సబ్ ఫీచర్

‘సోషల్ మీడియా’ విష వలయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఆధునిక యుగంలో శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన క్రమంలో సమాచార వినిమయానికి ‘సామాజిక మాధ్యమాలు’ ఎంతగానో దోహదం చేస్తున్నాయి. ఇదే సమయంలో ముఖ్యంగా యువత కాలాన్ని వృథా చేసుకొని, సామాజిక మాధ్యమాలకు బానిస కావడం కలవరపెట్టే అంశం. సామాజిక మాధ్యమాల ప్రభావం పిల్లలపై, యువతపై రోజురోజుకు మితిమీరుతున్నందున , వారి వ్యక్తిత్వ నిర్మాణం అయోమయంగా మారుతోంది.
ఒకప్పుడు నీతికథలు, పురాణేతిహాసాలు, నాటకాలు, జీవిత చరిత్రల ద్వారా పిల్లలను సన్మార్గంలో పెట్టడానికి కుటుంబాల్లో పెద్దవారు శ్రద్ధ చూపేవారు. కానీ, నేడు చరవాణులు, కంప్యూటర్లు వాడుకలోకి వచ్చిన తరువాత సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగింది. సామాజిక మాధ్యమాల్లోని వింత పోకడలు యువతను పెడదోవ పట్టించే విధం తయారవుతున్నాయి. పూర్వకాలంలో పెద్దలు చెప్పే వౌఖిక సాహిత్యం క్రియాశీలకమైన పాత్ర పోషిస్తూ పిల్లలను సన్మార్గంలో నడిపేది. జీవితాన్ని ఉన్నతీకరించుకోవడానికి అప్పట్లో అవకాశం ఉండేది. నేడు సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటివి యువత భవిష్యత్తుపై చెడు ప్రభావం చూప డం ఆందోళన కలిగించే అంశం. పిల్లలు సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు మితిమీరి వాడుతున్నారని తల్లిదండ్రులు మందలిస్తే కొందరు క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు ఎదురవుతున్నాయి. ఈమధ్య వచ్చిన పబ్జీగేమ్‌ల వంటి మొబైల్ ఆటల వల్ల తీవ్ర మానసిక సంఘర్షణకు లోనై ఎందరో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
సామాజిక మాధ్యమాల వల్ల పిల్లల్లో క్రియాశీలత లోపిస్తూ కృత్రిమమైన జ్ఞానానికి వారు పరిమితం కావడంతో చదువులో వెనకబడిపోతున్నారు. ఫలితంగా మానసిక ఒత్తిడికి గురికావడం అనివార్యమవుతోంది. సమాచార సాంకేతిక విప్లవంలో వాటి వినియోగంపై పరిమితి లేకపోవడంతో నిజమైన ప్రగతిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకప్పుడు టీవీలు, కంప్యూటర్లు చూసే పిల్లలు పెడదారి పడుతున్నారని ఆందోళన చెందేవాళ్ళం. కానీ నేడు వాటికన్నా పెనుభూతంగా సామాజిక మాధ్యమాలు రూపుదిద్దుకున్నాయి. కొంతమంది విద్యార్థులు సామాజిక మాధ్యమాల వేదికగా కులాలు, మతాలు, పార్టీలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలపై అభ్యంతరకమైన పోస్టులు పెడుతూ వివాదాలకు కారణమవుతున్నారు. కాలాన్ని వృథా చేసుకోవడం తప్ప ఇలాంటి పోస్టింగ్‌ల వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. కొన్ని సందర్భాలలో అసభ్యకరమైన, క్రూరమైన వీడియోలు చూస్తూ వాటిని యువకులు అనుకరించడం పరిపాటిగా మారింది. తద్వారా వీరు కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు దూరం అవుతున్నారు. నైతిక విలువలు, గౌరవ మర్యాదలు, బంధాలు, బంధుత్వాలు తెలియకుండా జీవితాన్ని కొనసాగించడం వల్ల యువతకు ఒరిగేదేమిటి?
సామాజిక మాధ్యమాల ద్వారా ఆవేశం, ఆక్రోశం వెళ్లగక్కేందుకు పరుష పదజాలాలు వాడుతూ వాగ్వివాదాలకు దిగడం ప్రమాదకరమని యువత గ్రహించడం లేదు. సామాజిక మాధ్యమాలలో పెట్టిన పోస్టులు సమస్యాత్మకంగా మారితే- సాంకేతిక చట్టం-2000 (ఐటి చట్టం) సెక్షన్ 66 ప్రకారం శిక్షలను ఎదుర్కొనక తప్పదు. సామాజిక స్పృహను పెంచుకుంటూ, జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించేందుకు యువత సంకల్పించాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు- సామాజిక మాధ్యమాలకు దూరం ఉంచాల్సిన అవసరం ఉంది. ఆధునిక ప్రపంచంలో సామాజిక మాధ్యమాల అవసరం ఉన్నప్పటికీ, వాటి వినియోగంలో పరిపక్వతను, విజ్ఞతను పాటించవలసిన అవసరం ఉంది. సామాజిక మాధ్యమాలు, మొబైల్ గేమ్స్‌కు బదులు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి. తద్వారా భావోద్వేగ సమతుల్యతను పాటిస్తూ, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేసి, వాటిని యువత వినియోగించుకునేటట్లు పాలకులు చొరవ చూపాలి. గ్రంథాలయాలే ఆధునిక దేవాలయాలు అనే సూక్తిని గుర్తుచేసుకుంటూ- నవ సమాజం నిర్మాణానికి యువత తన వంతు కృషి చేయాలి.

-సంపతి రమేష్ మహారాజ్ 99595 56367