సబ్ ఫీచర్

రవివర్మకే అందని సోగ్గత్తె..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవివర్మకే.. అందని ఒకే ఒక అందానివో/ రవి చూడని పాడని నవ్య నాదానివో
ఈ పల్లవి చదివితే చాలు -అంతకుముందు జానకమ్మ గొంతులోని ఆలాపన వినిపిస్తుంది. ఆ మార్థవానికి ఓ రొమాంటిక్ గొంతును మేళవించి ఎస్పీ బాలు పాడిన -పాట గుర్తుకొస్తుంది. పాట మదిలో కదిలినంత సేపూ -నృత్యం చేసిన అప్పరస కళ్లముందు కదలాడుతుంది. రెప్పమూసి ఆమె భంగిమల్ని మనోనేత్రంతో చూస్తే చాలు- వెలుగు తరగల్లాంటి మేఘాల మధ్య ఓ అందం సాక్షాత్కరిస్తుంది.
ఆ వెంటనే -1980ల్లో వచ్చిన రావణుడే రాముడైతే సినిమా.. అందులోని అక్కినేని ఆహార్యం.. ఇలా ఎనె్నన్నో గుర్తుకొచ్చేస్తాయి. గొలుసుకట్టులా మదిలోకి ఇన్ని జ్ఞాపకాలను మోసుకొచ్చే ఒకే ఒక అందం -జయచిత్ర. ఈ వారం మన వెనె్నల అతిథి ఆ -సోగత్తె. సోగ్గాడుతో తెలుగు స్క్రీన్‌కు పరిచయమైన బ్యూటీ ఆమె.
***
జయచిత్రగా ఇండస్ట్రీకి తొలి పరిచయం -సోగ్గాడు సినిమాతో. స్క్రీన్ ప్రజెన్స్ తొలిసారే అయినా -ఆనాటి ఫ్యామిలీతరం డ్రీమ్‌బోయ్ శోభన్‌బాబుకు ఏమాత్రం తగ్గని పెర్ఫార్మెన్స్ ఇచ్చారు జయచిత్ర. అలా సోగ్గాడుతో సమానమైన స్టేటస్ సంపాదించుకుని -సోగత్తెగా ఇండస్ట్రీకి దగ్గరైపోయింది జయచిత్ర. ఆమె సినీ ప్రయాణం అతి సామాన్యంగా కనిపించే అనన్య సామాన్యం. తొలితరం కథానాయిక అమ్మాజీ గారాలపట్టి రోహిణి. చెన్నైలోనే పుట్టింది. అక్కడే విద్యోదయ కానె్వంట్‌లో చదువుకుంది. అప్పటి సంప్రదాయానికి అనుగుణంగా -్భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంది. అమ్మ ఇచ్చిన ప్రేరణతో నటనలో ఓనమాలు దిద్దింది.
చిన్ని వయసునుంచే అల్లరి చేయకపోయినా -ఆహార్యంతో అల్లరి పిల్లే అన్నట్టే కనిపించేది. -‘అందుకు తగ్గట్టే అమ్మ వెరైటీ డ్రెస్సులు వేసేది. అందమైన పావడాలు కప్పేది. నన్ను చూసుకుని మురిసిపోయేది. అమ్మ గుర్తుకొచ్చే ప్రతిసారీ ఆ సన్నివేశాలన్నీ లైఫ్‌రీళ్లుగా కళ్లముందు కదిలిపోతుంటాయి’ అంటారు రోహణి. సారీ -జయచిత్ర.
ఫ్యాన్సీ డ్రెస్సులతో స్కూల్ డేస్‌లోనే స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసింది. స్కూల్లో ఏతరహా పోటీలు పెట్టినా హైలెట్ అయ్యేది రోహిణే. బాలగోపాల తరంగం చేస్తూ పళ్లెం అంచుల్లో నిలబడి నాట్యం చేస్తుంటే, అందరి చూపూ ఆమె కాళ్లపైనే ఉండేదట.
