సబ్ ఫీచర్

ప్రజాస్వామ్యం అపహాస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఐదేళ్ల కాలంలో మునుపెన్నడూ లేని మార్పులు మన దేశంలో చోటు చేసుకున్నాయి. రాజకీయ పార్టీల సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువైంది. మరో మార్పు ఏమంటే- విపక్ష పార్టీల తరఫున గెలిచిన నేతలు నిస్సిగ్గుగా అధికార పార్టీలోకి దూకడం. పార్టీ ఫిరాయించడం కొత్తగా జరుగుతున్న అనైతిక చర్య కానప్పటికీ ఇపుడు దాని తీవ్రత ప్రజాస్వామ్యంపై పడడం ఆందోళనకరం. లోక్‌సభకు, కొన్ని అసెంబ్లీలకు ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తికాకముందే ఇపుడు ఫిరాయింపులపై చర్చ కొందరికి ఆసక్తి కలిగించకపోచ్చు. కానీ నిరంతరం నడుస్తున్న ఈ రుగ్మతని ప్రజాస్వామ్య ప్రియులెవరూ సహించలేరు. గత ఐదేళ్ల కాలంలో దేశంలో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఫిరాయింపుల పర్వం ప్రజలకు విసుగు తెప్పించింది. ఈ పోకడలను సహించలేని ప్రజలు ఒక్కోసారి ఆగ్రహం వ్యక్తం చేసినా ఆశ్చర్యం లేదు. దీనికి పర్యవసానమే తెలంగాణలో కాంగ్రెస్ నుండి తెరాసలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై జరిగిన దాడి. ప్రజాస్వామ్యంలో దాడులు సమర్థనీయం కానప్పటికీ, ప్రజాగ్రహానికి దారితీసిన పరిణామాలు సమీక్షించాల్సిందే.
ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అసెంబ్లీ స్పీకర్‌దే. అధికార పార్టీ నుంచి ఎన్నికైన స్పీకర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోనపుడు ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి తప్పదు. తెలంగాణలో స్పీకర్‌కి ఫిర్యాదు చేసిన బాధిత పార్టీలు సభాపతి తీరుపై నిరాశకు లోనై చివరికి కోర్టును ఆశ్రయించాయి. ఇతర రాజకీయ నేతలను కలిశాయి. కేంద్ర హోం మంత్రిని, రాష్టప్రతిని కలిసి తమ వాదనను వినిపించాయి. ఇంత జరిగినా ఎలాంటి ఫలితం లేదు. దీంతో ఫిరాయించిన నేతలపై ప్రజలే తిరగబడే రోజులొస్తున్నాయి. ఫిరాయింపులను వ్యతిరేకించే ప్రజలు, రాజకీయ పక్షాల వారు అన్ని వ్యవస్థలూ విఫలం అయ్యాక ఏమి చేయగలరు? ఇదొక నిస్సహాయత నుండి పుట్టిన నిరుపయోగమైన చర్య. అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫిరాయింపుదారులను ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి కొనసాగుతోంది. జనం ఆగ్రహించినా, చట్టాలు తమను ఏమీ చేయలేవన్నది ఫిరాయింపు నేతల ధీమా.
స్పీకర్లు, రాష్ట్రపతి నుంచి మొదలుపెడితే హైకోర్టు, కేంద్ర హోం శాఖ, సుప్రీం కోర్టు వల్ల- ఈ ఫిరాయించే ప్రజాప్రతినిధులకు కొద్దిపాటి భయమైనా లేనప్పుడు జనం ఏం చేస్తారు? వ్యవస్థలు, వాటిలోని లోపాలు, పాలకుల వైఫల్యాలు, పసలేని చట్టాలు ఎందుకు? ఈ నేపథ్యంలో ప్రజలు దాడులు చేయాలా? ఫిరాయింపు రాజకీయాల వల్ల అనైతికంగా ప్రభుత్వాలు ఏర్పడడం కొత్తేమీ కాదు. ఈ విపరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నాయి. కర్నాటకలో సరైన బలం లేకున్నా ప్రభుత్వం ఏర్పాటుకు భాజపా ప్రయత్నించింది. దీనికి గవర్నర్ సహకరించడం ప్రజల్లో అనుమానాలు కలిగాయి. గెలిచిన ఎమ్మెల్యేలను ఆయా పార్టీలు ఎక్కడో ఒక చోట దాచుకోవాల్సి వస్తోంది.
ఎన్నికల సంఘం ఫలానా పార్టీ తరఫున గెలిచారని ధ్రువీకరణ పత్రాలిచ్చినా నేతలు ఎటు దూకుతారో తెలియని పరిస్థితి. తమ ప్రజాప్రతినిధులను తామే దాచిపెట్టుకునే పరిస్థితి రావడం ప్రజాస్వామ్య పునాదులు కూలుతున్న దృశ్యానికి ఒక ఉదాహరణ. తమ పార్టీకి మేలు జరిగేలా ఉంటే స్పీకర్లు తొందరగా నిర్ణయాలు తీసుకోవడం, అందుకు భిన్నంగా ఉంటే ఏళ్ల తరబడి నిర్ణయాన్ని వాయిదా వేయడం పరిపాటిగా మారింది. పార్లమెంటులో శరద్ యాదవ్‌పై వేగవంతంగా అనర్హత వేటు వెయ్యడం ఇందుకు తార్కాణం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే అభియోగంపై ఆయనపై చర్య తీసుకున్నారు. వేరే పార్టీలోకి వెళ్లిన ఎంపీలపై మాత్రం అనర్హత వేటు వెయ్యకపోవడం విడ్డూరం. ఎన్డీయేకి వ్యతిరేకంగా వుండటమే శరద్ యాదవ్ చేసిన నేరం.
