళిక భవిష్యత్‌ను నిర్మించేదేనా? చిత్తశుద్ధితో, కించిత్ లోతుగా ఆలోచన చేస్తే అసలు ‘రంగు’ బయట పడుతుంది! అటు బుద్ధుడు గాని, ఇటు కార్ల్ మార్క్స్ గాని ఊహా ప్రపంచం... రంగుల లోకంలో వాస్తవికతకు ఏమాత్రం ఆస్కారం లేని ఉటోపియన్ పద్ధతిలో ఊరేగారు. మానవుల మనస్తత్వాలను, సహజ గుణాలను, వారి అంతర్లోకాలను, ఆకాంక్షలను అంచనా వేయకుండా, ఆలోచించకుండా తమకు కలిగిన ‘జ్ఞానోదయం’ అంతిమం.. ఆ తరువాత ఇంకేమీ మిగిలిలేదు అని భావించి ఉద్బోధ చేస్తే మిగిలింది ఏమిటి?... హళ్ళికి హళ్ళికి... సున్నకు సున్నా మాత్రమే!
ప్రజల దుఃఖం, బాధ, రోదన, క్లేశం, కష్టం తీరేందుకు అష్టాంగ మార్గాన్ని అనుసరించాలని రెండున్నర వేల సంవత్సరాల క్రితం చెప్పినా, ఇప్పుడు చెప్పినా అది మనిషిని అర్థం చేసుకుని చేసిన వ్యాఖ్యానం అవదు. మనిషి అరిషడ్వర్గాల పుట్ట.. బహుళత్వంతో బహుముఖీనంగా విస్తరించాలనుకునే మనిషికి- ‘కోర్కెలను అదుపులో పెట్టుకుంటే, ఆశల రెక్కలు పూర్తిగా విప్పారకుండా చేసుకుంటే జీవితం సుఖసంతోషాలతో గడుస్తుంద’ని బోధించడం, అది సాధ్యమేనని ఆకర్షణీయంగా చెప్పి అందుకు గాను భూమ్యాకాశాలను ఏకం చేస్తూ ప్రచారం కొనసాగించడం, ప్రపంచమంతటా బౌద్ధం కమ్మేయాలని ఆశ పడటం విడ్డూరం గాక ఏమవుతుంది?
బౌద్ధం విస్తరణ- విస్తృతిలోనే బౌద్ధ సన్యాసుల, గురువుల ఆశ, కోర్కెబలంగా కనిపిస్తుంది. మరి బౌద్ధులే కోర్కెలను అణచిపెట్టుకోలేదు కదా? అది మానవ సహజం.. ఆ ‘ఇచ్ఛ’ లేకపోతే మనిషే కాడు.. ఈ వౌలిక విషయం తెలిసి కూడా బౌద్ధం త్రిరత్నాలను, అష్టాంగ మార్గాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం దగాగాక ఏమవుతుంది? ఈ 21వ శతాబ్దంలో ప్రజల జీవనం మెరుగుపరిచే, ఆలోచనలను ఉన్నతీకరించే, వారి నైపుణ్యాలకు సానబట్టే బోధనలు- ఆలోచనలకు ప్రాసంగిత ఉంటుంది గాని కోర్కెలు అణచి పెట్టుకోవాలని లేదా తగ్గించుకోవాలని, అష్టాంగ మార్గం ద్వారా అది సాధ్యమేనని నమ్మబలకడం దురదృష్టకరం. రెండున్నర వేల సంవత్సరాల నుంచి మొత్తం సమాజం బౌద్ధ బోధనలు పాటస్తే ఈనాటి పురోభివృద్ధి ఎలా జరిగేది? ప్రజలకు ఈ ఇంద్రధనస్సు లాంటి సౌకర్యాలు ఎలా అందేవి? వారి ఆసక్తి మేరకు, అనురక్తి మేరకు వివిధ అంశాలలో నైపుణ్యాన్ని ఎలా సంపాదించేవారు? ఇది ప్రాథమిక ప్రశ్న... ఇలాంటి ప్రశ్నలకు తావివ్వకుండా ఇప్పటికీ బుద్ధం శరణం గచ్ఛామి అంటూ భిక్షాటన చేస్తే మానవజన్మ ధన్యమవుతుందా?.. అసలు అది ఈనాటి చైతన్యమే కాదు. అయినా దాన్ని విస్తృతపరచాలనుకోవడం మానవుడిని దగా చేయడం, మోసం చేయడం తప్ప మరొకటి కాదు!

-వుప్పల నరసింహం 99857 81799