బీదలపాట్లు చిత్రం రూపొందించే సమయంలో ఓ పాప పాత్ర కోసం వెతుకుతున్నారు బి విఠలాచార్య. అలా చిన్న వయసులోనే విఠలాచార్య ముందు నిలబడింది రోహిణి. మరీ చిన్నగా ఉన్నావమ్మా, వయసు చాలదు అనేశారు విఠలాచార్య. ఆశగా వెళ్తే అవకాశం దక్కలేదు. ఆ విషయం మర్చిపోతున్న తరుణంలో వెతుక్కుంటూ వచ్చింది సినిమా చాన్స్. కెఎస్ గోపాలకృష్ణన్ రూపొందిస్తున్న ‘కురత్తిమగన్’ (మేమూ మనుషులమే) చిత్రం కోసం రోహిణిని సిఫార్స్ చేసింది విఠలాచార్యే. తొలిసారి మేకప్ టెస్ట్, డైలాగ్ చెప్పడం. అన్నీ ఫటాఫటా జరిగిపోయాయి. అందమైన రంగంలో అందగత్తె రోహిణి అనూహ్యంగా ఎదిగిపోవాలన్న తలపుంతోనే -ఆ సినిమా నుంచి జయచిత్రగా పేరు మార్చి, ఓ మంచి కథానాయిక దొరికిందని ఎఎస్ గోపాలకృష్ణన్ కితాబిచ్చేశారు. ‘డైలాగ్ చెప్పి వచ్చేశాను. అప్పుడు అంతగా ఆ విషయాలేమీ గుర్తులేవు. సినిమా విడుదలైంది. సూపర్‌హిట్ అన్నారు. వెంటనే కె బాలచందర్ దర్శకత్వంలో అరంగేట్రం చిత్రం, శివాజీ గణేశన్ హీరోగా భారత్ విలాస్ చిత్రాలతోపాటుగా ‘పొన్నుక్కు తంగ మనసు’ చిత్రాలు స్కూల్ ఫైనల్ పూర్తిచేసే సరికే సూపర్‌హిట్లుగా నిలిచాయి. అలా జయచిత్ర పేరు కథానాయికగా రెపరెపలాడింది’ అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు జయచిత్ర.
‘క్లాస్‌మేట్స్ కొందరు పోస్టర్లపై నువ్వేనా అని అడిగేవారు. నేనుకాదని అబద్ధం చెప్పి తప్పించుకునేదాన్ని’ అంటారామె. అలా పెద్ద పెద్ద హీరోలతో నటించడం, తెరపై తనను తాను చూసుకోవడం, పాటకు లిప్‌మూవ్‌మెంట్ ఇవ్వడం, డైలాగ్ చెప్పడం, చిన్నప్పుడు తాను విన్న ఎస్ జానకి, పి సుశీల పాటలకు నర్తించడంలాంటివన్నీ చూసేసరికి సినిమా పరిశ్రమ ఓ అద్భుతంలా అనిపించింది జయచిత్రకు. ఇదేదో బాగుంది, ఇంకా బాగా చేస్తే ఎలావుంటుంది అన్న ఆలోచనలో పడిపోయింది. ‘నేనేదో పెద్ద హీరోయిన్‌గా ఎదిగిపోవాలని ఎప్పుడూ రాలేదు. కానీ మూడు సినిమాలు హిట్ అయ్యాక మా అమ్మ తీరని కోరికను తీర్చాలనుకున్నాను. హీరోయిన్‌గా ఓ ఛాలెంజ్‌గా ఎదగాలనుకున్నాను. నెం1గా నిలవాలనుకున్నా. నిలిచి రాణించాలన్న పట్టుదల పెరిగింది. అలా నా కృషికి భగవంతుని ఆశీస్సులతోపాటుగా అనేకమంది ప్రోత్సాహం దొరికింది’ అంటూ చెప్పుకొచ్చారామె. రాకెట్ వేగంతో పరిశ్రమలోకి వచ్చి ఆ వేగాన్ని అలాగే అందుకోవడానికి తాను ఇబ్బంది పడ్డానంటారామె. అమ్మాయిల శపథం రూపొందిస్తున్నప్పుడే తెలుగులో చేయమని అడిగారు. అప్పటికే జయచిత్ర 25 చిత్రాలదాకా తమిళంలో నటించారు. తరువాత సోగ్గాడు చిత్రానికి నిర్మాత డి రామానాయుడు తప్పక చేయాలని పట్టుబట్టడంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు సోగ్గాడు