ఆంధ్రాలో జనసేన పార్టీలోకి వెళ్లేటపుడు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు రావెల కిశోర్‌బాబు, ఆకుల సత్యనారాయణ రాజీనామాలు ఆమోదించిన స్పీకర్- వైసీపీ నుండి అధికార పార్టీలోకి ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై చర్యలేవీ తీసుకోకపోవడం పక్షపాతం కాక మరేమిటి? తమిళనాడులో జయలలిత మరణించాక అన్నాడీఎంకే ఎదుర్కొన్న సంక్షోభం సందర్భంగా స్పీకర్ ఫిరాయింపుదార్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యమంత్రుల స్థాయిలో ఫిరాయింపులు ప్రోత్సహిస్తారు, స్పీకర్లు దానికి అనుగుణంగా వ్యవహరిస్తారు. రాజ్యంగ విలువలు మరిచి ఫిరాయింపుచేసిన వారితో గవర్నర్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. అధికారులు సైతం ఇందుకు మార్గాలను సుగమం చేస్తున్నారు. ఈ పెడధోరణులపై ఉన్నత న్యాయస్థానాలు సైతం చోద్యం చూడడం తప్ప ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదు. ఇక ప్రజలకు, బాధిత రాజకీయ పార్టీలకు అవకాశాలు ఇంకేమున్నాయి? వ్యవస్థలు దారుణంగా విఫలమయ్యాకే ఫిరాయింపు నేతలపై దాడులు జరగడం మొదలైంది. దీనికి ఎవరి దగ్గరా సమాధానం లేకపోవడం వ్యవస్థల వైఫల్యం అనడానికి తిరుగులేని ఉదాహరణ.
ఈ ఫిరాయింపులతో పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందంటే- కొత్తగా వచ్చే పార్టీలేవైనా కొన్ని సీట్లు గెలుచుకున్నా, ఆ ప్రజాప్రతినిధులు అధికార పార్టీలోకి దూకేస్తారన్న అంచనాకు ప్రజలు వెళ్లిపోవడం ప్రజాస్వామ్యానికొచ్చిన కొత్త ముప్పు. ఇప్పటికైనా ఫిరాయింపులను నిషేధించేలా పదునైన చట్టాలు తీసుకురావాలి. వ్యవస్థలకు లోబడి మనం వ్యవహరిస్తేనే ప్రజాస్వామ్యం మనుగడ అని గుర్తుచేయాలి. ఫిరాయించే నేతలు కూడా ‘అభివృద్ధి కోసం’ అధికార పార్టీలోకి చేరుతున్నామని కొత్త నినాదం అందుకోవడం, ప్రతిపక్షంలో వుంటే పనులు జరగడం లేదు అనడంతో ఎప్పటికీ ప్రతిపక్షాలు బతకలేవనే భావన సృష్టిస్తున్నారు. అసలే ధనస్వామ్యం అయిపోయిన ప్రజాస్వామ్యంలో విపక్ష పార్టీలైనా ప్రజావాణి వినిపిస్తాయనే అభిప్రాయం ఉంది. ఇపుడు అది కూడాపోయి డబ్బు, అధికార దాహం మాత్రమే మిగిలాయి. ఫిరాయించేవాళ్ళు అభివృద్ధి అంటూ, ఫిరాయింపులు చేయించేవాళ్ళు అంతా ప్రజాస్వామ్యం అంటూ నినదించడం హాస్యాస్పదం. ఇవన్నీ చూసి ప్రజాస్వామ్యం కూడా ఫక్కున నవ్వుతోంది. ప్రజాస్వామ్యం కూడా ఒక నిస్సహాయ వ్యవస్థ అయిపోయింది మరి.
ఈ ఫిరాయింపుల విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక విషయం అవగతమవుతుంది. ఒక పార్టీ లేదా ప్రభుత్వం మేలుకోసం ఒక ముఖ్యమైన వ్యక్తి తీసుకునే నిర్ణయానికి ఈ వ్యవస్థలలో కొన్ని దాసోహమవుతుంటే, కొన్ని వ్యవస్థలు నిస్సహాయంగా చూస్తున్నాయి. ఇందులో వ్యక్తి గెలిచి, వ్యవస్థలు ఓడిపోతున్నాయి. నాగరిక సమాజంలో వ్యవస్థలను వ్యక్తులే సృష్టించినా- వారు బలవంతులు కాకూడదు. వ్యవస్థలే అంతిమ నిర్ణేతలు. వ్యవస్థలను గెలిపిద్దాం, వ్యక్తులను కాదు. ఈ నినాదం బలపడితేనే ప్రజాస్వామ్యం పురోగమిస్తుంది.

-పచ్చల రాజేష్ 83318 23086