చిత్రంతో. ఆ తరువాత నిండుమనిషి, అన్నదమ్ముల సవాల్, యవ్వనం కాటేసింది, రావణుడే రాముడైతే, ఆత్మీయుడు, మా దైవం, సావాసగాళ్లులాంటి చిత్రాలతో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణవంటి అగ్రహీరోలతో నటించి శభాష్ అనిపించుకుంది. రిక్షా రాజి అనే చిత్రం డీగ్లామర్ పాత్ర కదా. ఎలా ఒప్పుకున్నారు అంటే -‘రాజు నిర్మాతగా రిక్షారాజి పాత్రకు నేను న్యాయం చేయగలనని వాళ్లు నమ్మటంతో ఆ అవకాశం వచ్చింది. చాలా హెవీ క్యారెక్టర్ అది. నేనే చేయాలని వాళ్లు ఆశపడ్డప్పుడు నేను కాదనలేకపోయాను. తిరుపతిలో షూటింగ్. రిక్షా నేర్చుకోవాలన్నారు. నేర్చుకున్నాను. మా అమ్మమ్మను కూర్చోబెట్టి తిరుపతి వీధుల్లో రిక్షాతొక్కాను. ఆ షాట్ సినిమాలో ఉందనుకుంటా. రోజూ షూటింగ్ చేయడం, సాయంత్రానికి మద్రాసు వెళ్లిపోవడం. అలా ఆ సినిమా పూర్తిచేశాను. కథానాయిక ప్రాధాన్యంవున్న ఆ సినిమా హిట్టయ మంచి పేరు తీసుకొచ్చింది.
తెలుగు పరిశ్రమలో అగ్ర హీరోలతో నటించినా ఏనాడూ వాళ్లు సీనియారిటీ ఇగో చూపలేదు. వారు మా అమ్మతో నటించి ఉండటంతో నన్ను ప్రేమగా చూసుకునేవాళ్లు. వారిప్రక్కన నటిస్తున్నానన్న భయం నాకేనాడూ ఉండేది కాదు. షూటింగ్‌లో క్యారెక్టర్‌లోకి వెళ్లిపోయేదాన్ని. నాకెదురుగా ఎంత పెద్ద హీరోవున్నా, వాళ్ల పాత్రలను మాత్రమే చూసేదాన్ని’ అంటారు జయచిత్ర. షూటింగ్ గ్యాప్‌లో అగ్ర హీరోలంతా తమ అనుభవాలను జయచిత్రకు వివరిస్తే, అవన్నీ ఆకళింపు చేసుకుందామె. అందులోంచి మంచి సలహాలు, అనుభవంలోంచి వచ్చిన మంచి మాటలను గుర్తుపెట్టుకునేవారు. ‘ఆ సమయంలో నాకు చాలా ఆశ్చర్యంవేసేది. ఇంకా బాగా నటించాలని వాళ్ల అనుభవాలు విన్నప్పుడు నిర్ణయించుకునేదాన్ని’ అంటూ ఆనాటి తపనను చెప్పారు జయచిత్ర. మొదట రఫ్‌గావుండి, తరువాత పాజిటివ్ ఎండ్‌తోవుండే పాత్రలు, స్వర్గానికి నిచ్చెనలు, అబ్బాయిగారు చిత్రాల్లో చేశారు. అటువంటి పాత్రలకు చివర్లో సింపతీ చాలా వచ్చేదని గుర్తు చేసుకున్నారు. సోగ్గాడు షూటింగ్ సమయం నుండి మా అమ్మ నావెంబడే వున్నారు. నా ఎదుగుదల చూసి ఎంతో ఆనందపడ్డారు. కానీ చిన్న వయసులోనే ఆమె నాకు దూరమవ్వడం బాధాకరం అంటూ తల్లిని గుర్తు చేసుకున్నారు. ‘ఒక సినిమా సక్సెస్ అయితే, ఓ దర్శకుడు మెచ్చుకుంటే, ప్రేక్షకులు శభాష్ అని చప్పట్లు కొడితే, ఏవైనా సినిమాకు సంబంధించిన షీల్డ్స్, అవార్డ్సు అందుకుంటుంటే అవన్నీ ఆనందకరమైన విషయాలే. భగవంతుడు అలాంటి అదృష్టం నాకిచ్చాడు. అందుకు తగ్గట్టు నేనూ కష్టపడి పనిచేశాను’ అంటూ గుర్తు చేసుకున్నారు. దర్శకులు చెప్పినదానికి మరింత బాగాచేసి వాళ్లను మెప్పించడమే ప్రధాన అంశంగా పెట్టుకున్నారామె.
జయచిత్ర తల్లిది కాకినాడ. తాతలకాలంలోనే మద్రాసు వెళ్లిపోయారని, తాను తెలుగింటి ఆడపడుచునేనని అంటారామె. కన్నడంలో రాజ్‌కుమార్ సరసన ‘హుళియ హాలిన మేవు’ అనే హిస్టారికల్ చిత్రం, విష్ణువర్థన్‌తో చిత్రాలు చేశారు. మలయాళంలో ‘నీ ఎంద లహరి’తోపాటుగా మరెన్నో చిత్రాలు చేశారు. సోగ్గాడు చిత్రం హిందీ రీమేక్‌లో రామానాయుడు అవకాశమిచ్చారు. ‘నేనిప్పుడే తెలుగులోకి వచ్చా. వెంటనే హిందీలోకి నెట్టేయకండి’ అంటూ జోక్ చేశానంటూ చెప్పుకొచ్చారామె.
భర్త వ్యాపారవేత్త. కొడుకు అమ్రీష్ మల్టీ టాలెంటెడ్. మూడు తమిళ చిత్రాలకు సంగీతం అందించాడు. హీరోగానూ ఓ సినిమా చేశాడు. తన ముందున్న కర్తవ్యం కొడుకు ఎదుగుదలను చూడడమే అంటారామె. ఇటీవల గుండమ్మకథ చిత్రంలో గుండమ్మ పాత్ర చేయమని ఎవరో అడిగారు. చేస్తానన్నాను. తరువాత ఆ విషయం మళ్లీ ఎవరూ ప్రస్తావించలేదు అంటూ గుర్తు చేసుకున్నారామె. రాజేశ్వరి కల్యాణం చిత్రానికి నంది అవార్డు, ఎంజిఆర్ చేతులమీదుగా ‘కలైమామణి’ అవార్డు, ఫిలిం ఫ్యాన్స్, ఫిలింఫేర్ అవార్డులు అనేకం అందుకున్నారామె. సోగ్గాడు చిత్రానికి రష్యా, విశే్వశ్వరరావు రూపొందించిన హరిశ్చంద్రుడు చిత్రానికి మారిషస్ దేశాలకు డెలిగేట్‌గా వెళ్లారు. తానా ఫిలిం ఫెస్టివల్స్‌లో భాగంగా న్యూయార్క్, వాషింగ్టన్, లాస్‌ఏంజిల్స్, కాలిఫోర్నియా పర్యటించారు. మలేసియా, సింగపూర్‌లలో తమిళ వరల్డ్ కాన్ఫరెన్స్‌లకు హాజరయ్యారు. యుఎస్‌ఏ వరల్డ్ పీస్ ఆర్గనైజేషన్ నుండి డాక్టరేట్ అందుకోవడం జీవితంలో మరపురాని గొప్ప విషయం అంటూ ముచ్చట్లు ముగించారు జయచిత్ర.

సరయు శేఖర్, 9676247000 సహకారం: గంగారామ్ నాయక్, కడెం